అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

4/30/10

సమానత్వం పేరుతో ఎటు వెళ్తున్నాం మనం ????

లేచింది నిద్ర లేచింది మహిళా లోకం దద్దరిల్లింది పురుష ప్రపంచం లేచింది నిద్ర లేచింది మహిళా లోకం అంటూ అన్న ఎన్టీవోడు పాడుతూ ఉంటే........ పాపం అంతకు ముందు వీళ్ళు కూర్చుని ఉండేవారు కాబోలు అనుకునే వాడిని చిన్నతనం లో. అయితే స్త్రీలు పురుషులతో సమానం అని చెప్పి అన్ని రంగాలలో ముందంజ వేయడం చివరికి అంతరిక్షానికి సైతం వెళ్లి రావడం స్త్రీ జాతికి గర్వ కారణం. అయితే ప్రతి మనిషికి తన జీవిత లక్ష్యానికి ప్రయాణం ప్రారంభించినప్పుడు కళ్ళ ముందు రెండు దారులు ఉంటాయి . వాటిలో ఒకటి ఒకటి అభివృద్ధి పధం లో మంచి అలవాట్లతో తను అనుకుంది సాధించి నలుగురి మన్నన పొందడం , నలుగురికి ఉపయోగపడే పనులు చేయడం వగైరా వగైరా . మరి రెండవది .. సప్తవ్యసనాలకు బానిస అవడం , జులాయిగా తిరగడం , జీవితం లో ఒక లక్ష్యం , ఒక ఆశయం అంటూ లేకుండా కేవలం సెక్స్ , మద్యం రౌడీఇజం మొదలైన పతనానికి హేతువుల బారిన ( దుర్గేశ్వర గారి భాషలో కలి ప్రభావానికి లోనయి) పడి... సుఖరోగాలతో , అందరి చేత చీ కొట్టించుకుంటూ రక్తకన్నీరు నాగభూషణం టైపు లోకి వెళ్లడం.

మొదటి దశలో సమానత్వం వైపు స్త్రీలు ఎప్పుడో ఎప్పుడో అడుగులు వేశారు . దేశ ప్రధానులు అయ్యారు , నోబుల్ గ్రహీతలు అయ్యారు ఇంకా మరెన్నో సాధించారు . ఆడవారికే కాక మగవారికి సైతం ఆదర్శప్రాయులయ్యారు . మానవతా వాదులకు ఆనందం కలిగించే విషయం ఇది.

అయితే వచ్చిన చిక్కల్లా........... మనిషి పతనమయ్యే రెండో మార్గం లో ఇంతవరకు మగాళ్ళ దే పై చేయి ..... మద్యపానం వల్ల ధూమపానం వల్ల వారు పతనం అవడమే కాక భావితరాలకి కూడా అనారోగ్య లక్షణాలు అందిస్తున్నారు కొందరు ... ఇటువంటి పరిస్థితిలో స్త్రీలు సైతం మద్యపానం , దూమపానం మొదలెట్టి ఈ దరిద్రాన్ని మరింత పెంచారు. పైగా సమానత్వం పేరుతో విచ్చలవిడి వ్యవాహారాలకి కూడా మహిళలకి కూడా అవకాశాలు ఉండాలి అని వాదించే వాదనల వల్ల కొత్త చిక్కులు వచ్చే ప్రమాదం ఉంది.

మనం ఈ విషయాన్ని గురించి మాట్లాడుకోవడానికి భయపడి మనకెందుకు వచ్చిన రచ్చ అనుకుంటాం గానీ మాట్లాడి తీరాలండీ .......... ఆడాళ్ళకి వ్యభిచారం చేసే హక్కులు ఎంటండి నా బొంద. ఆడాళ్ళకి కూడా వ్యభిచారం చేసే హక్కు కల్పిస్తూ వ్యభిచారం చట్టబద్దం చేయాలట . ఇదెక్కడి గొడవ సుఖ రోగాలు కొని తెచ్చుకోవడానికి హక్కా????? ఇప్పటికే మాములుగా దొరికిన అమ్మాయి బతకడమే కష్టం.... ఇక విటురాలి ( కొత్త పదం) హోదాలో వెళ్ళిన అమ్మాయి బ్రతికిరావడమే ??? ఏంటో స్త్రీ పురుషుల సమాన హక్కులు కోసం మాట్లాడే వాళ్ళు ఇలాంటి విషయాల మీద కాన్సంట్రేట్ చేయడం ........ స్త్రీలు విచ్చలవిడి శృంగారం కోరుకుంటున్నారు అనే భావన జనాల్లో పాతుకు పోవడానికి దోహదపడుతుంది.

మనం ముందు అనుకున్నట్టు మనషి ఎంచుకోవాల్సిన మొదటి మార్గం లో స్త్రీ పురుషులు పోటీపడి భావితరాలకి ఆదర్శప్రాయులు అవ్వాల్సిన ఆవశ్యకత ఎంతైన ఉంది . అంతే గాని మద్యపాన , వ్యభిచార వ్యవహారాలతో పురుషులతో పోటీ పడే అవకాశాలు కావాలి అని కొందరు దాంభికాలు పలికితే ప్రస్తుతం ఇప్పుడిప్పుడే బ్లాగులు, పత్రికలూ చదవడానికి ఉద్యుక్తులవతున్న పసి మనస్సులో చెడు బీజాలు పడే ప్రమాదం ఉంది.

కనుక మాట్లాడండి ........... సరైన సమానత్వాన్ని చాటండి

4/29/10

ఈ రోజు ఏంటో మీకు తెల్సా?

సూటిగా సుత్తిలేకుండా చెబుతా ............... ఈ రోజు శ్రీకాకుళం అన్నాయి మార్తాండ పుట్టిన రోజు ..... అందరూ శుభాకాంక్షలు తెలపండి ....................చాక్లెట్లు కావాలంటే శ్రీకాకుళం వెళ్ళండి.

జన్మదిన శుభాకాంక్షలు ప్రవీణు, ముందు ముందు మంచి మంచి కధలు కవితలు రాసి బ్లాగర్లని అలరించాలని కోరుకుంటుండా......

