అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

5/31/10

రాయుడు గారి కధ


అది 2009 ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే . మా ఫ్రెండు ఫోన్ చేశాడు "మావా.... పింకీ కి ఐదు పిల్లలు పుట్టాయి చూద్దువ్ గానీ రా" అని. " సరే వస్తా " అని చెప్పా. నా ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి . నా చిన్న తనం లో మా అక్క జానీ అనే ఒక కుక్కని పెంచేది. ఐదు సంవత్సరాలు మాతో ఉన్నాక ఒక రోజు ఒక స్కూటరిస్ట్ చాలా స్పీడ్ గా వస్తూ అదుపుతప్పి దాన్ని గుద్దేశాడు ... తీవ్రంగా గాయపడిన జానీ చనిపోయింది. అప్పుడు మా అక్క పడిన బాధ చూసిన మేము అప్పటి నుండి కుక్కలు పెంచడం విషయం లో కాస్త వెనకడుగు వేస్తున్నాం. ఎందరివొ లాబ్రోడార్స్, జర్మన్ షేప్పర్డ్స్, గ్రే హౌండ్స్ పెంచుకోవడానికి ఇవ్వచూపినా ధైర్యం చేయలేకపోయాం. కానీ ఆ రోజు పింకి దగ్గర కళ్ళు మూసుకుని పాకుతున్న ఐదు బుజ్జి బుజ్జి కూనలని చూసి ఎంత ముచ్చటేసిందో! పింకి క్రాస్ బ్రీడ్ పమేరియన్ .... క్రాస్ చేసిన కుక్క క్రాస్ బ్రీడ్ జర్మన్ షెపర్డ్.

నాలుగు ఆడకుక్క పిల్లల మద్య వెరైటీ బ్రౌన్ షేడ్ లో కన్నింగ్ ఫేస్ వేసుకుని కూర్చున్న ఒక బుజ్జిగాడి దగ్గర లుక్ స్టే అయింది. రోజు వెళ్లి ఆ బుజ్జి కుక్కపిల్లల్తో ఆడుకోవడం అలవాటు అయింది. ముఖ్యంగా ఆ కన్నింగ్ ఫేస్ ఏకైక కుక్క మగధీరుడు తో చాలా టైం స్పెండ్ చేసే వాడిని. ఆలా 20 రోజులు గడిచాయి. ఆ చుట్టుపక్కల వాళ్ళు వచ్చి తలా ఒకదాన్ని తీసుకుపోతాం అని చెప్పడం మొదలెట్టారు . ఈ దొంగ రాస్కెల్ ని కూడా ఎవరన్న తీసుకుపోతారేమో అనిపించింది. ఏమో వాడిని వదిలి ఉండలేనేమో అనిపించింది ..... వీడిని నేను తీసుకుపోతానురా అని చెప్పాను మా వాడితో. అమ్మో మా బాబాయి వాళ్ళు కావాలి అంటున్నారు రా మరి ఇప్పుడెలా ?? అని నీళ్ళు నమలసాగాడు . ఒక సారి పింకి వంక చూశాను . చూడు పింకి నీ దగ్గర నుండి బిడ్డని 20 రోజులకే దూరం చేస్తున్నందుకు క్షమించు ... నీకన్నా రెండు గ్లాసులు పాలు ఎక్కువే తాగిస్తా అని చెప్పి .... ఆ బుజ్జి గాడిని ఎత్తుకుని జంప్. వెనకనుండి మా వాడు అరుస్తున్నాడు . కానీ నాకేమీ వినిపించలేదు.

ఇంటికి తీసుకెళ్ళాక మా అమ్మ ఎలా రిసీవ్ చేసుకుంటుందా అనుకున్నాను కానీ ఈ రాస్కెల్ అందరి మనసులు దోచేశాడు. ముఖ్యంగా మా గడప 8 అంగుళాలు ఉంటుంది. మా గడప ని అతి కష్టంగా దిగి కింద మెట్లు సైతం డింగ్ చిక్ డింగ్ చిక్ అంటూ దిగి దూరంగా పోయి పాస్ పోసుకుని మళ్లా ఆపసోపాలు పడి ఇంట్లోకి వచ్చే వాడి చేష్టాలకి అందరూ దాసోహం అయిపోయారు. మా ఇంట్లో సందడి వాతావరణమే రోజూ . కాకపోతే వాళ్ళ అమ్మ దగ్గర నుండి తీసుకు వచ్చాను అనే కోపంతో అనుకుంటా మనోడు నాతో సరిగ్గా ఉండేవాడు కాదు . నేను ఇటు ఉంటే తల అటు తిప్పే వాడు . చివరికి ఎలాగో మచ్చిక చేసుకున్నా నా తిప్పలు నేను పడి.

అప్పుడే మనోడికి ఏదైనా మంచి పేరు పెడదామనే ఆలోచన వచ్చింది . సరిగా అప్పుడే టీవీ లో పెదరాయుడు సినిమా వస్తుంది. మనకి ఎలాగు వెరైటీ పేర్లు పెట్టే సరదా ఉండనే ఉంది. అందుకే రాయుడు అని ఫిక్స్ చేశా . మా పిన్నమ్మ కొడుకు వెంకట్రాయుడు నుండి రుసరుసలు వస్తాయని అప్పుడు అనుకోలేదు. వెంకట్రాయుడు నాకు చేసిన ద్రోహం ఇక్కడ చూడండి.

