అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

6/2/10

కైట్స్

ఆ పిల్ల చూపులో ఏ భావమూ లేదు. తను నన్ను ఎప్పుడు చూసినా ఒక పది సెకండ్లు కన్ను ఆర్పకుండా చూస్తుంది . ఆ చూపులో ఏ ఫీలింగ్ ఉండదు. ఆ చూపు మాత్రం నాకు బాగా గుర్తుండిపోయింది. అప్పట్లో నా చదువు నిమిత్తం మేము ఒంగోల్లో ఉండేవారం. ఒక రోజు మా ఇంటికి ఎదురుగా ఉన్న పోర్షన్ లోకి ఒక ఫ్యామిలీ అద్దెకు దిగారు. " పాపం ఆవిడకి ఆరోగ్యం అంత బాగోలేదనుకుంటా.... చాల నీరసంగా గోడ పట్టుకు నడుస్తుంది .... చిన్న పిల్లలు సర్దుకుంటున్నారు ఏదైనా సహాయం చెయ్యకూడదూ" అంది అమ్మ. వెంటనే లేచి వెళ్ళా ... ఇద్దరు మగ పిల్లలు ఒక అమ్మాయి సామాన్లు లోపలి మోసుకుంటున్నారు . పెద్దవాడికి నా వయసే ఉంటుంది రెండో వాడికి 15, ఆ పిల్లకి 13 ఉండచ్చు వయస్సు. పెద్దాడు నా వైపు చూసి పలకరింపుగా నవ్వి లోపలికి సామాను తీసుకెళ్ళాడు . ఆ వెనుకనే వచ్చిన రెండోవాడు" ఏం కావాలి " అని చికాకుగా అడిగాడు. " ఎం లేదు ఏదైనా హెల్ప్ కావాలా? " నా మాట పూర్తయ్యే లోపే " అవసరం లేదు పో " అన్నాడు. నాకెక్కడో కాలింది.... అయినా మనకెందుకులే అని వెళ్ళబోతుండగా ఆ పిల్ల వచ్చింది . కాసేపు అలాగే చూసింది . ఆ చూపులో ఏ భావం లేదు. కానీ నాకెందుకో ఆ చూపు ఆలా గుర్తుండి పోయింది.

అప్పుడు ఆ అమ్మాయి 10వ తరగతి అనుకుంటా .... స్కూల్ కి వెళ్ళేటప్పుడు ఎక్కడైనా ఎదురుపడితే .... అలాగే కాసేపు ఏ ఫీలింగ్ లేకుండా చూసి పోయేది. కొన్నాళ్ళకి మా ఫ్రెండ్ ఒకడు పొద్దునే వచ్చి నిద్ర లేపాడు . " రేయ్ మీ ఇంటి ఎదురోడు మా చెల్లి వెంట పడుతున్నాడంట.. మా అమ్మాయి నిన్న ఇంటికి వచ్చి ఏడ్చింది. మా నాన్నకి తెలీకుండా వాడి సంగతి చూడాలి " అన్నాడు. " ఎవడ్రా పెద్దోడా... చిన్నోడా " అన్నాను . "వాడేరా బాగా ఎర్రగా ఉంటాడు" అనగానే నన్ను విసుక్కున్న వాడే అని అర్ధం అయింది. " సరే సాయంత్రం వాడు కాలేజి నుండి వచ్చేటప్పుడు అడుగుదాం నువ్వు తొందరపడక" అని చెప్పా .

సాయంత్రం అయింది మా వాడు సైకిల్ చైన్ ..హాకీ స్టిక్ గట్రా రెడీ చేసుకుని వచ్చాడు. "అవన్నీ అవసరం లేదు ముందు వార్నింగ్ ఇద్దాం వినకపోతే భయపెడదాం .. అంతే గానీ సీరియస్ కోటింగ్ ఇస్తే మన అమ్మాయి పేరు బయటికి వస్తుంది " అని మా వాడికి నచ్చచెప్పి అక్కడి నుండి బయల్దేరాం. కాసేపటికి ఆ పిల్లోడు ఎదురయ్యాడు .

