అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

12/9/09

ఎన్న రాస్కలా మైండ్ ఇట్

రాజేష్ పని చేసే కన్సల్టెన్సీ వారు అస్సాం నుండి చెన్నై కి బదిలీ చేయడం తో ఈ మధ్యనే చెన్నై వచ్చిన రాజేష్ అక్కడ ఉదయాన్నే పాలు పోసే పాల్ రాజ్ ని పాలలో నీళ్ళు ఎక్కువ కలుపుతున్నారని నిలదీయడం తో పాలు పోసే పాల్ రాజ్ నాకేం తెల్సు సార వాడు మా డైరీ ఓనర్ పశుపతిని అడగమన్నాడు. పశువుల సాక్షిగా పశుపతిని నిలదీద్దాం అని డైరీ కి వెళ్ళిన రాజేష్ అక్కడ పశుపతికి బాడీగార్డ్ గా ఉన్న సుమో ఫైటర్ గుండు రావు చేత తన్నులు తినాల్సి వచ్చింది. ఆగ్రహించిన రాజేష్ వాళ్ళ మీద కేస్ పెడదామని లాయర్ కేసవన్ దగ్గరకి వెళ్ళాడు. కేస్ పెట్టేముందు మీరు డాక్టర్ దగ్గరకి వెళ్ళమన్న లాయర్ కేసవన్ సలహా మేరకు డాక్టర్ వైద్యనాధన్ ని సంప్రదించాడు రాజేష్. డాక్టర్ వైద్యనాధన్ అన్ని టెస్టుల నిమిత్తం పరిక్క్షిత్త ల్యాబ్ లో టెస్టు చేపించి .. రాజేష్ ని కాస్త పీల్చి పిప్పి చేసి పంపాడు . పళ్ళు దెబ్బ తినడం వల్ల ముందుగా డెంటిస్ట్ పల్లవన్ దగ్గరికి వెళ్ళిన రాజేష్ అక్కడినుండి కార్డియాలజిస్ట్ హృదయ రాజ్ దగ్గర కి వెళ్ళాడు.

తీవ్రంగా భయపడడం వల్ల సైక్రియాట్రిస్ట్ మనో దగ్గర కౌన్సిలింగ్ తర్వాత .. డాక్టర్ కామదేవన్ దగ్గరకి ఎందుకు వెళ్ళాడో తెలీదు. ఇంత మంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళడం వల్ల ఆర్ధికం
గా కాస్త సాయం అవసరం అయి ఫైనాన్సియర్ ధనసేకరణ్ దగ్గరకు వెళ్ళిన రాజేష్ ... ఈ మద్యనే రియల్ ఎస్టేట్ వ్యాపారి భూమినాధన్ దగ్గర కొన్న భూమి తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు. కాస్త రిలాక్సవుదామని బార్ కి వెళ్లి అక్కడ పని చేసే "మధు" సూదన్ కి బీర్ ఆర్డరిచ్చాడు. ఫుల్లుగా తాగిన రాజేష్ అక్కడే పడిపోవడం తో అలవాటుగా రాజేష్ ఆఫీసుకి ఫోన్ చేసాడు మధు సూదన్. డ్రైవర్ సారధి అందుబాటులో లేక పోవడం వల్ల ఆల్టర్నేట్ డ్రైవర్ పార్ధ సారధి వెంటనే వచ్చి రాజేష్ ని తీసుకెళ్లడం జరిగింది. రాజేష్ చేసే తిక్క పనులు చూసిన అతని చెనై మిత్రుడు మిత్రలాబన్ అతన్ని మెంటల్ హాస్పిటల్ కితీసుకెళ్ళి అక్కడ డాక్టర్ బుద్ది శిఖామణి కి చూపించాడు. అర్జంటుగా రాజేష్ కి డైవర్షన్ అవసరం అని డాక్టర్ బుద్ధి శిఖామణి చెప్పడం తో కొన్నాళ్ళు పని(చేసేదేం లేకపోయినా) వదిలి పెట్టి ఆటలు కళల యందు మనసు లగ్నం చేయమని మిత్రులు సలహా పడేసారు. అందువల్ల క్రికెట్ నేర్చుకుందామని గ్రౌండ్ కి వెళ్ళిన రాజేష్ అక్కడ బౌలర్ 'బాలా'జీ వేసిన బాలు గట్టిగ తగలడం వల్ల దానికి స్వస్తి పలికి పెయింటర్ చిత్రగుప్త వద్ద కొన్నాళ్ళు ... తరువాత నాటకాలు నేర్పే నటరాజన్ దగ్గర కొన్నాళ్ళు పని చేసి చివరికి నాటకాల నటరాజన్ కంపెనీలో మేకప్ మాన్ సింగారం తో గొడవ పడి అక్కడి నుండి బయటికి వచ్చి చివరిగా ఫిక్షన్ కధలు రాసే నవలన్ దగ్గర కధలు రాయడం నేర్చుకుందామని చేరి అతని దెబ్బకి పిచ్చ పిచ్చ గా తయారవడం వల్ల నవలన్ పక్కింట్లో ఉండే నర్సరీ ఓనర్ పుష్పరాజన్ రాజేష్ ని క్షేమంగా ఇంటికి చేర్చాడు. ఇంట్లో చిత్ర విచిత్రం గా ప్రవర్తిస్తున్న రాజేష్ ని దయ్యాల వైద్యుడు మాత్రుభూతం కి చూపించారు ఇంట్లో వాళ్ళు. రాజేష్ కి పట్టిన దయ్యం పాములు పట్టే నాగ మూర్తి దని చెప్పిన మాత్రుబూతం దానిని వదల గొట్టడానికి ముంగిసరాసన్ అనే మరో మాంత్రికుడి సాయం తో రాజేష్ ని వేపాకుల తో కొట్టి చివరికి దయ్యం వదిలిందని ప్రకటించారు. ఆ రోజు నుండి రాజేష్ ని వేలాయుధం అనే వాచ్ మాన్ అనుక్షణం గమనిస్తూ ఉండే వాడు. రాజేష్ మాత్రం పక్కింటి వాలీ బాల్ ప్లేయర్ బాలా త్రిపుర సుందరి కి మూగగా లైన్ వేసేవాడు

దీనంతటికీ కారణమైన పాల్ రాజ్ రోజు కల్తీ పాలు పోస్తూనే ఉన్నాడు

11/14/09

షాడో, బుచ్చిబాబు ...... ఒంగోలు శీను

నా చిన్నతనం లో ...... అంటే నాకు పదేళ్ళు ఉంటాయనుకుంటా ... అప్పుడు జరిగిన విషయాలివి . మా అన్న నాకన్నా పన్నెండేళ్ళు పెద్దవాడు ..... మా అక్క ఎనిమిదేళ్ళు పెద్ద ... అందువల్ల చిన్నప్పటి నుండి వాళ్ళ ప్రభావం నా మీద ఎక్కువ గా ఉండేది. మా అన్న ఎక్కువగా జేమ్స్ బాండ్ సినిమాలు ... రాంబో సినిమాలు గట్రా చూస్తూ . ఇంటికి మధుబాబు, పానుగంటి వంటి రచయితలు రాసిన షాడో , కిల్లర్ షాడో నవలలు తెచ్చుకుని చదివే వాడు.

మా అక్క దానికి పూర్తి వ్యతిరేకం ఆవిడకు మల్లిక్ నవలలు అంటే ప్రాణం , యద్దనపూడి సులోచనారాణి నవలలు అంటే పంచ ప్రాణాలు . ఇలా ఈవిడ ఎక్కువగా మల్లిక్ నవలలు చదవడం అదే మాదిరిగా నేను కూడా వీళ్ళతో చదవడం మొదలైంది.


అయితే నా మీద బాగా ప్రభావం చూపిన వారు ... మధు బాబు మరియు మల్లిక్ . ఎక్కువగా వీళ్ళ రచనల తో ప్రత్యేకించి అందులో పాత్రల తో బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాడిని. మా వాడు ఉదయాన్నే లేచి కరాటే గట్రా చేయడం ...... ఉండి ఉండి నిట్టూర్చడం .... సాలోచనగా తల పంకించడం వంటి పనులు చెయ్యడం తో ... మా వాడే షాడో అని నాకెందుకో అనిపించసాగింది.


అలా నా మీద పడిన నవలా ప్రభావం కొన్నాళ్ళకి బయట పడడం మొదలైంది . అదెలాగంటే మా ఊరు నుండి మా మామయ్య ఒకాయన మా ఇంటికి వచ్చాడు. భోజనం చేసి అలా బయకెల్దాం అని బయట కొచ్చి జర్రున జారి పడ్డాడు. వెంటనే మా అన్నయ్య వచ్చి లేవదీశాడు. నా మది లో కోటి ప్రశ్నలు ... ఈయన జారినప్పుడు కెవ్వు అని అరవలేదేంటి? .. పడగానే చచ్చానురోయి దేవుడో అనలేదేంటి ? ఇదే వెళ్లి మా అక్కని అడిగాను. అక్కా........ మామయ్య .. మల్లిక్ నవలల్లోలాగా పడగానే కెవ్వుమని అరవలేదేంటి అని .. మా అక్క నా వైపు అదోలాగా చూసి వెళ్ళిపోయింది.

ఇప్పుడు కెమెరా మా అన్న వైపు తిరిగింది " అన్నాయి మామ పడబోతుంటే నీ వెన్ను జలదరించి .... వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఇక్కడేదో జరగబోతుంది .. అనిపించలేదా? వెంటనే వెళ్లి అక్కడే ఆగు మామయ్యా అని అపలేదేంటి అని అడిగేసా. అసలే అక్కడ నీళ్ళు పోసి మామయ్య పడడానికి కారణం అయ్యి ఎక్కడ తిడతారో అని భయం భయం గా ఉన్న మా అన్నకి ఇంకా తిక్క రేగింది. అప్పుడే జరిగింది నేను ఊహించిన సంఘటన.... అన్న కుడి చేయి నా బుర్రకి కనెక్ట్ అయింది ... కాని సటాల్ అని సౌండ్ రాలేదు. :( ....మా అన్న నోటి నుండి సింహనాదం కాదు కదా కనీసం పిల్లినాదం కూడా రాలేదు :( . పదునైన కత్తితో గుండె లో పొడిచినట్లు మొఖం చిట్లిస్తూ వెళ్ళిపోయాడు.


ఒకసారి నేను అన్న .. "జగదేక వీరుడు అతిలోక సుందరి" సినిమాకి వెళ్ళాం. సినిమా ఇంటెర్వల్ లో అన్న లేచి బయటకి వెళ్ళాడు. అన్నకి తెలీకుండా నేను వెనకే వెళ్లి కొన్ని నిజాలు తెల్సుకున్నా అవేంటంటే ... మా అన్న కూల్డ్రింక్ షాప్ లో డబ్బులు ఇవ్వడానికి వాలెట్ లోనుండి ఒక కరెన్సీ కట్ట తీసి అందులోనుండి ఒక నోటు ఇవ్వలేదు. జేబులోనుండి పది రూపాయల నోట్ ఇచ్చాడు. మరొకటి సిగిరెట్ సగం తాగి పడేసాడు .. మా వాడే కనుక షాడో అయి ఉంటే చివరికంటా కాలిన సిగిరెట్ వేళ్ళను చురుక్కుమనిపించిన తర్వాత కదా పడేయాలి. సాలోచనగా తల పంకిస్తూ మా వాడు షాడో కాదన్న నిర్ణయానికి వచ్చా. అంతలో ఇద్దరు దృడకాయులు మా అన్నకి దగ్గర గా వెళ్ళారు...... కాని వాళ్ళు మా అన్నని ఏం అడగలేదు ..... మా అన్న వాళ్ళనేం పట్టించుకోలేదు. అయితే వాళ్ళు దృఢ కాయులు కాదని .... ఊబకాయులని నాకు తర్వాత తెలిసింది.

