అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

7/30/10

రాముడు వాలిని చాటు నుండి చంపడం తప్పు

రాముడు వాలిని చాటు నుండి చంపడం తప్పు .... ప్రస్తుతం యువతరాన్ని అయోమయం లోకి గురి చేస్తున్న వాఖ్యం ఇదే. రామాయణం పై అనేక నీలి నీడలను ప్రసరింప చేస్తున్న అనేక వివాదాస్పద విషయాలలో ఇది కూడా ఒకటి. అయితే పూర్తి నిజాలు తెలుసు కున్న తర్వాత .. బుర్రతో కాకుండా బుద్ధితో ఆలోచించేవారికి రామయ్య ఏ ధర్మం ప్రకారం వాలిని సంహరించాడు అన్నది తెలుసుకునే అవకాశం ఉంటుంది.

వాలి, సుగ్రీవులు పోరాటం జరిపేటప్పుడు చాటు నుండి వాలి ని రామయ్య బాణం సంధించి కింద పడవేసిన తర్వాత .. కిందపడ్డ వాలి రామయ్య మీద అనేక ఆరోపణలు చేశాడు. వాటిని ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం వాలి ఇలా అన్నాడు " రామా అందరూ నీ గురించి నువ్వు చాల గొప్పవాడివి, ధర్మం తెలిసినవాడివి, పరాక్రమవంతుడివి అంటారు. అటువంటి నీతో కాకుండా ఇంకొకరితో నేను అటువైపుకి తిరిగి యుద్ధం చేస్తుంటే, ఇంత ధర్మాత్ముడివి అయిన నువ్వు చెట్టు చాటు నుంచి నా మీద బాణం వెయ్యడానికి సిగ్గుగా లేదా. కాని నీకు నాకు ఈ విషయాలలో తగాదా లేదు. నేను చెట్ల మీద ఉండే ఆకులని, పండ్లని తినే శాఖా మృగాన్ని. నువ్వు మనిషివి, ధర్మం అనే తొడుగు కప్పుకున్న మహా పాపాత్ముడివి. చేతిలో కోదండం పట్టుకొని కనపడ్డ ప్రతి ప్రాణిని హింసించే స్వభావం ఉన్నవాడివి. నీయందు కామము విపరీతంగా ఉంది, అందుచేతనే ఏ కారణం లేకుండా నన్ను కొట్టి చంపావు. నువ్వు నాకు ఎదురుగా వచ్చి నిలబడి యుద్ధం చేసినట్టయితే, ఆ యుద్ధంలో నేను నిన్ను యమసదనానికి పంపించి ఉండేవాడిని" అని ఆవేశం గా మాట్లాడుతాడు.

అప్పుడు రామయ్య ఇలా సమాధానం ఇస్తాడు

ధర్మం అర్థం చ కామం చ సమయం చ అపి లౌకికం |
అవిజ్ఞాయ కథం బాల్యాత్ మాం ఇహ అద్య విగర్హసే ||