" రేయ్ ఇటురారా " అన్నాను . నా పిలుపు లో తేడా చూసి కాస్త భయంగా దగ్గరికి వచ్చాడు . " ఏంట్రా నీకేదో కొమ్ములు మోలిచాయట" అనబోతున్నాను మా వాడు ఆ చెంపా ఈ చెంప ఫటా ఫటా వాయించేశాడు. అయినా అల్లారు ముద్దుగా పెంచుకునే చెల్లి ని ఎవడన్నా ఎమన్నా అంటే ఏ అన్న ఊరుకుంటాడు. " నువ్వు ఆగరా " అని మా వాడిని ఆపి " నీ పేరేంట్రా " అని అడిగా . " రాజశేఖర్ అన్నా" ఏడుస్తూ చెప్పాడు. "చూడమ్మా నీకేందుకు వచ్చిన గొడవ చెప్పు నీ పని నువ్వు చేసుకో... అమ్మాయి జోలికి వెళ్ళకు , ఇంకోసారి ఇది రిపీట్ అయితే నేను కూడా చెయ్యి వేయాల్సి వస్తుంది" అని చెప్పా . సరే అని వెళ్ళిపోయాడు . వాడిని తుక్కు కింద కొడదాం అని వచ్చిన మా వాడు కాస్త నిరుత్సాహానికి గురయ్యాడు.

అ మర్నాడు రాజశేఖర్ వాడి చెల్లి ఎదురొచ్చారు .. దూరం నుండి నన్ను చూపిస్తూ ఏదో చెప్తున్నాడు . దగ్గరకి వచ్చాక ఆ పిల్ల అదే భావరహితమైన చూపు విసిరి వెళ్ళిపోయింది. రోజులు గడుస్తున్నాయి ఆ అమ్మాయి పేరు రాణి అని తెల్సింది. రాణి కాలేజ్ లో చేరాకా అప్పుడప్పుడు కుర్రాళ్ళతో ఏదో ఒక సందు లో మాట్లాడుతూ కనిపిస్తూ ఉండేది. నన్ను గానీ మా ఫ్రెండ్స్ ని చూసి గానీ బెదిరేది కాదు. అసలు ఇంటి దగ్గర వాళ్ళు చూస్తున్నారు అనే భయం కూడా కనిపించేది కాదు. మాకెందుకు వచ్చిన గొడవ లె అని పట్టించుకునే వాళ్ళం కాదు. కానీ అ చూపు మాత్రం కామన్. అలాగే రాజశేఖర్ పెద్దవాడు అయ్యాడు. వాడు ఒక బ్యాచ్ మైంటైన్ చేసే వాడు . అపుడప్పుడు " హై సీనన్నా" అని నన్ను పలకరించేవాడు. అమ్మయిల వెంట విస్తృతంగా పడడం మొదలెట్టాడు. అన్న ఒక రకం చెల్లి ఇంకో రకం. మనకి తెల్సిన విషయం ఏంటంటే చెల్లెలి చేత అమ్మాయిలకి లవ్ లెటర్లు పంపేవాడట. కానీ వీళ్ళ పెద్దన్న మాత్రం తన చదువు తన లోకం అన్నట్టు ఉండేవాడు.

ఒకసారి రాణి ఎవడితోనో కలసి తిరుగుతూ రాజశేఖర్ కంట పడింది. అక్కడే తన ఫ్రెండ్స్ తో కలసి వాడిని కొట్టి ఈ పిల్లతో తగాదా వేసుకుంటున్నాడు. " నువ్వు చేసినప్పుడు లేదా. నీ పని నువ్వు చూసుకో.. నా జోలికి వస్తే మర్యాద దక్కదు " అంటూ అన్నకే ఎదురు తిరుగుతుందా పిల్ల. వాళ్ళ అన్నని ఒక తోపు తోసి వీసా విసా నడుచుకుంటూ వెళ్తూ నా కేసి అదే చూపు చూసి పోయింది. ఇక అ బజార్లో ఉండలేమంటూ అక్కడి నుండి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. తర్వాత అప్పుడప్పుడు కనిపించేవాడు రాజశేఖర్ అమ్మాయిల వెంట పడి తిరుగుతూ ! రాణి కూడా అంతే. వాళ్ళ పెద్దవాడు ఎక్కడో ఉద్యోగం వెదుక్కుని వెళ్లిపోయాడట.

