అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

6/5/09

స్టార్ హోటల్ కి ఎందుకు వెళ్లరు

ఒక సారి ఒక పెద్ద మనిషి చాలా రోజుల తర్వాత కనిపించాడు."రండి సర్ అలా కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం " అంటూ ఎదురుగా ఉన్న ఐదు నక్షత్రాల హోటల్ కి నడవబోయాడు "బాబు నేను స్టార్ హోటళ్ళకి రాను" అన్నాను.

స్టార్ హోటల్ కి ఎందుకు వెళ్లరు మీరు అడిగాడు ఆ పెద్ద మనిషి "నిజం చెప్పమంటారా అబద్దం చెప్పమంటారా" .. .నా మాట పూర్తయ్యే లోపు తోట రాముడు లో యెన్ టీ వోడంతా సీను నీకు లేదు శీను అనేసాడు. సరే చెప్పడమెందుకు నీకే చూపిస్తా పద అనేసి లోనికి నడిచా.

కూర్చున్న కాసేపటికి సో కాల్డ్ స్టీవర్ట్ వచ్చాడు నల్ల ప్యాంటు తెల్ల చొక్కా దాని మీద నల్ల జాకెట్టు నల్ల టై చేతిలో ఎర్ర రంగు బుల్లి పుస్తకం రేనాల్డ్స్ పెన్ను. ఇది అ సదరు వ్యక్తి అవతారం .

"ఆర్డర్ చెప్పండి గురు" అన్నాడు పెద్ద మనిషి "ఆ నేనెందుకు లే మీరే చెప్పండి" అన్నాను నేను


వారిద్దరి సంభాషణ

స్టీవర్ట్ : ఏం తీస్కుంటారు సర్ కాఫీ , టీ, జ్యూస్, చాకొలేట్ , మై లో , ఐస్ క్రీం

పెద్దమనిషి : టీ ( దర్పంగా)

స్టీవర్ట్ : ఏ టీ సర్ సెయ్లోన్ టీ , హెర్బల్ టీ , బుష్ టీ , హనీ బుష్ టీ , ఐస్ టీ, గ్రీన్ టీ


పెద్దమనిషి : సెయ్లోన్ టీ (సాలోచనగా )


స్టీవర్ట్ :ఎలా కావాలి సర్ బ్లాక్ లేక వైట్


పెద్దమనిషి : వైట్ (ఏంటి తేడాగా ఉంది అనుకుంటూ )

స్టీవర్ట్ : మిల్క్ , వైట్నర్ లేక కండేన్సెడ్

పెద్దమనిషి : మిల్క్ ( అసహనం గా )

స్టీవర్ట్ :ఆవుపాలు , మేక పాలు , గేదె పాలు వీటిల్లో ఏది సర్

పెద్దమనిషి : గేదె పాలు ( దీనం గా)

స్టీవర్ట్ :చలి ప్రదేశం లో పెరిగిన గేదె లేక ఆఫ్రికా గేదె ? రెండిటి లో ఏది సర్

పెద్దమనిషి : ఆఫ్రికా గేదె ( అయోమయం గా )

స్టీవర్ట్ :సరే టీలో షుగర్ , స్వీట్నర్ లేక తేనే కావాలా సర్

పెద్దమనిషి : చక్కర ( పళ్ళు కొరుకుతూ)

స్టీవర్ట్ :బీట్ షుగర్ లేక కేన్ షుగర్ సర్

పెద్దమనిషి : కేన్ షుగర్ (వస్తున్న కన్నీళ్ళు ఆపుకుంటూ నోట్లో కర్చీఫ్ కుక్కుకుని )

స్టీవర్ట్ :వైట్ , బ్రౌన్ లేక ఎల్లో షుగర్ సర్

పెద్దమనిషి : టీ వద్దు గానీ నోరెండి పోతూ ఉంది కాస్త మంచి నీళ్ళు ఇస్తావా (కళ్ళు తుడుచుకుంటూ )

స్టీవర్ట్ :మినరల్ వాటర్ లేక మాములు వాటర్


పెద్దమనిషి : మినరల్ వాటర్ (మన్మధుడు సినిమాలో పారిపొయ్యే ముందు షూ లేస్ కట్టుకునే ముందు బ్రహ్మానందం లా చూస్తూ )

స్టీవర్ట్ :ఫ్లేవర్డ్ లేక నాన్ ఫ్లేవర్డ్

పెద్దమనిషి : (లేచి ) "అవును తాజమహల్ నేను ఎందుకు కట్టించాను .... అశోకుడు ఆడుకొవడా నికే కదా .. మరి రాయలు అలా అన్నాడేంటి .... ఏమో .. రుద్రమ దేవి చెప్పిందే నిజమవ్తుందా .. నేను ఈ పూటకూళ్ళ గృహమునందు ఎందుకు ఉన్నాను .. భటులేరి ... ఎవరక్కడ "
అంటూ చప్పట్లు కొట్టుకుంటూ టేబుల్ మీద ఉన్న గుడ్డ వీపుకి కట్టుకుని ఠీవి గా అడుగులేస్తూ వెళ్ళిపొయ్యాడు.

నాయనా సహజము గా కస్టమర్లకు విరక్తి కలిగించే వాళ్ళని చూసాను కానీ పిచ్చేక్కించే వాడ్ని నిన్నే చూసాను నీ పేరేంటి నాయనా కాస్త భయం తో కూడిన ఆసక్తి తో అడిగాను నేను.

"రాజేష్" నవ్వుతూ చెప్పాడా నల్ల గుడ్డల సాడిస్టు