మా వాడు షాడో కాదని తెలియడం తో నా నోరు వేపాకులు నమిలినట్లు చేదు గా అయింది. మస్తిష్కం లో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. "ఇక్కడేం చేస్తున్నావ్ రా" అంటూ మా అన్న తల మీద ఒక్కటివ్వడం తో ఈ లోకం లోకి వచ్చా.

మా అన్న షాడో కాకపోతేనేం నేనే షాడో అవుదామని నిర్ణయించుకున్నా. అయితే నేను ఇంకా ఆరవ తరగతి చదవుతుండడం వలన ఇంటర్ పోల్ లో చేర్చుకోరు కనుక హైస్కూల్ పోల్ లో చేరడానికి ప్రయత్నాలు మొదలెట్టా .... అందులో భాగం గా ఎవరైనా ముసలాయన సిగార్ వెలిగించి కనిపిస్తే సార్ మీ పేరు కులకర్ణి నా అని అడుగుతూ ఉండేవాడిని.

అయితే షాడో పక్కన ఎప్పుడు శ్రీకర్ ఉంటాడు కదా .. మరి నా పక్కన ఉండడానికి ఒకడు కావాలి కదా అనుకోగానే "సీనూ ఆడుకుందామా" అంటూ నా ముందు ప్రత్యక్షం అయ్యాడు రాజేష్ . అహ వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే కదా అనుకున్నా కాని నాకప్పుడు తెలీదు వీడు మధుబాబు నవల లోని వాడు కాదు మల్లిక్ నవలలోని కారెక్టర్ అని.

వీడు ఎంత వరకు పనికొస్తాడా అని నేను రాజేష్ ని గమనించడం మొదలెట్టాను. కాని వీడు హి హి హి అని పళ్ళికిలిస్తూ నవ్వడం .. అర్ధం కాని విషయాలకు బుర్రగోక్కోడం .... సినిమా వాల్ పోస్టర్ లు నోరెళ్ళబెట్టి చూడ్డం వంటి చేష్టలతో నన్ను విసిగించే వాడు. ఎప్పుడన్నా నేను వాడిని "దింగాల డిప్పి "అని తిట్టినప్పుడు గుడ్ల నీరు కుక్కుకోవడం వంటివి చేసే వాడు.

వీడిని ఎలాగైనా శ్రీకర్ ని చెయ్యాలని నేను చేయని ప్రయత్నం లేదు .... అలా ఆరు నెలలు గడిచాయి .... మా చేష్టలని వింతగా చూస్తూ నవ్వుకునే వారు మా క్లాస్మేట్స్ వాళ్ళకి నేను పెట్టిన పేరు డస్కు డమాల్ గాళ్ళు . పైటింగు నేర్పిద్దామని ఊరికే ఎటాక్ చెయ్యరా అంటే .... దబుక్కున ఎగిరి దుబుక్కున నా మీద పడే వాడు .... ఓరి నీ పుస్కున్నర పుస్కు అలా కాదు రా అంటే దుబుక్కున ఎగిరి దబుక్కున పడాలా అనేవాడు ... కోపంగా పళ్ళు కొరికి .. నెప్పి పుట్టి అబ్బో అనే వాడిని దవడ పట్టుకుని. "ఎందుకు శీను అలా పళ్ళు కొరుకుతావు ... మరీ పళ్ళు అంత జిలగా ఉంటే జీళ్ళు కొనుక్కుని నమలచ్చుగా .. ఉచిత సలహా పడేసాడు .. వాడికి కూడా సగం ఇస్తానని ఆశతో నాలిక తడుపుకుంటూ. చాల్లే నీ చచ్చు తెలివి తేటలు .. కిలారి కిత్తిగా అని వాడిని ఒక తోపు తోసి వాడు డుంకి డుంకి అని దింకిలు కొడుతుంటే అహ లపక్ చక లపక్ చక అని గంతులు వేస్తుండగా నాకు అన్పించింది నేను షాడో నా లేక మల్లిక్ నవలల్లో బుచ్చిబాబునా ? నేను వాడిని మార్చానా లేక వాడు నను మార్చేసాడా?







11/13/09

కధలో నీతి

అవి మేము 6 తరగతి చదువుకునే రోజులు .... నేను, ఫరూక్ , రాజేష్ మొదట ఫ్రెండ్స్ అయినది అక్కడే. ఒక రోజు టీచర్ గారు మాకు నీతి కధలు నేర్చుకుని రండి , రేపు ప్రతి ఒక్కరు ఏం కధ నేర్చుకున్నారో చెప్పాలి ... కధలో నీతి తప్పకుండా ఉండాలి అని చెప్పారు. పోలోమని అందరం బయల్దేరాం.

మరుసటి రోజు ఏం నేర్చుకున్నామో తెలీదు చెప్తే టీచర్ గారేం అంటారో తెలీదు... ఐన ఒక్కొక్కరం ఏదో ఒక కధ.. చెప్తున్నాం. ఏం చెప్పినా టీచర్ అందరి చేత క్లాప్స్ కొట్టిస్తున్నారు. అసలేం నేర్చుకోకుండా వచ్చిన రాజేష్ లో ధైర్యం వచ్చింది. తన వంతు వచ్చాక ఇలా చెప్పాడు.

"మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక బాడ్ ఫామిలీ ఉన్నారు టీచర్. ప్రతి ఒక్కళ్ళ తో గొడవలు పడుతూ ఉంటారు .... అందరినీ కొడుతూ ఉంటారు .... ఒక సారి మా మామయ్యా ఆఫీస్ నుండి వస్తుంటే గొడవ వేస్కున్నారు .... మా మామయ్య అసలే తాగి ఉన్నాడు ... అయన దగ్గర ఏమీ లేవ్ .. అయినా ఉత్త చేతులతో వాళ్ళందరినీ పిచ్చ కొట్టుడు కొట్టాడు .. టీచర్" విజయగర్వం తో చెప్పాడు రాజేష్.

"ఈ క్రూరమైన కధ లో నీతి ఏంట్రా" అయోమయంగా కాస్త కోపంగా అడిగారు టీచర్.

"తాగి ఉన్నపుడు మా మామయ్య జోలికి వెళ్ళరాదు" ముసి ముసి గా నవ్వుతూ చెప్పాడు రాజేష్.

11/10/09

కధ చెబుతాను ఊఁ కొడతారా ఉలిక్కిపడతారా


ఒకసారి నేను అస్సాం వెళ్లాను ( రాజేష్ ని కలవడానికి వెళ్ళానన్న మాట).. ..

రైల్వే స్టేషన్ నుండి నేరుగా అస్సాం లో రాజేష్ వాళ్ళ రూం కి వెళ్లాను. రూం అంటే రూం కాదు పాత ఇల్లు లాగ ఉంది . ఏంటబ్బా ఇలా ఉంది అనుకుంటూ లోపలి వెళ్ళాను. రాజేష్ ఎదురోచ్చాడు చేతిలో కార్డ్ లెస్ ఫోన్ ఉంది ... కాస్త అయోమయం గా ఉన్నాడు. "రా శీను" అంటూ మళ్ళా గోడలు మూలలు వెతకడం మొదలెట్టాడు. "ఏం వెతుకుతున్నావ్ రా" అంటే .. "ఈ కార్డ్ లెస్ లో మాట్లాడుతుంటే కాస్త డిస్టర్బెన్స్ వస్తుంది వైర్ ఏమన్నా ఫాల్ట్ ఉందేమో అని చూద్దాం అంటే దీనికి వైర్ లేదు వెతుకుతున్నా" తల గోక్కుంటూ చెప్పాడు రాజేష్ . వీడింకా మారలేదు అనుకుంటూ అక్కడ అంతా చూసాను. అదోలా ఉంది పాత గోడలు, పెచ్చులు ఊడిపోయిన పై కప్పు, 50 ఏళ్ళ నుండి పాడుబడిన ఇంటిలా ... వర్ణించడం ఎందుకు మీరే చూడండి.

మొత్తానికి భయంకరంగా ఉంది ... "అయినా ఇలాంటి ఇంట్లో ఉంటున్నావేంటి రా" అన్నాను. "మన అందరికి ఇక్కడ అయితే బాగా కంఫర్ట్ గా ఉంటుంది అని ఇలా తీసుకున్నా అద్దె బాగా తక్కువ" అన్నాడు రాజేష్. ఓహో అద్దె తక్కువని ఇలాంటి దయ్యాల కొంప తీసుకోవాలనే దెయ్యపు ఐడియా నీకే కదా వస్తుంది అనుకుంటూ ఉండగా ఎవరో నా వెనక ఉన్నట్టు అనిపించి గబుక్కున వెనక్కి తిరిగా ఏదో లీలగా కనిపించి కనిపించనట్లు ... అలా మాయం అయింది నా వెన్ను లో చలి మొదలైంది. "ఏంట్రా ఇక్కడేదో ఉంది" అన్నాను భయంగా. " ఈ ఇంట్లో మనిద్దరమే ఉన్నాము ..మరీ తెలుగు సినిమాల్లో ఇలాంటి ఇళ్లని బూత్ బంగ్లాలుగా చూపడం వల్ల నువ్వు బయపడుతున్నావ్ అలాంటిదేం లేదు కామ్ గా నీ రూం కి వెళ్లి పడుకో" అన్నాడు. ఎందుకో ఆ కంఠం లో కాస్త కోపం ద్వనించింది. సర్లే పనికి మాలిన భయం వల్ల ఈ ఎదవకి కూడా లోకువ అయిపోతున్నాను అనుకుంటూ "నా రూం ఎక్కడ" అడిగాను. " ఈ రూం పక్కన మెట్లు ఉంటాయి పైకి వెళ్ళు వెనక వైపు లాస్ట్ రూం నీది"అన్నాడు." మరి నీది" అన్నాను. ఇక్కడే ఈ మూల లాస్ట్ రూం నాది అన్నాడు ... "అదేంట్రా నేను అరిచినా రంకెలేసినా నీకు వినపడదు అంత దూరం ఏంటి నేను కూడా కిందనే ఉంటాను లేదా నువ్వు కూడా పైకి రా" అన్నాను .. "అంటే మిగిలిన రూముల్లో ఇంటిగల వాళ్ళ సామాన్లు ఉన్నాయి.ఈ రెండు రూములే ఖాళీగా ఉన్నాయి అదన్నమాట సంగతి. కావాలంటే నా రూం లో ఉండు అన్నాడు" . హు నీతో ఉండడం కంటే అక్కడే ఉండడం మేలు అనుకుంటూ పైకి వెళ్లాను. (గమనిక ) నా రూం లో మరియు రాజేష్ రూముల్లో మాత్రమే లైట్లు ఉంటాయి మిగిలిన రూమ్స్ కి కరంటు లేదు) మెట్లెక్కి పైకి వెళ్లాను . నా కర్మ గబ్బగియ్యం గా చిమ్మ చీకటిగా .. నేను ఆ రూముల ముందు నుండి నడుస్తూ వెళుతున్నా .... ఎవరో ఆశగా నా వైపు చూస్తున్నా ఫీలింగ్ .......రూముల్లో ఎవరో ఉన్నారు అని నాకు ఎందుకో అనిపిస్తుంది.