రాయుడు మా జీవితం లో అతి ముఖ్యమైన శాల్తీ అవుతున్న రోజులు అవి. వాడికి ఆల్బుమార్ వెయ్యడం ఒక పెద్ద ప్రసహనం . అల్బూమార్ అంటే చిన్ని బిడ్డలకి woodwards gripe water వంటిది అన్నమాట. మామూలుగా నోట్లో సిరంజి పెట్టి వేస్తారు కుక్కలకి . అన్ని కుక్కల్ల వేయించుకుంటే వీడు రాయుడు ఎందుకు అవుతాడు. వాడికి ఆల్బూమార్ వెయ్యడానికి నేను కాళ్ళు చాపుకుని కూర్చుని నా కాళ్ళ మీద పడుకోబెట్టుకుని ఆటలు ఆడించి మాయ చేసి నోరు తెరిపించి నోట్లో లటుక్కున వేయాల్సి వచ్చేది. 50 రోజుల బిడ్డ అయ్యాక ఇంజక్షన్స్ వేయించా. అదే నేను చేసిన పెద్ద నేరం . ఇంజక్షన్ వేయించిన ప్రతిసారి రాయుడు నాతో పలకడు. చాల సీరియస్ గా ఉండేవాడు . మళ్లా రెండు రోజులకు మామూలే అనుకోండి.

రెండు నెలలు గడిచాయి ఈ సారి పక్కిళ్ళ నుండి కంప్లైంట్స్ రావడం మొదలైంది. పక్కింటి ఆంటీ టీవీ చూస్తూ పొరబాటున ఆమె కళ్ళద్దాలు తీసి కింద పెట్టిందా .... ఇక అటు చూసి ఇటు చూసే సరికి అవి తీసుకుని వచ్చి మా ఇంట్లో డ్రస్సింగ్ టేబుల్ మీదా మా అమ్మ కళ్ళద్దాల పక్కన పెట్టేది. జండూ బాం సీసాలు , దువ్వెనలు ఇలా ఏది దొరికితే అది తీసుకు రావడం మా ఇంట్లో ఒక మూల పెట్టడం. ఈ అలవాటు మాన్పించడానికి నేను కొత్త ఎత్తులు వేసి అవన్నీ వాడికి ఇచ్చి నేను దగ్గర ఉంది మళ్లా వాళ్ళ ఇంట్లో పెట్టించే వాడిని . చివరికి అలవాటు మాన్పించాను అనుకునే లోపు .. మా ఇంట్లో వస్తువులు తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టేవాడు :((((.

మా ఇంటికి పాలు పోసే సుబ్బయ్య గారు పాలు పోసి ఖాళీ గిన్నె దాపెట్టుకుని తీసుకెళ్ళాల్సి వచ్చేది . గిన్నె తో సహా ఇచ్చి వెళ్ళాలి లేకపోతె వెంట పడేది. ఆయన వెనక దాపెట్టుకుంటే ఆయన వెనక్కి వెనక్కి తిరిగి మరీ చూసేది. ఎన్నో కుక్కల్ని చూశాను గానే ఇలాంటి ఖిలాడీ ని నేనెక్కడా చూడలేదండీ అనేవాడు ఆయన.

అలా మాకుటుంబం లో ఒక భాగం అయిపోయాడు రాయుడు. రాయుడి గారికి బ్లాగులో ఒక అజ్ఞాత అభిమాని ఉన్నారు. వారి కోరిక మేరకు వారి కోసమే ఈ టపా.

5/28/10

రాముడు రావణుడి కాళ్ళకి నమస్కరించాడా?

శ్రీ రామచంద్రుడు రావణుడి కాళ్ళకి నమస్కరించిన ఘటన బహుశా యే కొద్ది మందికో తెలిసి ఉండవచ్చు . ఒకసారి ఆ సంఘటన గురించి చర్చిద్దాం. సీతమ్మవారిని వెదుకుతూ బయలుదేరిన రాముడు అనేక చోట్ల శివలింగాలు ప్రతిష్టించి పూజలు చేసుకుంటూ బయలుదేరాడు అంటారు. ఆలా వారధి కట్టిన ప్రాంతం వరకు రాముడు ప్రతిష్టించిన ఆలయాలు ఉన్నాయి. అయితే చివర్లో వారధి కట్టిన తర్వాత యుద్ధానికి బయలుదేరే ముందు అక్కడ సముద్రపు ఒడ్డున శ్రీరాముడు ఇసుకతో ఒక పెద్ద శివలింగం తయారు చేశాడట. ఆ శివలింగానికి ప్రాణ ప్రతిష్ట చేయాల్సిందిగా నారద మహర్షి ని ఆహ్వానిస్తే అయన " రామా ఈ శివలింగానికి ప్రాణప్రతిష్ట చేయగల సమర్ధత , శివభక్తి ఒక్క రావణాసురుడికే ఉంది కనుక నీవు ఆయన్ని ఆహ్వానించు " అన్నాడట. "మనం పిలిస్తే ఆయన ఎలా వస్తాడు అయినా అతని మీదకి యుద్ధానికి వెళుతూ మళ్లా అయన చేత పూజ చేయించుకోవడం ఏమిటి" అని రామచంద్రుడు ప్రశ్నిస్తే " నీ బాద్యత గా నీవు పిలువు అయన వస్తే వస్తాడు లేకుంటే లేదు " అన్న నారద మహర్షి మాట ప్రకారం రావణుడికి ఆహ్వానం పంపాడట రామచంద్రుడు.

