అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

11/14/09

షాడో, బుచ్చిబాబు ...... ఒంగోలు శీను

నా చిన్నతనం లో ...... అంటే నాకు పదేళ్ళు ఉంటాయనుకుంటా ... అప్పుడు జరిగిన విషయాలివి . మా అన్న నాకన్నా పన్నెండేళ్ళు పెద్దవాడు ..... మా అక్క ఎనిమిదేళ్ళు పెద్ద ... అందువల్ల చిన్నప్పటి నుండి వాళ్ళ ప్రభావం నా మీద ఎక్కువ గా ఉండేది. మా అన్న ఎక్కువగా జేమ్స్ బాండ్ సినిమాలు ... రాంబో సినిమాలు గట్రా చూస్తూ . ఇంటికి మధుబాబు, పానుగంటి వంటి రచయితలు రాసిన షాడో , కిల్లర్ షాడో నవలలు తెచ్చుకుని చదివే వాడు.

మా అక్క దానికి పూర్తి వ్యతిరేకం ఆవిడకు మల్లిక్ నవలలు అంటే ప్రాణం , యద్దనపూడి సులోచనారాణి నవలలు అంటే పంచ ప్రాణాలు . ఇలా ఈవిడ ఎక్కువగా మల్లిక్ నవలలు చదవడం అదే మాదిరిగా నేను కూడా వీళ్ళతో చదవడం మొదలైంది.


అయితే నా మీద బాగా ప్రభావం చూపిన వారు ... మధు బాబు మరియు మల్లిక్ . ఎక్కువగా వీళ్ళ రచనల తో ప్రత్యేకించి అందులో పాత్రల తో బాగా ఇంటరాక్ట్ అవుతూ ఉండేవాడిని. మా వాడు ఉదయాన్నే లేచి కరాటే గట్రా చేయడం ...... ఉండి ఉండి నిట్టూర్చడం .... సాలోచనగా తల పంకించడం వంటి పనులు చెయ్యడం తో ... మా వాడే షాడో అని నాకెందుకో అనిపించసాగింది.


అలా నా మీద పడిన నవలా ప్రభావం కొన్నాళ్ళకి బయట పడడం మొదలైంది . అదెలాగంటే మా ఊరు నుండి మా మామయ్య ఒకాయన మా ఇంటికి వచ్చాడు. భోజనం చేసి అలా బయకెల్దాం అని బయట కొచ్చి జర్రున జారి పడ్డాడు. వెంటనే మా అన్నయ్య వచ్చి లేవదీశాడు. నా మది లో కోటి ప్రశ్నలు ... ఈయన జారినప్పుడు కెవ్వు అని అరవలేదేంటి? .. పడగానే చచ్చానురోయి దేవుడో అనలేదేంటి ? ఇదే వెళ్లి మా అక్కని అడిగాను. అక్కా........ మామయ్య .. మల్లిక్ నవలల్లోలాగా పడగానే కెవ్వుమని అరవలేదేంటి అని .. మా అక్క నా వైపు అదోలాగా చూసి వెళ్ళిపోయింది.

ఇప్పుడు కెమెరా మా అన్న వైపు తిరిగింది " అన్నాయి మామ పడబోతుంటే నీ వెన్ను జలదరించి .... వెంట్రుకలు నిక్కబొడుచుకుని ఇక్కడేదో జరగబోతుంది .. అనిపించలేదా? వెంటనే వెళ్లి అక్కడే ఆగు మామయ్యా అని అపలేదేంటి అని అడిగేసా. అసలే అక్కడ నీళ్ళు పోసి మామయ్య పడడానికి కారణం అయ్యి ఎక్కడ తిడతారో అని భయం భయం గా ఉన్న మా అన్నకి ఇంకా తిక్క రేగింది. అప్పుడే జరిగింది నేను ఊహించిన సంఘటన.... అన్న కుడి చేయి నా బుర్రకి కనెక్ట్ అయింది ... కాని సటాల్ అని సౌండ్ రాలేదు. :( ....మా అన్న నోటి నుండి సింహనాదం కాదు కదా కనీసం పిల్లినాదం కూడా రాలేదు :( . పదునైన కత్తితో గుండె లో పొడిచినట్లు మొఖం చిట్లిస్తూ వెళ్ళిపోయాడు.


