అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

6/28/10

గత 24 గంటలుగా వచ్చిన ట్రాఫిక్ సోర్స్

గత 24 గంటలుగా నా బ్లాగ్ కి వస్తున్న ట్రాఫిక్ సోర్స్ వివరాలు గూగులమ్మ చెప్పిన దాన్ని బట్టి :) పెద్దదిగా చూడడానికి ఫోటో మీద క్లిక్ చేయండి.


6/26/10

దయ్యం అంటే ఇష్టం - ఆఖరు భాగం

మా ముత్తాత నరసింహనాయుడు గారి గురించి చిన్నప్పటి నుండి విన్న కధలు అసలు దయ్యం మీద నాకు ఆసక్తి రేగేలా చేశాయి. ప్రకాశం జిల్లా లో మారుమూల కుగ్రామం , ఆ జిల్లాలోనే 90% మందికి తెలియని గ్రామం నరసింహనాయుడి కండ్రిగ మాది. మా ముత్తాత పేరే ఆ ఊరికి పెట్టారు. ఆ ఊర్లో మొదటి ఇళ్ళు కట్టింది ఆయనే. అయన గురించి అనేక కధలు ప్రచారం లో ఉన్నాయి. ఆ రోజుల్లో బ్రిటీష్ వారికి ఎదురు తిరిగినందుకు ఆయనను పోలీసులు అరస్టు చేశారట. మా ఊరు నుండి 30 దూరంలో ఉండే కందుకూరు పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారట. ఆ బురదలో పోలీసులు గుర్రాల మీద వెళుతుంటే వెనుక పావుకోళ్ళు వేసుకుని నరసింహనాయుడు నడుస్తుంటే బురదలో కూరుకుపోయి పావుకోళ్లు బొటన వేలు పక్క వేలు మద్య లో చీల్చుకుని మూడు అంగుళాలు కాలు చీలిపోయినా అసలు బాద కనబరచకుండా నడిచిన మొండి ఘటం అని మా వాళ్ళు ఎప్పుడు చెబుతూ ఉండేవారు. :p

ఆ తర్వాత చాలా కాలానికి అయన ఒకనాటి రాత్రి పొలం నుండి వస్తుండగా రెండు ఆడ దయ్యాలు అడ్డగించాయని ...... ఆ దయ్యలని పట్టుకుని జుట్టు కట్టిరించాడని ... దాంతో ఖంగారు పడ్డ ఆ దయ్యాలు అయనని బ్రతిమాలితే మా ఇంటికి వచ్చి పని చేస్తే మీ జుట్టు మీకు ఇస్తా అని చెప్పాడని ఆలా దయ్యాలు చాలా కాలం మా ఇంట్లో ఊడిగం చేశాయని ఒక పిట్ట కధ ఉంది. అయితే ఈ కధ నిజం కాదని, కల్పితం అని మా అమ్మ తర్వాత చెప్పింది.

సదరు నరసింహ నాయుడు మరణించాక అయన వంశం లో పుట్టినవాడే పిచ్చయ్య నాయుడు .. నరసింహ నాయుడి పోలికలతో పుట్టడంతో ఆయనే మళ్లీ పుట్టాడు అని అందరూ భావించారు. సదరు పిచ్చయ నాయుడు గారికి ఒక బ్రహ్మాండమైన కామెడీ కత ఉంది. రోజూ పిచ్చయ్య గారు తన పొలం లో వేసిన శనగ పంట దగ్గరికి తెల్లవారు ఝామునే వెళ్ళేవాడు ... ఒకరోజు ఆలా వెళుతుండగా ... ఒక్కసారిగా అయన మీద నల్లటి ఆకారం దూకింది .. వెంటనే అలర్ట్ అయిన పిచ్చయ తన దగ్గర ఉన్న కర్రతో దాన్ని బలం కొద్ది కొట్టాడట. అదేటు వెళ్లి పడిందో గాని ఇంకా కనిపించలేదట. దయ్యమే దాడి చేసింది అని ఆయన భావం. కానీ ఆ మరుసటి రోజు తలకి దెబ్బతగిలి ఒక పొలం లో పడి ఉన్న అడవిపంది యానాదులకి దొరకడం కొసమెరుపు.

ఆ పిచ్చయ్య నాయుడు గారు మరణించిన కొనాళ్ళకి అయన మనమరాలు ఒక మగబిడ్డకి జన్మనిచ్చింది .. ఆహా పిచ్చయ్య మళ్లీ పుట్టాడు అని భావించిన పెద్దలు ఆ బాలునికి పిచ్చయ్య అని నామకరణం చేయబోతే..... ఆ తల్లి ఎందుకో నాకు ఈ బిడ్డ ఏడుకొండలవాడి వరప్రసాదం అందుకే అయన పేరే పెట్టుకుంటా అని చెప్పి .. ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పేరుని సంస్కృతీకరించి సప్తగిరి శ్రీనివాసులు అని నామకరణం చేసిందట. ఆ శ్రీనివాసుడు ఎవరో ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకుంటా..... ...అయితే మా అమ్మమ్మ ఊరుకోకుండా చిన్నప్పటినుండి నరసింహనాయుడే ... పిచ్చయ్య గా ఆతర్వాత నేనుగా పుట్టానని నాకు లేనిపోని కధలు అన్నీ చెప్పి మరీ చావడం వల్ల నాకు కూడా దయ్యం జుట్టు కోసి పని చేయించుకోవాలి అన్న బలమైన కోరిక కలగడం లో ఆశ్చర్యం లేదనుకుంటా!

