అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

2/3/11

లేత మనసులు - ఆఖరు భాగం

గమనిక : చాలా కాలం తర్వాత వ్రాస్తున్నాను కనుక అర్ధం కాని వాళ్ళు ముందు మూడు పార్ట్స్ ఓపిక చేసుకు చదువుకోవాల్సినదిగా ప్రార్ధన.

లేత మనసులు - 1

లేత మనసులు - 2

లేత మనసులు - 3

కిట్టిగాడి ఎపిసోడ్ ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాటే గానీ ఒకపక్క నా అంతరాత్మ రేపు నీ సంగతి చూసుకోవోయి అని హెచ్చరిస్తూనే ఉంది. మర్నాడు ఉదయాన్నే జిమ్ కి వెళ్ళేప్పుడు చూసా... ఇంకా లేవలేదనుకుంటా తలుపులు మూసి ఉన్నాయి. తిరిగి వచ్చేటప్పుడు బయటనే నిల్చుని ఉంది మున్ని... పక్కనే ఉంది పూజ ... "10.30 కి సూపర్ మార్కెట్ కి వెళ్తున్నాము వచ్చేవాళ్ళు రావచ్చు"  అని ఇండైరక్ట్ గా హింట్ ఇచ్చింది పూజ."  హే నోర్ముయి"  అని పూజ ని నవ్వుతూ గదిమినా తనలా చెప్పడం మున్ని కి ఇష్టమే అని తెలుస్తోంది. ఒక్కసారిగా మనసు గాల్లో తేలిపోయింది , మరుక్షణమే పిలిచి బకరాని చేస్తారేమో అని ఆలోచన రావడం తో మనసు గాల్లోంచి నేరుగా గుంటలో పడింది. అయినా చూద్దాంలే అనుకుని ఇంటికి వెళ్లి పూల రంగడు టైప్ లో యెర్ర టీ షర్ట్ , కింద రఫ్ అండ్ టఫ్ జీన్స్  వేసి మన సైకిల్ మీద బయల్దేరా . అప్పట్లో ఒంగోల్లో ఒకే ఒక సూపర్ మార్కెట్ ఉండేది.  కూసంత పెద్దదే ! నేరుగా లోపలకి  వెళ్ళా .... కొద్ది సేపటికి పూజ కనిపించింది కానీ మున్ని అక్కడ లేదు . ఇదసలే   మగరాయుడు టైప్ దీన్ని పలకరించాలా వద్దా అని అనుకునే లోపే  "హాయి హాయి " అంటూ వచ్చేసింది. "ఏంటి ఇంత లేటా! అయినా 10.30 కి రమ్మంటే 10 కె వచ్చి వెయిట్ చెయ్యాలి గానీ ఐదు నిముషాలు లేట్ గా వచ్చి దిక్కులు చూస్తావేంటి"  ..... అని గలగలా మాట్లాడేస్తుంది.  ఓ మై గాడ్ దీని వాగ్ధాటి కి నేను తట్టుకోలేను అనుకుంటూనే " మీ సిస్టర్ ఎక్కడ ?" అని అడిగాను . "అంటే నాకోసం రాలేదా!!!!!!!!! అక్క కోసం వచ్చావా  " అని  కళ్ళు ఎగరేస్తుంది .  నాకు ఒక్క నిముషం  ఫ్యూజ్  ఫెయిల్ . అంతలోనే మున్ని వచ్చేసింది . "రారనుకున్నాను .. ధైర్యవంతులే  !!" అంది నవ్వుతూ  హి అని పల్లికిలించి ఊరుకున్నాను."  ఎం లేదు ఊరికే మీతో మాట్లాడాలి అనిపించింది అందుకే  రామ్మన్నాము ... కానీ  ఇక్కడ  తెల్సిన అంకుల్ ఉన్నారు  ఈవినింగ్ గుడి దగ్గరకి రాకూడదూ "అంది మున్ని. " సరే " అన్నాను . "ఓకే బాయి " అని బయల్దేరారు.

కొద్దిగా ముందుకి వెళ్ళాకా" అవును నాకో డౌట్"  అంటూ  వెనక్కి తిరిగింది  పూజ.  ఏమిటి అన్నట్టు చూసాను................  " అవును మీకు బాత్రూం అలవాటు ఉండదా .... ఫ్రెష్  ఎయిర్  ఉండాల్సిందేనా ? అంది కొంటెగా .... నాకు అర్ధం కాలేదు .... మళ్ళీ  ఏమిటన్నట్టు చూసాను . "అదే పొద్దున్న పొద్దున్నే సైకిలేసుకుని బయలుదేరుతారు ఎక్కడికి ?" అంది .... " ఎక్కడికి అనుకుంటున్నావ్? "  అన్నాను ....  " హా లండన్ కేమో అనుకున్నా..  నిజమేనా !!"  కిల కిలా నవ్వుతూ వెళ్ళిపోయింది.  హారి భగవంతుడా  ... మనం  ఉదయాన్నే జిం కి  వెళ్తున్నాం అనే ఫీలింగ్ లో తెగ చించుకుని వెళ్తుంటే అమ్మాయిలకి ఇలా అర్ధం అవుతుందా ........ అనుకుంటూ ఇంటి దారి పట్టా  :(