ఒకసారి నేను అన్న .. "జగదేక వీరుడు అతిలోక సుందరి" సినిమాకి వెళ్ళాం. సినిమా ఇంటెర్వల్ లో అన్న లేచి బయటకి వెళ్ళాడు. అన్నకి తెలీకుండా నేను వెనకే వెళ్లి కొన్ని నిజాలు తెల్సుకున్నా అవేంటంటే ... మా అన్న కూల్డ్రింక్ షాప్ లో డబ్బులు ఇవ్వడానికి వాలెట్ లోనుండి ఒక కరెన్సీ కట్ట తీసి అందులోనుండి ఒక నోటు ఇవ్వలేదు. జేబులోనుండి పది రూపాయల నోట్ ఇచ్చాడు. మరొకటి సిగిరెట్ సగం తాగి పడేసాడు .. మా వాడే కనుక షాడో అయి ఉంటే చివరికంటా కాలిన సిగిరెట్ వేళ్ళను చురుక్కుమనిపించిన తర్వాత కదా పడేయాలి. సాలోచనగా తల పంకిస్తూ మా వాడు షాడో కాదన్న నిర్ణయానికి వచ్చా. అంతలో ఇద్దరు దృడకాయులు మా అన్నకి దగ్గర గా వెళ్ళారు...... కాని వాళ్ళు మా అన్నని ఏం అడగలేదు ..... మా అన్న వాళ్ళనేం పట్టించుకోలేదు. అయితే వాళ్ళు దృఢ కాయులు కాదని .... ఊబకాయులని నాకు తర్వాత తెలిసింది.

మా వాడు షాడో కాదని తెలియడం తో నా నోరు వేపాకులు నమిలినట్లు చేదు గా అయింది. మస్తిష్కం లో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. "ఇక్కడేం చేస్తున్నావ్ రా" అంటూ మా అన్న తల మీద ఒక్కటివ్వడం తో ఈ లోకం లోకి వచ్చా.

మా అన్న షాడో కాకపోతేనేం నేనే షాడో అవుదామని నిర్ణయించుకున్నా. అయితే నేను ఇంకా ఆరవ తరగతి చదవుతుండడం వలన ఇంటర్ పోల్ లో చేర్చుకోరు కనుక హైస్కూల్ పోల్ లో చేరడానికి ప్రయత్నాలు మొదలెట్టా .... అందులో భాగం గా ఎవరైనా ముసలాయన సిగార్ వెలిగించి కనిపిస్తే సార్ మీ పేరు కులకర్ణి నా అని అడుగుతూ ఉండేవాడిని.

అయితే షాడో పక్కన ఎప్పుడు శ్రీకర్ ఉంటాడు కదా .. మరి నా పక్కన ఉండడానికి ఒకడు కావాలి కదా అనుకోగానే "సీనూ ఆడుకుందామా" అంటూ నా ముందు ప్రత్యక్షం అయ్యాడు రాజేష్ . అహ వెతకబోయిన తీగ కాలికి తగలడం అంటే ఇదే కదా అనుకున్నా కాని నాకప్పుడు తెలీదు వీడు మధుబాబు నవల లోని వాడు కాదు మల్లిక్ నవలలోని కారెక్టర్ అని.