4/28/10

వ్యభిచారం - చట్టబద్ధం - పరిణామాలు

మద్యం, జూదం , వ్యభిచారం .. మనిషి చాలా త్వరగా ఆకర్షించబడి చివరికి పతనమయ్యే కొన్ని అలవాట్లలో ఇవి ప్రధానమైనవి. నాకు చరిత్రలు తెలియావ్ గానీ నా చిన్న తనంలో ఎవరైనా మద్యం సేవించే వారిని ఒక విలన్ లాగా చూసే వారు మా ఏరియా లో..... మరి ఇప్పుడో ఇంటికి ఇద్దరు తాగుబోతులు ఉన్నారు ( ఎవరి మనోభావాలు అయినా గాయపడితే క్షంతవ్యుడిని) మహిళలలో సైతం మద్యం సేవిస్తున్నారు . గుట్టు చప్పుడు కాకుండా రెండు పెగ్గులు తాగి నక్కి నక్కి గుంటనక్కలా ఇంటికి పోయేవాడు ఒకడైతే మూడో పెగ్గు దాటి పులి లాగా వాడెంత , వాడెంత వీడెంత అని అరచి నానా రచ్చ చేసేవాడు ఇంకొకడు. ఈ రెండు స్టేజీలు దాటిన తర్వాత ఇంకొక స్టేజి ఉంటది..... అదే పంది దశ అంటారు ... అంటే యెంత తాగారో తెలీనంత తాగి రోడ్డు పక్కన కాలువలలో పంది లాగ పొరలె స్టేజి. గ్రామ గ్రామాన వెలసిన బెల్టు షాపులు , వీది వీధిన తాగి తిరిగే మందుబాబులు ఎక్కువ అయ్యారు ఎందుకు మన దగ్గర మద్యపానం చట్టబద్ధం అవడం వల్ల . కేవల ప్రబుత్వం తాగమంది ఆ ఒక్క మాట చాలు మిగతా నిభందనలు తుంగలో తోక్కేయోచ్చు .. ఎక్సైజు శాఖ వారికీ మామూలు ఇస్తే చాలు. మధ్యపాన నిషేధం ఉన్న రోజుల్లో రోడ్డు మీద తాగి తిరిగిన దాఖలాలు బాగా తగ్గాయి . ఎప్పుడైతే నిషేధం ఎత్త్ఘేశారో అడ్డు అదుపు లేకుండా పోయింది. ఎందుకంటే మన మనస్తత్వాలు అలాంటివి కనుక. ఇక పోతే జూదం విషయానికి వస్తే ప్రస్తుతం ఎక్కడైనా పేకాట ఆడుతున్నారు అనే సమాచారం వచ్చి పోలీసులు రైడ్ చేస్తే ఎటు వాళ్ళు అటు పరిగెత్తి పంచెలు ఎగ్గట్టి గోడలు దూకి పారిపొయి , ఎందుకొచ్చిన గొడవరా నాయనా నానా హైరానా పడి చివరకి పేకాట మానేశారు కొన్ని గ్రామాల్లో. ఉదాహరణ ప్రకాశం జిల్లా చెరువు కొమ్ము పాలెం, త్రోవగుంట, దశరాజుపల్లి వగైరా వగైరా . పోలీసులు వచ్చి కొడుతుంటే చాల చిన్న తనంగా ఉంది శీను అందుకే మద్యాహ్నం పేకాట మానేసి పని చేసుకుంటున్నా చాలా డబ్బులు సంపాదించా అని మా రెగ్యులర్ బార్బర్ కొండలు ఈ మద్య చెబుతున్నాడు. అన్ని ఏరియాలలో ఇది వర్క్ ఔట్ అవక పోయినా కాస్తంత ఉపశమనం కలిగించే విషయం.

ఇక అలాగే వ్యభిచారం విషయానికి వస్తే ప్రస్తుతం రెడ్ లైట్ ఎరియాలలో వేశ్యా గృహలకి నక్కి నక్కి పోతున్నారు చాలా మంది వరకు ... వచ్చిన చిక్కంతా హైటెక్ వ్యభిచారం వచ్చిన తర్వాతే .. నివాస గృహాల మద్య ఖరీదైన మనుషుల్లా తిరుగుతూ గుట్టు చప్పుడు కాకుండా వ్యభిచారం చేయడం వారికి రాజకీయ నాయకుల అండదండలు ఉండడం వల్ల వ్యభిచారం అనేది ఊరి బయట నుండి ఊరి మధ్యకి ఎప్పుడో వచ్చేసింది. కాకపొతే టీవీ కెమేరాలకి పరువుకి కొండొకచో పెళ్లాల భయానికి కొందరు మానేసిన మాట వాస్తవం. అయితే చట్టబద్ధం చేయడం వలన చాలామందికి రెక్కలు వస్తాయి . ఎలా అయితే మద్యం వ్యాపారి ఈనాడు అత్యున్నత దేవాలయ పదవి అలంకరించాడో .... చట్టబద్దం అయిన తర్వాత చట్టబద్ధమైన వ్యభిచార గృహాలు మన నేతలు నడపడం మొదలెట్టి రాష్ట్రం లో అత్యధిక ఆదాయం గల వ్యభిచార గృహ నిర్వహాహక నేత ఏదో ఒక పవిత్రమైన పదవి అధిస్టించే ప్రమాదం లేకపోలేదు. ఒకప్పుడు ఒంగోలు పట్టణం లో రామ్ నగర్ రైల్వే ట్రాక్ ప్రాంతం రెడ్ లైట్ ఏరియా గా బాగా ప్రాచుర్యం లో ఉంది. అయితే పోలీసులు దాడులు చేసి పట్టుకుని కోర్టులో వారు 25 ర్తూపాయలు ఫైన్ కట్టి మళ్లీ అదే పని చేయడం ఇలా జరుగుతూ ఉండేది . చివరికి ఒక బ్రహ్మాండమైన ఐడియాతో పోలీసులు వారి ఆట కట్టించారు. ఆ గృహాలు వెళ్ళే దారులన్నీటి లోనూ మఫ్టీ లో ఉన్న పోలీసులు దాగి అక్కడికి వెళ్లి వచ్చే ప్రతి ఒక్కడిని పట్టుకుని స్టేషన్ లో పెట్టడం మొదలెట్టారు. దీంతో అటు వెళితే పోలీసులకు పట్టు బడడం ఖాయం అనే భయంతో కొన్నాళ్ళ తర్వాతా ఆ రెడ్ లైట్ ఏరియాకి ఎవరూ వెళ్లకపోగా నిర్వాహకులు సైతం వేరే వ్యాపారాలో నిమగ్నమై అ వృత్తి మానేశారు . అయితే ఇదంతా జరగడానికి పదేళ్ళకి పైగా పట్టింది. ప్రస్తుతం వ్యభిచారం చేస్తే పోలీసులో , టీవీ వాల్లో పట్టుకుంటే పరువుపోతుంది అనే భయం వల్ల జనాల్లో చాలా మంది వ్యభిచారం జోలికి పోవడం లేదు. అదే చట్టబద్దం చేస్తే భయపడే వాడేవడు. అంతంతమాత్రంగా ఉన్న కాపురాలు సైతం కల్లోలం అవుతాయి. ప్రస్తుతం యువతకి సహనం తగ్గింది. ప్రతి చిన్న గొడవ చిలికి చిలికి గాలివాన అవుతుంది. ముఖ్యంగా భార్య భర్తల మద్య . సరిగ్గా అదే సమయం లో " వంటకని వైఫెందుకురా హోటళ్ళు చాలు , వంటికని ఒకటా రెండా అంగడి అందాలు " అనే లైన్లతో వినడానికి చక్కగా ఉండే పాటలు ఉత్సాహపరుస్తుంటే , శనగలు తిని చెయ్యి కడుక్కునే వారు ఎక్కువ అవుతారు. ప్రస్తుతం వ్యభిచార గృహం గుట్టు చప్పుడు కాకుండా నిర్వహించే బడా బడా నేతలు ఈ వ్యాపారం లోడైరక్టు దిగుతారు. ట్రాఫికింగ్ అప్పుడు ఇంకా ఎక్కువ అవుతుంది . వ్యాపార అభివృద్ధికి అందంగా ఉండే అమ్మాయిల కిడ్నాప్ లు ఎక్కువ అవుతాయి. వాళ్ళని మాదక ద్రవ్యాలకి బానిసల్ని చేసి వారితో వ్యాపారం చేస్తారు. నిబంధనలు అన్నీ తుంగలో తొక్కుతారు. ఆ ఊహే భయంకరంగా ఉంటుంది . ఇప్పుడు గ్రామాల్లో తిరునాళ్ళలో నగ్న నృత్యాలు చేస్తున్నారు అదీ పోలీసుల భయంతో కొన్ని చోట్ల మానేశారు . ముందు ముందు వ్యభిచారం చట్టబద్ధం అయితే ఇవన్నీ శృతి మించుతాయి. అశ్లీల నృత్యాలు చేసేటపుడు పోలీసులు వస్తే ఇక్కడ జరిగేది నృత్యాలు కాదు వ్యభిచారం చేస్తున్నాం అని చెబుతారు. పోలీసులు ఏమి చేయగలరు . ఒక కామెడీ ఉదాహరణ : పలాన గ్రామంలో వ్యభిచారం చేయడానికి డి.ఎస్.పి కి పర్మిషన్ లెటర్ పెడితే ఎంత చండాలంగా ఉంటుంది .