ఆ గ్రామం వెళితే నా కోరిక తీరుతుందేమో అన్న ఆశతో ఒకసారి ఆ ఊరు వెళ్ళా .... రాత్రి ఎవరికీ చెప్పకుండా మా పొలాల వైపు వెళ్ళా ....... మా పొలాలకి వెళ్ళే దారిలో వాగు దాటాలి ( నీళ్ళు ఉండవు అనుకోండి) అక్కడ మైదానం లో మద్య లో ఉండగా తెల్లని ఆకారం గాలిలో తేలుతూ నా వైపు వస్తుంది ..... నా గుండెలో రైలు పరిగెట్టడం మొదలైంది. ఆ ఆకారం చాలా వేగంగా దగ్గరికి వస్తుంది. ఇప్పుడెలారాదేవుడా అసలు నేను ప్రిపేర్ అవలేదు ......ఎం లేదు ఇదేమో దగ్గరికి వచ్చేస్తు ఉంది అనుకుంటున్నా ఆ ఆకారం దగ్గరికి వచ్చేసింది కిర్రు కిర్రు శబ్దాలతో .. .... అప్పటి దాకా ఉన్న ధైర్యం అవిరవడంతో బిగుసుకుని నిలబడిపోయా ...... దగ్గరికి వచ్చిన ఆకారం సైకిల్ దిగినట్టు దిగింది. ఇంకాస్త దగ్గరికి వస్తే అది నిజంగా సైకిలే .... వచ్చింది మా ఊరి వెంకటప్పయ్య .... "ఏందీ చక్కర కేళీ ( సప్తగిరి అనేది నోరు తిరక్క ) ఈ టైములో ఇక్కడ ఉన్నావ్" అన్నాడు .. "ఊరికే వచ్చా గానీ నిన్ను చూసి దయ్యం అనుకున్నా" అన్నాను . అసలు దయ్యాలు ఎక్కడివి............... ఇంతవరకు దయ్యాల గురించి మాట్లాడుకోవడమే గానీ మా తాతల కాలం నుండి ఈ రకంగా రాత్రుళ్ళు పొలాల్లో అడవుల్లో తిరిగే మేము ఇంతవరకు చూడలేదు అన్నాడు. ఆ రోజు వెంకటప్పయ్య తో డీప్ డిష్కషన్ తర్వాత ......దయ్యాన్ని చూడాలని ఉబలాట పడిన నేను చివరకి తెలుస్కున్నది ఏంటయ్యా అంటే ...........................
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.

.
.
.
.

.

.
.

.
.
.
.


దయ్యాలు లేవు

6/25/10

కొత్త తిట్లు

క్రియేటివ్ కిరణ్ తేజ గారి తాజా పోస్ట్ తిట్ల దండకం చూశాకా నాకూ కొత్త తిట్లు రాయాలనిపించి ఇలా వ్రాసేస్తున్నా హిహీ
జాగ్రత్తగా నేర్చేసుకుని బ్లాగుల్లో కాకుండా మీ ఆఫీసుల్లో , కాలనీల్లో వాడుకోండి :)

చీ నీ మొహం మీద చీమ చీమిడేయ్య
నీ తలలో పేను కి ఈగలు పురుడు పొయ్య
సిక్కుల కాలనీలో మంగలి షాపు పెట్టుకునే ఏబ్రాసి ఎదవ
తింగరి సంఘం ఎన్నికలలో నీకు డిపాజిట్ కూడా రాకుండా పోను
నీ పిండం పిశాచాలు ఎత్తుకెళ్ళ
చీమల పుట్ట కబ్జా చేసే నెలఎక్కువ వెధవ
ఒరాంగుటాన్ లా నడిచే వంకర ఎదవ
మార్తాండ కధలు మళ్లీ మళ్లీ చదివే జిడ్డుగా
కళ్ళు పీకి గోల్ఫ్ ఆడతా ఈగ మొహమోడా


ఇంకా ఉన్నాయి అవి మరో టపాలో ...................................

6/23/10

ఆచారి ఏమంటివి ఏమంటివి

మా ఇంటికి గానీ మా ఫ్రెండ్స్ ఇళ్ళకి , ఆఫీసులకి గాని ఏదైనా చెక్క పని చేయాలంటే మా ఆస్థాన కార్పెంటర్ ఆచారి గారినే సంప్రదిస్తాం. అయితే ఆచారి లో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం చెప్పింది తను చెయ్యడు . తనకి నచ్చినట్టు చెయ్యాలని చూస్తాడు. అందుకే దగ్గరుండి చేయించుకోవాలి. అదీ గాక మనం ఒకటంటే తను ఇంకోటి అంటాడు. వయసులో పెద్దవాడు అయినా చాలా కాలం నుండి పరిచయం ఉండడంతో కాస్త ఫ్రెండ్ షిప్ డెవలప్ అయింది మా మద్య. ఆ మద్య ఒంగోల్లో మా మిత్రుడు తన ఇంట్లో ఏసి బిగిస్తూ విండో అడ్జస్ట్ చేయాల్సిందిగా ఆచారిని పిలిస్తే షరామామూలుగా మనం చెప్పింది కాక అతనికి నచ్చినట్టు చెయ్యాలని చూస్తాడు .... టేకు చెక్క తప్పితే పనికి రాదంటాడు ... చూసీ చూసి తిక్కరేగిన నేను ఆచారీ ...... ఏమంటివి ఏమంటివి ..... టేకు చెక్క తప్పితే మారు జాతి చెక్క పనికి రాదందువా ఎంతమాట ఎంత మాట. కిందటి నెల సెల్ రేంజి షాపులో టేబుల్ చేయుటకు నువ్వు వాడినది ఏ చెక్క , అంతకు ముందు నా కంప్యుటర్ టేబుల్ కి వాడినది యే చెక్క ........ వేప చెక్కతో మా వాళ్ళ గడపలు చేయలేదా ..... మద్ది చెక్కతో కిటికీలు చేయలేదా .... న్యూ ఉడ్ తో షో కేసులు చేయలేదా .... టేకు టేకు అని చేబుతూనేమా వాళ్ళ ఇళ్ళన్నీ రకరకాల చెక్కలతో నింపి కంపు చేసినావు ... మళ్లా ఈరోజు చిన్న చెక్క ముక్క కొట్టడానికి టేకు టేకు అని ఎందుకు నీలుగుతున్నావ్ అనగానే ... ఆచారి నోరు తెర్సుకుని చూస్తున్నాడు ... మా ఫ్రెండ్ వాడి భార్య నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని నవ్వు ఆపుకోలేక తంటాలు పడుతున్నారు.