వీడు ఎంత వరకు పనికొస్తాడా అని నేను రాజేష్ ని గమనించడం మొదలెట్టాను. కాని వీడు హి హి హి అని పళ్ళికిలిస్తూ నవ్వడం .. అర్ధం కాని విషయాలకు బుర్రగోక్కోడం .... సినిమా వాల్ పోస్టర్ లు నోరెళ్ళబెట్టి చూడ్డం వంటి చేష్టలతో నన్ను విసిగించే వాడు. ఎప్పుడన్నా నేను వాడిని "దింగాల డిప్పి "అని తిట్టినప్పుడు గుడ్ల నీరు కుక్కుకోవడం వంటివి చేసే వాడు.

వీడిని ఎలాగైనా శ్రీకర్ ని చెయ్యాలని నేను చేయని ప్రయత్నం లేదు .... అలా ఆరు నెలలు గడిచాయి .... మా చేష్టలని వింతగా చూస్తూ నవ్వుకునే వారు మా క్లాస్మేట్స్ వాళ్ళకి నేను పెట్టిన పేరు డస్కు డమాల్ గాళ్ళు . పైటింగు నేర్పిద్దామని ఊరికే ఎటాక్ చెయ్యరా అంటే .... దబుక్కున ఎగిరి దుబుక్కున నా మీద పడే వాడు .... ఓరి నీ పుస్కున్నర పుస్కు అలా కాదు రా అంటే దుబుక్కున ఎగిరి దబుక్కున పడాలా అనేవాడు ... కోపంగా పళ్ళు కొరికి .. నెప్పి పుట్టి అబ్బో అనే వాడిని దవడ పట్టుకుని. "ఎందుకు శీను అలా పళ్ళు కొరుకుతావు ... మరీ పళ్ళు అంత జిలగా ఉంటే జీళ్ళు కొనుక్కుని నమలచ్చుగా .. ఉచిత సలహా పడేసాడు .. వాడికి కూడా సగం ఇస్తానని ఆశతో నాలిక తడుపుకుంటూ. చాల్లే నీ చచ్చు తెలివి తేటలు .. కిలారి కిత్తిగా అని వాడిని ఒక తోపు తోసి వాడు డుంకి డుంకి అని దింకిలు కొడుతుంటే అహ లపక్ చక లపక్ చక అని గంతులు వేస్తుండగా నాకు అన్పించింది నేను షాడో నా లేక మల్లిక్ నవలల్లో బుచ్చిబాబునా ? నేను వాడిని మార్చానా లేక వాడు నను మార్చేసాడా?11/13/09

కధలో నీతి

అవి మేము 6 తరగతి చదువుకునే రోజులు .... నేను, ఫరూక్ , రాజేష్ మొదట ఫ్రెండ్స్ అయినది అక్కడే. ఒక రోజు టీచర్ గారు మాకు నీతి కధలు నేర్చుకుని రండి , రేపు ప్రతి ఒక్కరు ఏం కధ నేర్చుకున్నారో చెప్పాలి ... కధలో నీతి తప్పకుండా ఉండాలి అని చెప్పారు. పోలోమని అందరం బయల్దేరాం.

మరుసటి రోజు ఏం నేర్చుకున్నామో తెలీదు చెప్తే టీచర్ గారేం అంటారో తెలీదు... ఐన ఒక్కొక్కరం ఏదో ఒక కధ.. చెప్తున్నాం. ఏం చెప్పినా టీచర్ అందరి చేత క్లాప్స్ కొట్టిస్తున్నారు. అసలేం నేర్చుకోకుండా వచ్చిన రాజేష్ లో ధైర్యం వచ్చింది. తన వంతు వచ్చాక ఇలా చెప్పాడు.

"మా మామయ్య వాళ్ళ ఇంటి దగ్గర ఒక బాడ్ ఫామిలీ ఉన్నారు టీచర్. ప్రతి ఒక్కళ్ళ తో గొడవలు పడుతూ ఉంటారు .... అందరినీ కొడుతూ ఉంటారు .... ఒక సారి మా మామయ్యా ఆఫీస్ నుండి వస్తుంటే గొడవ వేస్కున్నారు .... మా మామయ్య అసలే తాగి ఉన్నాడు ... అయన దగ్గర ఏమీ లేవ్ .. అయినా ఉత్త చేతులతో వాళ్ళందరినీ పిచ్చ కొట్టుడు కొట్టాడు .. టీచర్" విజయగర్వం తో చెప్పాడు రాజేష్.