నోట్ : దేశం లో రేపుల సంఖ్య తగ్గించడానికి వ్యభిచారం చట్టబద్దం చేయడం ... ఎలుకలున్నాయని ఇళ్ళు తగలబెట్టడంతో సమానం అని నా అభిప్రాయం. మరి మీరేమంటారు .


4/27/10

విశ్వనేత్ర అంధుల పాఠశాల -ఒక ఆదర్శం

నెల్లూరు టేక్కయిమిట్ట ప్రాంతంలో ఉన్న విశ్వనేత్ర School for the blind వారు అంధ విద్యార్ధులకు ఉచితముగా భోజన , వసతి సౌకర్యాలు కల్పించడంతో బాటు వారికి సంగీతం లో ( key board, jazz, rhythm pad , tabala ) మంచి శిక్షణ ఇస్తూ అంధ విధ్యర్ధులకుసేవ చేస్తుంది. గత ఎనిమిది సంవత్సరాలుగా ఒకటి నుండి పదవ తరగతి వరకు పిల్లలకు ఉచితముగా విద్య నేర్పడమే కాకుండా వారికీ ఉచిత హాస్టల్ , భోజన సౌకర్యాలు కల్పించడం కాకుండా పై చదువులకి కూడా వారికి సహకరిస్తున్నారు. కేవలం చదువే కాకుండా సంగీతం లో ఆసక్తి ఉన్న పిల్లలకి సంగీత వాయిద్యాలు నేర్పడం తద్వారా వారి జీవనోపాధి కి వారికి ఒక అవకాశం కల్పించడం వంటివి చేస్తున్నారు.

అయితే ఈ పాఠశాల కి ఒక ప్రత్యేకత ఉంది అదేంటంటే ఈ పాఠశాల లో అంధ విద్యార్ధులకు ఒక ప్రోడక్ట్ తయారు చేయడం లో శిక్షణ ఇస్తారు అదే " ఫ్లోర్ క్లీనర్ " . ఫ్లోర్ క్లీనర్ లు చేసి అమ్మడం ద్వారా వచ్చే ఆదాయాన్ని పిల్లల కోసం వినియోగిస్తారు. తద్వారా పిల్లలకి తమ సొంత సంపాదన మీద తాము బతుకుతున్న భావన కలగడంతో బాటు దేనికీ ఎవరినీ యాచించకుండా స్వయంగా సంపాదించుకోగలము అనే ఆత్మవిశ్వాసం వారిలో కలుగుతుంది. మనలో చాలా మంది డొనేషన్లు ఇస్తూ ఉంటాం ... డొనేషన్లు ఇచ్చే బదులు వారి దగ్గర ఫ్లోర్ క్లీనర్ లు కొని వారికి చేయూత నిస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. నెల్లూరు సమీపంలో ఉన్న మీ మిత్రులకు ఇక్కడ కొనమని సలహా ఇవ్వడమే కాకుండా మన ప్రాంతం లో ఒక పది మంది కలిసి కొనే పనైతే పది బాటళ్ళు వారే ఒక వ్యక్తి చేత పంపుతారు . ఆలా కూడా సాయం చేయవచ్చు.