6/21/10

దయ్యమంటే ఇష్టం - రెండవ భాగం

దయ్యాల వేటలో ఆలా కొన్ని అనుకోనిదెబ్బలు తిన్నప్పటికీనిన్నీ ఒకపరి ఆ భూతమును వీక్షించవలెనన్న కోరిక అలాగే ఉండిపోయింది. కొన్నాళ్ళకి నా మిత్రుడు..... నాకంటే రెండేళ్ళ పెద్ద వాడు అయిన గురు ఒక ఆసక్తికరమైన విషయాన్ని మోసుకొచ్చాడు. ఇక్కడ మా గురించి ఒక నాలుగు లైన్లు చెప్పుకోవాలి. చాలా చిన్నప్పటి నుండే ....అంటే నాకు ఐదు , గురు ఏడేళ్ళు వయసు నాటికే మాకు ఆరిందా చేష్టలు బాగా వచ్చేశాయి. నానా అల్లరి చేసే వాళ్ళం అప్పుడు మేము సంతపేట లో ఉండేవాళ్ళం మా ప్రాంతానికి మూడు కిలోమీటర్లు దూరాన ఉండే లాయర్ పేట లో సాయిబాబా గుడి ఉండేది. ఆ గుడికి వెళ్దామని ప్లాన్ చేశాం ఇంట్లో చెప్పకుండా .. చెబితే పంపరు ఎందుకంటే అ అడ్వెంచర్ టైం కి నా వయసు ఏడేళ్ళు వాడికి తొమ్మిదేళ్ళు. సాయంత్రం స్కూల్ నుండి వచ్చి స్నానం చేసి ఐదు గంటలకి బయలుదేరాం దారిలో సినిమా పోస్టర్లు చూసుకుంటూ ..... ఒకసారి వాళ్ళ నాన్నతో వచ్చి ఉండడం చేత గురుకి దారి తెల్సు. వాడి చొక్క పట్టుకుని నేను ఆలా వెళ్ళిపోయాం. గుడిలో భజన జరుగుతుంది భజన అయిపోయేదాకా ఉండి.... రాత్రి హారతి ఇచ్చే దాకా అక్కడే ఉండి ప్రసాదాలు తీసుకుని రోడ్డు మీదకి వచ్చాం. టైము పదయింది. అప్పుడు (1987 ) ఒకటి అరా సైకిల్ లేదా స్కూటర్ వాళ్ళు తప్పరోడ్డు మీద మనుషులు లేరు. యధాప్రకారం రాళ్ళు తన్నుకుంటూ .... చిరంజీవి సినిమా పోస్టర్ ఉన్న దగ్గర ఆగి చూసుకుంటూ ఇళ్ళు చేరేటప్పటికి అక్కడ ఊరు వాడా అంత మా ఇంటి ముందు గుమి గూడి ఉన్నారు . టూ టౌన్ పోలీసులు కూడా సిద్ధం. అమాయకంగా అడుగులు వేసుకుంటూ వస్తున్న నన్ను పక్కకి లాగి గురు గాడికి ఇచ్చాడు వాళ్ళ నాన్న పెద్ద కోటింగ్ . నన్ను ఎవరూ ఏమీ అనలేదు మరి! పసి బిడ్డని ఆలా తీసుకెళ్ళడం ఏంట్రా అని వాడిని కొడుతుంటే నేను పసిబిడ్డని కాబోలు అనుకున్నా ( అంటే అప్పటికే స్కూల్ లో స్వప్నని పెద్దయ్యాక పెళ్లి చేసుకుందాం అని నేను ప్లాన్స్ వేస్తున్న సంగతి ఇంట్లో తెలీదు కదా ) .

ఆలా చిన్నప్పటి నుండి నేను గురు చేసిన అడ్వెంచర్లు చాలానే ఉన్నాయి. కానీ తాజాగా గురు గాడు తీసుకొచ్చిన విషయం ఏంటంటే కందుకూరు ప్రాంతం లో దామా శైలజ అనే ఒక విద్యార్ధిని ని కొందరు రేప్ చేసి చంపేశారు కందుకూరు సింగరాయకొండ అనే ఊర్ల మద్యలో. ఆ అమ్మాయి ని చంపేసిన చోట ఎవరో మూలుగుతూ ఏడుస్తూ ఉన్న శబ్దాలు వినిపిస్తున్నాయని నిన్న సాయంత్రం అటు నడిచివెళ్ళే వాళ్ళు చాలా స్ప్రష్టంగా విన్నారని చెప్పాడు. షాడో లాగా సాలోచనగా తల పంకిస్తూ వాడి వైపు చూశా .... వెళ్దామా అన్నట్టు కళ్ళతోనే సైగ చేశాడు . ఇంకా ఆలస్యం ఏంట్రా పద అని .. నా బైక్ తీసా ... అప్పట్లో నాకు BSA- Bond బైక్ ఉండేది . ఇప్పుడు అవి దొరకడం లేదు. 40 కిలోమీటర్లు అరగంట లో చేరుకున్నాం. ఆ ప్రాంతానికి దగ్గరగా వెళ్ళాం ఎం వినిపించడం లేదు. చాల సేపటి తర్వాత ఎరా ఇక్కడ ఎం లేదేంటి అన్నానో లేదో సన్నగా మూలుగు స్టార్ట్ అయింది. వెంటనే ఏడుపు లాగా వినిపించడం మొదలైంది. మా ఖర్మ కాలి అమావాస్యకీ అటు ఇటుగా వెళ్ళామేమో అసలేం కనపడి చావడం లేదు. టైం పన్నెండు అవుతుంది. మేము మౌనంగా గా ఉంటే ఎం లేదుగాని మేము ఏదైనా మాట్లాడడానికి ట్రై చేస్తే మూలుగు వస్తుంది. మూలుగు ను బట్టి రోడ్ కి ఎడమ వైపు వస్తుంది అని కనిపెట్టాం. అక్కడ కాలువ ఉంది మూలుగు వచ్చేదగ్గర తూము లాగా ఉంది ఒక 20 అడుగులు తూము ఉంది తూము పైన మట్టి రోడ్డు ఉంది . బండి స్టార్ట్ చేసి చూశాం . ఎం కనిపించడం లేదు . ఇక్కడ విచిత్రం ఏంటంటే మాకు అసలు భయం వెయ్యకపోవడం , సినిమాల్లో చూపిచ్చినట్టు అడుగులో అడుగు వేస్కుంటూ నడవడం ఇలాంటివెం లేవు చాలా కాజువల్ గా ఉన్నాం. అ తూము దగ్గరగా వెళ్లి తొంగిచూస్తున్నాం.

ఇదేదో తేల్చుకునే వెళ్ళాలి అనిపించింది . తెల్లరిందాకా అక్కడే గడిపాం కబుర్లు చెప్పుకుంటూ .. తెల్లారింది.... వేకువ వెలుగులు రాగానే గురు వైపు చూస్తా బండికి అనుకుని కూర్చుని నిద్రపోతున్నాడు. నేనే లేచి వెళ్లి ఆ తూము దగ్గర వంగి చూశా పడి అడుగుల దూరం లో రెండు కాళ్ళు కనిపించాయి ... లైఫ్ లో ఫస్ట్ టైం నాకు గుండె జల్లుమంది. వెంటనే గురు ని పిలిచా .. వాడు వచ్చాడు ... అటువైపు పనులకు వెళుతున్న వాళ్ళు కూడా వచ్చారు. కాళ్ళు కనపడుతున్నాయి అని నేను చెప్పగానే సగం మంది జంప్ . నలుగురు మాత్రం ధైర్యంగా తొంగి చూసి అవి కాళ్లే అని కన్ఫర్మ్ చేశారు . తూముకి రెండో వైపు వెళ్లి చూస్తె మొహం అస్ప్రష్టంగా కనిపిస్తుంది . మూలుగులు ఎక్కువ అయ్యాయి.