"ఈ క్రూరమైన కధ లో నీతి ఏంట్రా" అయోమయంగా కాస్త కోపంగా అడిగారు టీచర్.

"తాగి ఉన్నపుడు మా మామయ్య జోలికి వెళ్ళరాదు" ముసి ముసి గా నవ్వుతూ చెప్పాడు రాజేష్.

11/10/09

కధ చెబుతాను ఊఁ కొడతారా ఉలిక్కిపడతారా


ఒకసారి నేను అస్సాం వెళ్లాను ( రాజేష్ ని కలవడానికి వెళ్ళానన్న మాట).. ..

రైల్వే స్టేషన్ నుండి నేరుగా అస్సాం లో రాజేష్ వాళ్ళ రూం కి వెళ్లాను. రూం అంటే రూం కాదు పాత ఇల్లు లాగ ఉంది . ఏంటబ్బా ఇలా ఉంది అనుకుంటూ లోపలి వెళ్ళాను. రాజేష్ ఎదురోచ్చాడు చేతిలో కార్డ్ లెస్ ఫోన్ ఉంది ... కాస్త అయోమయం గా ఉన్నాడు. "రా శీను" అంటూ మళ్ళా గోడలు మూలలు వెతకడం మొదలెట్టాడు. "ఏం వెతుకుతున్నావ్ రా" అంటే .. "ఈ కార్డ్ లెస్ లో మాట్లాడుతుంటే కాస్త డిస్టర్బెన్స్ వస్తుంది వైర్ ఏమన్నా ఫాల్ట్ ఉందేమో అని చూద్దాం అంటే దీనికి వైర్ లేదు వెతుకుతున్నా" తల గోక్కుంటూ చెప్పాడు రాజేష్ . వీడింకా మారలేదు అనుకుంటూ అక్కడ అంతా చూసాను. అదోలా ఉంది పాత గోడలు, పెచ్చులు ఊడిపోయిన పై కప్పు, 50 ఏళ్ళ నుండి పాడుబడిన ఇంటిలా ... వర్ణించడం ఎందుకు మీరే చూడండి.