వారిని కాంటాక్ట్ చేయవలేనంటే
విశ్వనేత్ర స్కూల్ ఫర్ ది బ్లైండ్,
మెగాస్టార్ చిరంజీవి గారి అపార్ట్ మెంట్ దగ్గర,
టేక్కేమిట్ట, నెల్లూరు
PH: 9000733118 , 9293138115

ఈ రోజే నేను ఒక 30 లీటర్లు మా సర్కిల్ లో ఇప్పించా:) లీటర్ బాటిల్ ధర 100/-

4/26/10

వెండి సామాన్లు - రాకెట్ పెట్రోలు

స్కూల్ లో చదువుకునే రోజుల్లో రాజేష్ ని అందరూ అడ్డదిడ్డంగా ఆడుకునేవారు ముఖ్యంగా ఐదో క్లాసులో ఉనప్పుడు మా క్లాస్ లో పొడుగ్గా ఉండే గంగ భవాని అయితే రాజేష్ చదువు బాగా రావాలంటే అరిటాకులు నమలాలి తెల్సా నేను ఒక ఆకు తినగానే లెసన్ మొత్తం చదవకుండానే వచ్చేసింది అని చెప్పగానే పాపం వీడు ఆకు తిని నోరంతా జిల పుడుతుంది అని గోల చేస్తుంటే స్కూల్ కి దగ్గరలోనే ఉన్న త్రివేణి వాళ్ళ ఇంటి నుండి వేడి వేడి పాలు తాగించడం నాకింకా గుర్తు. వాడికి చుట్టూ పక్కల ఎక్కడైనా నేను ఉంటే ఇతరుల బారి నుండి రక్షించే వాడిని నేను లేకుంటే అ బాధ్యత ఫరూక్ తీసుకునే వాడు.

ఆ రోజుల్లో మాది అడ్డు అదుపు లేని బ్యాచ్ కావడంతో పదేళ్ళకే ఊరంతా చుట్టి వచ్చేవాళ్ళం కొబ్బరి ఆకులు సన్నగా కట్ చేసి కొసకి పొడుగాటి తాడు కట్టి దూరంగా ఉంది కొబ్బరి ఆకుని పాములాగా కదిలించి చాలా మందిని బెంబేలెత్తించిన ఘనమైన చరిత్ర 1990- 1994 మద్య ఒంగోలు సత్యనారాయణ పురం కుర్రాళ్ళ సొంతం. అప్పట్లో పిన్నీసులు తీసుకుని రైల్ వచ్చే ముందు పట్టాల మీద పెట్టి రైల్ వెళ్ళిపోయాక అది కాస్త పొడుగ్గా అవడం చూసి ఏదో సాధించేసిన మా ఫీలింగ్ చూసి తనకి కూడా ఏదన్నా సాధించాలని కోరిక పుట్టిన రాజేష్ కి ఒక భయంకరమైన ఐడియా వచ్చింది కానీ దేవుడి దయ వల్ల అది వెంటనే అమలు చేయకుండా మా బ్యాచ్ లో నంబర్ వన్ ఎదవ అయిన విక్టర్ దగ్గరకి వచ్చి "విక్కి నేను కూడా పట్టాల మీద పడుకుంటే రైల్ వచ్చి పొడుగ్గా చేసిద్డా" అని అడిగాడు. అసలే ఎదవ విక్టర్ గాడు వాడికి రాజేష్ దొరికాడు" రైల్ కన్నా నేను ఎక్కితే ఇంకా పొడుగ్గా చేస్తా" అని వాడి భుజాల మీద ఎక్కి ఇంటి దాక మోయించాడు. ఇలా రాజేష్ ని అందరూ పలు పలు విధాలుగా ఆడుకుంటున్నారు.

అందరూ తనని ఫూల్ చేస్తున్నారు అని బలంగా తెలుసుకున్న రాజేష్ ఏదైనా చేసి వీళ్ళ నోరు మూయించాలి ఘాట్టిగా డిసైడ్ అయ్యాడు. తెలుగు సినిమాల ప్రభావంతో ఏదైనా చేసి బాగా పేరు డబ్బు సంపాదించి అందరి ముందు నోట్లో సిగార్ పెట్టుకుని కార్ లో దిగి అదేదో సినిమాలో సుమన్ లాగ డైలాగ్ చెప్పాలనే తన బలమైన కోరిక ఫరూక్ దగ్గర బయట పెట్టాడు. అది 1994 .......... రాజేష్ కి ఫరూక్ భయంకరమైన ఐడియా చెప్పిన సంవత్సరం మీ ఇంట్లో కానీ ఎక్కడైనా కానీ పాత వెండి సామాను ఉంటే దాన్ని శ్రీ హరి కోటలో వాళ్ళు లక్షల రూపాయలు పెట్టి కొంటారు అయితే ఆ వెండి సామాను 1941 కి ముందుది అయి ఉండాలి ఆ వెండి సామాను లో రాకెట్ కి వాడే పెట్రోలు ఉంటుంది ...... ఒక్క చిన్న చుక్కతో చంద్రుడి మీదకి వెళ్లి రావచ్చు అందుకే దానికి అంత డిమాండ్ అని చెప్పేశాడు.

అంత గొప్ప సీక్రెట్ తెల్సుకున్న రాజేష్ ... ఫరూక్ దగ్గర ఆ సీక్రెట్ మరి ఇంకెవరికీ చెప్పకూడదు అని ఒట్టు పెట్టించుకుని వెండి సామాను వేటలో పడ్డాడు. ఆఖరికి నన్ను కూడా అడిగాడు " మీ ఇంట్లో పాత వెండి సామాను ఉంటే నేను 25000 ఇచ్చి కొంటా..... నేను దాన్ని ఎంతకైనా అమ్ముకుంటా ... నేకు సంబంధం లేదు నీకు మాత్రం 25000 ఇస్తా .... విషయం బయటికి రాకూడదు గుర్తుంచుకో అని చెప్పి వెళ్ళిపోయాడు . ఏంట్రా వీడు ఇలా అడిగాడు అని ఫరూక్ ని అడిగితే అసలు విషయం చెప్పాడు. నవ్వుకుని వదిలేసాం . అయితే ....................... కొన్నాళ్ళకి ఒంగోల్లో అదొక ప్రభంజనం అయింది . ఎవరు చూసిన ఇంట్లో 1941 కి పూర్వం వెండి సామాను ఉంటే లక్ష రూపాయలు పెట్టి కొంటాం అని బ్యాచ్ లకి బ్యాచ్ లు తిరగడం మొదలు పెట్టారు. రౌడీ షీటర్లు చోటా మోటా నాయకులు అందరూ ఇదే పనిలో ఉన్నారు. ఎవరికీ చెప్పవద్దు అని ఫరూక్ కి చెప్పి వీడు మాత్రం దేశం మొత్తం చెప్పాడు. దాదాపు ఐదేళ్ల పాటు వెండి సామాను కోసం తిరిగిన రాజేష్ తర్వాత 10 మిలియన్ డాలర్స్ నోట్ దొరకడంతో దాన్ని ఇండియన్ కరెన్సీ లోకి మార్చేందుకు ప్రయత్నాలు మొదలెట్టాడు ఆ వివరాలు తర్వాతి టపాలో ................................