రూం లోకి వచ్చి లైట్ ఆన్ చేశా .... హమ్మయ్య అనుకుంటూ ... కాసేపు పడుకున్నా......................... సడన్ గా మెలకువ వచ్చింది టైం చూసా... 11 ఐంది.ఈ ఎదవ డిన్నర్ కి పిలవలేదేంటా అనుకుంటూ బయట కొచ్చా .......... చల్లగా ఉంది బయట . కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి . ఒక్కసారిగా ఏదో శబ్దం వినిపించింది. ఇందాక కూడా ఇలాంటి శబ్దమే వచ్చింది అందుకే నేను నిద్ర లేచా.ఏదో అనుమానం వచ్చి మెట్లెక్కి పైకి వెళ్ళా అక్కడ ...... అక్కడ......అక్కడ .... ఏవో.. కొన్ని .... ఆకారాలున్నాయి ... అవి ముసుగులు వేసుకుని వాటిలో అవి చర్చల్లో ఉన్నట్లు గుస గుసలాడుకుంటూ ఉన్నాయి. అమ్మో దయ్యాల్లాగా ఉన్నాయి అనుకున్నా ( పారిపోదాం అన్న ఐడియా నాకప్పుడు రాలేదు) పైగా అవేం మాట్లాడుకుంటూ ఉన్నాయో తెలుసుకుందామని కుతూహలం తో దగ్గరకు వెళ్ళా .... తెలుగు లోనే మాట్లాడుతున్నాయి. "వీడిని ఇవాళ ఎలాగైనా మంచి చేసుకుని మన రూములోకి తీసుకెళ్ళాలి . తరువాత నమిలి మింగేద్దాం" అంటుంది ఒకటి. అవి దయ్యాలని అర్ధం ఐంది. "ఐతే మనం మనుషులకు తగల కూడదు మన శరీరం మంచుగడ్డ లాగ చల్లగా ఉంటుంది అప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది. కాబట్టి తగలకుండ మేనేజ్ చేద్దాం" అనుకుంటూ ఉన్నాయవి. సడన్ గా నా వైపు తిరిగాయి. నేను వాటిని చూడనట్లు అటువైపు తిరిగా .... హమ్మయ్య వీడు మనల్ని చూడలేదు అనుకుంటూ అవి ఇంకో వైపుకి వెళ్ళిపోయాయి. వార్నీ ఇది నిజంగా దయ్యాల కొంపనే కదా అనుకుంటూ గబగబా కిందికి వచ్చి రాజేష్ రూం కి వెళ్లాను . తాళం వేసి ఉంది ఈ టైం లో ఎక్కడికి వెళ్ళాడబ్బా అనుకుంటూ అలా ముందు వైపుకి ఉన్న పిచ్చిమొక్కల లాన్ లోకి వచ్చా ... "ఇక్కడేం చేస్తున్నావ్ శీను" వెనక నుండి రాజేష్ గొంతు వినిపించింది. వెనక్కితిరిగి చూస్తె చేతిలో ఏవో పార్సిల్ పట్టుకుని ఉన్నాడు. "ఈ టైం లో ఎక్కడికి వెళ్ళావ్ " కోపంగా అడిగాను ... "నీ కోసం డిన్నర్ తెచ్చా హోటల్ నుండి" అంటూ పార్సిల్ ఇచ్చాడు. "డిన్నర్ సంగతి తర్వాత పైన దయ్యాలు ఉన్నాయిరా బాబు .. ఈ రాత్రి కి నన్ను తినాలని ప్లాన్ చేస్తున్నాయి... అవును ఇన్ని రోజుల నుండి నువ్వు ఇక్కడే ఉన్నావ్ కదా నిన్ను తినలేదేంటి" అని అనుమానంగా అడిగా ..."నేను అదే అడుగుతున్నా .. దయ్యాలు ఉంటే నన్ను ఎందుకు తినలేదు ..ఆ ....దయ్యాల్లేవ్ గియ్యాల్లేవ్ అంతా నీ భ్రమ" అన్నాడు.
"సరే పోయి తిని పడుకో" .. అని నా వైపు అదోలా చూసి..... రూం లోకి వెళ్ళిపోయాడు .. మళ్ళా ఆ చీకటి మెట్లెక్కి పోవాలా అనుకుంటూ మెట్ల వైపు వెళ్లాను అక్కడ కిటికీల వెనుక నుండి నన్ను తొంగి తొంగి చూస్తునాయి ఆ దయ్యాలు.


ఇక్కడేమో దయ్యాలున్నాయి ఈ రాజేష్ గాడేమో నమ్మడు ఇప్పుడెలా అనుకుంటూ ఏదన్నా ప్లాన్ చెయ్యాలి వీటిని రాజేష్ కి పట్టివ్వడానికి అనుకుంటూ నాకు తెలీకుండానే పై అంతస్థుకి వెళ్ళా ... మై గాడ్ అక్కడ ఫుల్ గా దయ్యాలున్నాయి. కిందకెల్దామని మెట్ల దగ్గర కొచ్చా మెట్ల మీద కాచుకుని కూర్చున్నాయి దయ్యాలు. ఇప్పుడెలారా భగవంతుడా అనుకుంటుండగా "సార్ ఇక్కడ శ్రీనివాస్ ఎవరండీ?" అన కేక వినపడింది కింద నుండి "నేనే బాబు శ్రీనివాసుని ఇంతకీ నువ్వెవరు" అని అరిచా ( దయ్యాలు ఆలోచనలో పడ్డాయి ) "నేను డి.టి. డి.సి . కొరియర్ అబ్బాయిని సార్ మీకు కొరియర్ వచ్చింది" అరిచాడా కొరియర్ అబ్బాయి . "సరే కాస్త పైకి రావా "రిక్వెస్టు తో కూడిన అరుపు అరిచా ." సరే సార్ వస్తా" అని టక టకా నడుచుకుంటూ వచ్చేసాడు ఆ కొరియర్ అబ్బాయి. "అహ దేవుడిలా వచ్చవయ్యా" అన్నాను." అదేంటి సార్ అలా అన్నారు" అయోమయం గా అడిగాడా కొరియరబ్బాయి. "ఏం లేదు నేను కూడా నీతో బాటు బయటకి వస్తా నన్ను తీసుకెళ్ళు" అన్నాను.

అయోమయంగా చూసాడా కొరియరబ్బాయి .... కాని ఆ అబ్బాయి ని తోడుగా తీసుకుని నేను దయ్యాల బారి నుండి తప్పించుకుందామని చూస్తున్నానని వాడికి తెలీదు. ఎందుకైనా మంచిదని కొరియరబ్బాయి చెయ్యి పట్టుకుని చూశాను మంచులాగ తగుల్తుందేమో అని ....... అదేం లేదు మామూలుగానే ఉంది. ఆనందంగా ఆ అబ్బాయి చెయ్యి పట్టుకుని నడుస్తుంటే ఉక్రోషంగా చూస్తున దయ్యాలు నిస్సహాయులయ్యాయి. బయట వరకు వచ్చాక " బాబు థాంక్స్ ఇంక నువ్వెళ్ళు" అని పంపేసా. టైం అర్ధరాత్రి రెండు గంటలైంది అక్కడే కూర్చున్నా . ఏం చేయాలో పాలుపోడం లేదు. ఈ రాజేష్ గాడెం చేస్తున్నాడో .. ఈ దయ్యాలు వాడిని ఏం చేస్తాయో అని భయం భయం గా కూర్చున్నా . కాసేపటికి .... రాజేష్ గాడు బయటికి వచ్చాడు. "బాత్రూం కని లేచి చూస్తే నువ్వు ఇక్కడ కనపడ్డావ్ ఏం చేస్తున్నావ్" అంటూ దగ్గర కొచ్చాడు . "నీ బొంద........... నీ పిండాకూడు పిశాచాలకి పెట్ట............ నీ శార్ధం చెట్టు కింద పెట్ట .. ఈ దయ్యాల కొంపలో నీ దిక్కుమాలిన కాపురం నువ్వూను ... పైన అని దయ్యాలేరా ... ఇందాక ఆ కొరియర్ గాని రాక పొతే చచ్చుండే వాడిని దయ్యాల చేతిలో" అని ఆవేశం గా అరిచేసాను. "అంత లేదమ్మా పద పైకెళ్ళి చూద్దాం" అంటూ నన్ను పైకి తీస్కెళ్ళాడు. పై అంతస్థుకి వెళ్ళగానే అక్కడన్నీ దయ్యాలు మమ్మల్ని చూస్తూ నవ్వుతూ దగ్గరకొస్తున్నాయి. " రాజేష్ ....... రాజేష్ అవిగో దయ్యాలు" అంటూ వాడి చెయ్యి పట్టుకున్నాను . ఆశ్చర్యం రాజేష్ చేయి... మంచులాగ.. ఐస్ లాగా ....చల్లగా పొగలు వస్తు ఉంది. " ఆ రాజేష్ నువ్వు దయ్యానివా అంటూ వదులు వదులు " అని నా చెయ్యి లాక్కోసాగాను.

.
.
.
.
.
.
.
.
.


కళ్ళు తెరిచేసరికి
.
.
.
.
.
.
.
.
శీను రేయ్ సీనూ ... టైం ఎనిమిదైనా లేవకుండా ఆ మొద్దు నిద్రేంటి ఆ కలవరింతలేంటి అంటూ తట్టి లేపుతుంది అమ్మ ... పక్కన బిత్తర చూపులు చూస్తూ భయం భయం గా నిలబడి ఉన్నాడు రాయుడు.







హమ్మయ్య ఇదంతా కలేనా!!!!!

ఊఁ కొట్టారా ఉలిక్కిపడ్డారా .


10/16/09

స్టార్ స్లిప్స్

మహేష్ బాబు : ఎన్ని స్లిప్పులేట్టామని కాదు అన్నయా ………….. కొషిన్ దిగిందా లేదా

జూనియర్ యెన్. టి . ఆర్ : ఈ కాలేజీ లో మొదట స్లిప్ పెట్టింది మా తాత. దొరికింది మా తాత . వాటితో మీరేంటి సర్ నన్ను పీకేది

రాంచరణ్ తేజ : కొసెన్స్ ఎక్కువ ఇనా పరవాలేదు లెక్చరర్, స్లిప్ లు తక్కువ కానీకు

ప్రభాస్ : ఎండి ఒక స్లిప్ ఇవండి ………… ఎండి ఒక ఆన్సర్ చూపించండి ………….. మీ హ్యాండ్ రైటింగ్ చాలా బాగుంది ………………. ఎండి ప్లీజ్ ఎండి చూపించండి .

సాయి కుమార్ : కనిపించే ఈ 3 పేపర్లు ……. కొసిన్ పేపర్, మెయిన్ పేపర్, అడిషనల్ పేపర్ ఐతే ……… కనిపించని ఆ 4 వ పేపర్ ఏరా స్లిప్.
చిరు : నువ్వు 3 స్లిప్స్ పెట్టు …… మరో ముగ్గురికి 3 స్లిప్స్ పెట్టమని చెప్పు …… అలా మొత్తం కాన్సెప్ట్స్ కవర్ చెయ్యొచ్చు

బాలయ్య: కుమారస్వామి , గోపాలస్వామి , నాగేంద్రస్వామి , ఇలా ముగుర్రు స్లిప్పులు పెట్టి దొరికి పొతే ………. ఈసారి పుట్టేవాడు దొరక్కూడదని మొక్కి మరీ పెట్టాడు రా నా పేరు స్లిప్పు స్వామి అని

6/5/09

స్టార్ హోటల్ కి ఎందుకు వెళ్లరు

ఒక సారి ఒక పెద్ద మనిషి చాలా రోజుల తర్వాత కనిపించాడు."రండి సర్ అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం " అంటూ ఎదురుగా ఉన్న ఐదు నక్షత్రాల హోటల్ కి నడవబోయాడు "బాబు నేను స్టార్ హోటళ్ళకి రాను" అన్నాను.

స్టార్ హోటల్ కి ఎందుకు వెళ్లరు మీరు అడిగాడు ఆ పెద్ద మనిషి "నిజం చెప్పమంటారా అబద్దం చెప్పమంటారా" .. .నా మాట పూర్తయ్యే లోపు తోట రాముడు లో యెన్ టీ వోడంతా సీను నీకు లేదు శీను అనేసాడు. సరే చెప్పడమెందుకు నీకే చూపిస్తా పద అనేసి లోనికి నడిచా.

