రాజేష్ పని చేసే కన్సల్టెన్సీ వారు అస్సాం నుండి చెన్నై కి బదిలీ చేయడం తో ఈ మధ్యనే చెన్నై వచ్చిన రాజేష్ అక్కడ ఉదయాన్నే పాలు పోసే పాల్ రాజ్ ని పాలలో నీళ్ళు ఎక్కువ కలుపుతున్నారని నిలదీయడం తో పాలు పోసే పాల్ రాజ్ నాకేం తెల్సు సార వాడు మా డైరీ ఓనర్ పశుపతిని అడగమన్నాడు. పశువుల సాక్షిగా పశుపతిని నిలదీద్దాం అని డైరీ కి వెళ్ళిన రాజేష్ అక్కడ పశుపతికి బాడీగార్డ్ గా ఉన్న సుమో ఫైటర్ గుండు రావు చేత తన్నులు తినాల్సి వచ్చింది. ఆగ్రహించిన రాజేష్ వాళ్ళ మీద కేస్ పెడదామని లాయర్ కేసవన్ దగ్గరకి వెళ్ళాడు. కేస్ పెట్టేముందు మీరు డాక్టర్ దగ్గరకి వెళ్ళమన్న లాయర్ కేసవన్ సలహా మేరకు డాక్టర్ వైద్యనాధన్ ని సంప్రదించాడు రాజేష్. డాక్టర్ వైద్యనాధన్ అన్ని టెస్టుల నిమిత్తం పరిక్క్షిత్త ల్యాబ్ లో టెస్టు చేపించి .. రాజేష్ ని కాస్త పీల్చి పిప్పి చేసి పంపాడు . పళ్ళు దెబ్బ తినడం వల్ల ముందుగా డెంటిస్ట్ పల్లవన్ దగ్గరికి వెళ్ళిన రాజేష్ అక్కడినుండి కార్డియాలజిస్ట్ హృదయ రాజ్ దగ్గర కి వెళ్ళాడు.
తీవ్రంగా భయపడడం వల్ల సైక్రియాట్రిస్ట్ మనో దగ్గర కౌన్సిలింగ్ తర్వాత .. డాక్టర్ కామదేవన్ దగ్గరకి ఎందుకు వెళ్ళాడో తెలీదు. ఇంత మంది డాక్టర్ల దగ్గరకు వెళ్ళడం వల్ల ఆర్ధికం గా కాస్త సాయం అవసరం అయి ఫైనాన్సియర్ ధనసేకరణ్ దగ్గరకు వెళ్ళిన రాజేష్ ... ఈ మద్యనే రియల్ ఎస్టేట్ వ్యాపారి భూమినాధన్ దగ్గర కొన్న భూమి తాకట్టు పెట్టి డబ్బు తీసుకున్నాడు. కాస్త రిలాక్సవుదామని బార్ కి వెళ్లి అక్కడ పని చేసే "మధు" సూదన్ కి బీర్ ఆర్డరిచ్చాడు. ఫుల్లుగా తాగిన రాజేష్ అక్కడే పడిపోవడం తో అలవాటుగా రాజేష్ ఆఫీసుకి ఫోన్ చేసాడు మధు సూదన్. డ్రైవర్ సారధి అందుబాటులో లేక పోవడం వల్ల ఆల్టర్నేట్ డ్రైవర్ పార్ధ సారధి వెంటనే వచ్చి రాజేష్ ని తీసుకెళ్లడం జరిగింది. రాజేష్ చేసే తిక్క పనులు చూసిన అతని చెనై మిత్రుడు మిత్రలాబన్ అతన్ని మెంటల్ హాస్పిటల్ కితీసుకెళ్ళి అక్కడ డాక్టర్ బుద్ది శిఖామణి కి చూపించాడు. అర్జంటుగా రాజేష్ కి డైవర్షన్ అవసరం అని డాక్టర్ బుద్ధి శిఖామణి చెప్పడం తో కొన్నాళ్ళు పని(చేసేదేం లేకపోయినా) వదిలి పెట్టి ఆటలు కళల యందు మనసు లగ్నం చేయమని మిత్రులు సలహా పడేసారు. అందువల్ల క్రికెట్ నేర్చుకుందామని గ్రౌండ్ కి వెళ్ళిన రాజేష్ అక్కడ బౌలర్ 'బాలా'జీ వేసిన బాలు గట్టిగ తగలడం వల్ల దానికి స్వస్తి పలికి పెయింటర్ చిత్రగుప్త వద్ద కొన్నాళ్ళు ... తరువాత నాటకాలు నేర్పే నటరాజన్ దగ్గర కొన్నాళ్ళు పని చేసి చివరికి నాటకాల నటరాజన్ కంపెనీలో మేకప్ మాన్ సింగారం తో గొడవ పడి అక్కడి నుండి బయటికి వచ్చి చివరిగా ఫిక్షన్ కధలు రాసే నవలన్ దగ్గర కధలు రాయడం నేర్చుకుందామని చేరి అతని దెబ్బకి పిచ్చ పిచ్చ గా తయారవడం వల్ల నవలన్ పక్కింట్లో ఉండే నర్సరీ ఓనర్ పుష్పరాజన్ రాజేష్ ని క్షేమంగా ఇంటికి చేర్చాడు. ఇంట్లో చిత్ర విచిత్రం గా ప్రవర్తిస్తున్న రాజేష్ ని దయ్యాల వైద్యుడు మాత్రుభూతం కి చూపించారు ఇంట్లో వాళ్ళు. రాజేష్ కి పట్టిన దయ్యం పాములు పట్టే నాగ మూర్తి దని చెప్పిన మాత్రుబూతం దానిని వదల గొట్టడానికి ముంగిసరాసన్ అనే మరో మాంత్రికుడి సాయం తో రాజేష్ ని వేపాకుల తో కొట్టి చివరికి దయ్యం వదిలిందని ప్రకటించారు. ఆ రోజు నుండి రాజేష్ ని వేలాయుధం అనే వాచ్ మాన్ అనుక్షణం గమనిస్తూ ఉండే వాడు. రాజేష్ మాత్రం పక్కింటి వాలీ బాల్ ప్లేయర్ బాలా త్రిపుర సుందరి కి మూగగా లైన్ వేసేవాడు
దీనంతటికీ కారణమైన పాల్ రాజ్ రోజు కల్తీ పాలు పోస్తూనే ఉన్నాడు