అపర శివభక్తుడు అయిన రావణుడు ఆ ఆహ్వానాన్ని మన్నించి ఆ ప్రాంతానికి విచ్చేసి ఆ శివలింగానికి పూజచేసి ప్రాణప్రతిష్ట చేశాడట. పూజ అంతా అయ్యాక ధర్మం ప్రకారం పూజారి కాళ్ళకి మొక్కాలి , అ పూజారి ఆశీర్వదించాలి . ఈయన ఏమని సంకల్పం చెప్పి మొక్కాలి , ఆయన ఏమని అశీర్వదించాలి ? నిన్ను చంపడానికి వస్తున్నాను నన్ను దీవించు అనుకుని ఈయన మొక్కాలి అయన తధాస్తు అనాలి . రామ చంద్రుడు రావణుడి కాళ్ళకి మొక్కితే ఆయన అభీష్ట ఫలసిద్ధిరస్తు అని దీవించాడట.

శత్రువైనా రమ్మన్న ఆహ్వానాన్ని మన్నించి వచ్చి మరీ తన చావుకి తానే వరం ఇచ్చి వచ్చిన రావణుడి అంతరంగం ఏమిటి ? రావణుడిని చంపడానికి రావణుడి చేతే తధాస్తు అనిపించడానికే నారదుడు ఈ ఎత్తుగడ వేశాడా? ఈ రెండు ధర్మ సందేహాలు ఎవరైనా పెద్దలు వివరిస్తే సంతోషిస్తాను.

5/27/10

రాజగోపురం కూలడం దేనికి సూచన

ఎప్పుడో 494 సంవత్సరాల కిందట శ్రీకృష్ణ దేవరాయలు కట్టించిన శ్రీకాళహస్తీస్వర దేవాలయ రాజ గోపురం కూలిపోయింది మన పాలకవర్గం నిర్లక్ష్యం కారణంగా దాదాపు ఐదు వందల సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ కట్టడాన్ని సంరక్షించుకోలేకపోవడం నిజంగా పురావస్తుశాఖ, దేవాదాయశాఖ సిగ్గుతో తలవంచుకోవాల్సిన విషయం. వారికి సిగ్గు అనేది ఎలాగు లేదు కనుక మనం విషయం లోకి వద్దాం. ఈ రాజగోపురం కూలిపోవడానికి మనకి ప్రధానంగా కనిపించే కారణం లైలా తుఫాన్ అయినా అసలు అది బలహీనపడడానికి దోహదపడిన అంశాలు ఒక సారి చూద్దాం.

ఆలయ పరిసరాల్లో లెక్కకి మించి బోర్లు వేయడానికి పర్మిషన్ ఇవ్వడం ఒక కారణం. ఆలయ పరిసరాల్లో ఇష్టానుసారం బోర్లు వేయడానికి అనుమతులు ఇచ్చినప్పుడు స్థానికుల నుండి వ్యతిరేకత ఎదురైనా అధికారులు బోర్లు వేయడానికి అనుమతులు ఇచ్చేసారు. మరో ప్రధాన కారణం అక్కడ భారీ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టడం. అత్యంత పురాతన మట్టి కట్టడం ఉన్న చోట ఆ రాజగోపురానికి అత్యంత సమీపం లో భారీ షాపింగ్ కాంప్లెక్స్ లు కట్టడానికి పూనుకోవడం , లెక్కకి మించి బోర్లు వేయడం వల్ల పునాదులు దెబ్బతిన్నాయి అనేది మెజారిటీ అభిప్రాయం.

కొద్ది రోజుల క్రితం లైలా తుఫాన్ ధాటికి గోపురం లో పగుళ్ళు ఏర్పడి మట్టి పెళ్లలు రాలిన సందర్భం లో చెన్నై పురావస్తు శాఖ వారు ఆ గోపురానికి 150 మీటర్లు రెడ్ జోన్ గా ప్రకటించి అది కూలిపోవడం ఖాయం అని చెప్పినా దేవాదాయ శాఖ అధికారులు పట్టించుకోలేదు. గత రాత్రి కూలిపోవడానికి ముందు కాస్త పక్కకి వోరిగిన రాజగోపురాన్ని చూసి స్తానిక వ్యాపారులు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసిన కాసేపటికే ఒక్కసారిగా గోపురం కుప్ప కూలింది .