సాయంత్రం గుడి దగ్గరకి వెళ్ళాలనే అనుకున్నా ... కానీ  మా వాళ్లందరూ గుడి దగ్గరే ఉంటారు మా అమ్మతో సహా అందుకే వెళ్ళలేకపోయా .... ఆ మరుసటి రోజు మున్ని కాస్తంత సీరియస్ గా చూసింది . తనకి పరిస్థితి వివరించేందుకు కుదరలేదు. అలా చూపులతో కొన్ని  రోజులు గడిచాయి .  అదే సమయం లో అరుదుగా హిందీ సినిమాలు రిలీజ్ అయ్యే ఒంగోలు కి 'దిల్ తో పాగల్ హైన్ 'సినిమా వచ్చింది. యాదృచ్చికంగా  మున్ని వాళ్ళు మేము ఒకే రోజు ఒకే షో కీ వెళ్ళాం . వాళ్ళు మాకంటే నాలుగు వరుసల ముందు ఉన్నారు . సినిమాలో మున్ని మాధురీ దీక్షిత్ లాగా నేను షారుక్ లాగ నేను ఊహించేసుకుని  ఫీల్ అయిపోయానని వేరే చెప్పక్కర లేదనుకుంటా .  అది ప్రేమా , ఆకర్షణా  అని తేల్చుకోలేని వయసు లో ఉన్న  మనసు మీద 'దిల్ తో పాగల్  హైన్ 'లాంటి సినిమాలు బలమైన ప్రభావాన్నే చూపిస్తాయి . ఎస్ ... నేను మున్ని ని ప్రేమించేశాను.మున్ని కూడా సినిమా మద్యలో వెనక్కి రెండు మూడు సార్లు నాకేసి చూడడం గమనించాను కూడా.

ఆరోజు నుండి మున్ని ని చూడడం కోసమే  వాళ్ళ ఇంటి ముందు రెండు మూడు రౌండ్లు ఎక్కువ వేసే వాడిని ..... మున్ని కూడా ముసి ముసి నవ్వులు నవ్వుకుంటూ చూస్తూ ఉండేది. అదేంటో గానీ  ఒక నెల రోజుల పాటు  చూపులు నవ్వులతో ఒకలాంటి  తియ్యని ఫీలింగ్  ఉండేది మా మద్య .  ఒక రోజు మా అన్న నాకొక పని అప్పగించాడు ... ఆ పని మీద వెళ్తూ  మున్ని కాస్త ఆందోళనగా ఉండడం గమనించాను .  నా పని ముగించుకు సాయంత్రం వచ్చేసరికి పూజా,  ముష్కాన్ గేటు దగ్గరే ఉన్నారు . నేను వాళ్ళ ఇంటికి చేరువయ్యేటప్పటికి " అక్క  నిన్ను రైల్వేస్టేషన్ కి రమ్మంది"  అని పెద్దగా అరిచారు . వాళ్ళ పక్కింటి వాళ్ళు , రోడ్డు మీద జనాలు ..  అందరూ ఒక్కసారి షాకై చూస్తున్నారు .  నేను రెండో ఆలోచన లేకుండా  రైల్వేస్టేషన్ కి వెళ్లిపోయా .... నేను స్టేషన్ లోపలికి వెళ్ళే సరికి ట్రైన్ వచ్చింది . నేను మున్ని ని చూసేసరికే తను ట్రైన్ ఎక్కుతూ నన్నుచూసింది .... అప్పటికే వెనకనే ఉన్న వాళ్ళ  నాన్న "పద పద"  అని తొందర పెడుతూ లోనికి తీసుకెళ్ళాడు . ట్రైన్ వెళ్ళిపోయింది.