4/25/10

నన్నెప్పుడూ కాపాడే నా సాయి

" ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి " నిత్యం నేను స్మరించుకునే వాఖ్యమిది. 1982 వరకు మా కుటుంబానికి సాయిబాబా గురించి తెలీదు . ఆ సంవత్సరం లో సాయిని నమ్మి అయన మార్గంలో నడవడం మొదలెట్టిన దగ్గర నుండి ఇంతవరకు ఆ మార్గం విడువలేదు.

స్వర్గీయ ఆచార్య ఎక్కిరాల భరద్వాజ గారు రచించిన సాయి లీలామృతం లో 29 వ అధ్యాయం లో మా అమ్మగారి ప్రస్తావన ఇలా ఉంది. " కామేశ్వరమ్మ ( ఒంగోలు) తమకు తెలిసిన వారి నుండి ' శ్రీ సాయి లీలామృతము' తీసుకొని శ్రద్ధగా పారాయణ చేసింది. కొంతకాలంగా ఆమెకు మూర్చవ్యాది, వెన్నులో నొప్పి వచ్చి ఏ చికిత్సకూ తగ్గలేదు. అది తగ్గించమని బాబాను ప్రార్థించి పారాయణ చేస్తుండగా, ఒకనాటి రాత్రి శ్రీ సాయి డాక్టరు వలె స్వప్న దర్శనమిచ్చి ఇంజెక్షన్ చేశారు. అ నొప్పికి మెలకువ వచ్చి చూస్తే ఇంజెక్షన్ చేసిన గుర్తు స్పష్టంగా కనిపించింది. అంతటితో ఆ వ్యాధి తగ్గిపోయింది. ఆమె మరింత భక్తి తో పారాయణ చేస్తుంటే ధ్యానానికి కూర్చోగానే శిరిడీ లో సాయికెదురుగా కూర్చునట్లు భావోద్రేకం కలిగి బాహ్యస్మృతి లేకుండా 5,6 గంటల సేపు కూర్చుంది పోయేది.

ఆమెకు ఇంకెన్నో దివ్యనుభావాలు కలుగుతుండేవి . ఉదా :- 3 - 9 - 1986రాత్రి ఆమెకు కలలో ఎవరో పాముల వాళ్ళిద్దరూ వాకిట్లో నిలబడి బెదిరిస్తున్నారు. ఇంతలొ తెల్లని దిస్తులు ధరించిన ఎదురింటి ముస్లింల అబ్బాయి వచ్చి వాళ్ళను ఉరుదూ లో తిట్టి తరిమేశాడు. మర్నాడు గురువారం సాయంత్రం ఆ అబ్బాయి వాళ్ళింటికి వస్తే ఆ కల సంగతి చెప్పారు. సాయియే అలా దర్శనమిచ్చి ఆపద నివారించి ఉంటారని అతడన్నాడు. నాటి రాత్రి ఆమెకు కలలో ఒక దున్నపోతు, భీకరులైన నలుగురు మనుష్యులు కన్పించి ఆమె మెడకు తాడుకట్టి లాగుతున్నారు. ఆమె భయంతో కేకవేసి నిద్ర లేచింది. మరలా నిద్ర పట్టాక మరలా ఆ నల్గురూ ఆమె మంచం చుట్టూ తిరుగుతున్నట్లు కల వచ్చింది. అంతలో తెల్లని వస్త్రాలు ధరించిన వేరొకరు వాళ్ళను తిట్టి వెళ్ళగొట్టారు. ఆమెకు మెలకువ వచ్చి మంచం దిగబోతే ఎడమ కాలు క్రింద మెత్తగా ఏదో తగిలింది. కాలు ప్రక్కకు తీసేలోగా ఒక త్రాచుపాము పడగ విప్పి బుసకొట్టి ఆమె కాలుపై కాటువేసి చర చరా వెళ్ళిపోయింది. కొద్దిసేపట్లో ఆమె శరీరం చల్లబడి, చెమట పట్టి, గుండెలు బరువెక్కాయి. కొందరు పరుగున పోయి పాముల నరసయ్యకు ఫోను చేసారు, కొందరు ఆమెను డాక్టరు వద్దకు తీసుకు వెళ్లాలన్నారు. ఆమె, " నన్ను సాయి పటం దగ్గర చాప మీద పడుకోబెట్టి భజన చేయండి. నాకు సాయియే దిక్కు. నేను డాక్టరు వద్దకు రాను. నాకెలా ఉంటే అలా జరుగుతుంది" అన్నది. క్రమంగా ఆమెకు బాహ్యస్మృతి తగ్గుతూ నోట నురుగు రాసాగింది. ఇంతలొ ఆ ప్రదేశమంతా పరిమళాలు వ్యాపించాయి! కాసేపటికి స్పృహ వచ్చింది. త్వరలో ఆమె కోలుకున్నది.