ఈ రాజ గోపురం కూలిపోవడం రాష్ట్ర భవిష్యత్ కి సంకేతం అని కొందరు జ్యోతిష్కులు హెచ్చరిస్తున్నారు .... నాస్తికులు వారిని అవహేళన చేస్తున్నారు .. కానీ మన చుట్టూ ఆవరించి ఉన్న ప్రమాదాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు. సూటిగా సుత్తి లేకుండా మనం ఒక అంశాన్ని గమనించే ప్రయత్నం చేస్తే ........... అతి పెద్ద హిందూ దేశం లో అత్యదికుల ఆరాధ్య దైవం అయిన ఈశ్వరుని రాజగోపురం కూలిపోవడం వెనక కూడా నిర్లక్ష్యం , అవినీతి ఆలసత్వం నిండి ఉన్నాయి అంటే ఇంకా సామాన్యుడి పరిస్థితి ఏంటి . 15 రోజుల కింద హెచ్చరించినా గోపురాన్ని గాలికి వదిలేశారు అంటే రేపు జనానికి ఏదైనా అయితే ఎవడు పట్టించుకుంటాడు. దేవుడినే లెక్క చేయని ప్రభుత్వం , అధికారులు జనాన్ని చీమల్లా పురుగుల్లా హీనంగా చూడరు అని గ్యారంటీ ఉందా?

ముందు ముందు జరగబోయేవి అనీ సినిమా సీన్లే... టాగూర్ సినిమాలో ఒక ప్రాంతం అంతా నేలమట్టం అయ్యే ప్రమాదం ఉన్నా తన స్వార్ధం కోసం పనులు ఆపని కాంట్రాక్టర్ నిర్వాకానికి జరిగిన నష్టం ఏంటో ఇక్కడ ఉన్న చాలా మంది చూసే ఉంటారు. అలాంటి ఎన్నో ఘటనలు ఇక ఇష్టానుసారం జరుగుతూనే ఉంటాయి. ఈ ప్రభుత్వ ప్రభుద్దుల నిర్వాకాలకి దేవుడికే రక్షణ లేదు. ఇక మన రక్షణ భారం ఎవరి మీద వేద్దాం . అనర్ధం ఏదన్న ఉంటే ఆ యాంగిల్ లో ఉంటుంది అని అర్ధం చేసుకోవాలి.

చివరి మాట : జ్యోతిష్కులు , పండితులు ఒక విషయానికి క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు .. దేవుడికి అపచారం జరిగితే ప్రళయం వస్తుంది అని చెప్పడం వల్ల దేవుని ఆగ్రహం వల్ల అవన్నీ సంబవిస్తాయి అనే సంకేతాలు ప్రజల్లోకి పంపుతున్నారు . మనం ఎన్ని తప్పులు చేసినా .... మనలో మార్పు తీసుకువచ్చి అక్కున చేర్చుకునే కరుణామయుడు దేవుడు ... ఆ ప్రేమమూర్తి ఎన్నడు ఆగ్రహించడు కానీ ........... ఈ కలియుగానికి అధిపతి అయిన కలి పురుషుడు చూస్తూ ఊరుకోడు .. దైవ దూషణ చేసిన వారిని, ప్రజల మాన ప్రాణాలతో చెలగాటం ఆడుకునే వారిని , తాగుబోతులను , అమాయకులను మోసగించే వారిని తానేం చేసినా దేవుడు వారిని కాపాడడానికి రాకూడదు ... ఇదే కలియుగ ధర్మం. నాస్తికులు అయినా దేవుని మీద నమ్మకం లేని వారు అయినా సాటి మనిషికి సాయం చేసే వారిని కలి తాకనైనా తాకలేడు. అందువలన ఇప్పుడు కలి ఏ రకంగా తన దాడి కొనసాగిస్తాడో ? వేచి చూద్దాం.

5/22/10

కాపాడిన చెరువు గండి

తుఫాన్లు ప్రకాశం జిల్లాకి కొత్త కాదు .....నేను ప్రతి సంవత్సరం చాలా భయంకరమైన తుఫాన్లు చూశాను. అసలు నేను పుట్టిందే తుఫాన్లో అంట. కానీ ఈసారి తుఫాన్ కి ఒక ప్రత్యేకత ఉంది .. అదేంటంటే తుఫాన్ వల్ల కురిసిన నీటికి ఎటు పోవాలో అర్ధం కాకపోవడం. అదేంటి అంటారా చెబుతా వినండి ...... మా ఊరు వెళ్ళాలంటే వాగు దాటి వెళ్ళాలి కాకాపోతే చాలా ఏళ్ళ క్రిందటే ఆ వాగు మీద అధునాతనమైన బ్రిడ్జి కట్టారు. అప్పటినుండి ఎ బాధ లేకుండా జనం తిరుగుతున్నారు. వర్షం వచ్చినప్పుడు ఆ వాగులోకి వచ్చిన నీరు రకరకాల పిల్ల కాలువల లోకి వెళ్లి చెరువులలో కలిసేవి. కానీ కాలక్రమేణా కాస్తంత రాజకీయ పలుకుబడి ఉన్నవారు ఆ చెరువులు కొద్ది కొద్దిగా ఆక్రమించుకోవడం మొదలెట్టి కొంత కాలానికి ఒక చెరువు అసలు లేకుండా పోయింది ... పిల్ల కాలువలు సైతం కనుమరుగు. అయితే గత మూడేళ్లుగా ఆ వాగులోకి అనుకున్నంత నీళ్ళు రాలేదు.

