అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

4/26/10

వెండి సామాన్లు - రాకెట్ పెట్రోలు

స్కూల్ లో చదువుకునే రోజుల్లో రాజేష్ ని అందరూ అడ్డదిడ్డంగా ఆడుకునేవారు ముఖ్యంగా ఐదో క్లాసులో ఉనప్పుడు మా క్లాస్ లో పొడుగ్గా ఉండే గంగ భవాని అయితే రాజేష్ చదువు బాగా రావాలంటే అరిటాకులు నమలాలి తెల్సా నేను ఒక ఆకు తినగానే లెసన్ మొత్తం చదవకుండానే వచ్చేసింది అని చెప్పగానే పాపం వీడు ఆకు తిని నోరంతా జిల పుడుతుంది అని గోల చేస్తుంటే స్కూల్ కి దగ్గరలోనే ఉన్న త్రివేణి వాళ్ళ ఇంటి నుండి వేడి వేడి పాలు తాగించడం నాకింకా గుర్తు. వాడికి చుట్టూ పక్కల ఎక్కడైనా నేను ఉంటే ఇతరుల బారి నుండి రక్షించే వాడిని నేను లేకుంటే అ బాధ్యత ఫరూక్ తీసుకునే వాడు.

ఆ రోజుల్లో మాది అడ్డు అదుపు లేని బ్యాచ్ కావడంతో పదేళ్ళకే ఊరంతా చుట్టి వచ్చేవాళ్ళం కొబ్బరి ఆకులు సన్నగా కట్ చేసి కొసకి పొడుగాటి తాడు కట్టి దూరంగా ఉంది కొబ్బరి ఆకుని పాములాగా కదిలించి చాలా మందిని బెంబేలెత్తించిన ఘనమైన చరిత్ర 1990- 1994 మద్య ఒంగోలు సత్యనారాయణ పురం కుర్రాళ్ళ సొంతం. అప్పట్లో పిన్నీసులు తీసుకుని రైల్ వచ్చే ముందు పట్టాల మీద పెట్టి రైల్ వెళ్ళిపోయాక అది కాస్త పొడుగ్గా అవడం చూసి ఏదో సాధించేసిన మా ఫీలింగ్ చూసి తనకి కూడా ఏదన్నా సాధించాలని కోరిక పుట్టిన రాజేష్ కి ఒక భయంకరమైన ఐడియా వచ్చింది కానీ దేవుడి దయ వల్ల అది వెంటనే అమలు చేయకుండా మా బ్యాచ్ లో నంబర్ వన్ ఎదవ అయిన విక్టర్ దగ్గరకి వచ్చి "విక్కి నేను కూడా పట్టాల మీద పడుకుంటే రైల్ వచ్చి పొడుగ్గా చేసిద్డా" అని అడిగాడు. అసలే ఎదవ విక్టర్ గాడు వాడికి రాజేష్ దొరికాడు" రైల్ కన్నా నేను ఎక్కితే ఇంకా పొడుగ్గా చేస్తా" అని వాడి భుజాల మీద ఎక్కి ఇంటి దాక మోయించాడు. ఇలా రాజేష్ ని అందరూ పలు పలు విధాలుగా ఆడుకుంటున్నారు.

అందరూ తనని ఫూల్ చేస్తున్నారు అని బలంగా తెలుసుకున్న రాజేష్ ఏదైనా చేసి వీళ్ళ నోరు మూయించాలి ఘాట్టిగా డిసైడ్ అయ్యాడు. తెలుగు సినిమాల ప్రభావంతో ఏదైనా చేసి బాగా పేరు డబ్బు సంపాదించి అందరి ముందు నోట్లో సిగార్ పెట్టుకుని కార్ లో దిగి అదేదో సినిమాలో సుమన్ లాగ డైలాగ్ చెప్పాలనే తన బలమైన కోరిక ఫరూక్ దగ్గర బయట పెట్టాడు. అది 1994 .......... రాజేష్ కి ఫరూక్ భయంకరమైన ఐడియా చెప్పిన సంవత్సరం మీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ పాత వెండి సామాను ఉంటే దాన్ని శ్రీ హరి కోటలో వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి కొంటారు అయితే ఆ వెండి సామాను 1941 కి ముందుది అయి ఉండాలి ఆ వెండి సామాను లో రాకెట్ కి వాడే పెట్రోలు ఉంటుంది ...... ఒక్క చిన్న చుక్కతో చంద్రుడి మీదకి వెళ్లి రావచ్చు అందుకే దానికి అంత డిమాండ్ అని చెప్పేశాడు.

అంత గొప్ప సీక్రెట్ తెల్సుకున్న రాజేష్ ... ఫరూక్ దగ్గర ఆ సీక్రెట్ మరి ఇంకెవరికీ చెప్పకూడదు అని ఒట్టు పెట్టించుకుని వెండి సామాను వేటలో పడ్డాడు. ఆఖరికి నన్ను కూడా అడిగాడు " మీ ఇంట్లో పాత వెండి సామాను ఉంటే నేను 25000 ఇచ్చి కొంటా..... నేను దాన్ని ఎంతకైనా అమ్ముకుంటా ... నేకు సంబంధం లేదు నీకు మాత్రం 25000 ఇస్తా .... విషయం బయటికి రాకూడదు గుర్తుంచుకో అని చెప్పి వెళ్ళిపోయాడు . ఏంట్రా వీడు ఇలా అడిగాడు అని ఫరూక్ ని అడిగితే అసలు విషయం చెప్పాడు. నవ్వుకుని వదిలేసాం . అయితే ....................... కొన్నాళ్ళకి ఒంగోల్లో అదొక ప్రభంజనం అయింది . ఎవరు చూసిన ఇంట్లో 1941 కి పూర్వం వెండి సామాను ఉంటే లక్ష రూపాయలు పెట్టి కొంటాం అని బ్యాచ్ లకి బ్యాచ్ లు తిరగడం మొదలు పెట్టారు. రౌడీ షీటర్లు చోటా మోటా నాయకులు అందరూ ఇదే పనిలో ఉన్నారు. ఎవరికీ చెప్పవద్దు అని ఫరూక్ కి చెప్పి వీడు మాత్రం దేశం మొత్తం చెప్పాడు. దాదాపు ఐదేళ్ల పాటు వెండి సామాను కోసం తిరిగిన రాజేష్ తర్వాత 10 మిలియన్ డాలర్స్ నోట్ దొరకడంతో దాన్ని ఇండియన్ కరెన్సీ లోకి మార్చేందుకు ప్రయత్నాలు మొదలెట్టాడు ఆ వివరాలు తర్వాతి టపాలో ................................

3 comments:

Anonymous said...

bagundandi meeru andaru Rajesh ni edipinchina vidhanam. Mee tapa lu chadive Rajesh ippudu em anukora papam.

శ్రీనివాస్ said...

ఖచ్చితంగా మీ కామెంటు చూశాక అనుకుంటాడెమో గాని ప్రస్తుతం ..... వాడే చాలా మందికి ఈమెయిలు లో ఫార్వర్డ్ చేస్తాడు :)

సుభద్ర said...

chalaa chalaa baagundi...mukyamgaa silver vetaa!!paapam nijam cheppEyandi...