కాసేపు  అక్కడే కూర్చుని  వెనక్కి వచ్చాను . నేను వచ్చేసరికి పూజ గేటు దగ్గరే ఉంది .ఆ పక్కనే  ఫాన్సీ షాప్ దగ్గరకి పని ఉన్నట్టు వచ్చింది . " అక్కని కలిశావా"  అంది  ... " లేదు నేను వెళ్ళే సరికి ట్రైన్ వెళ్ళిపోయింది ... మళ్ళీ  ఎప్పుడు వస్తుంది"  అన్నాను ...... "అక్క ఎందుకు వెళ్ళిందో తెల్సా .....................అక్కకి రేపు పెళ్లి చూపులు .... బహుశా ఇక రాదేమో!"  అంది. నాకేం అర్ధం కాలేదు ఒకరకంగా చెప్పాలంటే ఆ పరిస్థితిలో ఎలా  బిహేవ్ చెయ్యాలో కూడా తెలీలేదు . ఇప్పుడు  మనసులో అదోరకంగా ఉంది కానీ అది  బాధ అని చెప్పలేను .. బహుశా ఒకరకమైన కన్ఫ్యూషన్ అయి ఉండవచ్చు . నేను పూజ ముందు బాద నటించాలేమో అనుకున్నాను ... నా ఆలోచనలకి నేనే నవ్వుకున్నాను .  వెళ్ళే ముందు పూజ " ఎందుకో అక్కకి నువ్వంటే  ఇష్టం ... కానీ ఇలాంటి పరిస్థితిలో తనకి చాయిస్ లేదు " అనేసి వెళ్ళిపోయింది.

నిజమే కనీసం మేమిద్దరం సరిగ్గా  మాట్లాడుకోను కూడా  మాట్లాడుకోలేదు ... మా మద్య ఉన్నది  చెప్పుకోని ప్రేమేనా అన్నదానికి కూడా నాదగ్గర సరైన సమాధానం లేదు. అసలా సిట్యుయేషన్ లో ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా నాకు అర్ధం కాలేదు.  కొన్ని రోజులు అలా గడిచాక మున్నికి పెళ్లి సెట్ అయినట్టు పూజ చెప్పింది ... కొన్నాళ్ళకి పెళ్లి కూడా అయిపొయింది .  పెళ్లి అయిన ఒక నెలకి మున్ని తన హస్బెండ్ తో కల్సి ఒంగోల్ వచ్చింది .  నాకా సంగతి తెలీదు నేను మామూలుగా సైకిల్  తొక్కుకుంటూ వెళ్తున్నాను .... " శీను ....శీను.... శీను"  అని ఎవరో పిలవడంతో చూశాను వాళ్ళ వరండాలో చీర కట్టుకుని  మున్ని నిల్చుని ఉంది.  ఆశ్చర్యం , నన్ను ఇంత డైరక్ట్ గా పిలుస్తుంది ఏమిటా అని చూస్తున్నా "లోపలి రా"  అంది చనువుగా ... మళ్ళీ పంచ్.. ఏమైంది ఈ పిల్లకి ఇలా పిలుస్తుంది అనుకుంటూ గుబులు గుబులు గా లోనికి అడుగుపెట్టా .... " రా శీను నిన్ను మా హస్బెండ్ కి పరిచయం చేస్తా రా"  అంది .  మూడో పంచ్ ..... ఇప్పుడు ఏమి చెబుతుంది  క్లాస్ మేట్ అని చెబుతుందా లేక చిన్నప్పటి ఫ్రెండ్ అని చెబుతుందా లేక పక్కింటి అబ్బాయి అని చెబుతుందా ఏదైనా అబద్దమే కదా .. అని కొద్దిగా భయంగా , ఎవడినో మోసం చేస్తున్న ఫీలింగ్ తో గిల్టీ గా లోనికి వెళ్లాను . " హే సిద్ధూ  శ్రీ అని చెబుతూ ఉంటానే తినే"  అని చెప్పి పరిచయం చేసింది ."  ఓ హాయి మీరేనా శ్రీను అంటే ...మున్ని చెప్పింది ... నాకొక అబ్బాయి లైన్ వేశాడు కానీ  డేర్ చెయ్యలేకపోయాడు నేను డిసైడ్ అయ్యే లోపే మీతో పెళ్లి అయింది అని ఎనీ వేస్  నీకంటే నేను చాలా లక్కీ కదా ".. అని జోవియల్ గా మాట్లాడాడు . ఆరోజు గంటకి పైగా అతనితో మాట్లాడి  వచ్చాను .. ఆ ఇంట్లోకి బెరుగ్గా భయంగా గిల్టీగా వెళ్ళిన నేను ... మున్ని నా గురించి సరైన ఇంట్రో ఇవ్వడంతో చాలా రిలీఫ్ గా గర్వంగా బయటికి వచ్చాను :)మళ్ళీ ఇప్పటిదాకా నేను  మున్ని ని కలవలేదు , చూడలేదు .

మున్ని కి నాకు మద్య  ప్రేమ కధ ఏమి నడవలేదు ... కానీ మామద్య ఒక ఎమోషన్ ఉండేది ... మున్ని పట్ల నాలో కొన్ని ఫీలింగ్స్ ఉన్నాయి అవి నేను మున్ని కి కూడా చెప్పలేదు అందుకే ఆ ఫీలింగ్స్ నాలో శాశ్వతంగా నిలిచిపోయాయి.