ఆ రోజు మే 19 మామూలుగా వర్షం పడుతుంది . అసలు గాలి అనేది లేదు .. శరత్ గారు తన బ్లాగులో చెప్పిన థి బర్డ్స్ సినిమా డౌన్ లోడ్ పెట్టి ఒంగోలు నుండి ఊరికి బయలుదేరాను .... మాములుగా భోజనాలు చేసి పడుకున్నాం. అర్ధరాత్రి గాడనిద్ర లో ఉండగా దగ్గర్లో పిడుగు పడిన శబ్దం వినిపించి ఉలిక్కి పడి లేచాం .. అప్పటికే చాలా తీవ్రమైన వేగంతో గాలులు వీస్తున్నాయి .పడుకున్నా ఎందుకో నిద్ర పట్టలేదు. తెల్లవారుజామున బయటికి వచ్చి చూశాను మా ఇంటి బయట గేటు అంచులు తాకుతూ తాకుతూ నీళ్ళు వెళుతున్నాయి .... దాదాపు 5 అడుగుల ఎత్తులో ఉండే ఆ గేటు దాకా నీళ్ళు వచ్చాయి అంటే మనసు ఏదో కీడు శంకించింది .... అలాగే గొడుగు తీసుకుని బయటికి వచ్చాను .. నా నడుముల లోతు నీళ్ళు పారుతున్నాయి. సిమెంట్ రోడ్లు వేయడంతో రోడ్డు కన్నా దిగువకి ఉన్న ఇళ్ళు మునిగి పోయాయి. ఆ ఇళ్ళల్లో వాళ్ళు రోడ్ మీద దిగులుగా నిల్చునారు. ఇన్ని నీళ్ళు ఎలా వచ్చాయి .......అంత వాన ఈ కాసేపట్లో పడిందా .. అని అక్కడ ఉన్నవాళ్ళు చర్చిన్చుకుంటున్డగానే.. అందరి మనసుల్లోకి ఒకే సారి ఆలోచన వచ్చింది .. పొరబాటున పై నుండి వాగులోకి నీళ్ళు గానీ వచ్చాయా ... ఒక్క ఉదుటన పెద్దగా కేకలు వేస్తూ ........ అందరినే అలర్ట్ చేస్తూ ఇంటికి వెళ్ళాను ......మా వాళ్ళని నిద్రపోవద్దని .. నీళ్ళు పెరిగితే పైకి వెళ్ళమని చెప్పి ... నాతొ బాటు రావడానికి నా వెంటపడే రాయుడి కళ్ళు గప్పి .. వాగు వైపు బయలుదేరాను ..... మా ఊరి కుర్రాళ్ళు కొందరు అప్పటికే బయల్దేరారు . వాగు దగ్గరికి వెళ్ళిన మేము హతాశులం అయ్యాం. ఎన్నో ఊర్లలో ఆక్రమణకి గురైన చెరువుల్లోకి వెళ్ళాల్సిన నీళ్లన్నీ ఆ వాగులోకే వచ్చాయి .... అసలు బ్రిడ్జి కనిపించడం లేదు .... ఇదే ఇంకాస్త సేపు కొనసాగితే కష్టం ... ఏదో ఒకటి చేయాలి అందరినీ అలర్ట్ చేయమని చెప్పి కొందరిని పంపాం. వండర్ ఏంటి అంటే పై నుండి నీటి ఉరవడి ఎక్కువ అవుతుంది కానీ ఊళ్లోకి నీళ్ళు అంతగా రావడం లేదు ..... కారణం అర్ధం కాకపోయినా....... మనసు పీకుతూనే ఉంది . ఈ లోపు తెల్లారింది ....తెల్లవారాకా వాగుకి అవతల వైపు చాలా పెద్ద గండి పడి కనిపించింది .... ఆ నీళ్లన్నీ అవతల వైపు పొలాల్లోకి వెళ్ళాయి ..... ఆ గండి పడకపోతే నీళ్ళు ఊర్లో పడి చాలా మంది... గ్రామస్తులు నాతొ సహా నిద్రలోనే మునిగిపోయేవారు ..... ఎప్పుడూ లేనిది ఆ వాగులోకి ఆ రకంగా నీళ్ళు రావడానికి కారణం పై ఊర్లలో చెరువుల అక్రమణ లే.... వాళ్ళు చేసిన పాపానికి ఎన్నో గుడిసెలు కొట్టుకుపోయాయి .... అసలు కొన్ని ఊళ్ళకి ఊళ్ళే నామరూపాలు లేకుండా పోయేవి. కళ్ళ ముందు జరిగిన కర్నూలు వంటి ఘోరాలు మళ్లీ జరక్కుండా ఉండాలంటే ... ఆక్రమణలకి అడ్డుకట్ట వేయాలి. గండి పడడం వల్ల ప్రాణాలు మిగిలినా ఎందరివో పంటలు సర్వనాశనం అయ్యాయి.... అ గండి పడిన నీళ్ళు పక్కూరి మాలపల్లె లోకి వెళ్ళాయి ..... అక్కడ వారి యాతన వర్ణనాతీతం

ఒంగోలు టౌన్ నడి బొడ్డులో 10 అడుగుల మేర నీరు పారిందట... ఆ పాపం ఎవరిదీ ? ఊరి మద్యలో వర్షం నీళ్ళు పోవడానికి ఆకాలం లో నుండి ఉన్న ఊర చరువు ని కబ్జా చేసి మార్కెటింగ్ కాంప్లెక్స్ కట్టారు .. ఇక ఆ నీళ్ళు ఎటుపోవాలో తెలీక ఆ కాంప్లెక్స్ లో షాపుల లోకే పోయాయి...సరుకు అంతా నీటి పాలు ....... వంద కోట్ల నష్టం అట .. ఎవడి వల్ల ఎవడికి నష్టం.