" వాలీ , నీకు అసలు ధర్మార్ధకామ మోక్షాల గురించి తెలుసా ? నువ్వు అజ్ఞానివి. ఒక చిన్న బాలుడు ఎలా ప్రవర్తిస్తాడో నువ్వు అలా ప్రవర్తించేవాడివి, నువ్వు అజ్ఞానివి కావడం వలన నీకు తెలియకపోతే, ఆచారం తెలిసినవారిని, పెద్దలైనవారిని ఆశ్రయించి నువ్వు కనుక్కోవాలి. నువ్వు అవేమి తెలుసుకోకుండా నా గురించి అడుగుతున్నావు. ఇక్ష్వాకుల యొక్క రాజ్యంలోకి ఈ భాగం కూడా వస్తుంది. ఆ ఇక్ష్వాకు వంశంలో పుట్టిన భరతుడు ఇప్పుడు రాజ్యం చేస్తున్నాడు. ఇక్ష్వాకు వంశంవారు రాజ్యం చేస్తుండగా ధర్మాధర్మములు జెరిగిన చోట నిగ్రహించే అధికారం మాకు ఉంటుంది. నీకు కామం తప్ప వేరొకటి తెలియదు, అందుచేత నీకు ధర్మాధర్మ విచక్షణ చేసే అధికారం లేదు. జన్మనిచ్చిన తండ్రి, పెద్ద అన్నగారు, చదువు నేర్పిన గురువు, ఈ ముగ్గురూ తండ్రులతో సమానం. అలాగే తనకి జన్మించిన కుమారుడు, తోడబుట్టిన తమ్ముడు, తన దగ్గర విద్య నేర్చుకున్న శిష్యుడు, ఈ ముగ్గురూ కుమారులతో సమానము. నీ తండ్రి మరణించడం చేత, నువ్వు పెద్దవాడివి అవడం చేత నువ్వు తండ్రితో సమానము. నీ తమ్ముడు సుగ్రీవుడు, ఆయన భార్య అయిన రుమ నీకు కోడలితో సమానము. కాని సుగ్రీవుడు బతికి ఉన్నాడని తెలిసి, కోడలితో సమానమైన రుమని నువ్వు అనుభవించి, నీ భార్యగా కామ సుఖాలని పొందుతున్నావు ( వాలి బిలంలో ఉండిపోయినప్పుడు, వాలి మరణించాడు అనుకొని సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశారు. అప్పుడు సుగ్రీవుడు వాలి భార్య అయిన తారని తన భార్యగా అనుభవించాడు. మరి సుగ్రీవుడు చేసింది దోషం కాదా? ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, సంధ్యావందనం చేసే వానర జాతికి, రాజ్యపాలన చేసే వానర జాతికి, మంత్రులచేత సేవింపబడే వానర జాతికి కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ జాతిలోని స్త్రీలు తమ భర్త మరణిస్తే మరిదిని పునర్వివాహం చేసుకొని, వారితో ఉండచ్చు. ఆనాడు వాలి చనిపోయాడనుకొని తార సుగ్రీవుడిని వివాహమాడింది. కనుక సుగ్రీవుడితో ఆనాడు తార ఉండడం ధర్మం తప్పడం కాదు. కాని సుగ్రీవుడు బతికే ఉన్నాడని తెలిసి కూడా ఆయన భార్యతో కామ సుఖాలని అనుభవించడం వాలి యొక్క దోషం. ఈ నియమం కేవలం పైన చెప్పిన వానర జాతికి మాత్రమే, మనుష్యులకి కాదు. అలాగే వాలికి రెండు శక్తులు ఉన్నాయి. ఒకటి, ఇంద్రుడు ఇచ్చిన మాలని మెడలో వేసుకుంటే, వాలి అపారమైన ఉత్సాహంతో ఉంటాడు. రెండు, ఎవరన్నా వాలికి ఎదురుగా వెళితే, వాళ్ళ శక్తిలో సగం శక్తిని ఈయన లాగేసుకుంటాడు, ఇది బ్రహ్మగారు వాలికి ఇచ్చిన వరం) అందుచేత ఒక మామగారు కోడలితో కామభోగాన్ని అనుభవిస్తే ఎంత దోషమో, అంత దోషాన్ని నువ్వు చేశావు. ధర్మ శాస్త్రంలో దీనికి మరణశిక్ష తప్ప వేరొక శిక్ష లేదు. అందుకని నేను నిన్ను చంపవలసి వచ్చింది.

నన్ను చెట్టు చాటునుండి చంపావు, వేరొకడితో యుద్ధం చేస్తుంటే కొట్టావు, అది దోషం కాదా? అని నన్ను అడిగావు, దానికి నేను సమాధానం చెబుతాను విను.