కూర్చున్న కాసేపటికి సో కాల్డ్ స్టీవర్ట్ వచ్చాడు నల్ల ప్యాంటు తెల్ల చొక్కా దాని మీద నల్ల జాకెట్టు నల్ల టై చేతిలో ఎర్ర రంగు బుల్లి పుస్తకం రేనాల్డ్స్ పెన్ను. ఇది అ సదరు వ్యక్తి అవతారం .

"ఆర్డర్ చెప్పండి గురు" అన్నాడు పెద్ద మనిషి "ఆ నేనెందుకు లే మీరే చెప్పండి" అన్నాను నేను


వారిద్దరి సంభాషణ

స్టీవర్ట్ : ఏం తీస్కుంటారు సర్ కాఫీ , టీ, జ్యూస్, చాకొలేట్ , మై లో , ఐస్ క్రీం

పెద్దమనిషి : టీ ( దర్పంగా)

స్టీవర్ట్ : ఏ టీ సర్ సెయ్లోన్ టీ , హెర్బల్ టీ , బుష్ టీ , హనీ బుష్ టీ , ఐస్ టీ, గ్రీన్ టీ


పెద్దమనిషి : సెయ్లోన్ టీ (సాలోచనగా )


స్టీవర్ట్ :ఎలా కావాలి సర్ బ్లాక్ లేక వైట్


పెద్దమనిషి : వైట్ (ఏంటి తేడాగా ఉంది అనుకుంటూ )

స్టీవర్ట్ : మిల్క్ , వైట్నర్ లేక కండేన్సెడ్

పెద్దమనిషి : మిల్క్ ( అసహనం గా )

స్టీవర్ట్ :ఆవుపాలు , మేక పాలు , గేదె పాలు వీటిల్లో ఏది సర్

పెద్దమనిషి : గేదె పాలు ( దీనం గా)

స్టీవర్ట్ :చలి ప్రదేశం లో పెరిగిన గేదె లేక ఆఫ్రికా గేదె ? రెండిటి లో ఏది సర్

పెద్దమనిషి : ఆఫ్రికా గేదె ( అయోమయం గా )

స్టీవర్ట్ :సరే టీలో షుగర్ , స్వీట్నర్ లేక తేనే కావాలా సర్

పెద్దమనిషి : చక్కర ( పళ్ళు కొరుకుతూ)

స్టీవర్ట్ :బీట్ షుగర్ లేక కేన్ షుగర్ సర్

పెద్దమనిషి : కేన్ షుగర్ (వస్తున్న కన్నీళ్ళు ఆపుకుంటూ నోట్లో కర్చీఫ్ కుక్కుకుని )

స్టీవర్ట్ :వైట్ , బ్రౌన్ లేక ఎల్లో షుగర్ సర్

పెద్దమనిషి : టీ వద్దు గానీ నోరెండి పోతూ ఉంది కాస్త మంచి నీళ్ళు ఇస్తావా (కళ్ళు తుడుచుకుంటూ )

స్టీవర్ట్ :మినరల్ వాటర్ లేక మాములు వాటర్


పెద్దమనిషి : మినరల్ వాటర్ (మన్మధుడు సినిమాలో పారిపొయ్యే ముందు షూ లేస్ కట్టుకునే ముందు బ్రహ్మానందం లా చూస్తూ )

స్టీవర్ట్ :ఫ్లేవర్డ్ లేక నాన్ ఫ్లేవర్డ్

పెద్దమనిషి : (లేచి ) "అవును తాజమహల్ నేను ఎందుకు కట్టించాను .... అశోకుడు ఆడుకొవడా నికే కదా .. మరి రాయలు అలా అన్నాడేంటి .... ఏమో .. రుద్రమ దేవి చెప్పిందే నిజమవ్తుందా .. నేను ఈ పూటకూళ్ళ గృహమునందు ఎందుకు ఉన్నాను .. భటులేరి ... ఎవరక్కడ "
అంటూ చప్పట్లు కొట్టుకుంటూ టేబుల్ మీద ఉన్న గుడ్డ వీపుకి కట్టుకుని ఠీవి గా అడుగులేస్తూ వెళ్ళిపొయ్యాడు.

నాయనా సహజము గా కస్టమర్లకు విరక్తి కలిగించే వాళ్ళని చూసాను కానీ పిచ్చేక్కించే వాడ్ని నిన్నే చూసాను నీ పేరేంటి నాయనా కాస్త భయం తో కూడిన ఆసక్తి తో అడిగాను నేను.

"రాజేష్" నవ్వుతూ చెప్పాడా నల్ల గుడ్డల సాడిస్టు

4/11/09

బ్లాగరుల సృజనాత్మకత కి పరిక్ష

జనులార , హితులార , సన్నిహితులారా ,,,

మరేమో ఆల్రెడీ వికట కవి అనే పేరు తో ఒక బ్లాగు ఉన్నా సంగతి తెలీక నేను పేరెంచుకుంటిని ... మరి అదేమాదిరిగా ముందుకు పోతున్నాం... ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం , టపాలు రాసాం అన్న విషయాన్నీ మనవిచేస్కుంటున్నాను.

ఐతే ఈనాడు మరొక్క బ్లాగు ఉన్నదనీ ... ఇదే పేరు తో ఉన్నదని .. సీమ పచ్చగా ఉండాలంటే నేను పేరుమార్చాలని నిర్ణయించుకున్నా, రాజీవ్ బ్లాగు పేరు మార్పిడి పధకం కింద నా బ్లాగు పేరు మార్చే ప్రయత్నం చేస్తున్నా.

సామజిక న్యాయం కోసం కొత్త పేరు సూచించే అవకాశాన్ని మీకు ఇస్తున్నాను మొదటి సారిగా మా ప్రజా చోద్యం పార్టీ కార్యక్రమాన్ని చేపట్టింది.

కొన్ని పేర్లు బ్లాగెలక్షన్ కమీషన్ సూచించడం జరిగింది

డాం
గన్నేరు పప్పు
జిల్లేడు పూలు
లేవండి పడుకోండి
బ్లాగు తమ్ముడు
పాకశాల
బుర్రలో మూట
తోచింది కూస్తాను
నాన్న బడి
ప్రపంచం లో అసాద్యం
మజా రాజ్యం
నూతన పెన్ను
నా నస వీణ
మూడార్లు
పన్నెండు

ఈ పేర్లలో ఒక మంచి పేరు సూచించిన వారికి రాజేష్ తో ఒకరోజు గడిపే అవకాశం. పేర్లే కాక మీకు తోచిన పేర్లు కూడా సూచించ వలసింది గా కోరడమైనది.

గమనిక : బ్లాగు పేరు మాత్రమే మార్చుతున్నాను .. బ్లాగ్ లో ప్రధాన పాత్ర ధారుడిని కాదు .... రాజేష్ పాత్ర ఎవరికిఇవ్వబడదు

4/9/09

రాజేష్ రియాల్టీ షో

మీరు ఒక కాలనీ లో ఉంటున్నారు .. మీ పక్క పోర్షన్ లో రాజేష్ ఉంటున్నాడు .. ఒక రోజు మీ అబ్బాయి ని టమాటాలు తీసుకురమ్మని మార్కెట్టుకు పంపారు ... వెళ్ళిన బాబు యెంత సేపు కి తిరిగి రాలేదు( సరదాగా నే కాసేపు అనుకోండి) .... కంగారు కంగారు గా పక్కనే ఉంటున్న రాజేష్ దగ్గరకెళ్ళి ఇలా అన్నారు " రాజేష్ మా బాబు టమాటా కోసంమార్కెట్ కి వెళ్లి మూడు గంటలైంది ఇంక రాలేదు నాకేంటో కంగారుగా ఉంది కాస్త వెళ్లి చూస్తావా" అన్నారు. అప్పుడు రాజేష్ ఏం చేస్తాడు అనుకుంటున్నారు????
ఆప్షన్స్

: వెంటనే బాబు ని వెదికి తేవడానికి మార్కెట్ కెళ్తాడు.

బి: మార్కెట్ కెళ్ళి టమాటాలు తెస్తాడు.

సి: ఇంట్లో టమాటాలు తెచ్చి పూటకి కానీవండి అంటాడు.

డి: వేరే కూర వండుకోండి అంటాడు.

కరక్టు సమాధానం తెలిసిన వారు కూడలి అని టైపు చేసి స్పేస్ ఇచ్చి మీ రైట్ ఆప్షన్ టైప్ చేసి జల్లెడకి పంపండి.

4/7/09

నా జీవితం లో మరపురాని దృశ్యాలు (కొన్ని మాత్రమే)

పెద్దదిగా చూడుటకు ఫోటో మీద క్లిక్ చేయండి

పి ఏం.ఏం అనాధ శరణాలయం




బ్లైండ్ స్కూల్




కేర్ అండ్ లవ్ అనాధ శరణాలయం



న్యూ లైఫ్ హోం పిల్లలతో




సహాయ యానివర్సరీ గురించి పేపర్లో



సాయినాధ అనాధ సదన్ లో దుర్గమ్మ తో



హృదయస్పందన


చక్రం

3/31/09

సర్దార్జీ క్షమించు

ఇందాకే ఒక మిత్రుడు సిక్కుల గురించి ఉన్న దాదాపు అన్ని జోకులు మెయిల్ చేసాడు ... కాసేపయ్యాక ఆకాశమంతా .... సినిమా రివ్యూ చదవడం జరిగింది ... అందులో కూడా సర్దార్ మీద వచ్చే జోకుల గురించి ప్రస్తావనఉంది.
సర్దార్ జోక్స్ ఇవాళ ఇంతలా ఫేమస్ అవడానికి కారణాలేంటి .... అసలు సర్దార్ జోకులెలా పుట్టాయి అని కాస్త లోతుగా కొద్దో గొప్పో నాకు పరిచయం ఉన్నా సర్కిల్ లో ఆర తీయగా కొన్ని విషయాలు తెలిసాయి.
స్వతంత్ర పోరాటం లో తెల్ల వాడికి చెమటలు పట్టించటం లో సర్దార్జీల పాత్ర చాలా ఉందని అసలు స్వాతంత్రం కోసంప్రాణాలు ఒడ్డి పోరాడిన యోధులు వారి లోనే ఎక్కువని .. వారు చూపిన తెగువను తట్టుకోలేని తెల్లవాడు అక్కసు తోవారి వారి పార్టీలలో సర్దార్జీ జోకులు మొదలెట్టాడని .. తెల్సుకున్న తర్వాత .. నా మీద నాకే కోపమొచ్చిందికొన్నాళ్ళు సర్దార్జీ జోకులు నేను ఆస్వాదిన్చినదుకు. తెల్లవాడు మన వారి మీద మొదలెట్టిన దాడి ని మనమేకొనసాగిస్తున్నాం.
సర్దార్జీల మీద ఈనాడు ఇన్ని జోకులా. గూగుల్ సెర్చ్ లో సర్దార్ అని కొడితే కొన్ని వందల వెబ్సైట్లు .. దర్సనమిస్తున్నాయి .. ఒక్క సారి ఆలోచిస్తే సామజిక వర్గం లోని వారు యెంత ఆత్మన్యూనతా భావానికీలోనవుతారు .. పాఠశాల లో కళాశాల లో సాటి పిల్లల అవహేళన మద్య పిల్లల మానసిక పరిస్తితి .. నిజం గామనకే అలాంటి పరిస్థితి వస్తే ఒక్కసారి ఒళ్ళు గగుర్పొడిచింది .... ... గాడ్ .... నిజం గా ప్రపంచం మొత్తం కలిసి ఒక జాతి మీద జరుపుతున్న హేయమైన దాడిగా అనిపించింది. నా సామాజిక వర్గాన్ని ఎత్తి చూపుతూ మీ వాళ్ళకికాస్ట్ ఫీలింగు ఎక్కువ రో అని నన్ను స్కూల్ లో కాలేజి లో కొందరు మాట్లాడుతుంటేనే నాకు చాలా బాదేసేది. అలాంటిది ప్రపంచమంతా ఇంత దారుణమైన ప్రక్రియ జరుగుతుంటే వారెంత బాధ పడుతున్నారో.