మొత్తానికి నాకు భూమ్మీద నూకలున్నాయో లేక బ్లాగుల్లో టపాలు ఉన్నాయో గానీ బ్రతికిపోయా.... టోటల్ గా ఈ తుఫాన్ ని బాగా ఎంజాయి చేసింది మాత్రం మా రాయుడు ఈ రెండు రోజులు ఆ నీళ్ళలో ఈతలు కొడుతూ తిరిగాడు. రోజు డెట్టాల్ స్నానం కూడా చేశాడు.

5/19/10

చంపేశారు ---- ఏం చేయలేక పోయాను

నిన్న మద్యాహ్నం టీవీ చూస్తుండగా ఒక్క సారిగా డాం అని పెద్ద శబ్దం ఆ వెంటనే అమ్మో అయ్యో ... అంటూ పెద్ద కేకలు వినిపించాయి. అలాంటివి జరిగినప్పుడు మనల్ని ఎవరూ కంట్రోల్ చేయలేరుగా ..... సిలిండర్ పేలి ఉంటుంది అన్న అనుమానంతో దగ్గరలో నీళ్ళు ఎక్కడ ఉన్నాయో అని చూసుకుంటూనే అటు పరిగెత్తాను. అక్కడ ఆ చాయలేమీ కనిపీలేదు.. ఏమి జరిగి ఉంటుందా అని అనుకునేలోపే ఆ ఇంటికి వెనకవైపు నుండి ఏడ్చుకుంటూ వచ్చింది ఒకావిడ .... ఏమైందమ్మా అని అడిగే లోపే "మా కుక్క రాత్రి నుండి పిచ్చి పిచ్చి గా ప్రవర్తిస్తుంది.. మున్సిపాలిటీ వాళ్ళకి ఫోన్ చేస్తే రాలేదు అందుకే నక్కలోడిని పిలిపించి .. కల్పించేశాం" అని చెప్పింది వెక్కుతూ. ఆ ఇంట్లో మిగతా కుటుంబసభ్యులు కూడా విషాదవదనాలు వేసుకుని బయటికి వచ్చారు . తుపాకీ భుజాన వేసుకుని చనిపోయిన కుక్కని గోతం లో వేసుకున్న నక్కలోడు కూడా బయటికి వచ్చాడు .

నేను బయటకి రాగానే ప్రతి రోజూ ఒకసారైనా నా దగ్గరికి వచ్చి నా కాలు వాసన చూసి కాసేపు ఆడుకుని వెళ్ళే ఆ కుక్క గుర్తు వచ్చి మనసంతా అదోలా అయిపోయింది ( బహుశా మా రాయుడికి సంబందించిన వాసన అది పసి గడుతుంది అనుకుంటా ) . ఇదే పరిస్థితి రేపు నా రాయుడికి వస్తే .... అమ్మో ఆ ఊహే భరించలేకపోయాను . తర్వాత డౌట్ వచ్చి అడిగా " అవును ఇంజక్షన్ లు వేయించలేదా ?" అని ... "లేదు బాబు అవసరం లేదనుకున్నాం " అని చెప్పారు వాళ్ళు.. అంత కాడికి కుక్కని పెంచుకోవడం దేనికి అని వాళ్ళ మొహన్నే అడుగుదాం అనుకున్నా కానీ అడగలేకపోయా...... కుక్కని పెంచుకోవాలి అనుకోగానే సరా ..... సరైన పద్దతిలో పెంచుకోవాలి .... ఏదో అన్నం పెట్టి వీధి లో వదిలేస్తే .... చెత్త చెదారం తినో లేక పిచ్చి కుక్కలు కరిచో దీనికీ పిచ్చిపట్టే ప్రమాదం ఉంది . చాలా ఊళ్లలో చాల మంది ఇలాగే కుక్కలు పెంచుతారని ఆతర్వాత అక్కడ జరగిన చర్చల్లో విన్నా .... ఏమైనా మనం ఏమీ చేయలేం గా ..

ప్రతి సంవతరం ఇంజక్షన్స్ వేయించాలి
ప్రతినెలా డివార్మింగ్ టాబ్లెట్స్ వేయాలి
వారానికి రెండు సార్లు లాల ( స్నానం ) పోయాలి
హెయిర్ ఫాల్ అవకుండా అప్పుడప్పుడు ఒక టానిక్కు తాపాలి

ఇవన్నీ చేయగలిగితేనే కుక్కలు పంచుకోమని .... ముందు ముందు ఎవరైనా కుక్కని పెంచుకోవడానికి ఉత్సాహపడే వాళ్ళకి చెబుదామని ఈ టపా.




5/18/10

సిగ్గు, శరం - బుద్ది, జ్ఞానం ఉన్నట్టా లేనట్టా ?