న మే తత్ర మనస్తాపో న మన్యుః హరిపుంగవ |
వాగురాభిః చ పాశైః చ కూటైః చ వివిధైః నరాః ||

నేను మానవుడిని, నువ్వు వానరానివి. నేను మనిషిని, నువ్వు జంతువువి. క్షత్రియుడు, మాంసం తినేవాడు, ధర్మాన్ని నిలబెట్టవలసినవాడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే, తాను చాటున ఉండి కొట్టచ్చు, వల వేసి పట్టుకొని కొట్టచ్చు, పాశం వేసి పట్టుకొని కొట్టచ్చు, అది అప్రమత్తంగా ఉన్నప్పుడు కొట్టచ్చు, అది పడుకొని ఉన్నప్పుడు కొట్టచ్చు, నిలబడి ఉన్నప్పుడు కొట్టచ్చు, పారిపోతున్నప్పుడు కొట్టచ్చు, ఎప్పుడైనా కొట్టచ్చు, కాని ఆ మృగం వేరొక స్త్రీ మృగంతో సంగమిస్తున్నప్పుడు మాత్రం బాణ ప్రయోగం చెయ్యకూడదు. నువ్వు మైధున లక్షణంతో లేవు, అందుకని నిన్ను కొట్టాను. నేను నరుడిని కనుక మృగానివైన నిన్ను ఎలా కొట్టినా నాకు పాపం రాదని తెలిసి కొట్టాను. కాని నువ్వు చనిపోయేముందు రోషం కలిగి నన్ను ప్రశ్నించావు. నాయందు ఎటువంటి దోషము లేదు " అని రామచంద్రమూర్తి సమాధానమిచ్చారు.


కాబట్టి వానర జాతి ధర్మాన్ని తప్పి కోడలు వంటి రుమ ని బలవంతంగా అనుభవించడం వాలి తప్పు ...... అందుకు శిక్షకి అర్హుడు. మృగం అయిన వాలిని మానవుడు , క్షత్రియుడు అయిన రాముడు తనని శరణు కోరిన సుగ్రీవుని కోసం సంహరించడం అధర్మం కాదు ( పైగా వాలికి వరం కూడా ఉంది)

కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ వాలిని హీరో ని చేసి ... రామయ్య ధర్మం తప్పాడు అని ప్రచారం చేసి భావితరాలకి అసలు ధర్మమే తెలియకుండా చేయకండి.

నోట్ : నేను కూడా వాలిని రామయ్య చంపడం యెంత వరకు కరక్టు అనే ప్రశ్న లేపి పెద్దల చేత వివరణలు ఇప్పిద్దాం అనుకున్నాను కానీ గతం లో ఇలాంటి ఒక పోస్ట్ లో చర్చ పక్కదారి పట్టడం వల్ల ... నాకు తెల్సిన వివరణ నేను ఇచ్చాను .... పెద్దలు ఎవరైనా మరింత వివరణ ఇస్తే బాగుంటుంది :)

10 comments:

Anonymous said...

Dhanyavadamulu . bagaa chepparu

వెంకట్ said...