పై విషయం లో స్థలాబావం వలన భరద్వాజ గారు పూర్తి విషయం వ్రాయలేదు. మా ఆమ్మకి మూర్చ వ్యాధి ఉండేది . అప్పట్లో ఆర్ధికంగా బాగా చిటికిన మా కుటుంబం సరైన వైద్యం చేయించుకోలేని పరిస్థితి. తెల్సిన వారి ద్వారా సాయి గురుదేవుల గురించి విని ఆయన చరిత్ర పారాయణ చేసిన కొన్నాళ్ళకి కలలో సాయి డాక్టరు రూపంలో కనిపించి ఇంజక్షన్ చేశారట. వెంటనే ఉలిక్కిపడి లేచిన మా అమ్మ మమ్మల్ని పిలిచి ఇంజక్షన్ గుర్తు చూపించారు . ఆ రోజు నుండి ఆమెకి ఫిట్స్ లేవు. అప్పటి నుండి నిత్యం సాయిని కొలవనారంభించిన మా అమ్మ తెల్లవారుఝామున నలుగు గంటలకి పూజ లో కూర్చుంటే ఒక్కొక్కసారి ఆ రోజు సాయంత్రం వరకు బాహ్య స్మృతి లేకుండా కూర్చుని ఉండేది. ఎప్పుడో మెలకువ వచ్చి లేచి నేను శిరిడీ వెళ్లి వచ్చాను అనేది. అప్పుడే నాలుగేళ్ల వయసుండే నేను " అమ్మా నువ్వు చచ్చి పోయావా ఇందాక పిలిస్తే పలకలేదు ?" అని దీనంగా అడిగేసరికి " ఏమిటి బాబా ఇంత చిన్న బిడ్డ ఉన్న నాకు ఈ ఆధ్యాత్మికత ఏంటి" అని బాద పడ్డారట. అంతే అప్పటి నుండి నేను బాగా పెద్ద వాడిని అయ్యేవరకు మా అమ్మ గారికి అలాంటి యోగస్థితి కలగలేదు. అయితే మద్య మద్యలో స్వప్న దర్శనాలు ఇస్తూ ఉండేవారట. పాము కరిచిన రోజు నాకు బాగా గుర్తు అప్పుడు నాకు నాకు ఏడేళ్ళు . తెల్లవారుజ్హామున పెద్దగ అరిచింది అమ్మ అందరం పరిగెట్టుకు వెళ్ళాం ... ప్ మా ముందు నుండే పెద్ద త్రాచుపాము వెళ్ళింది . మా అన్న నోటితో విషాన్ని లాగాడు .. కాసేపటికి గుండెల్లో పాము బుస కొడుతున్నట్టు ఉంది అన్నది అమ్మ ........ హాస్పిటల్ కి తీసుకెళ్దాం అన్నారు కొందరు అయితే అమ్మ మాత్రం నేనెక్కడికీ రాను నన్ను సాయి పటం వద్ద పడుకోబెట్టండి అనడంతో అలాగే చేశారు . ఐదు గంటల సమయం లో ఆ ప్రాంతమంతా చక్కని సువాసన వచ్చింది అమ్మ వంటి నిండా తెల్లగా కనిపిస్తూ ఉండడంతో భయపడి లైట్ వేసి చూసిన మేము ఆమె వంటి నిండా విభూతి చూసి ఆశ్చర్య పోయాం . ఆ రోజు ఉదయం తొమ్మిది గంటలకల్లా మా అమ్మ పూర్తి ఆరోగ్యవంతురాలు అయింది.

2008 నుండి మళ్లా యోగస్థితిలోకి మా అమ్మ వెళ్లడం ప్రారంభం అయింది. 2008 లో గురు పౌర్ణమి నుండి ఇప్పటి వరకు నాలుగు సార్లు మా పూజ మందిరంలో బాబా విగ్రహం నుండి విభూతి రావడం వచ్చింది. ఆ ఫోటోలు ఒక్కసారి చూడండి .






ఆ తరువాత 2008 దసరా రోజు రావడం మొదలైన విభూతి మూడు రోజుల వరకు పెరిగింది.



తంబూలీ అనే రౌడీ వాడు ఊర్లో నుండి వెళ్ళిపో అని ఆజ్ఞాపిస్తే ...... మూడు నెలలపాటు ఊరిబయట నివసించి అయన మనకి నేర్పింది . సహనం , ప్రేమ . ఎదుటి వాడు తిడితే తిరిగి తిట్టకు వాడు తిట్టినందుకు నీకేమన్న నెప్పి పుట్టిందా ... లేదుకదా అంటూ మనల్ని తగాదాలు పెట్టుకోవద్దు అని చెబుతారు. మిట్ట మద్యాహ్నం ఆకలితో ఉన్న ఏదో ఒక జీవి కోసం ఒక ముద్ద అన్నం బయట పెట్టమని చెబుతారు. ఇరువురు కలిసినప్పుడు అక్కడ లేని మూడో వ్యక్తి గురించి పుకార్లు మాట్లడుకోవద్దు అని చెబుతారు. ఒక మనిషి సక్రమమైన జీవితం ఎలా గడపాలో ఆయన జీవించి చూపారు. ఎన్ని పారాయణాలు చేసినా ఒక్కొకసారి సహనం నశించి అవతల వారితో యుద్ధానికి దిగినా సాయంత్రం ఇంటికెళ్ళాక అయన పటం లోనుండి "నా మాట వినలేదుగా " అన్న భావన తో ఉన్న చూపులు నన్ను వెంటాడుతాయి.

నిత్యం స్మరించుకోవాల్సిన ఆయన మాటలు కొన్ని

నీదగ్గరకు ఏ ప్రాణి వచ్చినా తోలెయ్యవద్దు, ఆదరించు, ఋణానుబంధంపై నమ్మకముంచి గుర్తుంచుకో. ఆకలిగొన్న వారికి అన్నం, గుడ్డలు లేనివారికి గుడ్డలు యివ్వు. భగవంతుడు సంతోషిస్తాడు. నిన్నెవరైనాసరే ఏమైనా అడిగితే సాధ్యమైనంత వరకు యివ్వు, లేక యిప్పించు, " లేదు" అనవద్దు. యిచ్చేందుకు ఏమీ లేకపోతే మర్యాదగా చెప్పు. చులకన చేయడం, కోపగించుకోవడం తగదు. నీ దగ్గరున్నా యివ్వలనిపించకపోతే లేదని అబద్ధం చెప్పవద్దు. ఇవ్వలేనని మర్యాదగా చెప్పు. ఇవ్వలేకపోతే దానికి కారణం చెప్పు. అయిష్టమే కారణమైతే అదే చెప్పు .

ప్రాణులన్నిటి రూపాలలో నేనే సంచరిస్తుంటాను. ఎవరెవరిపై కోపించినా, దూషించినా నాకు చాలా బాధ కల్గుతుంది. ఎవడు ధైర్యంగా నిందను, దూషణను సహిస్తాడో వాడు నాకెంతో ఇష్టుడు. నిన్నేవరైనా బాధించినా వాడితో పోట్లాదవద్దు. సహించలేకపోతే ఒకటి రెండు మాటలతో ఓర్పుగా సమాధానం చెప్పు. లేకుంటే నా నామం స్మరించి అక్కడనుండి వెళ్ళిపో. వాడితో యుద్ధం చేసి దెబ్బకు దెబ్బ తీయవద్దు. నీవేవరితోనైనా పోట్లాడితే నాకు చాలా ఏహ్యం కలుగుతుంది. ఎవరి గురించి తప్పుగా మాట్లాడవద్దు. నీ గురించి ఎవరైనా మాట్లాడినా చలించకు. వాడి మాటలు నీకేమి గుచ్చుకోవు గదా! ఇతరులు చేసే పనులకు ఫలితం వారే అనుభవిస్తారు. నీవు చేసే పనుల ఫలితమే నీకుంటుంది. తక్కిన ప్రపంచం తలక్రిందులు కానివ్వు . దాన్ని లక్ష్య పెట్టక, ఋజుమార్గం లో వెళ్ళు, ఆనందానికి యిదే మార్గం.