ఛత్తీస్ ఘడ్ దంతేవాడలో 75 మందికిపైగా పోలీసులని మావోయిస్ట్ లు బెట్టుకున్నప్పుడు ........ దానికి కనీస బాద్యత వహించాల్సిన చిదంబరం ... రాజీనామా డ్రామా ఆడి వదిలేశారు. ఆంధ్ర తెలంగాణా ఉద్యమాల్లో వేలు పెట్టి పెద్ద రచ్చ చేసినప్పుడే అయన తెలివితేటలు అందరికే అవగతం అయ్యాయి . అలాంటి వ్యక్తి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాడు అనుకోవడం ఎస్పీవోలు , సిఆర్పిఎఫ్ జవాన్లు చేసిన నిజమైన తప్పు. సరే రాజకీయనాయకుల సంగతి వదిలేద్దాం . అడవుల్లో తిరిగే పోలీసులకి వారి ఆఫీసర్లకి కాస్తైనా జ్ఞానం ఉందా లేదా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. వారానికి ఒకసారి పోలీసులపై మావోయిస్ట్ లు తెగబడుతూనే ఉన్నారు. అంతెందుకు గత 30సంవత్సరాలుగా రహదారుల్లో మందుపాతరలు పేలుతూనే ఉన్నాయి అయినా పోలీసులు రహదారి మార్గాన ప్రయాణం మానుకోలేక పోతున్నారు. ఆ దారిన వెళ్తే చచ్చే అవకాశాలు ఉన్నా ఎందుకు పోతున్నారు? విశ్లేషిస్తే కారణాలు చాలా సిల్లీగా ఉంటాయి.

మన పోలీసులకి కనీస దేహదారుడ్యం కూడా ఉండదు .. పోలీస్ శాఖలో ఉద్యోగం కోసం చేయాల్సిన పరుగు , లాంగ్ జంప్ హైజంప్ వంటివి చేయకుండా దొడ్డిదారిన ప్రవేశించడం . లంచాలు ఇచ్చి ఉద్యోగాలు సంపాదించడం ప్రధాన కారణం. ఇక ఉద్యోగాలు వచ్చేశాక ఉద్యోగ భద్రత వగైరాల వల్ల అసలు శారిరక వ్యాయామాలు చేయకపోవడం .... ఆ కారణంగా అడవుల్లో కూంబింగ్ డ్యూటీ లు వేశాక అక్కడ నడిచి తిరగలేకపోవడం. మనం ముందు అనుకున్నట్టే మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో రోడ్డు మార్గాన పోలీసులు ప్రయాణించడం ... ఆత్మహత్యా సదృశ్యం .. అసలు రోడ్డు మార్గాన వెళ్ళకూడదు ... ఒక వేళ రోడ్డు దాటాల్సి వస్తే ఇటు నుండి అటు దూకి వెళ్ళాలి ........ఇది ట్రైనింగ్ లో చెప్పే ప్రధాన పాఠం. రోడ్లకు దూరంగా మావోయిస్ట్ లు ఎలాగైతే అడవి మార్గాన సంచరిస్తున్నారో పోలీసులు కూడా అడవి లో సంచరించ లేక పోతున్నారు ఎందుకంటే . వీళ్ళకి ఆ ఓపిక లేదు , వీళ్ళు తిరగలేరు , పట్టుమని పది కిలోమీటర్లు కూడా నడవలేరు. అసలు ఒక వ్యూహం అనేది ఉండదు . పనికి మాలిన వాళ్ళని ఎంపిక చేసి వాళ్ళని అడవుల్ని జల్లెడ పట్టడానికి పంపిస్తే ఇలాగే ఉంటుంది. ఇకనైనా సిగ్గు తెచ్చుకోకపోతే రేపెలా ఉంటుందో తెల్సా .. ముంబై తరహా ఘటన లు జరిగినప్పుడు కాపాడడానికి వచ్చే యెన్.ఎస్.జి కమాండో లు కూడా చేతగాని వారు వచ్చినా ఆశ్చర్యం లేదు .


మరొక కారణం పై స్థాయిలో అవినీతి ...అసలు కేంద్రం తలుచుకుంటే గగన మార్గాన తిరగడానికి పోలీసులకు హెలికాప్టర్లు .. అత్యదునిక శాటిలైట్ ఫోన్లు సమకూర్చలేదా? సమకూర్చగలదు కానీ ఒక వేళ వాటికి నిధులు మంజూరు చేస్తే ... చివరికి పోలీసుల వద్దకి వచ్చేవి డబ్బా ఫోన్ లు ... తుప్పుపట్టిన పాత హెలికాప్టర్లు .

ఆయుధాల్లో నాణ్యత లేదు, మనుషుల్లో సత్తా లేదు. అసలు గ్రీన్ హంట్ ఎందుకో ఎవడికీ తెలీదు . అంతా మాయ . ఈ సారి పోలీసులతో బాటు ప్రజల ప్రాణాలు సైతం గాల్లో కలిసి పోయాయి. మావోయిస్ట్ లు సమసమాజం స్థాపించే లోపు సమాజమే లేకుండా పోతుందేమో !

5/14/10

లౌకికవాదమా? హిందూమతద్వేషమా ?