ఒక పది నిముషాలు చర్చల అనంతరం ... బయటికి లాగాలని డిసైడ్ అయ్యాం , ఉచ్చు రెడీ అయింది పదే పది నిమిషాలు ఆ శాల్తీ కాలికి ఉచ్చు పడడం , లాగడం కూడా అయిపోయింది. తీరా చూస్తే అరవైఏళ్ళ ముసలోడు .... అక్కడికి దగ్గరగా ఉండే సంచార జాతులకి చెందిన వాడు ... వణుకుతూ లేచి కూర్చున్నాడు రెండు చేతులతో తాబేలు పిల్లని బద్రంగా పట్టుకుని ఉన్నాడు. కాస్త ఉపశామించాక అతను చెప్పిన విషయం ఏంట్రా అంటే ..... మొన్న సాయంత్రం ఆ తూములోకి తాబేలు పిల్ల వెళ్లడం చూశాడు ... పట్టుకుందాం అంటే దొరకలేదు .. కొద్ది కొద్దిగా వెళ్లి లోపల ఇరుక్కుపోయాడు . ఎవరో ఒకరు వచ్చి తీస్తారు అనే ఆశాభావంతో ఉన్నాడు ... అందుకే తాబేలు పిల్లని వదల్లేదు. అదీ సంగతి.

6/17/10

దయ్యం అంటే ఇష్టం

నాకు చిన్నప్పటి నుండి దయ్యాల సినిమాలు అంటే చాలా ఇష్టం, సినిమాలే కాదండోయి దయ్యాన్ని చూడాలనే ఉద్దేశంతో మా ఒంగోలు లోని మామిడి పాలెం స్మశానానికి రాత్రి వేళల్లో వెళ్లి ఆ సమయం లో అక్కడికి వచ్చే విటుల( రవిగారికి సంభందం లేదు ) ఏకాంతానికి భంగం కలిగించే వాడిని. కానీ నా కోరిక తీరలేదు . అలాగే దయ్యాన్ని చూడాలనే నా ఆశ చావలేదు. నేను పదవ తరగతి లో ఉండగా .... రైలు కట్ట దగ్గర అదీ రాం నగర్ పదవ లైన్ దగ్గర రాత్రి వేళల్లో దయ్యాలు సంచరిస్తున్నాయి అన్న సమాచారం నాలో ఉత్సాహాన్ని నింపింది. నా ఫ్రెండ్ శేషు కూడా దయ్యాన్ని చూడాలని ఉత్సాహ పడ్డాడు. ఇద్దరం కలిసి వెళ్ళాలి అని నిర్ణయించుకున్నాం. రాత్రి ఎనిమిది అవగానే నేను శేషు వాళ్ళ ఇంటిలో చదువుకుంటా అని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్ళా... వాడు అన్నం తింటూ మద్య మద్య లో ఏదో రాసుకుంటున్నాడు. ఏంట్రా అంటే దయ్యం కనిపిస్తే కోరాల్సిన కోరికల చిట్టా అంట ( దయ్యాలు కోరికలు తీరుస్తాయి అని వాడికి చిన్నప్పుడు ఎవరో చెప్పారులే) సరే మా ఇంట్లో చదువుకుని అక్కడే పడుకుంటాం అని వాళ్ళ ఇంట్లో చెప్పి వెళ్ళాం. రాం నగర్ కి పది లైన్స్ ఉంటాయి ప్రతి లైన్ రైల్వేయ్ ట్రాక్ దగ్గర ఎండ్ అవుతుంది. ఒకటో లైన్ దగ్గర ట్రాక్ ఎక్కాం. పదవ లైన్ సమీపిస్తున్న కొద్ది మాలో విపరీతమైన యాంగ్జయిటీ మొదలైంది.

కానీ అక్కడ దయ్యాలు కాదు కదా ఆ సూచనలు కూడా లేవ్. సరే ఇంకొంచం ముందుకి వెళదాం అనుకుంటుండగా సడన్ గా ట్రాక్ పక్క నుండి ఒక శాల్తీ వచ్చి నా చెయ్యి పట్టుకుంది . ఒక్క సారి గుండె జల్లు మంది .. "అరె శేషుగా శేషుగా" అని అరుస్తూ పక్కకి చూద్దును కద వాడు అప్పటికే అరట కిలో మీటర్ పరిగెత్తాడు. ఈ లోపు నా చెయ్యి పట్టుకున శాల్తీ ఒక ఆడమనిషి అని అర్ధం అయింది. నాకు నోట్లో నుండి మాట పెగలడం లేదు. " ఎందబ్బాయి నిన్న గాక మొన్న పాంటు వేసినట్టు ఉన్నావ్ అప్పుడే తొందర వచ్చిందా ? రెండువందలు అవ్వుద్ది తీయి బయటికి " అదోకలాంటి యాసలో అడుగుతున్నా ఆ మనిషిని చూసి "దయ్యానికి డబ్బులేందుకు" అన్నా అంతే " సచ్చినోడ దయ్యం నన్ను దయ్యం అంటావా రేయ్ సుబ్బిగా ఈడేవడో చూడరా " అని అరిచింది. సదరు సుబ్బిగాడు కర్ర తీసుకుని చెట్ల సందు లో నుండి రావడం చూసి పిటి ఉష పెంపుడు కొడుకు లా పరిగెత్తి ఇల్లు చేరుకున్నా !

మర్నాడు శేషుగాడు అడిగాడు రాత్రి ఎం జరిగింది అని జస్ట్ కొద్ది రోజుల ముందే భైరవ ద్వీపం సినిమా చూసి ఉండడంతో నరుడా ఓ నరుడా ఏమి కోరిక సాంగ్ రేంజి లో వాడికి ఒక దయ్యం కన్య కహానీ వినిపించి ఆ దయ్యం కన్య నా అందానికి మెచ్చి ఒక వరం ఇచ్చింది అని... ఆ వర ప్రభావం వల్ల నేను తల్చుకుంటే ఎవడినైనా శపించి మసి చేయగలను అని చెప్పి ... రాజేష్, శేషు, విక్టర్, సీనుగాడు ( పాములోడు) జ్యోతి, రాజి, నందిని, మోహన మొదలైన మిత్ర బృందాన్ని నా పాదాక్రాంతుల్ని చేసుకున్నా . కొన్నాళ్ళకి "దయ్యం పేరుతో జనాన్ని బెదరగొట్టి వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠా అరస్ట్" అన్నవార్త మా వాళ్ళు చూడ లేదు కనుక నా ఆటలు మరి కొన్నాళ్ళు సాగాయి. కానీ దయ్యాన్ని చూడాలన్న నా కోరిక తీరలేదు ... హారర్ సినిమాలు చూస్తూ ఆ కోరిక తీర్చుకుంటున్నా .. మీరెవరన్నా మంచి దయ్యం సినిమాలు పరిచయం చేసి పుణ్యం కట్టుకోండి ప్లీచ్ ........... హారర్ సినిమాల మోజులో హాలీవుడ్ లో వై.వి.ఎస్. చౌదరి, తేజ కన్నా వికారం ఉన దర్శకులు తీసిన వికారపు సినిమాలకి బలి అవుతున్నా..