ఆలా ఎనిమిదేళ్ళు గడిచాయి మొన్న ఈమధ్య రెగ్యులర్ గా ప్రతి గురువారం నేను వెళ్ళే సాయిబాబా గుడి కి వెళ్లాను . అక్కడ గోడల కి ఒక పాంప్లెట్ అంటించి ఉంది. ముద్దులోకికే నాలుగేళ్ల చిన్నారి ఫోటో వేసి కింద చిన్నారి మా మణి కనిపించుట లేదు ఆచూకీ తెల్సిన వారు కింది నంబర్ల కి ఫోన్ చేయగలరు అని ఫోన్ నంబర్లు ఉన్నాయి. మరో రెండు రోజులకి పేపర్లో ' శవమై తేలిన చిన్నారి మణి' అనే శీర్షిక తో 'కన్న తల్లే కాలాంతకురాలు - అక్రమ సంబధమే కారణం' అన్న ఉప శీర్షికతో ఉన్న వార్త ఒక్క సారిగా నన్ను అలర్ట్ చేసింది. చూస్తే ఆ కన్నతల్లి రాణి అని తెల్సింది. ఎం జరిగి ఉంటుందా అని ఆరా తీస్తే కొన్ని విషయాలు తెలిసాయి.

మా ఏరియా నుండి వెళ్లిపోయిన మూడేళ్ళకి రాణి కి పెళ్లి చేశారు. తన సొంత మేనబావ ఆమెని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిన తర్వాత రాణి కి ఆమె భర్తకి అసలు పడేది కాదు . అతను ఎంత సర్దుకు పోదాం అని ప్రయత్నించినా రాణి తగ్గేది కాదు. కొన్నాళ్ళకి వారికి మణి పుట్టాడు. మణి పుట్టిన తర్వాత కూడా ఇద్దరికీ ఒక్క క్షణం పాడేది కాదట. నిత్యం తగవులాడుకొని ఒక దశలో కొట్టుకునే స్థాయికి వచ్చారట. ఇక లాభం లేదనుకుని మణి తో సహా పుట్టింటికి చేరుకుంది రాణి. ఇదే సమయంలో ఒక సారి ఆమె ఫోన్ కి వచ్చిన రాంగ్ నంబర్ ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆ ఫోన్ పరిచయం విడదీయరాని ఫోన్ స్నేహంగా మారింది. ఆ ఫోన్ చేసింది ఒక స్కూల్ టీచర్. పిల్లలకి పాఠాలు చెప్పాల్సిన మాస్టారు రాణి కి ప్రేమ పాఠాలు వల్లించాడు. తర్వాత వారి స్నేహం అక్రమ సంభంధంగా మారింది. ఆ టీచర్ ఇంట్లో ఎవరూ లేని సమయం లో వచ్చి రాణి తో గడిపి వెళుతుండేవాడు. కానీ ఆ సమయం లో మణి వారికి అడ్డుగా ఉన్నాడు. మణి లేకపోతే తన వ్యవహారం చక్కగా సాగుతుంది అని తెల్సుకున్న రాణి , మణి ని అంతం చేయడానికి డిసైడ్ అయ్యింది. అదే విషయం ఆ టీచర్ కి చెబితే మొదట నసిగినా తర్వాత ఒప్పుకున్నాడు. మెడికల్ షాపు కి వెళ్లి నిద్రమాత్రలు తెచ్చి ఇచ్చాడు. ఆ నిద్రమాత్రలు అన్నీ పాలల్లో కలిపి తాగించింది .... అవి తాగి నిద్రపోయిన మణి సాయంత్రానికి లేచి వాంతులు చేసుకోవడం మొదలు పెట్టాడు. అందరూ కలసి హాస్పిటల్ కి తీసుకెళ్ళి కక్కించారు. పుడ్ పాయిసన్ అని అందరూ అనుకున్నారు. కానీ రాణి అఘాయిత్యం బయట పడలేదు. మరో రెండు రోజులాగి టీచర్ కి ఫోన్ చేసింది . మణి ని తీస్కెళ్ళి చంపేసి వస్తేనే తనతో ఫ్రెండ్ షిప్ కంటిన్యు చేస్తాను అని లేకుంటే లేదని ఖరాకండిగా చెప్పడంతో .. మళ్లీ వచ్చిన ఆ టీచర్ మణి ని తనతో తీసుకెళ్ళాడు. మణి చనిపోయినట్టు తనకి కన్ఫర్మేషన్ కావాలని అడిగిందట ఆ తల్లి. మణి ని ఆ టీచర్ తీసుకెళ్లడం అ దగ్గర లో ఉన్న ఒక కిల్లీ షాపు ఓనర్ చూశాడు.