మీరెప్పుడైనా సర్దార్జీ ని కలిసారా .. కలిస్తే గమనించండి యెంత మంచి వారో .... యెంత దేశభక్తి కల వారో తెలుస్తుంది.. పెళ్ళాం పిల్లల్ని వదిలి దేశం మొత్తం లారీ డ్రైవర్లు గా , హైవే పక్కన ధాభాలు నడుపు కుంటూ మనకెంతో సేవ చేస్తున్నారు ... తన మీద తనే జోకు వేసుకునే మంచి వాడు సర్దార్జీ ... అలాంటి సర్దార్జీని బాద పెడితే మనకి పాపం.
పైగా కొన్ని జోకుల్లో వారి స్త్రీల కారెక్టర్ గురించి చెండాలమైన కామెంట్స్ ఉన్నాయి. ఇదెంత కుసంస్కారం.
నవ్వు కోవాలి కాని అది కొందరి పాలిట శాపం గా మారకూడదు.
గమనిక : నేను తెలుగు బ్లాగ్లోకం లోకి కొత్తగా వచ్చాను .. చర్చ ఇంతకు ముందు కూడా జరిగి ఉండవచ్చు .. మళ్ళా జరిగితే తప్పులేదుగా.
(ఈ సారి సర్దార్ జోకులు ఎవరికన్నా చెప్పేటప్పుడు సర్దార్ పేరు తీసేసి తన పేరు పెట్టుకోమని రాజేష్ ఉచిత సలహా ఇస్తున్నాడు)

3/30/09

బ్లాగ్కర్ణుడు - వీడికి బ్లాగు లేదు

కూడల్లో బ్లాగరుల మద్య బ్లాగ్ కాంపిటీషన్ జరుగుతుంది .. బ్లాగ్ పెద్దలు బ్లాగ్ పూజ్యులు సీనియెర్ బ్లాగరులు ... బ్లాగ్భీష్మ పితామహులు మరియు బ్లాగ్ కురువృద్ధులు అందరు అక్కడ ఉన్నారు. తమ సత్తా నిరూపించు కోవాలని బ్లాగరులంతా ఉత్సాహం గా ఉన్నారు.

పోటీ ప్రారంభించినారు........ ఒక్కొక్కరే తమ బ్లాగును పబ్లిష్ చేస్తున్నారు . నిర్వాహకులు మార్కులు వేస్తున్నారు ......కరతాళ ధ్వనుల మధ్య రవి గారు గెలవడం దాదాపు ఖాయం అనుకున్న సమయం లో వచ్చాడొక యువకుడు " నేనుకూడా బ్లాగుతా" అంటు.

అతని పేరు
బ్లాగ్కర్ణుడు అతని మోహము లో కనిపిస్తున్న బ్లాగ్ తేజస్సు కు భయపడిన మలక్పేట్ రౌడీ ఎలా ఐనా రవి గారిని గెలిపించాలని "అటులనే బ్లాగెదవు కాని నీ బ్లాగు తెలుగు ఫాంటు లో ఉందా లేదా వివరాలేవి" అని అడిగాడు.. సమాధానంగా మౌనాన్ని ఆశ్రయించాడు బ్లాగ్కర్ణుడు . ఏమి నీమౌనము తెలుగు టైపు రాదా అని ప్రశ్నించాడు మలక్పేట్..... రాదన్నాడు బ్లాగ్కర్ణుడు .... ఐన నీవు అనర్హుడవుప్రకటించినాడు మలక్పేట్.. నిరాశ తో వెనుదిరిగినాడు బ్లాగ్కర్ణుడు.

"ఆగాగు" గంభీరమైన స్వరం వినిపించి అందరు అటు చూసారు ... లాప్టాప్ భుజాన పెట్టుకుని మధ్య లోకి వచ్చాడు వికటకవి .... "మలక్పెటా ...... ఏమంటివి ఏమంటివి ఇది బ్లాగ్ పరీక్షయే గాని ఫాంట్ పరీక్ష కాదే కాదు కాకూడదు ఇది ఫాంట్ పరీక్ష అన్డువా మొన్న మొన్న దాక ఆర్కుట్ లో మనము వాడినది ఏ ఫాంటు .. నీ రౌడీ రాజ్యము లో అప్పుడప్పుడు నీవు వాడినది ఏ ఫాంటు ఇంత ఏల లేఖిని కి ముందు అసలు మన అందరిది ఏ ఫాంటు .. నాతొ చెప్పిన్తు వేమయ్య యాహూ చాట్ లో ను .. తెలుగు పీపుల్ నందు మేము వాడినది ఏ ఫాంటు .. అతి జుగుప్సాకరమైన భాష వాడే రిడీఫ్ చాట్ నందు మన జనాలు వాడినది ఏ ఫాంటు .... హె .... మనము ఏ నాడో ఆంగ్ల ఫాంటునకు అధీనులమైనాము .. మళ్ళా ఈ నాడు ఫాంటు ఫాంటు అంటూ ఈ ఫాంటు గోల ఏమి " అన్నాడు వికటకవి ఆవేశం గా.

పరిస్థితి చేయి జారి పోతుంది అనుకున్న జీడిపప్పు గారు వచ్చి .. "సరే నాయనా వికటకవి లెస్ పలికినా లెస్స పలికితివి .... అటులైన ఫాంటు పట్టింపు లేదు కాని ఇతను బ్లాగవలెనన్న బ్లాగు కావలెను కదా ... బ్లాగు లేని ఇతను ఏల బ్లాగుతాడు ఐన ఇప్పుడు సృష్టించినా కూడలి లో సభ్యత్వం కావలెనన్న ఇంకా రెండు రోజులు పట్టును కదా" .... అని ప్రశ్నించి .. చిత్రం భళారే విచిత్రం లో బ్రహ్మానందం లా రవి గారి వంక చూసి కళ్ళెగరేసి బాగా చెప్పానా అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇచ్చి కూర్చున్నాడు.

వెంటనే వికటకవి .... బ్లాగు ఉంటేనే ... బ్లాగానిస్తారంటే ... ఇతన్ని నా బ్లాగు లో మెంబరు గా చేర్చుకుంటా అనగానే .. .. సమయమ మించి పోయింది అని గంట కొట్టారు నిర్వాహకులు . ఈ గొడవల కారణంగా పోటీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు ...

మరునాడు , ఆనాడు , ఆంధ్ర మంట , చంద్ర మరియు అక్కుపక్షి పేపర్లలో న్యూస్... ఇలా ఉంది.

కూడల్లో జరిగిన బ్లాగుయ్ల పోటీ ఒక యువకుని కారణం గ రద్దయినది అని ... ఆ యువకుడు బ్లాగ్కర్ణుడు అని ఇంతకీ
బ్లాగ్కర్ణుడు ఎవరు అని ఆరా తీయగా అతని పేరు రాజేష్ అని ... బ్లాగడం కాదు కదా కనీసం బ్లాగులో పాకడం కూడా రాని వాడని...... గొడవ చేసి రవి గారి గెలుపుకు అడ్డు కట్ట వెయ్యడానికే వికటకవి అతన్ని తీస్కోచ్చాడని తెలిసిన రవి గారు కోపోద్రిక్తులై .. వికటకవి కోసం కూడలి, జల్లెడ , ఆర్కుట్ నగరాల్లో గాలిస్తున్నట్లు సమాచారం.

వికట కవి ని పట్టిచ్చిన వారికి పది కామెంట్లు బహుమతిగా ఇస్తా
అని అయన ఈ సందర్భంగా ప్రకటించినట్లు సమాచారం ,వికట కవిని పట్టుకోవడానికి మలక్, జీడిపప్పు , నేస్తం, కిరణ్ (ఐతే ఓకే ) , చైతన్య , బ్లాగు సోదరి గార్లు తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నారని అభిజ్ఞా వర్గాల భోగట్టా.

3/25/09

బ్లాగోపాఖ్యానం

ముందు మాట: ముందుగా ఈ టపా చదవడానికి వచ్చిన పెద్దలకి చిన్నలకి నా విన్నపం... ఈ టపా సరదాగా నవ్వుకోడానికి రాసాను. అంతే గానీ ఎవరినీ ఎత్తి పొడవడానికి కాదు. కోప తాపాలకు తావివ్వకుండా మీ సోదరుడు చేసిన చిన్ని హాస్య రచనగా భావించి చదవండి.

మొత్తం బ్లాగ్లోకం లో బ్లాగరుల సంఖ్య నాలుగు కోట్ల మూడు లక్షల తొంభై ఆరు వేల ముప్పయి నాలుగు
వీరిలో భారతీయులు పదకొండు లక్షల ముగ్గురు
వీరిలో తెలుగు వారు ఒక లక్షా ఇరవై వేల ఇరవై నాలుగు
వీరిలో తెలుగులో బ్లాగు వ్రాయు వారు మూడు వేల మంది
వీరిలో మగ వారు పద్దెనిమిది వందల ముప్పయి మూడు
ఆడవారు పదకొండు వందల అరవై ఏడు
వీరిలో బ్లాగులు డిలీట్ చేసిన వారు వంద మంది
కూడలి లో నమోదు ఐన వారు మూడు వందల మంది
వీరిలో ఆడవారు నూట ముప్పై
మగ వారు నూట డెబ్బై
నిరంతరం బ్లాగులో టపా లు రాసేవారు రెండు వందల యాభై మంది
అప్పుడప్పుడు రాసే వారు ఇరవై మంది
బ్లాగు నమోదు చేసుకుని మాత్రమే ఉండేవారు పది మంది
ఏదో ఒక సొల్లు టపా ఒకటి అలా వదిలేసే వారు ఇరవై మంది
ఒకటి కన్నా ఎక్కువ బ్లాగులు ఉన్నవారు పంతొమ్మిది మంది
పక్క బ్లాగులు చూసి కామెంట్లు రాసి ఉత్సాహ పరిచే వారు నలభై మంది
కామెంటు చెయ్యకుండా అదే పనిగా బ్లాగులన్నీ చూసి పొయ్యే వారు డెబ్బయి మంది
అజ్ఞాత కామెంట్లు రాసే వారి సంఖ్యా అజ్ఞ్జాతం
బ్లాగులో టపా రాసి.. నా బ్లాగు చూడు చూడు అని సావ దొబ్బే వారు ఎనభై ఏడు మంది
నేను నీబ్లాగు లో కామెంటు రాస్తా నువ్వు నా దాన్లో కామెంటు రాయి అని కుళ్ళ బొడిచే వారు పది మంది.. అమ్మాయిల బ్లాగుల్లో కామెంటు రాసి వారి దృష్టి లో పడాలనుకునే మగబ్లాగార్ల సంఖ్య నూట డెబ్బై( వంద శాతం) హిట్లు పెంచుకోవడానికి హిట్ కౌంటర్ పెట్టుకుని అదే పనిగా రిఫ్రెష్ బటన్ నొక్కుకునే వారు రెండు వందల తొంభై తొమ్మిది
వివాదాల ద్వారా ఫేం అవుదాము అనుకునే వారు పన్నెండు మంది
ఫేక్ బ్లాగరులు ఇరవై ఏడు మంది

ఇంక హిట్లు...