మొత్తానికి భయంకరంగా ఉంది ... "అయినా ఇలాంటి ఇంట్లో ఉంటున్నావేంటి రా" అన్నాను. "మన అందరికి ఇక్కడ అయితే బాగా కంఫర్ట్ గా ఉంటుంది అని ఇలా తీసుకున్నా అద్దె బాగా తక్కువ" అన్నాడు రాజేష్. ఓహో అద్దె తక్కువని ఇలాంటి దయ్యాల కొంప తీసుకోవాలనే దెయ్యపు ఐడియా నీకే కదా వస్తుంది అనుకుంటూ ఉండగా ఎవరో నా వెనక ఉన్నట్టు అనిపించి గబుక్కున వెనక్కి తిరిగా ఏదో లీలగా కనిపించి కనిపించనట్లు ... అలా మాయం అయింది నా వెన్ను లో చలి మొదలైంది. "ఏంట్రా ఇక్కడేదో ఉంది" అన్నాను భయంగా. " ఈ ఇంట్లో మనిద్దరమే ఉన్నాము ..మరీ తెలుగు సినిమాల్లో ఇలాంటి ఇళ్లని బూత్ బంగ్లాలుగా చూపడం వల్ల నువ్వు బయపడుతున్నావ్ అలాంటిదేం లేదు కామ్ గా నీ రూం కి వెళ్లి పడుకో" అన్నాడు. ఎందుకో ఆ కంఠం లో కాస్త కోపం ద్వనించింది. సర్లే పనికి మాలిన భయం వల్ల ఈ ఎదవకి కూడా లోకువ అయిపోతున్నాను అనుకుంటూ "నా రూం ఎక్కడ" అడిగాను. " ఈ రూం పక్కన మెట్లు ఉంటాయి పైకి వెళ్ళు వెనక వైపు లాస్ట్ రూం నీది"అన్నాడు." మరి నీది" అన్నాను. ఇక్కడే ఈ మూల లాస్ట్ రూం నాది అన్నాడు ... "అదేంట్రా నేను అరిచినా రంకెలేసినా నీకు వినపడదు అంత దూరం ఏంటి నేను కూడా కిందనే ఉంటాను లేదా నువ్వు కూడా పైకి రా" అన్నాను .. "అంటే మిగిలిన రూముల్లో ఇంటిగల వాళ్ళ సామాన్లు ఉన్నాయి.ఈ రెండు రూములే ఖాళీగా ఉన్నాయి అదన్నమాట సంగతి. కావాలంటే నా రూం లో ఉండు అన్నాడు" . హు నీతో ఉండడం కంటే అక్కడే ఉండడం మేలు అనుకుంటూ పైకి వెళ్లాను. (గమనిక ) నా రూం లో మరియు రాజేష్ రూముల్లో మాత్రమే లైట్లు ఉంటాయి మిగిలిన రూమ్స్ కి కరంటు లేదు) మెట్లెక్కి పైకి వెళ్లాను . నా కర్మ గబ్బగియ్యం గా చిమ్మ చీకటిగా .. నేను ఆ రూముల ముందు నుండి నడుస్తూ వెళుతున్నా .... ఎవరో ఆశగా నా వైపు చూస్తున్నా ఫీలింగ్ .......రూముల్లో ఎవరో ఉన్నారు అని నాకు ఎందుకో అనిపిస్తుంది.