మణి ని చాలా దూరం పొలాల్లోకి తీసుకెళ్ళిన ఆ టీచర్ ముందు రాణి కి ఫోన్ చేశాడు . ఫోన్ చేసి లైన్ లో ఉండమని చెప్పి మణి గొంతు పిసకడం మొదలెట్టాడు. మణి అచేతనుడైపోయేంత వరకు అతని అరుపులు ... మూలుగులు ఫోన్ లో విన్న రాణి .. తర్వత ఎందుకైనా మంచిది పిల్లవాడిని పూడ్చేయమని చెప్పిందట టీచర్ తో. దగ్గర లో ఉన్న ఒక గుంటలో మణిని వేసి వాడిపై పెద్ద పెద్ద రాళ్ళు వేసేసి వచ్చేశాడు ఆ టీచర్. సాయంత్రానికి పిల్లవాడు కనిపించడం లేదు అని గగ్గోలు పెట్టి .. పాంప్లేట్లు వేయించి . పేపర్ లో ప్రకటనలు ఇప్పించి రాణి చేసిన గొడవ అంతా ఇంతా కాదు. నా మణి నాకు కావాలి అని ఏడుస్తున్న ఆమెని చూసి అందరూ జాలిపడ్డారు. యదా ప్రకారం కంప్లైంట్ ఇచ్చిన మూడు రోజులకి తాపీగా విచారణ మొదలెట్టిన పోలీసులు ... పనిలోపనిగా కిల్లీ కొట్టు వొనర్ దగ్గర సిగరెట్ కోసం వెళ్లడం తో కధ లో మలుపు వచ్చింది. వీళ్ళ ఇంట్లో ఎవరూ లేనప్పుడు ఒకడు వస్తాడని ... వాడే మొన్న పిల్లోడిని తీసుకెళ్ళాడు అని అతను చెప్పడంతో .. ఆ కోణం లో దర్యాప్తు చేసి టీచర్ ని అదుపు లోకి తీసుకున్న పోలీసులు గంట లో కేసుని చేదించి .. మణి శవాన్ని బయటికి తీశారు. బిడ్డ శవాన్ని చూసిన మణి తండ్రి రోదన వర్ణనాతీతం ..... ఈ రాక్షసి ఇంతకి తెగిస్తుంది అనుకోలేదంటూ పొర్లి పొర్లి ఏడ్చాడు అతను. మొదట శోకాలు తీసిన రాణి ఇప్పుడు నిస్సిగ్గుగా జైల్లో కూర్చుంది. ఆ టీచర్ తన ఉద్యోగం పోగొట్టుకుని కటకటాల పాలు అయ్యాడు ...... కన్న బిడ్డని పోగొట్టుకుని మణి తండ్రి విలవిలలాడుతున్నాడు. ఇన్నాళ్ళు అమ్మాయిల వెంట తిరిగి చదువు సంధ్యలు లేకుండా .. ఏ ఉద్యోగానికీ పనికి రాకుండా తయారైన రాజశేఖర్ ఇంత జరిగినా చీమకుట్టినట్టైనా లేకుండా తిరుగుతున్నాడు. అనారోగ్యం పాలైన తల్లి , కుటుంబ పోషణ నిమిత్తం తీరిక లేని తండ్రి , తన చదువు తన జీవితం అన్నట్టు ఉండే పెద్దన్న.... గాలికి తిరిగే చిన్నన్న .... వీరి మూలంగా రాణి , రాణి భర్త , టీచర్ ల జీవితాలు తెగిన గాలి పటాల్లా తయారయ్యాయి. అందుకే ఈ టపాకి శీర్షిక కైట్స్ అని పెట్టాను. నాలుగు రోజుల కింద కోర్టు దగ్గర నోటరీ తో పని ఉండి వెళ్తే వాయిదా కోసం వచ్చి చెట్టు కింద నిల్చున్న రాణి కనపడింది. మళ్లీ అదే చూపు. ఆ పిల్ల చూపులో ఏ భావమూ లేదు.