అరిషడ్వర్గాలలో అసూయను జయించడం చాలా సులువు. దాని వలన మనకేలాభామూ లేదు. అవతల వారికే నశ్రమూ లేదు. అసూయంటే యితరుల బాగును సహించలేకపోవడమే.ఓర్చుకోలేక అపవాదులు కల్పిస్తాము. వారు నష్టపోతే సంతోషిస్తాము. దాని వలన మనకేమి ప్రయోజనము? అవతల వాడికి మంచి జరిగితే మనకేమి నష్టము? కాని యిది ఎవరూ ఆలోచించారు. వాళ్ళు బాగుపడితే మనకే మేలు జరిగినట్లు భావిద్దాం! లేదా మనమూ ఆ మేలును పొందే యత్నం చేద్దాం. వాడు మనసోత్తేమి లాక్కున్నాడు? వాడి కర్మననుసరించి ఫలితాన్ని వాడు పొందుతాడు.

ఈ టపా వ్రాయడానికి కారణం నా సాయి గురించి నా బ్లాగులో వ్రాసుకున్దామనే ఈ మద్య అదుపుతప్పుతున్న నా ఆవేశాన్ని అనుచుకున్దామనే గానీ గొప్ప కోసమో లేక లేదో రుజువుల కోసమో కాదు :)

4/21/10

దర్శకరత్నకు లేఖ - సూటిగా సుత్తి లేకుండా !

దర్శకరత్న దాసరి నారాయణ రావు గారికి ,

నమస్కరించకుండా వ్రాయునది ... బాబు సినిమా ఇండస్ట్రీ కి పెద్దన్న అని మీకు మీరు అనుకున్నారేమో తెలీదుగానీ మేము ఎవరం అనుకోలేదు. అయితే ఎంతో మందికి లైఫ్ ఇచ్చానని చెప్పుకున్న మీరు , అనేక హిట్ చిత్రాలకి దర్శకత్వం వహించిన మీరు పూర్తిగా కొత్తవారితో ఒక సినిమా తీస్తున్నారట. దాని పేరు "యంగ్ ఇండియా" అట. నా ఖర్మ గాలి ఆ సినిమా పాటలు నిన్న రాగా.కాం లో విన్నాను . అంతా బాగానే ఉంది గాని ఆ" కోల్ కోల్ కలకత్తా" పాట అంత దరిద్రంగా , చండాలంగా , నీచంగా , నికృష్టంగా , రాసిన వాడిని , పాడిన వారిని పడేసి కొడదాం అనిపించేలా ఉంది . మరి మీకు అనిపించలేదా ? ఎన్నోహిట్ చిత్రాలకి దర్శకులు మీరు.. ఏదన్నా సినిమా ఫంక్షన్ కి వస్తే ప్రస్తుతం మారుతున్న సినిమా విలువల గురించి వల వాలా మాట్లాడేసి నవతరం దర్శకులను , నటులను ఎకి పీకి పారేసే మీకు ఇది తగునా? సక్సస్ కోసం పాటలో సభ్యత గల మనుషుల మనోభావాలు గాయపడేలా .... బండభూతులు చొప్పించి మరీ పాడించాలా ????? రాసిన సాహితి కి బుద్ధిలేదా లేక పాడిన మాలతికి జ్ఞానం లేదా లేక ఆ సినిమా నిర్మిస్తున్న మీకు అసలేమీ లేదా? మీకు లేఖ రాసే ఈ నా ప్రయత్నం .....ఏదో గొడవ చస్తే ఆ పాట తొలగిస్తారని కాదు ... మీ మైండ్ సెట్ మార్చుకుంటారని ...

వికటకవి

4/20/10

"మాలిక " పనితీరు భేష్

తొలి తెలుగు వేగవంతమైన సంకలిని " మాలిక " పనితీరు భేష్ అని చెప్పాలి . ఒక రకంగా టెస్ట్ సిగ్నల్ లా భావించాల్సిన తరుణం లో కూడా ఇప్పటికే ఉన్న అనేక సంకలినుల మధ్య తన ప్రత్యేకత చాటుకుంది. టపా వ్రాసిన దగ్గర నుండి పబ్లిష్ అయ్యే వరకు గంట ఒక్కొకసారి రెండు గంటలు ఎదురు చూసే పరిస్థితి నుండి బ్లాగరులు కాసింత ఊరట చెందుతారు. నీ బ్లాగు లేపేస్తా అని బెదిరిస్తూ బ్లాగర్లని గ్రిప్పులో పెట్టుకునే తరహా పాలిటిక్స్ కి మేము దూరం అని ముందుగానే చెప్పేశారు సంకలిని నిర్వాహకులు. నాకు తెలిసి గూగుల్ లేదా వర్డ్ ప్రెస్ లో బ్లాగులు తయారు చేసుకుంటారు లేదా కొందరు సొంత డొమైన్ వాడుకుంటారు . గూగుల్ , వర్డ్ ప్రెస్ ని మించి బ్లాగ్సేవ ( బ్లాగు సేవ ) చేస్తున్నట్టు కొన్ని సంకలినుల తీరు తెన్నూ ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. కొన్ని భజన పార్టీలు సంకలినుల తీరు తెన్నులు ఇలాగే ఉండాలి అని తమకి తగిన నిర్దేశాలు ఇవ్వడం హాస్యాస్పదం ( ఎవరూ పట్టించుకోక పోయినా) ముఖ్యంగా crybabies కి లోబడి సంకలినులు పని చేయడం వంటి వ్యవహారాలతో సగం జనం విసుగేత్తిన విషయం వాస్తవం. అటువంటి వ్యవహారాలకి " మాలిక " దూరం అని ముందే చెప్పి తన ఔనత్యాన్ని చాటుకుంది.

తర్వాత సంకలినులు చేయాల్సిన కొన్ని బాద్యతలు ఉంటాయి . అది అసభ్యతకు అశ్లీలానికి తావు లేని బ్లాగులు సంకలిని లో ఉండేలా చూసుకోవడం. మాలిక ఆ పని విజయవంతంగా చేస్తుంది అని కోరుకుంటూ " మాలిక " విజయవంతమైన సందర్భం లో మాలిక నిర్వాహకులకు నా అభినందనలు.

