మరీ మరీ తిరిగి చూడమన్న ప్రసాద్ గాడి హెచ్చరికలతో వెనక్కి తిరిగిచూసా . ఆమె చటుక్కున తల తిప్పుకుంది కానీ ఆమె అప్పటిదాకా నన్నే చూస్తుంది అని గుర్తించేసా :D. ఇక ఆ రోజు రాత్రి నిద్రపోతే ఒట్టు. మరురోజు ఉదయాన్నే పూలరంగడులా రంగురంగుల చొక్కా వేసి తయారై సైకిలెక్కి బయల్దేరా. వాళ్ళ ఇంటి దగ్గరకొచ్చేసరికి ... అక్కడ ఆమె ఉంటుంది అని.. మేమిద్దరం చూసుకుంటాం అని .... ఎన్నెన్నో ఆశలతో వచ్చిన నాకు నిరాశే ఎదురైంది. వాళ్ళంతా వంటగదిలో బిజీగా ఉంది నా ఆవేశం మీద నీళ్ళు చల్లారు :(. కానీ అప్పటికే నేను మున్నిని ప్రేమించేశాను.. మున్ని కూడా నన్ను ప్రేమించేసి ఉంటుంది అని మెంటల్ గా ఫిక్స్ అవడంతో కొద్దిగా ముందుకెళ్ళి ఏదో మర్చిపోయినట్టు మళ్లీ వెనక్కి రావడం వంటి ప్లాన్లు వేసి మరీ నాలుగైదు రౌండ్లు బెల్లు కొట్టుకుంటూ తిరిగినా ఉపయోగం లేదు. అంతలో "సీనుగా రేయ్ " అని ఒక సుపరిచితమైన గొంతు నుండి వెలువడిన పొలికేక నా కర్ణేంద్రియాలకు బలంగా తాకడంతో ఉలిక్కిపడి వెనక్కి తిరిగిన నాకు పళ్ళికిలిస్తూ కనిపించాడు హైదరాబాద్ కృష్ణ. అంటే హైదరాబాద్ లొ చుట్టాలింట్లో ఒక వారం ఉండి వచ్చిన దగ్గర నుండి హైదరాబాదీ తెలంగాణా స్లాంగ్ లొ మాట్లాడేస్తూ మా దుంపతెంచుతుండడంతొ వాడికా పేరు పెట్టేశాం అనమాట.
"శీనూ" చాలా గారాబంగా పిలిచేశాడు కిట్టి గాడు. "ఈడెబ్బ ఈడేంటి తేడాగా ఉన్నాడు కొంపదీసి మన ఫిగర్ కి లైన్ వెయ్యడం లేదుకదా" అనుకుంటూ "ఎరా హైదర్ ( హైదరాబాద్ కృష్ణ కి షార్ట్ కట్) ఏంది సంగతి" అని అడిగా. "నాతో బాటు ఎస్.ఎస్. యెన్. కాలేజి వరకు రావా" అని అడిగాడు. హమ్ అసలే మన టర్కీ కనిపించడం లేదు కదా ఈలోపు టైం పాస్ అవుతుంది అనుకుని " మరిసైకిల్ నువ్వే తొక్కాలిరోయి" అన్నాను . పరమానందభరితుడై "అలాగే మామా నువ్వు రా చెబుతా" అని నా సైకిల్ సారధిగా మారి కాలేజీ కి తీసుకెళ్ళాడు. మెయిన్ గేట్ దగ్గర ఆపమని చెప్పి " నువ్వు తొందరగా లోనికి వెళ్లి పని చూసుకుని తొందరగా వచ్చేయరా నేను ఇక్కడనే ఉంటాను" అన్నాను. అంత కాడికి నిన్ను ఇక్కడదాకా తొక్కుకుని తేవడం ఎందుకురా" అన్నాడు. "మరెందుకు తెచ్చావ్ రా " కాస్త అనుమానంగా అడిగా..... "అనన్యకి ఈ రోజు లెటర్ ఇవ్వబోతున్నా మామా" సిగ్గుపడుతూ చెప్పాడు. ఉలిక్కిపడి "అంత డేర్ చేశావేంటి రా ? " అన్నాను..సోనాలీ బెంద్రే పిన్ని కూతురు లా ఉండే అనన్య ని ఆదరాబదరా కట్టిన మట్టి గోడలా ఉండే కిట్టిగాడిని కంపేర్ చేస్తూ. "ఆలా అంటావేంటి మామా ...ఆ అమ్మాయే రా నాకు లవ్ లెటర్ రాసింది నీకు తెల్సుగా" అదోలా కళ్ళు మూసుకుని నవ్వుతూ . నాకేం తెలుసు.... అనబోతు అర్ధోక్తిలో ఆగిపోయా ..... వాడన్న మాట నిజమే. వాడికి అనన్య ఎఫెక్టు తగలడానికి కారణం నేనే! ఆ కధ తెల్సుకోవడానికి ఒక రెండు పేరాలు రెండు నెలల వెనక్కివెళ్లి వద్దాం. ...............