6/15/10

మాదే అగ్రకులం

బ్లాగుల్లో ఈ మద్య కులాల కుమ్ములాటలు మొదలయ్యాయి. దీనికి ఆజ్యం పోసిందేవరో అందరికీ తెలుసు. అయితే ప్రస్తుతం నేను చెప్పేది బ్లాగు సామాజిక వర్గాల ( బ్లాగాజిక వర్గాల గురించి) గత ఏడాది వరకు బ్లాగులోకం లో కులుకుడు బ్లాగరుల సంఘం ( కుబ్లాస) ఆధిపత్యం కొనసాగేది. దీనికి అనుభంద సంస్థగా కేతిగాళ్ళ సంఘం ( కేసం) ఉండేది. కుబ్లాస బలమైన బ్లాగాజిక వర్గం గా ఉండడం తోబాటు .... ఆధిపత్య ధోరణి , ఆదేశాలు జారీ చేసే ధోరణి మొదలైన అభిజాత్య భావనలు ఎక్కువగా కనిపించేవి. బ్లాగుల్లో నిమ్న కులస్తులు అయిన సాధారణ బ్లాగరుల పై కుబ్లాస దాడులు , అజ్ఞాత కామెంట్లతో బెదర గొట్టే వారు . ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఒక మరిది వీరికి చేయూత అందించేవాడు. అనుబంధ సంస్థలు అయిన కుబ్లాస , కేసం వారి వ్యూహం బహు చిత్రముగా ఉంటుంది. కుబ్లాస దైవ సంభందం అయిన విషయాలు ప్రచారం చేస్తూ , బ్లాగ్ ఆస్తికుల ను తమ సంఘం లో సభ్యులుగా చేర్చుకున్తుంటే కేసం వారు హిందూ మతం పై విషం కక్కుతూ , దేవుడిని దూషిస్తూ నాస్తికులను తమ వైపు తిప్పుకునేవారు . ఎప్పుడైనా అడ్డంగా బుక్ అయినపుడు ఒక సంఘం వారు మరొక సంఘం వారిని కవర్ చేయడానికి విశ్వప్రయత్నం చేస్తారు. . హైందవ ధర్మాలు , ఆధ్యాత్మికత గురించి లెక్చర్లు దంచే కుబ్లాస సభ్యులు అప్పుడప్పుడు భారతీయ విలువలని అపహాస్యం చేస్తూ జనాలకి మెంటల్ ఎక్కిస్తారు. వీరికి మరీ ఇబ్బంది ఎదురైనప్పుడు ఉత్తరాంధ్ర మరిదిని మద్య లో నిలబెట్టడం ద్వారా తప్పించుకునే వారు. వీరి ప్రధాన అస్త్రం కాపీ పేస్ట్. సాధన శోధన అంటే గూగుల్ సెర్చ్ చేయడమా?? అనే సందేహాలకి సమాధానం www.google.com లో చూసుకోండి.

అయితే వీరి ఆగడాలు అడ్డుకోవాలని భావించిన కొందరు యువకుల సంకల్ప పలితమే కెలుకుడు బ్లాగర్ల సంఘం
(కెబ్లాస) అనే నూతన బ్లాగాజిక వర్గం ఆవిర్భావం. కెలుకుడు బ్లాగర్లు అడుగు పెట్టిన కొన్నాళ్ళకి తాము అవలంబించిన కొన్నికఠినమైన పద్ధతుల ద్వారా కులుకుడు సంఘాన్ని అదుపు చేయగలిగారు. కెబ్లాస అనుసరించిన పద్ధతులు

వారు ఒక రాయి వేస్తే వీరు రెండు రాళ్ళు వేయడం
వారు వేసిన రాళ్ళ ని తిరిగి వారి వైపే పడేలా చేయడం
కుబ్లాస ని పూర్తిగా ఆత్మరక్షణ లో పడేయడం

ఈ పరిణామ క్రమంలో కెబ్లాస ఒక బలమైన బ్లాగాజిక వర్గం గా ఎదిగింది. బ్లాక్కులం లో అగ్ర కులంగా నిలించింది. కెబ్లాస కి ఉప కులం గా ప్రకేబ్లాస ఆవిర్భవించింది . అయితే మత మార్పిడుల లాగ ఇక్కడ ఒక కుల మార్పిడి జరిగింది. కెబ్లాస నుండి శరత్ అనే బాలుడు వైదొలగి గేబ్లాస అనే ప్రత్యేక ప్రతిపత్తి కలిగిన సంస్థ స్తాపించుకున్నాడు. కెబ్లాస ని చూసి ముచ్చట పడిన బ .రా. రే తొక్కలో బ్లాగర్ల సంఘం ( తొబ్లాస) స్థాపించారు. ముందు ముందు అనేక సంఘాలు ఆవిర్భవించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఏదేమైనా ప్రస్తుతానికి బ్లాగాజిక వర్గాల్లో మాదే అగ్రకులం. ఎనీ డౌట్స్ .

6/11/10

బ్లాగుల్లో కులచిచ్చు - బ్లాగర్లారా బహుపరాక్

బ్లాగుల్లో గత రెండు రోజులుగా కులచిచ్చు రగిలింది...... ఎప్పుడో ఇది హిందూ మతంలో కాష్టం రగిలించక ముందే బ్లాగర్లు శాంతిస్తే మంచిది. ముఖ్యంగా హిందూ మతం మీదా , హిందూ దేవుళ్ళ మీదా అష్టవంకర కూతలు కూసే వారు ఇపుడు హటాత్తుగా హిందువు అనగానే మొదట గుర్తు వచ్చే బ్రాహ్మణ కులానికి , మరో అగ్ర కులమైన కమ్మ వారి ద్వారా అన్యాయం జరిగింది అని , బ్రాహ్మలు రెడ్లకి సపోర్ట్ ఇవ్వడం వల్ల కమ్మ వారు తట్టుకోలేక ఒక దీర్ఘ ప్రణాళిక వేసుకుని బ్రాహ్మల అంతు చూశారని అవాకులూ చెవాకులూ పెలుతున్నారు . ఇదేమన్నా యుగానికి ఒక్కడు సినిమానా 800 సంవత్సరాలుగా కనిపించకుండా పాండ్యులు , చోళుల నాశనానికి పధకాలు వేశారనడానికి ! సినిమాలోనే కామెడీ గా అనిపిస్తే మనోళ్ళు ఆ కామెడీని బ్లాగుల్లో పండించడానికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారు.