రూం లోకి వచ్చి లైట్ ఆన్ చేశా .... హమ్మయ్య అనుకుంటూ ... కాసేపు పడుకున్నా......................... సడన్ గా మెలకువ వచ్చింది టైం చూసా... 11 ఐంది.ఈ ఎదవ డిన్నర్ కి పిలవలేదేంటా అనుకుంటూ బయట కొచ్చా .......... చల్లగా ఉంది బయట . కన్ను పొడుచుకున్నా కానరాని చీకటి . ఒక్కసారిగా ఏదో శబ్దం వినిపించింది. ఇందాక కూడా ఇలాంటి శబ్దమే వచ్చింది అందుకే నేను నిద్ర లేచా.ఏదో అనుమానం వచ్చి మెట్లెక్కి పైకి వెళ్ళా అక్కడ ...... అక్కడ......అక్కడ .... ఏవో.. కొన్ని .... ఆకారాలున్నాయి ... అవి ముసుగులు వేసుకుని వాటిలో అవి చర్చల్లో ఉన్నట్లు గుస గుసలాడుకుంటూ ఉన్నాయి. అమ్మో దయ్యాల్లాగా ఉన్నాయి అనుకున్నా ( పారిపోదాం అన్న ఐడియా నాకప్పుడు రాలేదు) పైగా అవేం మాట్లాడుకుంటూ ఉన్నాయో తెలుసుకుందామని కుతూహలం తో దగ్గరకు వెళ్ళా .... తెలుగు లోనే మాట్లాడుతున్నాయి. "వీడిని ఇవాళ ఎలాగైనా మంచి చేసుకుని మన రూములోకి తీసుకెళ్ళాలి . తరువాత నమిలి మింగేద్దాం" అంటుంది ఒకటి. అవి దయ్యాలని అర్ధం ఐంది. "ఐతే మనం మనుషులకు తగల కూడదు మన శరీరం మంచుగడ్డ లాగ చల్లగా ఉంటుంది అప్పుడు వాళ్ళకి డౌట్ వస్తుంది. కాబట్టి తగలకుండ మేనేజ్ చేద్దాం" అనుకుంటూ ఉన్నాయవి. సడన్ గా నా వైపు తిరిగాయి. నేను వాటిని చూడనట్లు అటువైపు తిరిగా .... హమ్మయ్య వీడు మనల్ని చూడలేదు అనుకుంటూ అవి ఇంకో వైపుకి వెళ్ళిపోయాయి. వార్నీ ఇది నిజంగా దయ్యాల కొంపనే కదా అనుకుంటూ గబగబా కిందికి వచ్చి రాజేష్ రూం కి వెళ్లాను . తాళం వేసి ఉంది ఈ టైం లో ఎక్కడికి వెళ్ళాడబ్బా అనుకుంటూ అలా ముందు వైపుకి ఉన్న పిచ్చిమొక్కల లాన్ లోకి వచ్చా ... "ఇక్కడేం చేస్తున్నావ్ శీను" వెనక నుండి రాజేష్ గొంతు వినిపించింది. వెనక్కితిరిగి చూస్తె చేతిలో ఏవో పార్సిల్ పట్టుకుని ఉన్నాడు. "ఈ టైం లో ఎక్కడికి వెళ్ళావ్ " కోపంగా అడిగాను ... "నీ కోసం డిన్నర్ తెచ్చా హోటల్ నుండి" అంటూ పార్సిల్ ఇచ్చాడు. "డిన్నర్ సంగతి తర్వాత పైన దయ్యాలు ఉన్నాయిరా బాబు .. ఈ రాత్రి కి నన్ను తినాలని ప్లాన్ చేస్తున్నాయి... అవును ఇన్ని రోజుల నుండి నువ్వు ఇక్కడే ఉన్నావ్ కదా నిన్ను తినలేదేంటి" అని అనుమానంగా అడిగా ..."నేను అదే అడుగుతున్నా .. దయ్యాలు ఉంటే నన్ను ఎందుకు తినలేదు ..ఆ ....దయ్యాల్లేవ్ గియ్యాల్లేవ్ అంతా నీ భ్రమ" అన్నాడు.
"సరే పోయి తిని పడుకో" .. అని నా వైపు అదోలా చూసి..... రూం లోకి వెళ్ళిపోయాడు .. మళ్ళా ఆ చీకటి మెట్లెక్కి పోవాలా అనుకుంటూ మెట్ల వైపు వెళ్లాను అక్కడ కిటికీల వెనుక నుండి నన్ను తొంగి తొంగి చూస్తునాయి ఆ దయ్యాలు.


ఇక్కడేమో దయ్యాలున్నాయి ఈ రాజేష్ గాడేమో నమ్మడు ఇప్పుడెలా అనుకుంటూ ఏదన్నా ప్లాన్ చెయ్యాలి వీటిని రాజేష్ కి పట్టివ్వడానికి అనుకుంటూ నాకు తెలీకుండానే పై అంతస్థుకి వెళ్ళా ... మై గాడ్ అక్కడ ఫుల్ గా దయ్యాలున్నాయి. కిందకెల్దామని మెట్ల దగ్గర కొచ్చా మెట్ల మీద కాచుకుని కూర్చున్నాయి దయ్యాలు. ఇప్పుడెలారా భగవంతుడా అనుకుంటుండగా "సార్ ఇక్కడ శ్రీనివాస్ ఎవరండీ?" అన కేక వినపడింది కింద నుండి "నేనే బాబు శ్రీనివాసుని ఇంతకీ నువ్వెవరు" అని అరిచా ( దయ్యాలు ఆలోచనలో పడ్డాయి ) "నేను డి.టి. డి.సి . కొరియర్ అబ్బాయిని సార్ మీకు కొరియర్ వచ్చింది" అరిచాడా కొరియర్ అబ్బాయి . "సరే కాస్త పైకి రావా "రిక్వెస్టు తో కూడిన అరుపు అరిచా ." సరే సార్ వస్తా" అని టక టకా నడుచుకుంటూ వచ్చేసాడు ఆ కొరియర్ అబ్బాయి. "అహ దేవుడిలా వచ్చవయ్యా" అన్నాను." అదేంటి సార్ అలా అన్నారు" అయోమయం గా అడిగాడా కొరియరబ్బాయి. "ఏం లేదు నేను కూడా నీతో బాటు బయటకి వస్తా నన్ను తీసుకెళ్ళు" అన్నాను.