"మామా కిట్టి గాడికి బాగా ఎక్కువ అయింది రా" ... మేము రెగ్యులర్ గా కూర్చునే పిట్టగోడ మీద చేరగానే గురు అన్న మొదటి డైలాగ్ ఇది . "ఏం చేశాడురా" అన్నాడు రాజేష్. "ఈ గోడ మీద కూర్చుని అమ్మాయిల మీద వరస్ట్ కామెంట్స్ వేసిపోతున్నాడు ... ఆ ఎఫెక్ట్ మనకి పడేలా ఉంది"అన్నాడు గురు. "అరే టెన్త్ క్లాస్ అమ్మాయిలని కూడా వదలడం లేదురా" చాలా ఆవేశంగా కంప్లైంట్ చేశాడు గిరి. "దుప్పటేసి ఉతుకుదాం రా ఒకసారి ఎవడుకోట్టాడో తెలీకూడదు నాకొడుక్కి" ఆవేశపడ్డాడు ఆది . "ఆగండ్రా బాబు ఆడికి అంత అవసరం లేదు వాడిని ఏంటీవీ బకరా హాట్ సీట్ మీద కూర్చోబెట్టే టైం వచ్చింది " అన్నాను." ఏం చేద్దామంటావ్?" అన్నాడు గురు. "చెప్తా! ముందు ఒక పేపర్ తీసి నేను చెప్పినట్టు రాయి" అన్నాను. రాజేష్ గాడి పుస్తకం లోనుండి పుసుక్కున ఒక పేపర్ చినిగింది. "చెప్పురా" అన్నాడు గురు రాయడానికి సంసిద్ధం అవుతూ ... అప్పుడే తట్టిన ఐడియా ప్రభావం వల్ల ఒక చిటికేసి సీనియర్ లాయర్ టైప్ లొ ఒక లెటర్ డ్రాఫ్ట్ చేయించా....:). లెటర్ రాయడం పూర్తి అయింది. "రేపు ఎవరైనా ఆవెనక చెట్టు మీద కూర్చుని సరిగ్గా ఏదో ఒక కాలేజి బస్సు వచ్చేటప్పుడు ఈ లెటర్ వాడి ముందు పడాలి వాడికి అనుమానం రాకుండా ఎలా చేస్తారో మీ ఇష్టం ... ముఖ్యంగా ఈ తింగరి రాజేష్ గాడు అక్కడ లేకుండా చూడండి" అని చెప్పా. టోటల్ గ్యాంగ్ మొత్తం కలిసి ప్రణాళిక రచించారు.
మరుసటి రోజు కావాలనే కాస్త లేటుగా వెళ్ళా ... వెళ్ళేటప్పటికి అక్కడ మొత్తం కోలాహలంగా ఉంది . "మామా మామా ఇటురా ఇటురా" అని ఆత్రంగా చెయ్యి పట్టుకుని లాక్కుపోయాడు కిట్టిగాడు. "ఏందిరా నీగోల" అసహనంగా అనడానికి ట్రై చేశాను. "అబ్బా విసుక్కోకు మామా ఇది చదువ్" అని ఒక లెటర్ తీసి చేతిలో పెట్టాడు. మనోళ్ళు ప్లాన్ అమలు పరిచారన్న మాట అనుకుంటూ లెటర్ తీసి చదివా అందులో " డియర్ కృష్ణ , మీరు చాలా అందంగా ఉంటారు" అన్న వాఖ్యం చదివి వాడి వైపు చూసా ... "ఇంకా చదువు ఇంకా చదువు" అన్నాడు కిట్టిగాడు అపుకోలేని ఉత్సాహం ఆపుకోడానికి యత్నిస్తూ.... మళ్లీ మొదటి నుండి చదివా " డియర్ కృష్ణ , మీరు చాలా అందంగా ఉంటారు ముఖ్యంగా మీరు కళ్ళు మూసి నవ్వేటప్పుడు ఇంకా అందంగా ఉంటారు " అనే వాఖ్యం చదివి గిరుక్కున తల తిప్పి చూసా ... కళ్ళు మూసి నవ్వుతున్నాడు. "ఛి నీఎంకమ్మ" అనుకుని మళ్లీ లెటర్ చదవడం మొదలెట్టా " నేను రోజు బస్సు లోనుండి మిమల్నే చూస్తాను కానీ మీరు నన్ను కాకుండా అందరికీ లైన్ వేస్తున్నారు ... ఆలా చేయొద్దు ఇక నుండి నన్నే చూడాలి ప్రేమతో నీ ప్రియురాలు" చదవడం ముగించా. "ఎవరు రాశారురా ?" కాస్త పెద్దరికం జోడిస్తూ నడుము మీద చేతులు పెట్టుకుని అడిగా. "తెలీదు మామా ఎస్.ఎస్.యెన్ బస్సు లోనుండి ఇది వచ్చి నా మీద పడింది" అన్నాడు. "అవున్రా నన్ను తప్ప ఇంకెవరినీ చూడవద్దు అన్నది కదా ఇకనుండి జాగర్త " అన్నాను. "అసలు ఆ పిల్ల ఎవరో తెలిస్తే కద మామా .... నన్నే చూడు అంటుంది అసలామె ఎవరో తెలిస్తే కాదా ఆమెనే చూసేది" ఆందోళనగా అన్నాడు కృష్ణ. "అందుకు నా దగ్గర ఐడియా ఉంది మామా ... ముందు మన గాలి నాయాల్ల పక్కన కూర్చోడం మానేయి ... ప్లేస్ మార్చు ... వేరే ఏరియా చూసుకో ... నీకు వర్క్ ఔట్ అయిపోద్ది "అని ఒక ఉచిత సలహా పారేశా .... అప్పుడు కళ్ళు మూసి నవ్వుతూ వెళ్ళి బస్సులెమ్మట తిరగడం మొదలెట్టిన కిట్టిగాడు .. ఇదిగో ఇప్పుడు లెటర్ రాసింది రాం నగర్ లొ ఉండే అనన్య అని ఫిక్స్ అయ్యి వచ్చాడు ... (ఇక ప్రస్తుతానికి వద్దాము.)
