మా ఫ్రెండు వాళ్ళ సెల్ ఫోన్ షోరూం లో చిన్న పని ఉండి వెళ్ళిన నేను .. అక్కడ వాళ్ళు బిజీగా ఉండడం తో ..వాళ్ళ సిస్టం లో పాత దయ్యాల సినిమా చూస్తుండగా .. వెనక నుండి " అది సైతానా బాబు " అన్న మాటలు చెవి పక్కగా వినిపించడం తో ఉలిక్కిపడి వెనక్కి తిరిగా . నా వెనక వైట్ అండ్ వైట్ లో కాలర్ బటన్ కూడా పెట్టుకుని టక్ చేసుకుని నిల్చున ఒక 50 ఏళ్ళ శాల్తీ కనిపించాడు.(బహుసా తన సెల్ రిపేర్ కి ఇచ్చి ఉంటాడు) ... "అంటే అది దయ్యం మాష్టారు" అన్నాను. "దయ్యానికి ఆకారం ఉండదు బాబు . అది సైతాన్ బానిస ... అది ఎవరికి అయినా పట్టాలి కానీ ,దానికి అంటూ ఆకారం ఉండదు .. ఈ సినిమా అంతా డూపు " అన్నాడు . ఓహో అని మళ్లీ సినిమా చూడడం లో మునిగిపోయ్యా . కాసేపు ఆగి మళ్లీ " నేను చాలా దయ్యాలని తరిమా తెల్సా" అన్నాడు. ఇదేదో మనకి పనికొచ్చే అంశంలా ఉంది అనుకంటూ సినిమా పాజ్ లో పెట్టి చైర్ ని గిర్రున 180 డిగ్రీలకి తిప్పా . ( అంటే వెనక్కి తిరిగా). ఇక మా మధ్య సంభాషణ ....
నేను : నిజ్జంగా దయ్యాలని మీరు చూశారా ?
దయ్యాలాయన : చూడడానికి అవి కనిపించవు బాబు ఎవరి ఒంట్లో అయినా ఆవహిస్తే .. వాళ్ళని అదుపులో ఉంచుకుని తిప్పలు పెట్టద్ది"
నేను : ఓహో అవునా!
దయ్యాలాయన : అవును . అప్పుడు నేను వెళ్లి ప్రార్ధన చేస్తా ... అప్పుడు దయ్యం వదిలిపోయిద్ది ... కాస్త పవర్ఫుల్ దయ్యం అయితే నేను పిడికిలి తెరిస్తే గానీ పోదు ..
నేను : అదేంటి పిడికిలి??????????
దయ్యాలాయన : అంటే నేను సాధారణంగా చెయ్యి విప్పను నేను గనక పిడికిలి ....విప్పితే ఎలాంటి సైతాన్ అయినా పారిపోవాల్సిందే.
నేను : ఓహో .. అదేలెండి. ..........సరేగానీ ఈ సారి మీరు .. దయ్యాన్ని వదల గొట్టేటప్పుడు నన్ను కూడా తీసుకు పోతారా ?
దయ్యాలాయన : అది .. నేను ఇప్పుడు చెయ్యడం లా .... నీ వయసులో ఉండగా ప్రార్ధనలు చేసే వాడిని ..... అప్పుడు దయ్యం వదిలిపోయినా వాళ్ళు డబ్బులు ఇవ్వడం లేదు .. అందుకని మానేశా ఇప్పుడు నా పవర్ పోయింది .
నేను : ఓహో .. అసలు దయ్యాలు ఎలా తయారవుతాయట?
దయ్యాలాయన : అదా .. జనరల్ గా పరలోకము నుండి ప్రభువు పిలిస్తే ... సహజం గా మరణిస్తే అక్కడికి వెళ్తారు .. కానీ ఎదవ వేషాలు వేసి .. యాక్సిడెంట్ లలో మరణించిన వారు .. అక్కడికి వెళ్లేసరికి ప్రభువు తలుపు తెరవడు ... అక్కడ తలుపు మూసి ఉండేసరికి .. వెనక్కి వచ్చి ఇక్కడ తిరుగుతాయి ... అప్పుడు నాలాంటి పాస్టర్లు వాళ్ళని పరలోకానికి పంపాలి.