ఇంతకాలం బ్లాగర్ల మద్య కులం అనే ప్రస్తావన రాలేదు నాకు తెల్సి ... ఒక బ్లాగు తీవ్రవాది పన్నిన ఉచ్చులో పడ్డ కొందరు మాత్రం అక్కడికి వెళ్లి మేము కమ్మ వారిమి మాకేం ఒరగలేదు అని తమ కులాన్ని బయట పెట్టుకునే ప్రయత్నం చేశారు. మరొక యువకుడు ఆవేశపడి కమ్మ వారి వ్యాపారాలలో ఉన్నత స్థాయి ఉద్యోగాలు బ్రాహ్మణుల కిందనే ఉన్నాయి , అసలు నగరాల్లో బ్రాహ్మణులూ కోటీశ్వరులు అని కామెంట్ చేశాడు. అది చూసి కడుపు మండిన ఒక జయహో , బ్రాహ్మణులలో కూడా పేదవారు ఉన్నారు అంటూ ఎదురు దాడికి దిగిన దాకా వచ్చింది . ఒక తీవ్రవాది ఈ పన్నిన ఉచ్చులో ఇమీకు తెలీకుండానే ఇరుక్కున్నారు . జాగ్రత్త పడండి కమ్మ వారిలో పేడ పిసుక్కుంటూ , కూలి చేసుకుంటూ బ్రతికే వారు లేరా ? అలాగే కోట్లకి కోట్లు పడగలెత్తిన వారు కూడా ఉన్నారు . బ్రాహ్మణులలో తిండి గడవని వారిని చూశాను .. అలాగే మంచి స్థాయిలో ఉన్న వారినీ చూశాను.

బ్రాహ్మణులూ బ్రాహ్మణులకి చేయూత అందించ లేదు అలాగే కమ్మలు కూడ వారి చుట్టాలని పెంచి పోషించుకునారేమో గాని సాటి కమ్మ వారిని పైకి తేలేదు. నాతో రండి ఉదాహరణ లు కోకొల్లలు చూపిస్తా ... కనీసం 100 గ్రామాల్లో తిండి గడవని బ్రాహ్మణులని , కమ్మలని, రెడ్లని, దోశెలు పోసుకుని పొట్ట పోసుకునే కోమట్లని , కూలికి వెళ్ళే రాజులని ఎంత మందిని కావాలంటే అంత మందిని చూపిస్తా. ఒక్క ఎన్టీఆర్ కరణాలని రద్దు చేస్తే ఆయన్ని కమ్మ కులానికి ప్రతినిధిని చేస్తారా?

కుల గజ్జి ఉండకూడదు కానీ మతం పై విశ్వాసం ఉండాలి మన మతం లో చీలిక రాకూడదు .. మతం అంటే అందులో మన సంస్కృతి .. మన చరిత్ర ఇమిడి ఉంటాయి .. మన మతం లో చీలిక తెద్దాం అని ప్రయత్నించే ముష్కరులు కసబ్ గాడి కంటె ప్రమాదకరం. మన బ్లాగు లోకపు కసబ్ కారు కూతలు ఖండించండి కుల చిచ్చు ఆర్పేయండి. మనలో మనం కొట్టుకుంటే ఆహా హిందూ మతం ఐఖ్యత అని మరొక పోస్టు పెడతాడు. అప్పుడు అవాక్కయ్యేది మీరే!


పరమత సహనం కలిగిన ఏకైన మతం హిందూమతం . ఇదేన్నటికీ విచ్చిన్నం కారాదు.

6/2/10

కైట్స్

ఆ పిల్ల చూపులో ఏ భావమూ లేదు. తను నన్ను ఎప్పుడు చూసినా ఒక పది సెకండ్లు కన్ను ఆర్పకుండా చూస్తుంది . ఆ చూపులో ఏ ఫీలింగ్ ఉండదు. ఆ చూపు మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది. అప్పట్లో నా చదువు నిమిత్తం మేము ఒంగోల్లో ఉండేవారం. ఒక రోజు మా ఇంటికి ఎదురుగా ఉన్న పోర్షన్ లోకి ఒక ఫ్యామిలీ అద్దెకు దిగారు. " పాపం ఆవిడకి ఆరోగ్యం అంత బాగోలేదనుకుంటా.... చాల నీరసంగా గోడ పట్టుకు నడుస్తుంది .... చిన్న పిల్లలు సర్దుకుంటున్నారు ఏదైనా సహాయం చెయ్యకూడదూ" అంది అమ్మ. వెంటనే లేచి వెళ్ళా ... ఇద్దరు మగ పిల్లలు ఒక అమ్మాయి సామాన్లు లోపలి మోసుకుంటున్నారు . పెద్దవాడికి నా వయసే ఉంటుంది రెండో వాడికి 15, ఆ పిల్లకి 13 ఉండచ్చు వయస్సు. పెద్దాడు నా వైపు చూసి పలకరింపుగా నవ్వి లోపలికి సామాను తీసుకెళ్ళాడు . ఆ వెనుకనే వచ్చిన రెండోవాడు" ఏం కావాలి " అని చికాకుగా అడిగాడు. " ఎం లేదు ఏదైనా హెల్ప్ కావాలా? " నా మాట పూర్తయ్యే లోపే " అవసరం లేదు పో " అన్నాడు. నాకెక్కడో కాలింది.... అయినా మనకెందుకులే అని వెళ్ళబోతుండగా ఆ పిల్ల వచ్చింది . కాసేపు అలాగే చూసింది . ఆ చూపులో ఏ భావం లేదు. కానీ నాకెందుకో ఆ చూపు ఆలా గుర్తుండి పోయింది.

అప్పుడు ఆ అమ్మాయి 10వ తరగతి అనుకుంటా .... స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఎదురుపడితే .... అలాగే కాసేపు ఏ ఫీలింగ్ లేకుండా చూసి పోయేది. కొన్నాళ్ళకి మా ఫ్రెండ్ ఒకడు పొద్దునే వచ్చి నిద్ర లేపాడు . " రేయ్ మీ ఇంటి ఎదురోడు మా చెల్లి వెంట పడుతున్నాడంట.. మా అమ్మాయి నిన్న ఇంటికి వచ్చి ఏడ్చింది. మా నాన్నకి తెలీకుండా వాడి సంగతి చూడాలి " అన్నాడు. " ఎవడ్రా పెద్దోడా... చిన్నోడా " అన్నాను . "వాడేరా బాగా ఎర్రగా ఉంటాడు" అనగానే నన్ను విసుక్కున్న వాడే అని అర్ధం అయింది. " సరే సాయంత్రం వాడు కాలేజి నుండి వచ్చేటప్పుడు అడుగుదాం నువ్వు తొందరపడక" అని చెప్పా .

