అందరూ పనికిమాలిన వెధవ అని తిడుతున్నారని కోపగించిన రాజేష్ ఏదైనా మంచి పని చేసి నలుగురి చేత శబ్బాష్ అనిపించుకోవాలని బలమైన ఆశయంతో ఆ దిశగా అడుగులు వేశాడు అయితే రాజేష్ ని జైల్లో పెట్టారు. కారణం అగ్నిప్రమాదానికి గురై తగలబడుతున్న ఇంటి లో నుండి 6 గురిని బలవంతగంగా ఈడ్చుకొచ్చి రక్షించాడు. అందువల్ల తన ధైర్య సాహాసాలకు మెచ్చి ప్రభుత్వం తనకు అవార్డ్ ఇస్తుందని ఆశపడ్డ రాజేష్ ఆశల మీద నీళ్ళు చల్లారు పోలీసులు. ఎందుకంటె రాజేష్ రక్షించాను అనుకున్న వారంతా అగ్నిమాపక శాఖ సిబ్బంది అట. జైలు నుండి విడుదల అయిన రాజేష్ కి బాల త్రిపుర సుందరి నుండి ఫోన్ వచ్చింది . హాయ్ రాజేష్ ఇవాళ మాఇంటికి రావా రాత్రంతా ఇంట్లో ఎవరూ ఉండరు గోముగా అడిగింది. ఊహల్లో తేలిపోతూ వెళ్ళిన రాజేష్ అవాక్కయ్యాడు . నిజంగానే అక్కడ ఎవరూ లేరు.. అందుకే కాపలా పడుకోమన్నారు.
అలా మంచిపని ధ్యాసలో పడ్డ రాజేష్ తన ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా తిరగడంతో కాస్త వొంట్లో నలత గా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్లాడు. డాక్టర్ టెస్టుల కోసం లాబ్ కి పంపాడు రాజేష్ ని. అయితే అక్కడ వెయిట్ చేస్తున్న రాజేష్ పక్కనే కూర్చున్న పాప ఏడుస్తూ ఉంది. ఎందుకమ్మా ఎడుస్తావ్ అనునయంగా అడిగాడు రాజేష్ "నేను బ్లడ్ టెస్టు కోసం వస్తే నా వేలు కోశారు" అని ఏడుస్తూ చెప్పిందా పాప. అంతే ఒక్కసారిగా చలి జ్వరం వచ్చినట్టుగా వణికి పోయాడు రాజేష్. ఒక్క ఉదుటున బయటికి పరిగెత్తాడు. అది చూసిన కంపౌండర్ రాజేష్ చేతిలోనుండి జారి పడిన స్లిప్ తీసి చూసాడు. అందులో యూరిన్ టెస్టు కి టిక్ పెట్టి ఉంది.