సగటున సాహిత్య బ్లాగుకి ఒక రోజు హిట్లు ఆరు
కామెడి బ్లాగుకి వంద
రాజకీయ విమర్శకులకు ముప్పై
వ్యక్తిగత బ్లాగులకి అరవై ఆరు
చాల కాలం నుండి బ్లాగ్లోకం లో ఉంటూ సీనియెర్ లు అయిన వారికి (బుక్ మార్క్స్ అయి ఉంటారు కనుక ) నూట ముప్పై
కధలు రాసే వారికీ సగటున రోజుకి ఇరవై
బూతుల బ్లాగుకి పదకొండు వందలు ( దేవుడా రక్షించు)

గమనిక:
పైన ఉన్న వివరాలు సరి కాదని, తప్పని ఎవరికన్నా అనిపిస్తే.. సరైన వివరాలతో వారు వస్తే నేను టపా సరి చేస్తాను.
ఏ విధమైన అభ్యంతరాలు ఉన్నా కూడలి జ్యురీష్ డిక్షన్ పరిధి లో వాదోపవాదాలు జరుగ వలెను ..
ఈ టపా వలన ఎవరి మనసులయిన మండితే రాజేష్ చేత బర్నాల్ రాపించే సౌకర్యం వినియోగించుకొనవలసిన ప్రార్ధన.

ఇట్లు
బ్లాగ్ భవదీయుడు

వికటకవి

3/24/09

"నీ పేరు రాజేషా !!?"

ఒక రోజు ఉండి ఉండి సడన్ గా నా కొత్త కంప్యుటర్ ఎల్.సి.డి. మానిటర్ పనిచెయ్యడం ఆగిపోయింది .. విజయవాడలో కొన్నాను ..ఇప్పుడు వాడేం అంటాడో అనుంటూ ఫోన్ చేశా వాడికి..... నా గోడు మొత్తం విని తీసుకురండి సార్ అన్నాడు వాడు . ఇపుడేమో చాలా పని ఉండి పోయింది ఎలా అబ్బా అనుకుంటుండగా మా రాయుడు (కుక్క పిల్ల) ఆందోళనగా మూలగడం మొదలెట్టాడు .... ఏదో ఉపద్రవం రాబోతుంది అనుకుంటుండగా రాజేష్ లోపలికొచ్చాడు.

అహ టైము కి వచ్చావ్ రా విజయవాడ దాక పోయి వస్తావా .. నా మాట పూర్తయ్యేలోపే సరే అని లేచి బయల్దేరాడు రాజేష్ ... దాదాపు రాజేష్ గేటు దాటే లోపు తేరుకున్న నేను "రాజేష్" అని గర్జించడం చూసిన రాయుడు లోపలకేల్లి తలుపు చాటున దాక్కున్నాడు. "ఏంటి శీను" ఆముదం తాగినట్ట్టు మొకం పెట్టుకుని వచ్చి అడిగాడు రాజేష్ గాడు.

నేను: ఎక్కడికి రా

రాజేష్ : విజయవాడ పోయి రమ్మన్నావ్ గదరా ఇపుడే

నేను : &%%^&*$#$%^*))&^%$&&%**&^%$ ( ఇవన్ని పత్రికలలో రాయడానికి వీలు కాని బూతుల బాష గా గుర్తించండి )

నేను: విజయవాడ పోయి ఏం చేస్తావ్ రా...చెత్తనా .....

రాజేష్: అబ్బా మర్చిపొయ్య శీను దేనికి విజయవాడ ???

నేను: &%%^&*$#$%^*))&^%$&&%**&^%$ ........... మొన్న కొన్నాం కదా కంప్యుటర్ ... విజయ వాడ లో దాని మానిటర్ దొబ్బింది మార్చుకురా. అడ్డ్రస్ తెలుసా కే. కే. ఎలక్త్రానిక్స్ . మొఘల్ రాజ పురం ... ( అన్ని చెప్పి) ఇంక పో అని పంపా


ఇప్పుడు కెమెరా రాజేష్ తో పటు పయనం అయినది ( కధ లో నా పాత్ర నిష్క్రమిస్తుంది )

స్థలం ఒంగోలు రైల్వే స్టేషన్ ... టికెట్ కౌంటర్ ..

రాజేష్ : ఒక టికట్ ఇవ్వండి

రైల్వే ఎంప్లాయి: (విసుగ్గా ) ఎక్కడికయ్య

రాజేష్ : కే. కే. ఎలక్త్రానిక్స్ . మొఘల్ రాజ పురం..

రైల్వే ఎంప్లాయి: &%%^&*$#$%^*))&^%$&&%**&^%$ ఊరి పేరేంటి రా చచ్చు వెధవ

రాజేష్: (నాలిక కరుచుకుని ) విజయ వాడ హి హి హి

రైల్వే ఎంప్లాయి: నీ పేరు రాజెషా

రాజేష్ : మీకెలా తెలుసు సార్ ( ఒకింత ఆశ్చర్యంగా )

రైల్వే ఎంప్లాయి: ఒంగోల్లో అందరికి తెలుసు ... ఊరికి తింగరోడు ఒకడున్నాడని

రాజేష్ గర్వంగా ప్లాట్ ఫారం మీదకొచ్చాడు ....

ట్రైన్ వచ్చింది .. ఎక్కాడు ..... రైలు రెండు స్టేషన్లు దాటాక పక్కనే కూర్చున్న ముసలాయన " బాబు తరవాత వచ్చేది చీరాలేనా అని అడిగాడు. చీరాలే గాని అది రాదు మనమే వెళ్తాం తెలివిగా బదులిచ్చానన్న గర్వం తో చూసాడు రాజేష్ .

ముసలాయన : %%^&*$#$%^*))&^%$&&%**&^%$... నీ పేరు రాజేషా ...

రాజేష్ : అవును .. అయినా మీది పక్క ఊరు కదా మీకెలా తెలుసు ..

ముసలాయన: జిల్లా లో అందరికి తెలుసు రా తింగరి వెధవ

రాజేష్ : ఏంటో యెంత వద్దనుకున్నా పాపులర్ అయిపోతున్నాను .. (దిగులు నటిస్తూ)

విజయవాడ

ట్రైన్ దిగిన రాజేష్ అక్కడ ఏం ఘన కార్యం చేస్తాడో అన్న భయం తో నేను ముందుగా ఒక ఫ్రెండు తో మాట్లాడడం తో వాడు స్టేషన్ కి వచ్చి రాజేష్ ని పిక్ అప్ చేసుకుని గమ్యానికి చేర్చి వెళ్లి పొయ్యాడు ... షాపు వాడికి కూడా నేను ఫోన్ చేసి చెప్పడం తో వీడి తో మాటలు కలప కుండానే నా మానిటర్ రిప్లేస్ చేసి ఇచ్చాడు.
బయటికి వచ్చిన రాజేష్ ఈ సారి సొంత తెలివి తేటల తో బతకాల్సిన టైము వచ్చింది ....
స్టేషన్ కి వెళ్ళడానికి రిక్షా ని పిలిచాడు ..

రాజేష్ : అబ్బాయి రైల్వే స్టేషన్ కి వస్తావా

రిక్షా పుల్లర్ :వస్తానండే మరేమో పది రూపాలివ్వలండే

రాజేష్ : చాలా చీపు ..... నా దగ్గర సామాను కూడా ఉందయ్యా

రిక్షా పుల్లర్: సామాను కి ఏమి తీస్కోనండే దానికి ప్రీ

రాజేష్ : ఐతే సామాను తీస్కెళ్ళి రైల్వే స్టేషన్కి పద నేను నడిచొస్తా

రిక్షా పుల్లర్: %%^&*$#$%^*))&^%$&&%**&^%$ .. నీ పేరు రాజేషా ...

రాజేష్ :( సినిమాల్లో సునీల్ లాగ అవక్కై) హె నీకెలా తెల్సు... నీది మా జిల్లా కాదు గదా

రిక్షా పుల్లర్: ఆంధ్ర దేశం లో అందరికి తెలుసు నీలాంటోడు ఒక్కడే ఉన్నాడని ...

రాజేష్ ఆశ్చర్యం ... సంభ్రమం తట్టుకోలేక స్టేషన్ వైపు ప్రయాణం సాగించాడు .... అప్పుడే........
"ఏరా బంటి " " రారా చంటి " .. అనే రెండు గొంతులు విని అటు చూసాడు...... తెలుగు దేశం వారి టి.వి. యాడ్స్ లో కోడి పిల్లలు అక్కడ ఉన్నాయి .. వాటి వైపు నడవ బోతుండగా ... రారా రాజేష్ .. బాగున్నావా .. అంటూ అవే ఎదురొచ్చాయి .
ఆశ్చర్యం గా ఉందే నేను మీకూ తెల్సా ఎలా తెల్సు ...అడిగాడు రాజేష్ .

చంటి : కూడల్లో తెలిస్తే బ్లాగ్లోకం లో తెలుస్తుంది ......

బంటి : అంటే లోకం కోడై కూస్తుంది " నువ్వు తింగరి వెదవని "

3/21/09

నీకైతే ఐదు నాకైతే ఐదొందలు

రాజేష్ ఒక సారి న్యూయార్క్ నుండి శాన్ ఫ్రాన్సిస్కో ఫ్లైట్ లో బయల్దేరాడు .. పక్కనే ఉన్న ఫారినర్ కి బోర్ కొట్టడం వలనరాజేష్ తో మాట మాట కలిపాడు .. ఏదన్నా ఫన్ని గేమ్ ఆడదాం అన్నాడు రాజేష్ ఆసక్తి చూపలేదు ... కిటికీ బయటకుచూస్తూ తనలో తానూ నవ్వుకోసాగాడు ................

నేను ఒక ప్రశ్న అడుగుతాను మీకు సమాధానం చెపితే నేను ఐదు డాలర్ లు ఇస్తా .. చెప్పలేక పొతే మీరు ఇవ్వాలిఅన్నాడు ... ఈసారి రాజేష్ పెదవి విరిచి నిద్రకి ఉపక్రమించాడు ..


సారి ఫారినర్ కొత్త ఆఫర్ ఇచ్చాడు ఓకే మీరు ఓడిపోతే నాకు ఐదు $ ఇవ్వండి నేను ఓడిపోతే మీకు ఐదు వందలు $ ఇస్తా అని..... రాజేష్ అలర్ట్ అయ్యాడు ... సరే అడగండి అన్నాడు

వెంటనే అడిగాడు ఫారినర్ " మేరి వాళ్ళ నాన్న గారికి నలుగురు కుమార్తెలు పెద్దమ్మాయి పేరు ఈస్ట్ , రెండో అమ్మాయివెస్ట్ మరియు మూడో అమ్మాయి పేరు నార్త్ .... ఐతే నాలుగో అమాయి పేరు ఏంటి ?

సౌత్ అన్నాడు రాజేష్ వెంటనే ...

హేహే పిజ్జా లో లేగ్గేసారు అసలు ఆన్సర్ మేరి అన్నాడు ఫారినర్ ...... సరే అని తన జేబు లో నుండి ఐదు $ ఇచ్చాడురాజేష్ ...

"ఇప్పుడు మీ టర్న్" అన్నాడు ఫారినర్

"మూడు కాళ్ళతో కొండ ఎక్కి నాలుగు కాళ్ళతో దిగేది ఏది " అన్నాడు రాజేష్

వెంటనే నొసలు చిట్లించిన ఫారినర్ చాల ఆలోచించినాడు .. లాప్టాప్ తీసి సెర్చ్ చేసాడు మిత్రులకు మెయిల్స్ పంపాడుఫలితం శూన్యం....... వెంటనే ఐదు వందలు తీసి ఇచ్చాడు

వెంటనే నిద్రకి ఉపక్రమించాడు రాజేష్
ఆన్సర్ తెల్సుకోవాలన్న ఆరాటం ఆగని ఫారినర్ రాజేష్ ని లేపి అసలు ఆన్సర్ ఏంటి అని అడిగాడు .... వెంటనే తన జేబులో నుండి ఐదు $ తీసి అతని చేతిలో పెట్టాడు రాజేష్.


3/20/09

రాజేష్ ప్రేమ కధ

ఒంగోలు లో ఒకప్పుడు నీళ్ళ కరువు ఉండేది ... .. చాలా దూరం నుండి నీళ్లు తెచ్చుకునే వారు .......