అయోమయంగా చూసాడా కొరియరబ్బాయి .... కాని ఆ అబ్బాయి ని తోడుగా తీసుకుని నేను దయ్యాల బారి నుండి తప్పించుకుందామని చూస్తున్నానని వాడికి తెలీదు. ఎందుకైనా మంచిదని కొరియరబ్బాయి చెయ్యి పట్టుకుని చూశాను మంచులాగ తగుల్తుందేమో అని ....... అదేం లేదు మామూలుగానే ఉంది. ఆనందంగా ఆ అబ్బాయి చెయ్యి పట్టుకుని నడుస్తుంటే ఉక్రోషంగా చూస్తున దయ్యాలు నిస్సహాయులయ్యాయి. బయట వరకు వచ్చాక " బాబు థాంక్స్ ఇంక నువ్వెళ్ళు" అని పంపేసా. టైం అర్ధరాత్రి రెండు గంటలైంది అక్కడే కూర్చున్నా . ఏం చేయాలో పాలుపోడం లేదు. ఈ రాజేష్ గాడెం చేస్తున్నాడో .. ఈ దయ్యాలు వాడిని ఏం చేస్తాయో అని భయం భయం గా కూర్చున్నా . కాసేపటికి .... రాజేష్ గాడు బయటికి వచ్చాడు. "బాత్రూం కని లేచి చూస్తే నువ్వు ఇక్కడ కనపడ్డావ్ ఏం చేస్తున్నావ్" అంటూ దగ్గర కొచ్చాడు . "నీ బొంద........... నీ పిండాకూడు పిశాచాలకి పెట్ట............ నీ శార్ధం చెట్టు కింద పెట్ట .. ఈ దయ్యాల కొంపలో నీ దిక్కుమాలిన కాపురం నువ్వూను ... పైన అని దయ్యాలేరా ... ఇందాక ఆ కొరియర్ గాని రాక పొతే చచ్చుండే వాడిని దయ్యాల చేతిలో" అని ఆవేశం గా అరిచేసాను. "అంత లేదమ్మా పద పైకెళ్ళి చూద్దాం" అంటూ నన్ను పైకి తీస్కెళ్ళాడు. పై అంతస్థుకి వెళ్ళగానే అక్కడన్నీ దయ్యాలు మమ్మల్ని చూస్తూ నవ్వుతూ దగ్గరకొస్తున్నాయి. " రాజేష్ ....... రాజేష్ అవిగో దయ్యాలు" అంటూ వాడి చెయ్యి పట్టుకున్నాను . ఆశ్చర్యం రాజేష్ చేయి... మంచులాగ.. ఐస్ లాగా ....చల్లగా పొగలు వస్తు ఉంది. " ఆ రాజేష్ నువ్వు దయ్యానివా అంటూ వదులు వదులు " అని నా చెయ్యి లాక్కోసాగాను.

.
.
.
.
.
.
.
.
.


కళ్ళు తెరిచేసరికి
.
.
.
.
.
.
.
.
శీను రేయ్ సీనూ ... టైం ఎనిమిదైనా లేవకుండా ఆ మొద్దు నిద్రేంటి ఆ కలవరింతలేంటి అంటూ తట్టి లేపుతుంది అమ్మ ... పక్కన బిత్తర చూపులు చూస్తూ భయం భయం గా నిలబడి ఉన్నాడు రాయుడు.హమ్మయ్య ఇదంతా కలేనా!!!!!

ఊఁ కొట్టారా ఉలిక్కిపడ్డారా .