"ఆ లెటర్ రాసింది అనన్య అని ఎలా ఫిక్స్ అయ్యావ్ రా?" అని అడిగా . "ఆ రోజు నుండి ఆ బస్సు వెనకే ఫాలో అయ్యాను మామా చాల రోజులు ... బస్సు దిగిన అందరు అమ్మాయిలు మామూలుగా వెళ్ళిపోయేవారు కానీ ఒకరోజు ఈ అమ్మాయి ఇంట్లోకి వెళ్లి మళ్లీ గేటు దాకా వచ్చి వెళ్ళింది రా " అన్నాడు . "గేటు వెయ్యడం మర్చిపోయిందేమో రా అందుకే వచ్చి ఉంటుంది " అన్నా .. "కాదు మామా నాకోసమే వచ్చింది రా "అని వాదించడం మొదలు పెట్టాడు. "సరే ఇపుడు ఎం చేద్దాం అంటావ్ "అన్నాను "నువ్ కూడా తోడు వస్తే లెటర్ ఇస్తా నేను కూడా" అన్నాడు . "సరే అలాగే ఎడువ్ కానీ ఆరోజు ఆ లెటర్ ఆమె రాసి ఉండకపోతే ?" అన్నాను . "అందుకే ఆసంగతి ఇందులో రాయలేదు" మామా తెలివిగా రాశా కదా అన్నట్టు కళ్ళెగరేస్తూ అన్నాడు కిట్టి గాడు. "సరే ఇచ్చి రా.... నేనుకూడా వస్తే అప్పుడే పబ్లిసిటీ మొదలెట్టాడా అని నీమీద బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది.. ఏదన్న తేడా జరిగితే నేను వచ్చి నిను సేవ్ చేస్తా అన్నాను. యే మూడ లొ ఉన్నాడో గానీ ఒప్పుకున్నాడు. " పాస్ బెల్లు కొట్టినప్పుడు పోయి ఇచ్చివస్తా "అన్నాడు. "నీ ఎంకమ్మ థూ నీ ఎలిమెంటరీ బుద్ది తగలడా .. 11.20 -11.30 లీషర్ టైం అప్పుడు బయటికి వస్తారు పోయి ఇచ్చిరా" అన్నాను. బిక్క మొహం వేసుకుని నిల్చున్నాడు
అనన్య బయటికి వచ్చింది . "రేయి పదినిముషాలే ఉంది పోయి ఇచ్చి రా నీకెందుకు నేను ఉన్నా" అని చెప్పి తోసా . వాడు బయల్దేరగానే గోడ వెనక నక్కి చూడడం మొదలెట్టా .... అనన్య ఉన్న ప్లేస్ కి మాకు ఒక వంద అడుగుల దూరం ఉంటుంది. అక్కడ జరిగేది స్ప్రష్టం గానే కనిపిస్తుంది. వీడు వెళ్లాడు ..లెటర్ ఇచ్చాడు.. ఆమె చదివింది .. అటు ఇటు చూసింది .. వాళ్ళ ఫ్రెండ్ ని ఏదో అడిగింది ..ఆమె పెన్ను తెచ్చి ఇచ్చింది .. ఇదే లెటర్ మీద ఏదో రాసి ఇచ్చింది.. మనోడు మొహం వేలాడేసుకుని వచ్చాడు. "ఏమైందిరా ?"అన్నాను.. లెటర్ చేతికి ఇచ్చాడు. లెటర్ మీద రెడ్ ఇంకు తొ REJECTED అని రాసి ఉంది. రెడ్ ఇంకు పెన్ లేకపోతే ఫ్రెండ్ ని అడిగితీసు కుని మరీ రాసిందిరా.... అంటూ వేణుమాధవ్ ఎక్సప్రెషన్ ఇచ్చాడు కిట్టిగాడు. ఆ రోజు అర్ధరాత్రి దాకా మా బ్యాచ్ మొత్తం కిట్టిగాడి కామెడీ మే చెప్పుకుని చెప్పుకుని మరీ నవ్వుకున్నాం అని వేరే చెప్పాలా?????
(ఇంకా ఉంది)
లేత మనసులు - 1
లేత మనసులు - 2