సాయంత్రం అయింది మా వాడు సైకిల్ చైన్ ..హాకీ స్టిక్ గట్రా రెడీ చేసుకుని వచ్చాడు. "అవన్నీ అవసరం లేదు ముందు వార్నింగ్ ఇద్దాం వినకపోతే భయపెడదాం .. అంతే గానీ సీరియస్ కోటింగ్ ఇస్తే మన అమ్మాయి పేరు బయటికి వస్తుంది " అని మా వాడికి నచ్చచెప్పి అక్కడి నుండి బయల్దేరాం. కాసేపటికి ఆ పిల్లోడు ఎదురయ్యాడు .

" రేయ్ ఇటురారా " అన్నాను . నా పిలుపు లో తేడా చూసి కాస్త భయంగా దగ్గరికి వచ్చాడు . " ఏంట్రా నీకేదో కొమ్ములు మోలిచాయట" అనబోతున్నాను మా వాడు ఆ చెంపా ఈ చెంప ఫటా ఫటా వాయించేశాడు. అయినా అల్లారు ముద్దుగా పెంచుకునే చెల్లి ని ఎవడన్నా ఎమన్నా అంటే ఏ అన్న ఊరుకుంటాడు. " నువ్వు ఆగరా " అని మా వాడిని ఆపి " నీ పేరేంట్రా " అని అడిగా . " రాజశేఖర్ అన్నా" ఏడుస్తూ చెప్పాడు. "చూడమ్మా నీకేందుకు వచ్చిన గొడవ చెప్పు నీ పని నువ్వు చేసుకో... అమ్మాయి జోలికి వెళ్ళకు , ఇంకోసారి ఇది రిపీట్ అయితే నేను కూడా చెయ్యి వేయాల్సి వస్తుంది" అని చెప్పా . సరే అని వెళ్ళిపోయాడు . వాడిని తుక్కు కింద కొడదాం అని వచ్చిన మా వాడు కాస్త నిరుత్సాహానికి గురయ్యాడు.

అ మర్నాడు రాజశేఖర్ వాడి చెల్లి ఎదురొచ్చారు .. దూరం నుండి నన్ను చూపిస్తూ ఏదో చెప్తున్నాడు . దగ్గరకి వచ్చాక ఆ పిల్ల అదే భావరహితమైన చూపు విసిరి వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్నాయి ఆ అమ్మాయి పేరు రాణి అని తెల్సింది. రాణి కాలేజ్ లో చేరాకా అప్పుడప్పుడు కుర్రాళ్ళతో ఏదో ఒక సందు లో మాట్లాడుతూ కనిపిస్తూ ఉండేది. నన్ను గానీ మా ఫ్రెండ్స్ ని చూసి గానీ బెదిరేది కాదు. అసలు ఇంటి దగ్గర వాళ్ళు చూస్తున్నారు అనే భయం కూడా కనిపించేది కాదు. మాకెందుకు వచ్చిన గొడవ లె అని పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ అ చూపు మాత్రం కామన్. అలాగే రాజశేఖర్ పెద్దవాడు అయ్యాడు. వాడు ఒక బ్యాచ్ మైంటైన్ చేసే వాడు . అపుడప్పుడు " హై సీనన్నా" అని నన్ను పలకరించేవాడు. అమ్మయిల వెంట విస్తృతంగా పడడం మొదలెట్టాడు. అన్న ఒక రకం చెల్లి ఇంకో రకం. మనకి తెల్సిన విషయం ఏంటంటే చెల్లెలి చేత అమ్మాయిలకి లవ్ లెటర్లు పంపేవాడట. కానీ వీళ్ళ పెద్దన్న మాత్రం తన చదువు తన లోకం అన్నట్టు ఉండేవాడు.

ఒకసారి రాణి ఎవడితోనో కలసి తిరుగుతూ రాజశేఖర్ కంట పడింది. అక్కడే తన ఫ్రెండ్స్ తో కలసి వాడిని కొట్టి ఈ పిల్లతో తగాదా వేసుకుంటున్నాడు. " నువ్వు చేసినప్పుడు లేదా. నీ పని నువ్వు చూసుకో.. నా జోలికి వస్తే మర్యాద దక్కదు " అంటూ అన్నకే ఎదురు తిరుగుతుందా పిల్ల. వాళ్ళ అన్నని ఒక తోపు తోసి వీసా విసా నడుచుకుంటూ వెళ్తూ నా కేసి అదే చూపు చూసి పోయింది. ఇక అ బజార్లో ఉండలేమంటూ అక్కడి నుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. తర్వాత అప్పుడప్పుడు కనిపించేవాడు రాజశేఖర్ అమ్మాయిల వెంట పడి తిరుగుతూ ! రాణి కూడా అంతే. వాళ్ళ పెద్దవాడు ఎక్కడో ఉద్యోగం వెదుక్కుని వెళ్లిపోయాడట.

ఆలా ఎనిమిదేళ్ళు గడిచాయి మొన్న ఈమధ్య రెగ్యులర్ గా ప్రతి గురువారం నేను వెళ్ళే సాయిబాబా గుడి కి వెళ్లాను . అక్కడ గోడల కి ఒక పాంప్లెట్ అంటించి ఉంది. ముద్దులోకికే నాలుగేళ్ల చిన్నారి ఫోటో వేసి కింద చిన్నారి మా మణి కనిపించుట లేదు ఆచూకీ తెల్సిన వారు కింది నంబర్ల కి ఫోన్ చేయగలరు అని ఫోన్ నంబర్లు ఉన్నాయి. మరో రెండు రోజులకి పేపర్లో ' శవమై తేలిన చిన్నారి మణి' అనే శీర్షిక తో 'కన్న తల్లే కాలాంతకురాలు - అక్రమ సంబధమే కారణం' అన్న ఉప శీర్షికతో ఉన్న వార్త ఒక్క సారిగా నన్ను అలర్ట్ చేసింది. చూస్తే ఆ కన్నతల్లి రాణి అని తెల్సింది. ఎం జరిగి ఉంటుందా అని ఆరా తీస్తే కొన్ని విషయాలు తెలిసాయి.