నేను : ఓహో అలాగా ..హ్మం
దయ్యాలాయన : అవును ... నేను ఎన్నో చోట్ల ప్రార్ధన చేశా .. నేను వెళ్ళిన చోట .. వేరే హిందువుల దేవుళ్ళ పటాలు ఉంటే తీసేస్తా ... వాళ్ళు ఆ పటాలు తీసేశాక ప్రార్ధన చేస్తా ..... "
అసలు టాపిక్ ఒక్కసారిగా ఇటు మళ్ళింది ఏంట్రా బాబు అనుకుని అసలేం చెబుతాడో విందాం అని .. "ఓహో ఎందుకలాగా " అన్నాను .. "ఏసు ప్రభువు ఒక్కడే దేవుడు .. మిగతా వాళ్ళు కాదు.. అసలు వాళ్ళు లేరు అంతా ఉత్తదే .. ....
ఈ విషయం నాకు ఒక దయ్యం చెప్పింది" అన్నాడు . "అబ్బో ... అదెలా "అన్నాను . " ఒక కాగితం మీద దేవుళ్ళ పేర్లు రాసి ఇస్తే అందరి పేర్లు కొట్టేసి ఏసు పేరు మీద టిక్కు పెట్టి ఇచ్చేది "అన్నాడు . " ఓహో ... దయ్యం ఇంకా ఏమేం చెప్పింది" అన్నాను ? " ఆ ఒక సారి సునామీ వచ్చిన రోజుల్లో రాజు పాలెం లో ఒక అమ్మాయికి ఒక దయ్యం పడితే వెళ్లాను ... అక్కడ ఆ ఇంట్లో ఉన్న హిందువుల దేవుళ్ళ పటాలు మొత్తం తీసేయమని ఆ పిల్ల అమ్మకి చెప్పాను ... ఆమె తీసేసింది. కాసేపటికి దయ్యం పట్టిన అమ్మాయి వంట్లోకి దత్తాత్రేయుడు వచ్చాడు .. ఎవరు నువ్వు అన్నాను ... నేను దత్తాత్రేయుడిని.... ఈ ఇంటామెని నువ్వు పటాలు తీసేయమని చెప్పావు .... అయిన తీసేయలేదు ఒక మూల ఒక దేవుడి పటం దాపెట్టింది అది నీకు చెబుదామని వచ్చాను అన్నాడు ... ఓహో సరే నువ్వు గొప్పా మా ఏసు గొప్పా అన్నాను .. ఏసే దేవుడు అని ఒప్పుకున్నాడు .. సరే ఇంక వెళ్ళు అన్నాను దత్తాత్రేయుడు వెళ్ళిపోయాడు ... నేను కూడా దయ్యం వదలగొట్టి వచ్చేసాను" అన్నాడు.
"ఓహో .. సరే గానీ మీరు ఇరవయ్యేళ్ళ కింద మానేశాను ఇప్పుడు పవర్ అంతా పోయింది అన్నారు కదా మరి ... సునామీ వచ్చింది ఈ మద్య కదా మరెలా పవర్ వచ్చింది?" అన్నాను
నీళ్ళు నములుతూ అదీ అదీ .. అని తడుముకునే లోపు ... అవును హిందూ దేవుళ్ళు అసలు లేరు అన్నారు కదా ...మరి దత్తాత్రేయుడు ఎలా వచ్చాడు ... అని అడిగాను .. ఓక్క నిముషం బాబు . ఏదో ఫోన్ వస్తుంది అని ఫోన్ చెవిలో పెట్టుకుని మాట్లాడుతూ బయటికి వెళ్లాడు . ఈ లోపు సర్వీస్ సెంటర్ కుర్రాడు బయటికి వచ్చి .. అన్నా ఇప్పుడు దాకా నువ్వు మాట్లాడే ఆయన ఫోన్ లో బ్యాటరీ వేయడం మర్చిపోయి ఉత్త ఫోన్ ఇచ్చాం .. ఆయన వస్తే ఇవ్వు అని బ్యాటరీ నా చేతిలో పెట్టి వెళ్ళాడు.