9 comments:

Anonymous said...

ఇదంతా నిజమా!!!! నమ్మలేకపోతున్నాను...

అ తల్లి విషయం పక్కన పెడితే . ఆ అమ్మాయి మీకు ఇన్నిసార్లు వివిధ సందర్భాలలో ఎదురు పడ్దం ఏమిటి? ఆ చూపు కర్థమేంటి.
వింతగా ఉంది..
--సుధ

KAMAL said...

తరువాత కథేంటంటే పోలీసులతో ఆమెకు పరిచయాలు ఎక్కువవుతాయి. ఎ ఎస్సైయ్యో కొన్ని రోజులు ఉంచుకుంటాడు. ఆ తరువాత ఆమెకు ఇంకా కొత్త పరిచయాలవుతాయి. అప్పుడు ఉంచుకున్నోడు ఒక రోజు బాగా తాగి వచ్చి .....కోసి కారం అద్ది యాసిడ్ పోస్తాడు. ........కు రోగం వదులుద్ది లేక ప్రాణం వదులుద్ది.

చిన్నారి మణి ఆత్మకు శాంతి కలుగు గాక

కత పవన్ said...

ఆడ పిశాచి.....ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు..కోందరు తెలిసి ఇంకోందరు తెలియాక...అలాంటి ఆడదానిని ఆ మాష్టారుని పేట్రోల్ పోసి తగలబేట్టాలి...

Anonymous said...

నేను మీ టపా చదువుతున్నంత సేపు నాకు రాణి, రాజ శేఖర్, టీచర్, మణి వీళ్ళెవరు కనబడలేదు.
ఒక మంచి విషయాన్ని కమర్షియల్ టైటిల్ తో ఆకర్షించి చెప్పిన మీ టాలెంట్ మాత్రమే కనబడింది.
హాట్సాఫ్ టు యు. .....

- కస్క్రిమపదనిహీ

రాధిక said...

పాపం మణి.అమ్మగా ప్రవర్తించలేకపోతే సరే..... మనిషిగా అయినా ఆలోచినచలేకపోయిందా?ఆమె అసలు మనిషేనా? మరీ అంత కృరత్వమా?

శ్రీనివాస్ said...

@ సుధ గారు ఆ అర్ధం లేని చూపులకి అర్ధం నాకు ఇంతవరకు అర్ధం కాలేదు.

@ కమల్ కరక్ట్ గెస్.

@ పవన్ కంట్రోల్ కంట్రోల్

@ - కస్క్రిమపదనిహీ నన్ను పోగిదారో తిట్టారో అరధం కాలేదు :((

@ రాధిక సరైన పెంపకం లేకపోతే మనుషులు ఎలా తయారవుతారు అనేదానికి వీళ్ళు ఒక ఉదాహరణ.

స్వర్ణమల్లిక said...

కడుపున పుట్టిన బిడ్డని అక్రమ సంబంధం కోసం చంపాలని ఆలోచన చేసిందంటే అసలు ఆమె మానసిక పరిస్తితి ఎలాంటిదో, ఒకవేళ శిక్ష తప్పించుకుని బయటికి వచ్చినా ఆమె వల్ల సమాజానికి మరింత చేరుపే కానే మంచి లేదు. బిడ్డనే చంపించిందంటే వేరే వారు ఎవరైనా ఆమెకి అడ్డం వస్తే అదే పని చేస్తుంది అనేగా అర్ధం.

Vinay Chakravarthi.Gogineni said...

పెంపకం లేకపోతే మనుషులు ఎలా తయారవుతారు అనేదానికి వీళ్ళు ఒక ఉదాహరణ

srinu gaari eppudaina okasaari meeru tanaki cheppivundaalsindi.....adi mee veedhilo vuntunnappudu ela vadilesaaru.chinnappude koncham manchi maatalu talalku ekkite maredemo.

చందు said...

em maatalladalo teletam ledu srinu......!!!