మా ఏరియా నుండి వెళ్లిపోయిన మూడేళ్ళకి రాణి కి పెళ్లి చేశారు. తన సొంత మేనబావ ఆమెని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత రాణి కి ఆమె భర్తకి అసలు పడేది కాదు . అతను ఎంత సర్దుకు పోదాం అని ప్రయత్నించినా రాణి తగ్గేది కాదు. కొన్నాళ్ళకి వారికి మణి పుట్టాడు. మణి పుట్టిన తర్వాత కూడా ఇద్దరికీ ఒక్క క్షణం పాడేది కాదట. నిత్యం తగవులాడుకొని ఒక దశలో కొట్టుకునే స్థాయికి వచ్చారట. ఇక లాభం లేదనుకుని మణి తో సహా పుట్టింటికి చేరుకుంది రాణి. ఇదే సమయంలో ఒక సారి ఆమె ఫోన్ కి వచ్చిన రాంగ్ నంబర్ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆ ఫోన్ పరిచయం విడదీయరాని ఫోన్ స్నేహంగా మారింది. ఆ ఫోన్ చేసింది ఒక స్కూల్ టీచర్. పిల్లలకి పాఠాలు చెప్పాల్సిన మాస్టారు రాణి కి ప్రేమ పాఠాలు వల్లించాడు. తర్వాత వారి స్నేహం అక్రమ సంభంధంగా మారింది. ఆ టీచర్ ఇంట్లో ఎవరూ లేని సమయం లో వచ్చి రాణి తో గడిపి వెళుతుండేవాడు. కానీ ఆ సమయం లో మణి వారికి అడ్డుగా ఉన్నాడు. మణి లేకపోతే తన వ్యవహారం చక్కగా సాగుతుంది అని తెల్సుకున్న రాణి , మణి ని అంతం చేయడానికి డిసైడ్ అయ్యింది. అదే విషయం ఆ టీచర్ కి చెబితే మొదట నసిగినా తర్వాత ఒప్పుకున్నాడు. మెడికల్ షాపు కి వెళ్లి నిద్రమాత్రలు తెచ్చి ఇచ్చాడు. ఆ నిద్రమాత్రలు అన్నీ పాలల్లో కలిపి తాగించింది .... అవి తాగి నిద్రపోయిన మణి సాయంత్రానికి లేచి వాంతులు చేసుకోవడం మొదలు పెట్టాడు. అందరూ కలసి హాస్పిటల్ కి తీసుకెళ్ళి కక్కించారు. పుడ్ పాయిసన్ అని అందరూ అనుకున్నారు. కానీ రాణి అఘాయిత్యం బయట పడలేదు. మరో రెండు రోజులాగి టీచర్ కి ఫోన్ చేసింది . మణి ని తీస్కెళ్ళి చంపేసి వస్తేనే తనతో ఫ్రెండ్ షిప్ కంటిన్యు చేస్తాను అని లేకుంటే లేదని ఖరాకండిగా చెప్పడంతో .. మళ్లీ వచ్చిన ఆ టీచర్ మణి ని తనతో తీసుకెళ్ళాడు. మణి చనిపోయినట్టు తనకి కన్ఫర్మేషన్ కావాలని అడిగిందట ఆ తల్లి. మణి ని ఆ టీచర్ తీసుకెళ్లడం అ దగ్గర లో ఉన్న ఒక కిల్లీ షాపు ఓనర్ చూశాడు.

మణి ని చాలా దూరం పొలాల్లోకి తీసుకెళ్ళిన ఆ టీచర్ ముందు రాణి కి ఫోన్ చేశాడు . ఫోన్ చేసి లైన్ లో ఉండమని చెప్పి మణి గొంతు పిసకడం మొదలెట్టాడు. మణి అచేతనుడైపోయేంత వరకు అతని అరుపులు ... మూలుగులు ఫోన్ లో విన్న రాణి .. తర్వత ఎందుకైనా మంచిది పిల్లవాడిని పూడ్చేయమని చెప్పిందట టీచర్ తో. దగ్గర లో ఉన్న ఒక గుంటలో మణిని వేసి వాడిపై పెద్ద పెద్ద రాళ్ళు వేసేసి వచ్చేశాడు ఆ టీచర్. సాయంత్రానికి పిల్లవాడు కనిపించడం లేదు అని గగ్గోలు పెట్టి .. పాంప్లేట్లు వేయించి . పేపర్ లో ప్రకటనలు ఇప్పించి రాణి చేసిన గొడవ అంతా ఇంతా కాదు. నా మణి నాకు కావాలి అని ఏడుస్తున్న ఆమెని చూసి అందరూ జాలిపడ్డారు. యదా ప్రకారం కంప్లైంట్ ఇచ్చిన మూడు రోజులకి తాపీగా విచారణ మొదలెట్టిన పోలీసులు ... పనిలోపనిగా కిల్లీ కొట్టు వొనర్ దగ్గర సిగరెట్ కోసం వెళ్లడం తో కధ లో మలుపు వచ్చింది. వీళ్ళ ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఒకడు వస్తాడని ... వాడే మొన్న పిల్లోడిని తీసుకెళ్ళాడు అని అతను చెప్పడంతో .. ఆ కోణం లో దర్యాప్తు చేసి టీచర్ ని అదుపు లోకి తీసుకున్న పోలీసులు గంట లో కేసుని చేదించి .. మణి శవాన్ని బయటికి తీశారు. బిడ్డ శవాన్ని చూసిన మణి తండ్రి రోదన వర్ణనాతీతం ..... ఈ రాక్షసి ఇంతకి తెగిస్తుంది అనుకోలేదంటూ పొర్లి పొర్లి ఏడ్చాడు అతను. మొదట శోకాలు తీసిన రాణి ఇప్పుడు నిస్సిగ్గుగా జైల్లో కూర్చుంది. ఆ టీచర్ తన ఉద్యోగం పోగొట్టుకుని కటకటాల పాలు అయ్యాడు ...... కన్న బిడ్డని పోగొట్టుకుని మణి తండ్రి విలవిలలాడుతున్నాడు. ఇన్నాళ్ళు అమ్మాయిల వెంట తిరిగి చదువు సంధ్యలు లేకుండా .. ఏ ఉద్యోగానికీ పనికి రాకుండా తయారైన రాజశేఖర్ ఇంత జరిగినా చీమకుట్టినట్టైనా లేకుండా తిరుగుతున్నాడు. అనారోగ్యం పాలైన తల్లి , కుటుంబ పోషణ నిమిత్తం తీరిక లేని తండ్రి , తన చదువు తన జీవితం అన్నట్టు ఉండే పెద్దన్న.... గాలికి తిరిగే చిన్నన్న .... వీరి మూలంగా రాణి , రాణి భర్త , టీచర్ ల జీవితాలు తెగిన గాలి పటాల్లా తయారయ్యాయి. అందుకే ఈ టపాకి శీర్షిక కైట్స్ అని పెట్టాను. నాలుగు రోజుల కింద కోర్టు దగ్గర నోటరీ తో పని ఉండి వెళ్తే వాయిదా కోసం వచ్చి చెట్టు కింద నిల్చున్న రాణి కనపడింది. మళ్లీ అదే చూపు. ఆ పిల్ల చూపులో ఏ భావమూ లేదు.