నేను ఇంతకు ముందు చెప్పినట్టు కొందరు తమ తమ ప్రిజుడీస్ ఆధారంగా వాదనలు చేస్తున్నారు.అలాంటి చర్చలు ఎప్పటికీ తెగవు, మరి కొందరు ఇంకో ముందడుగు వేసి వాలి సుగ్రీవుల మనస్తత్వ విశ్లేషణలు కూడ మొదలు పెట్టారు. వాలిని చెట్టు చాటు నుండి చంపినా, రాముడి చేతిలో చనిపోయినా ఇద్దరిలో ఎవరి గొప్ప దనానికి వచ్చిన నష్టం లేదు. రావణుడంతటి బలవంతుడిని తోకతో బంధించి సప్తసముద్రాలు తిప్పిన వీరుడు వాలి, అందుకే చనిపోయే ముందు రాముడితో అంటాడు నీకు సీత విషయం లో సహాయం కావాలనుకుంటే ఒక్క రోజు లో రావణుడి నుంది విడిపించే వాడిని అంటాడు. తండ్రి మాట నిలబెట్టడానికి రాజ్యాన్ని తృణప్రాయంగా వదిలి వేసిన వాడు రాముడు.
రాముడి తప్పొప్పులను ప్రశ్నించే ముందు, ప్రశ్నించడానికి మనకున్న అర్హత ఏమిటొ ఆలోచించాలి ఒక్క సారి. ఆ కాలం లో రాక్షసులు కూడా కొన్ని నీతి నియమాలను పాటించే వారు మనం కనీసం వాటినైనా ఇప్పుడు పాటించగలమా? అన్నింటి కంటే సులభమైన పని తప్పులెంచడం, ఆ పని చేయడానికి పెద్ద కష్ట పడాల్సిన అవసరం లేదు. కష్టమైన పని అప్పటి నీతి నియమాలలో ఒక్క శాతమైనా మనం ఆచరించి చూపడం.

Anonymous said...

తను తినలేని జంతువును వేటాడటం , ప్రాణులను హింసించిడం కిందికి వస్తుంది. మాజీ రాజైన వాడు ఆ పని చేయడం తప్పు. అన్నీ త్య్జించి వనవాసం చేస్తున్న మాజీలు తమను తాము రాజులుగా చెప్పుకోవడం ఆలోచించాల్సిన విషయం.

పైగా స్వేచ్చాజీవితం గడుపుతున్న ఓ అన్నివిధాలా మనిషికి దీటైన జాతి మీద తమకు 100% హక్కున్నట్టు చెప్పటం, వారిని జంతువులు అనడం తప్పే.

ఈ విషయాల మీద అశుద్ధం తినే పంది, గొడ్డు మాంసం తినే నరవానర జాతుల వాదాన్ని కూడా విందాం.

Anonymous said...

// మాంసం తినేవాడు, ధర్మాన్ని నిలబెట్టవలసినవాడు ఒక మృగాన్ని కొట్టవలసి వస్తే, తాను చాటున ఉండి కొట్టచ్చు //

త్రేతాయుగంలో ద్విపాదులకు, చతుష్పాదులకు ఒకే ధర్మాలు వర్తించేవా? తార విషయంలో మానవుల కట్టుబాట్లు జంతువులకు వుండకపోవడం అధర్మమవుతుందా, యువర్ ఆనర్? :)

Anonymous said...

For above anonymous:
ఒక వేళ క్ౄర జంతువు ఏదయినా ఉ్టే దానిని చంపేటప్పుడు అది మనం తినగలిగినదా లేదా అనే ప్రస్తావన దండగ.

Anonymous said...

apUDu adi champaTam kaadu, AtmarakshaNa kindaku vastundi, Anon.

Haribabu said...