సరిగ్గా అలాంటి సమయం లోనే ప్రేమ లో పడ్డాడు రాజేష్ .. అమ్మాయి పేరు ... వసంత .. చాల మంచిది .. లోక జ్ఞానం లేని పిల్ల అవడం వల్ల రాజేష్ ని ప్రేమించింది ... ఒక సారి రాజేష్, వసంతతో తో సరదాగా బయటి వెళదాం అని ప్లాన్ చేసి పట్టణానికి దూరం గా గుండ్లకమ్మ సెలయేరు ఒడ్డుకి వెళ్లారు.

అక్కడ సంభాషణ

వసంత : రాజేష్ రా ఇలా కూర్చో
రాజేష్ : ...............
వసంత: ఏంటి ఏం మట్లాడవ్
రాజేష్ : నువ్వేగా రాయిలా కూర్చోమన్నావ్ అందుకే కదలకుండా కూర్చున్నా
వసంత : :((((

మళ్ళా కాసేపు నిశ్శబ్దం

వసంత : గల గలా పారే సెల యేరు ని చూస్తె నీకేం అన్పిస్తుంది
రాజేష్ : సైకిల్ కి రెండు బిందెలు కట్టి తెచ్చుకుంటే బాగుండేది అన్పిస్తుంది


సదరు వసంత మానసిక పరిస్థితిని అంచనా వేయడం పాఠకుల కే వదిలేస్తున్నా



3/19/09

మీ బ్లాగు హిట్ బ్లాగు అనే పేరు తెచ్చుకోవాలంటే

మీ బ్లాగు హిట్ బ్లాగు అనే పేరు తెచ్చుకోవాలంటే

కిందకి స్క్రోల్ చేయండి

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

సగం దూరం వచ్చారు ఇంకాస్త కిందకి వెళ్ళండి

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.





బ్లాగు పేరు హిట్ అని పెట్టండి

హి హి కామెంటు చేసి పొండి




























ఐడియా ఇచ్చింది -- రాజేష్

3/18/09

రాజేష్ --- ఓ మంచి మిత్రమార్కుడు

ఒక రోజు చాలా పెద్ద వర్షం పడుతుంది, చూద్దామని వాకిట్లోకొచ్చా ......పక్క ఇల్లు మా ఫ్రెండు రాజేష్ వాళ్ళది ... అక్కడ గొడుగు వేసుకుని ఉన్నాడు రాజేష్..... వర్షంలో వీడేం చేస్తున్నాడా అని చూస్తుంటే.. పైపు పట్టుకుని మొక్కలకు నీళ్లు పెడుతున్నాడు


???????????

ఇంత జరిగాక తనని పరిచయం చెయ్యక పొతే బాగోదుగా............

కింది ప్రొఫైల్ రాజేష్ చేత ఫిల్ చెయ్యబడింది

పేరు = రాజేష్ ( చాట్ లో అమ్మాయి లకి రాజ్ )
వయసు = యాహూ లో 22ఆర్కుట్ లో 24 ... ( వాస్తవంగా 29.)
సెక్స్ = ఛి పాడు
అభిరుచులు = మా వీధిలో వాళ్లతో కలం స్నేహం .. రబ్బరు స్టాంపుల సేకరణ .....

అడ్రస్ -- యాహూ అమ్మాయిలకి హైదరాబాద్........ ఆర్కుట్ లో అమ్మాయిలకైతే వైజాగ్, వైజాగ్ అమ్మాయిలకైతే హైదరాబాద్

3/14/09

నా తొలి పెళ్లి చూపులు

బుల్లెట్ బైక్ మీద రయ్యి మని దూసుకుపోతూ ఉండగా ఫోన్ మోగింది జేబులో .. అమ్మ చేసింది ... " ఇప్పుడే పేరయ్యగారు (పేరు మార్చా) ఒక ఫోటో తెచ్చి ఇచ్చారు రా.... అమ్మాయి కుందనపు బొమ్మ లా ఉంది నువ్వు త్వరగా వచ్చి చూస్కో" అనిపెట్టేసింది. ఆ ...ఏదో  ఫోటో ఇచ్చి ఉంటాడులే అని నా షికార్లు పూర్తి చేస్కుని తీరుబడిగా రాత్రి తొమ్మిది గంటలకు చేరుకున్నా .. ఆ ఫోటో  విషయమే   మర్చిపోయ్యా అసలు .. భోజనాలయ్యాయి హటాత్తుగా గుర్తొచ్చినట్లు ఉంది అమ్మకి... వెళ్లిఫోటో తెచ్చి ఇచ్చింది . ఫోటో లో అమ్మయిని అలా చూసా అంతే తెల్లని మాక్సీలు వేసుకున్న పన్నెండు మంది దేవతలునా చుట్టు డాన్స్ చేస్తున్న ఫీలింగ్ ... నా మీద మల్లె పూల రెక్కలు పడుతున్నట్టుగా ...... ఏదో పాట హిట్ సాంగ్ కి సంబందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యుసిక్ వస్తుంది వెనుక నుండి .. .తిరిగి చూస్తే వెనక పది మంది వయోలిన్ వాయిస్తున్నారు.
 
పడిపోయా ..........నిలువెల్లా మునిగిపోయ్యా.

జస్ట్ నాలుగు రోజుల ముందే పోకిరి సినిమా చూడడం తో ఆ ఎఫెక్టు బాగా పని చేసింది .. రాతిరంతా కునుకు లేదు ఏమెట్టికన్నారు రో ..అ దేవ దేవ దేవ దేవుడా అంటు పాడుకుంటూ ....... పెళ్ళంటూ చేస్కుంటే ఈ
అమ్మాయినే చేసుకోవాలి అని చాలా సార్లు అనుకుంటూ ...... అహ యెంత అందంగాఉంది .. నాకోసమే పుట్టిందా .. ఇలాంటి ఊహలతో కాలం గడుపుతూ ఉండగా తెల్లవారింది.

ఎప్పుడెప్పుడు అమ్మ ఈ టాపిక్ తెస్తుందా అమ్మాయి నచ్చింది అని చెబుదామా అని నా తపన, నా తాపత్రయం వర్ణనాతీతం. అమ్మేమో మరచి నట్లు ఉంది .. ఇప్పుడెలా .... సరే మనమే కదిలిద్దాం .. "అమ్మా .. అ అమ్మాయి కాస్త హైటుతక్కువ అనుకుంటా " ఏదో ఒకటి అనాలి కనుక అన్నా ... .. నా మీద తూటాల వర్షం మొదలైంది. " చవటా ఐదు ఆరు రా హైటు ఫోటో వెనక రాసి ఉంది సరిగ్గా చూడలేదా" అంటు... " ఒహ్ సరేవెళదాం అంటావా చూడడానికి " అనే లోపే " ఇరవై ఆరో తారీకు వెళ్తున్నాం మనం విజయవాడ..... ఆ రోజు మంచి రోజు......... ఈజులపాలు తగ్గిచ్చి పద్దతిగా తయారవ్వు" అంది అమ్మ

అమ్మా నీవెంత మంచి దానవు " ఓ అమ్మా నీ అనురాగం " అని పాట అందుకునే లోపే ముందా బికారి వేషం మార్చు అన్నది అమ్మ .. సరే అంటు బయల్దేరా సమయం పదకొండు గంటలు ఇంటి నుండి బయట పడ్డా . నేను రెగ్యులర్ గావెళ్ళే మంగలి షాప్ కే వెళ్తున్నా .. సరిగ్గా అప్పుడే అనుకోని సంఘటన ,...నేను యదాలాపంగా తల తిప్పడం నాజీవితాన్ని మలుపు తిప్పింది ..

కొత్తగా పెట్టిన షాపు తాలూకు బోర్డ్ .  అందులోను  పెండ్లి కుమారుని మేకప్ మా ప్రత్యేకత అని ఉన్న ఒక చిన్న బోర్డ్ నా ద్రుష్టి ని ఆకర్షించింది. రేపు మేకప్ వీడి దగ్గరే వేయించాలి కాదా అనుకున్నా. .. అంతే రెగ్యులర్ గా వెళ్ళే షాప్ని కాదని కొత్త కోర్కెలతో అమ్మాయి కి అందంగా కనపడాలనే కోటి ఆశ లతో లోపల అడుగు పెట్టాను .. ఆహ్లాదకరం గాఉంది లోపల వాతావరణం, అద్దం ముందు నన్ను నేను చూస్కున్నాను .. ... ఏ టైపు కటింగ్ సార్ అంటు వచ్చాడొకకుర్రాడు ... ఏ టైపు వద్దు వెనక వైపు కాస్త తక్కువగా ముందు కి మాములుగా ఉంచు నీట్ గా అందంగా అని చెప్పా. దువ్వెన కత్తెర తీస్కుని విదురుడు అంత వినయం గా దగ్గర కొచ్చాడు ... అంతే " సుబ్బారావు ఆగు " అని గంభీరం గాఒక స్వరం వినబడింది ... నేను సోకాల్డ్ సుబ్బారావు ఒకే సారి తల తిప్పి చూసాము.

షాపు ఓనర్ అనుకుంటా వచ్చాడు ఈ సార్ కి నేను చేస్తా అంటు .. ఏంటో స్పెషల్ మరి అనుకునేంతలో మీరు నాకుతెలుసు సార్ ఎప్పుడు ఆ గొకేస్తా గోరిగేస్తా (పేరు మార్చడమైనది )షాపు కి వెళ్తారు కదా నాకు తెల్సు వాళ్ళ కన్నా బాగాచేస్తాం సార్ అయినా అందరు ఫొర్ స్ట్రోకు బండి వాడే ఈ రోజుల్లో కూడా బుల్లెట్ బైకు ని మీరు వాడుతున్నారు... మీరుడిఫరెంటు సార్ అన్నాడు ( పోగిడాడా తిట్టాడా ) .. సరే బాగా చెయ్యండి వెనక తగ్గించండి ముందు నార్మల్ గా ఉంచండిఅని చెప్పి తల వాడికిచ్చి కళ్ళు తీస్కెళ్ళి అక్కడ పక్కనే ఉన్న ఈనాడు పేపర్ లో పెట్టా. అందులో అనూష్క ని చూడ గానేఫోటో అమ్మాయి గుర్తొచ్చింది .. మళ్ళా సేం సీన్ తెల్ల మాక్సీ లలో డజను మంది దేవతలు నా చుట్టూ డాన్స్ . అదే వయోలిన్ సంగీటం. ఆపారవశ్యాన్ని బ్రేక్ చేస్తూ షాపు వాడు పిలిచాడు సార్ అంటూ మెల్లగా .... ఏంటో ఆ అమ్మాయి ఫోటో చూసిన దగ్గర నుండిఅందరి గొంతులు మధురం గా వినపడుటున్నాయి ఏంటి అన్నట్టు కళ్ళు ఎగరేసాను. మిషన్ తో చేస్తా అన్నాడు ఓకేఅన్నా .. కొత్తగా తెప్పిచాను సార్ హైదర బాదు లో అంతా దీంతోనే మనం కూడా సిటి లెవల్లో అని ఏదేదో చెప్పాడు . సరేచెయ్యమన్నాను మళ్ళా నా మాక్సీలలోని దేవతలోచ్చారు .. కాసేపైంది .. ఏవో అరుపులు వినబడి తల తిప్పి చూసాను . .. సరిగ్గా పెట్టడం రాదా యాంగిల్ మారింది జీరో సైజు వచ్చింది అనేదో వాళ్ళ వాళ్ళని తిడుతున్నాడు వాళ్ళు తలవంచుకుని ఉన్నారు ... కాని కాని కాని .... పక్క సీట్లలో కూర్చున్న వాళ్ళు నా వైపు జాలి గా ఎందుకు చూస్తున్నారుఅర్ధం కాలేదు నెమ్మదిగా ఏదో అయింది అర్ధం అయింది పైగా నాక్కూడా ఏదో ఫీలింగ్ ఏంటో కొత్తగా ఉంది ఈ ఫీలింగ్ ఎక్కడోఅనుభవించా ఈ ఫీలింగ్ ఎక్కడబ్బా ఆ గుర్తొచ్చింది గాలి నేరు గా బుర్రకి తగుల్తున్న ఫీలింగ్ తిరుపతి లో కదా వస్తుంది రైట్ .. అవును అది ఇప్పుడెందుకు వచ్చింది అనుమానం గా బుర్రతడుము కున్నా నెత్తి మీద జుట్టు ఉంది ఎదురుగా అద్దంలో కూడా ఉంది హమ్మయ అనుకుంటుండగానే చెయ్యి వెనక్కి జారింది .. అంతే గుండె గుబిల్లుమంది .....కారణం అక్కడగరుగ్గా తగిలింది జుట్టు లేదు . " నీ ఎబ్బ రేయ్" అంటూ సీట్ లో నుండి లేచా.. అన్నా అన్నా అన్నా .. ( సార్ కాస్త అన్నాలోకి వచ్చింది ఏంటి ?) అసలేం అయింది అంటే .....అంటే .....అంటే ...అంటే మిషన్ కొత్తది ... అన్నా నేను మిషన్ కి కొత్తఅన్నా అన్నాడు ..