నా బ్లాగ్ మాలిక లో కలిపా మరి మీ బ్లాగ్ కలిపారా కలపక పోతే admin@maalika.org కి మీ బ్లాగ్ లింక్ పంపండి. మీరు పోస్ట్ రాసిన రెండు లేక మూడు నిముషాల వ్యవధిలో మీ టపా సంకలినిలో చూసుకోండి.

4/16/10

పక్షులని , మూగ జీవులని కాపాడుకుందాం

ఈ వేసవిలో పక్షులు , మూగజీవులకి మన సహకారం ఎంతైనా అవసరం . అసలే ఈసంవత్సరం ఏప్రిల్ లోనే ఎండలు తారా స్థాయికి చేరాయి. రాష్ట్రంలో సగటున 42 డిగ్రీలు నమోదు అవుతుంది. తాగునీటి కొరత వలన ఏటా భారీగా పక్షులు మరణిస్తున్నాయి. ఈ పరిస్థితి నుండి వాటిని మనం చిన్ని ప్రయత్నంతో బయటపడేసే మార్గం ఆలోచిద్దాం . మన ఇంటి మీద , బల్కనీలలో, గోడల మీద పాత్రలలో నీరు ఉంచితే అది ఏదో ఒక మూగ జీవికి చేరుతుంది . ఇంకా అలాగే రోడ్ల మీద తిరిగే ఎన్నో జీవులకి ఎండాకాలం నరక ప్రాయమే ... ముఖ్యంగా పట్టణాలలో . మరి వీటికోసం ఏమి చేయాలి ??? ప్రతిరోజూ ఇంటి ముందు బక్కెట్ నీళ్ళు పెట్టేంత స్థలమే మనలో చాలామందికి ఉండక పోవచ్చును ..... ఒక సారి ఈ క్రింది ఫోటోలు చూడండి.

గత సంవత్సరం ఆస్ట్రేలియాలో మాత్రమె సంచరించే చిన్ని ఎలుగుబంటి లాగా కనిపించే కోలా మంచి నీటి కోసం మనుషులని ప్రాధేయపడే దృశ్యాలు . ఇలా కోలాలు మనుషులని నీరు అడగడం ఇదే మొదటిసారట.





మరొక కోలా (KOALA) ఒక ఇంటిలోకి ప్రవేశించింది .... ఎండా నుండి కాపాడుకోడం కోసం . దాన్ని చూసి భయపడకుండా ఆ ఇంట్లో వాళ్ళు కొద్దిగా నీళ్ళు ఇస్తే ఏం జరిగిందో చూడండి...


మనలో చాలామంది ఏదైనా జీవి దగ్గరికి వస్తే అదిలించడమే తెల్సు . కానీ ప్రేమగా అదెందుకు వచ్చిందో పట్టించుకునే తేరిక బహు కొద్దిమందికే ఉంటుంది. నొరు తెరిచి చెప్పలేదు కదా .... పిల్లైనా , కుక్కైనా మన ఇంట్లో చొరబడేది కడుపు కోసమే కాని దొంగతనానికి కాదుగా ....... ఈ మందు వేసవిలో మూగప్రాణులకి నీరందించే విషయమై మనకి చేతనైన సాయం ఈ మూగజీవాలకి చేద్దాం ... ఈ విషయమై ఇంకా మంచి సూచనలు మీ నుండి ఆశిస్తూ సెలవ్.

4/15/10

లోకల్ కాల్

ఒక రాజకీయ నాయకుడు , ఒక దొంగ, ఒక సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఒకేరోజు మరణించి నరకానికి వెళ్లారు . వెళ్ళిన దగర నుండి చిత్రగుప్తుడి దగ్గర రాజకీయనాయకుడు నానా గొడవ చేయడం మొదలు పెట్టాడు. నా పార్టీ వాళ్ళతో చాలా మాట్లాడాలి ఒకసారి ఒక్కసారి ప్లీజ్ అని అని బతిమాలసాగాడు. డబ్బులిస్తే " నరక నెట్వర్క్ " ద్వారా ఫోన్ చేసుకోవచ్చని అక్కడ చిత్రగుప్తుడు చెప్పడంతో మొదట రాజకీయనాయకుడు ఫోన్ చేసుకుని ఐదు నిమిషాలు మాట్లాడి పెట్టేశాడు.

యెంత ? అన్నాడు రాజకీయ నాయకుడు . ఐదు లక్షలు అన్నాడు చిత్ర గుప్త. వెంటనే రాజకీయ నాయకుడు చెక్ రాసిచ్చి వెళ్ళిపోయాడు . ఇదంతా చూస్తున్న దొంగకి ఈర్ష్య కలిగింది . నేను మా దొంగల గ్రూపుకి ఫోన్ చేసుకోవాలి అని అడిగి ఫోన్ చేసుకుని రెండు నిముషాలు మాట్లాడి పెట్టేశాడు . ఈసారి అతని వద్ద పది లక్షలు వసూలు చేశాడు చిత్రగుప్తుడు. ఈ సారి మన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కి ఫోన్ చేసుకోవాలి అనిపించింది . వెంటనే చిత్ర గుప్తుడిని అడిగి తన ఆఫీస్ కి ఫోన్స్ చేసి కొలీగ్స్ తో ప్రాజెక్ట్ మేనేజర్ల గురించి , ఐటి కష్టాల గురించి దాదాపు పది గంటలు మాట్లాడాడు . అంతా అయిపోయాక యెంత అని అడిగాడు చిత్ర గుప్తుడిని. ఆ పది రూపాయలు అన్నాడు చిత్రగుప్త . అదేంటి అంత తక్కువ అని ఆశ్చర్య పోయాడు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. దానికి చిత్రగుప్తుని సమాధానం ... ఇలా ఉంది..


















నరకం నుండి నరకానికి లోకల్ కాల్

ఆటాడుకుందాం రా

IQ 120 కి పైన ఉన్నవారే సమాధానం చెప్పగలరట .... మీరేమన్నా ప్రయత్నిస్తారా?

ఈ క్రింది విధంగా
2 + 3 = 10
7 + 2 = 63
6 + 5 = 66
8 + 4 = 96

అయితే మరి
9 + 7 = ఎంత అవచ్చు ????

సమాధానం టక్కున చెప్పండి మీ ఐక్యు 120 కి ఎక్కువా తక్కువా అనేది మీరే తెల్సుకోండి ... నేనైతే రెండు నిమిషాల్లో కనుక్కున్నా