నిజానికి వాలి కూడా అంతలా భరితెగించి విచ్చలవిడిగా రాజ్యపాలన చేయడంలో ఒక రహస్యం ఉంది. వాలి మెడలో ఉండే కంఠహారం యొక్క శక్తి. ఆ శక్తివలెనే ఎవరినైనా ఓడించగలుగుతున్నాడు. మరి ఆ శక్తి అంటే సుగ్రీవుడికి కూడా భయం. మరి అలాంటి సుగ్రీవుడు ఎవరి ద్వారా రక్షణ పొందాడు.వాలి బ్రతికి ఉన్నంతవరకూ సుగ్రీవుడు హనుమ లేకుండా హనుమకు దూరంగా ఉండలేదు. సూర్యదేవుని మాట ప్రకారం సుగ్రీవుడికి రక్షణగా ఉండమని చెబుతూ... సూర్యదేవుడు హనుమకు సువర్చస్సు (సువర్చాల అంటారు)అనే దివ్య కంఠహారంను బహుకరిస్తారు.ఆ సువర్చసు శ్రీరాముడు కంఠహారం గుర్తించినవారు వారే నీ ప్రభువులు హనుమా అంటూ దీవించి పంపిస్తారు..సూర్యదేవులు.
ఈ విషయం వాలికి బాగా ఎరుక.కారణం హనుమ యొక్క దివ్య కంఠహారం ముందు వాలి కంఠహారం కూడా తన శక్తిని కోల్పోతుంది. అందుకే సుగ్రీవుడు హనుమ రక్షణలో ఆ కిష్కిండ లో విహరించేవాడు. శ్రీరాముడు సుగ్రీవుడుతో స్నేహం చేసే ముందువరకూ సుగ్రీవుడుకు ఆ విధంగా రక్షణ ఉండేది.
ఇక శ్రీరాముడు చెట్టు చాటునుండి.. ఈ విషయం పరిశీలిద్దాం. శ్రీరాముడు ధర్మం ఎరిగిన వ్యక్తి.వాలి యొక్క కంఠహారం హనుమను ఏమీ చేయలేకపోవచ్చు. కానీ శ్రీరాముడు కు ఆ విధమైన శక్తి ఉన్నా లేకపోయినా శ్రీరాముడు ప్రతి ఒక్కరి నీ గౌరవించే వ్యక్తిత్వం వలన, శ్రీరాముడు వాలి కంఠహారంకు గౌరవసూచకంగా మర్యాద పూర్వకంగా చెట్టు చాటునుండి అస్త్రం సంధిస్తాడు. సందించిన మరుక్షణమే వాలికి ఎదురు నిలుస్తాడు.. యుద్ధం కొఱకు కాదు. అలానే వాలి కంఠహారం వ్యక్తుల శక్తిని క్షీణింప చేయగలదు గానీ అస్త్ర శస్త్రాలను క్షీణింప చేయలేదు. ఈ సంఘటన వలనే శ్రీరాముడు మర్యాద పురుషోత్తముడుగా కీర్తి పొందాడు.
ధర్మవర్తనులు సంధించే గడ్డిపరక అయినా బ్రహ్మ అస్త్రం అయి వెంటాడి వేటాడుతుంది.. అలానే ధర్మవర్తనులు సంధించే అస్త్రాలు కూడా ఏ మూలనుండి సంధించినా అవి గురి తప్పవు... వాటినుండి తప్పించుకోవడం అసాధ్యం.ఇలాంటి సంఘటనలు శ్రీరాముని ఆయనంలో ఎన్నో.. విశ్లేషిస్తే విలువలకు ఒక ఘని శ్రీరాముని ప్రయాణం.
నాకు తెలిసినంతలో
🙏

hari.S.babu said...
This comment has been removed by the author.
hari.S.babu said...

ఈ బ్లాగు యజమానికీ మాలిక నిర్వాహకులకూ సాటి బ్లాగర్లలూ ఒక విచిత్రమైన విషయాన్ని వెల్లడి చేస్తున్నాను.

ఇక్కడ ప్రచురితమైన రెండు కామెంట్లు వేరెవరో నా పేరును తాం ఐడీలో పెట్టి వేశారు.
1.
Haribabu said...
నిజానికి వాలి కూడా అంతలా భరితెగించి విచ్చలవిడిగా రాజ్యపాలన చేయడంలో ఒక రహస్యం ఉంది...శ్రీరాముని ప్రయాణం.
నాకు తెలిసినంతలో
🙏

June 2, 2023 at 5:48 PM
2.
Haribabu said...
నిజానికి వాలి కూడా అంతలా భరితెగించి విచ్చలవిడిగా రాజ్యపాలన చేయడంలో ఒక రహస్యం ఉంది...శ్రీరాముని ప్రయాణం.
నాకు తెలిసినంతలో
🙏

June 2, 2023 at 5:51 PM

పైన చూపించిన రెండు కామెంట్లనూ నేను వెయ్యలేదు.

జై శ్రీ రాం!

Anonymous said...

ఐతే ఓకే.