పెంట ( ఇదే మాట ఇంగ్లీషు లో వాడా ) .. ఇప్పుడేంటి రా .. మరి ( నాలో ప్రతి నాయకుడు నిద్ర లేస్తున్నాడు ) "అన్నా కవర్చేస్తా అన్నా" ... " ఏం కవర్ చేస్తావ్ రా" ... .." ఏదో ఒకటి చేస్తా అన్నా" అంటూ కూర్చోబెట్టాడు .. ఆ చెవికి ఈ చెవికి మద్య కిందవైపుకి ఏం లేకుండా గుండ్రం గా గొరిగి పారేసాడు పైన బొచ్చె బోర్లించినట్టు జుట్టు కింద గుండు ( అర గుండా) .. .. నాజీవితం లో నా మీద నేనే జాలి పడే సన్నివేశాలు కూడా చోటు చేసుకుంటాయని .. అది పాతికేళ్ళ వయసులో అని అసలునేనెన్నడు ఊహించలేదు ... ఇప్పుడేంటి దారి .

లాగి పెట్టి రెండు పీకా .. ఐనా వాడేం చేస్తాడు ... పాపం నా కర్మ ఆలా కాలింది హత విధి .. సగం కన్నా పూర్తి గుండే నయం అనుకుని రేయ్ మొత్తం గోరిగేయ్యరా అన్నాను ..."అన్నా" అన్నాడు ఆర్ద్రత నిండిన గొంతు తో
" చెప్పింది చెయ్యి " .. హా ఐపోయింది శుబ్రంగా తీసేసాడు .. గుండు తో బయట కొచ్చా .. ఇప్పుడేంటి ఇంటికెలా వెళ్ళాలి .. మళ్ళా జుట్టువచ్చేదాకా నా పాత మంగలోడు చూసే యెగతాళి చూపులు, ఇందాక నా పక్క సీట్లల్లో ఉండే వాళ్ళు చేసిన ప్రచారానికి జనాల్లో నా గుండు గురించి వచ్చే చర్చలు... అన్ని నా మస్తిష్కం లో సుడులు తిరిగాయి.

ఇంటికి వెళ్ళాను .. సమయం ఒంటి గంట.  పదకొండు గంటలకి క్రాపు చేయించుకుని వస్తా అని వెళ్ళిన కొడుకు ఒంటి గంటకి గుండుతో ఇంటికొస్తే ఆ మాతృ మూర్తి మానసిక పరిస్థితి ఏంటి ఎలా ఉంటుంది.   అవాక్కయి నిచ్చేస్టురాలయి .. నోట మాట రాక .. "ఎంట్రా " అని మాత్రంఅనగలిగింది .. సీన్ మొత్తం వివరించా ... .. మరిప్పుడెలా రా అంటుండగానే గణగణ మంటూ ఫోన్ మోగింది ..

" అమ్మా ఇరవై ఆరు వస్తున్నారుగా" అమ్మాయి తరపు వ్యక్తి .. " లేదండి చిన్న అవాంతరం.... మా చుట్టాల్లో ఎవరికో ఒంట్లో బాగోలేదంట అందుకే రాలేము మేమే ఫోన్ చేద్దాంఅనుకుంటున్నాం" అనేసింది అమ్మ .. ఎందుకో తల తిప్పి చూస్తున్న నాకు ఆకాశం లో నా తెల్ల మాక్సీ దేవతలుదిగులుగా దూరం గా వెళ్లి పోతునట్లు కన్పించింది .. పెంట ( ఇంగ్లీషులో) మరో సరి అనుకుని .. త్వరగా జుట్టు పెరిగేమందులేమన్నా దొరుకుతాయేమో అని ఇంటర్నెట్ లో వెతకడం మొదలెట్టా.


మూడు నెలలు గడిచాయి.. పోలిస్ క్రాపు వచ్చింది అనే ఆనందం లో అమ్మకి చెప్పా వాళ్ళకి ఒక సారి ఫోన్ చెయ్యమని .. పిచ్చి తల్లి వెంటనే చేసింది. " ఐనా మూడు నెలలు మేము ఎన్ని సార్లు అడిగినా దాట వేస్తూ వచ్చారు కాదమ్మా అందుకే మీకు ఇంట్రస్ట్ లేదుఅనుకుని మీ వూరు పక్కనే కందుకూరు లో సంబంధం ఖాయం చేస్కున్నాం" త్వరలో పెళ్లి అనేసారు వాళ్ళు.

ఈ మూడు నెలల కాలం లో నన్ను ఎన్నో సార్లు ఉత్సాహ పరిచిన మాక్సీ దేవతలు .. కందుకూరు బస్సు ఎక్కినట్లు ఆరాత్రి నాకు కల వచ్చింది .మూడు రోజులు నిశ్శబ్దంగా గడిచాయి నాలుగో రోజు వచ్చాడు కందుకూరు నుండి మా దూరపు చుట్టం వెంకట్రాయుడు .. నాకన్నా రెండు నెలలు చిన్న వాడు .." మొన్న పెళ్లి చూపులకేల్లాం కదా పెద్దమ్మా మేము .. పిల్ల బాగుంది మళ్ళాముహూర్తాలు లేవని ఎల్లుండి నిశ్చితార్ధం .పెట్టాడు నాయన . అమ్మాయిది విజయవాడ పలానా వాళ్ళమ్మాయి " అంటుంటే నాకు గుండెల్లో ఎవరో కెలికినట్లు .. పిండినట్లు అనిపిస్తుంది. అమ్మకి ఎక్ష్ ప్రె షన్స్ కరువు .. ఐనా పెద్ద మనసుతో వాడికి తప్పకుండా వస్తా అని చెప్పి పంపింది .

ఆగస్టు పంతొమ్మిది అ రోజు వెంకట్రాయుడి పెళ్లి .. విజయవాడ లో .. నా ఫ్రెండు కం బావ మరిది ఐన ఉమా మహేష్ తోకలిసి మా కుటుంబ సభ్యులతో పెళ్లి కి వెళ్ళాం . అందరు లోపల ఉన్నారు కళ్యాణ మండపం బయట ఉమా మహేష్ కిజరిగింది చెప్పా.....అప్పుడు వాడేం అన్నాడంటే......... " వెంకట్రాయుడి టైము బాగుంది పీటల మీద కూర్చున్నాడు.. నీ టైము సంక నాకి బేవార్స్ గా బజార్ల వెంబడి తిరుగుతున్న్నావ్ .... అయినా సోనాలి బెంద్రే లాంటి అమ్మాయి ని చేస్కోవాలంటే సుడి ఉండాల్సిన దగ్గర ఉండాలి బావ .. నీకది లేదు .. పద పోయి బావ హోదాలో అక్షింతలేయ్యి"

మరో మూడు నెలలు గడిచాయి ..

బజార్లో ఉండగా అమ్మ ఫోన్ " సీనయ్యా పంతులు గారు ఒక అమ్మాయి ఫోటో తెచ్చి ఇచ్చార్రా అమ్మాయి చాలా బాగుందిఆ మంగలి షాపు వైపు వెళ్ళ కుండా నేరుగా ఇంటికి తగలడు"

3/12/09

తొలి టపా నా తొలి ప్రేమ గురించే

పదేళ్ళ కింద అనుకుంటా ఒలాంగో ని హీట్ స్ట్రీక్ ని సచిన్ చీల్చి చెండాడుతున్నాడు, జింబాబ్వే వర్సెస్ ఇండియా మాచ్లో. 'ఆహా!!! ఏమి నా అదృష్టము కన్నుల పండుగగా ఉన్నదీ పరుగుల వరద'... అని టీవీ కి నాకు కేవలం అడుగు దూరంమాత్రమే ఉంచుకుని మరీ చూస్తున్నా ( గమనించండి... మీ ఇళ్ళల్లో చాల మంది పిల్లలు వాళ్ళకి తెలీకుండానే టీవీకిదగ్గరగా పోతుంటారు ). సరిగ్గా అదే సమయంలో అనూహ్యంగా ఒక అనుకోని సంఘటన జరిగింది ...

మా ఇంటికి చుట్టాలోచ్చారు!!

వాళ్ళకి టీ కాఫీ ఇవ్వడానికి ఇంట్లో పాలు లేవనుకుంటా... హైరానా పడుతున్న మా అమ్మ కంటికి అమాయకంగా టీవీచూస్తున్న నేను కన్పించా. వెంటనే "సీనయ్యా బజారెల్లి పాల పేకెట్టు తీస్కు రా నాన్నా" అని పురమాయించింది. అయిష్టంగా బయల్దేరా .. కొత్త చుట్టాలాయే ..
పాత వాళ్ళైతే పోనని గొడవ చేయోచ్చు ...

సరిగ్గా అప్పుడే జరిగింది అనుకోని ఘటన...

నా పాటికి నేను నా హీరో రేంజర్ సైకిల్ మీద వెళుతున్నా. వీది మలుపుకెల్లేటప్పటికి ఎదురుగా ఒక అమ్మయి.. ఆహా! ఎంత అందంగా ఉంది అంటే అంత అందంగా ఉంది .. అమెనలాగే చూస్తూ ఉన్నా. సడన్ గా పెద్ద సౌండ్ వచ్చింది. ఏంటాఆని చూద్దును కదా పెద్ద లారి ఆగి ఉంది. అందులో నుండి తల బయటికి పెట్టి " ఇటు చూడు సామే" అంటున్నాడు డ్రైవర్. ఇందాక వచ్చిన సౌండ్ లారి సడన్ బ్రేక్ వల్ల అని అర్ధం అయ్యింది.

(సినిమాలలో హీరోయిన్ ని చూస్తూ ఆక్సిడెంట్ చేస్కున్న సీన్స్ చూసి మరీ ఇలా ఉంటారా అనుకునే వాడ్ని..)

డ్రైవర్ కామెంట్లకు కాస్త సిగ్గు పడి బొటన వేలు నెలకేసి రాసి అదేదో సినిమాలో వెంకటేష్ లాగా ఎక్ష్ ప్రె షన్స్ ఇచ్చుకుంటూ అక్కడి నుండి
బయట పడ్దా .. అమ్మాయి కోసం చూసా.. కన్పీలేదు.. ఎటు వెళ్లిందో ..!!

సచిన్ ఏమయ్యాడు... మాచ్ ఏమైంది... మా అమ్మ చెప్పిన
పాల పేకెట్లు ఏమయ్యాయో గాని ... చాల సేపు వెతికా.

అమ్మాయి మళ్ళి కన్పీలేదు!!

రోజే దేవుడిని కోరుకున్నా మళ్ళా పిల్ల కనిపించే సమయానికి అటు వైపు లారి గాని ఇతర వాహనం గానిరాకుండా చూడమని.

కానీ ఇంత వరకు ఆమె మళ్ళా కన్పీలేదు ...