లౌకికవాదులం అని చెప్పుకు తిరిగే కొందరి శైలి గత కొద్ది కాలంగా గమనిస్తూ వస్తున్నాం . పిచ్చ క్యామెడీ గా అనిపించింది ..... హిందూ మతం మీద విషం గక్కడానికి వీరు చేసే విశ్వప్రయత్నాలు చూసి నవ్వు కూడా వచ్చింది. అసలు మతపరమైన అంశాలు నేను గమనించడం మొదలు పెట్టిన తొలినాళ్ళలో ఒక సంఘటన జరిగింది. అదే గోద్రా లో సాధువులు వెడుతున్న ఒక రైలుని యాసిడ్ బాంబులతో దాడి చేసి తగలెట్టి.... బ్రతికిన వారిపై పెట్రోలు పోసి తగలెట్టారు అప్పుడు ఎవరూ మాట్లాడలేదు ( ఒక్క బిజెపి తప్ప) దానికి ప్రతిగా కొందరు దుండగులు విధ్వంసం సృష్టించి కొందరు మైనారిటీలను పొట్టన బెట్టుకున్నప్పుడు మాత్రం అన్ని రాజకీయ పార్టీలు ఏకమై ఖండించాయి. రెండవ సంఘటనని వీరు ఖండించడం మనం సమర్ధించగలం గానీ వీరు మొదటి ఘటన ని కూడా ఖండించి ఉంటే బాగుండేది అనిపించింది. సరే రాజకీయ నాయకుల పరిస్థితి అంతే ఓట్లు పోతాయి అనే భయంతో ఆలా మాట్లాడి ఉండవచ్చు అనుకుందాం. లౌకిక వాదుల పరిస్థితి ఏంటి. వారు కూడా దశాం లో ఇస్లామిక్ లేదా మరో మతానికి సంభందించి తీవ్రవాదం చెలరేగినప్పుడు చూడనట్టు నటిస్తారెందుకు .. మనదేశం లో ఇస్లామిక్ తీవ్రవాదం ఎంత భయంకరమైనదో ఎవరికీ ఎవరూ చెప్పనవసరం లేదు. అంతర్గతంగా విద్వంసం సృష్టించడానికి దేశీయ ముష్కరులు తయారు అవుతుంటే లౌకిక వాదులకి కనిపించదేం .. కేవలం హిందూ మతానికి సంబంధించి మాత్రం చీమ చిట్టుక్కుమంటే లటుక్కున వచ్చి పుటుక్కున బ్లాగులో రాసేసే వింత లౌకిక వాదుల ని చూసి నవ్వాలో ....ఇంకేం చేయాలో అర్ధం కావడం లేదు. హిందుత్వ తీవ్రవాదం లేదు అనడం లేదు ... కానీ లౌకిక వాదులం ... లేక ఇంకో వాదులం అని చెప్పుకునే వారు అన్ని రకాల మతాలను ఆయా మతాల తీవ్రవాదాన్ని సమ దృష్టితో చూస్తే బాగుంటుంది .

ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం ..... అ మధ్య MF వేరే దేశం పౌరసత్వం తీసుకున్నాడు అనే వార్త తెలియగానే లబోదిబో మని గుండెలు బాదుకున్నారు. అందరికీ తెల్సిందే ......కానీ ఈ మద్య లక్నోలోని దారుల్ ఉలూం ఆఫ్ దేవ్‌బంద్ అనే ముస్లిం సంస్థ ఒక ఫత్వా జారీ చేసింది. తాము పని చేసే చోట్ల ముస్లిం యువతులు మగవాళ్ళతో మాట్లాడకూడదు , కలిసి పనిచేయకూడదు .... ఆలా చేస్తే శిక్షార్హులు అవుతారు అనేది ఆ ఫత్వా సంక్షిప్త సారాంశం . ఇదే పని ఏదేని హిందూ సంస్థ చేసి ఉంటే మన లవ్ కిక్ వాదులు ఏం లొల్లి బెట్టేవారో తెలీదు గాని ఈ ఫత్వా జారీ అయి నాలుగు రోజులు దాటినా కుయి కయి లేదు. ఎక్కడో ఎవడో ఏదన్నా హిందూ వ్యతిరేక ఆర్టికల్ వ్రాస్తే మాత్రం వీరి గరళ కంఠం లోనుండి బౌ బౌ లు వస్తాయి. ఏం ఇస్లాం మతం లో జరిగే వివక్ష లవ్ కిక్ వాదులకి కనిపించదా ?? లేక ధైర్యం చాలదా ? లేక లౌకిక వాదం అంటే హిందూ మత వ్యతిరేకమా ??

என்னடா டேய் சொல்றா

5/13/10

విజయ్ మాల్యా బొమ్మరిల్లు



నువ్వే చేశావ్ .. మొత్తం నువ్వే చేశావ్





నేనా ??????????????????






అవును నువ్వే .... ఇంక చాలు ............మేము కోల్పోయింది చాలు





ఏమి కోల్పోయారురా మీరు????????????????




ఇంకా అర్ధం కాలేదా నీకు.... నిన్నటిదాకా మన దగ్గర ఏముందో ఇవాళ ఎం లేదో అదే........... గెలవడం ...... అదే కోల్పోయింది. నువ్వెప్పుడూ రన్స్ బాగా చేయాలి ... ఆరెంజ్ క్యాప్ కొట్టేయాలి అని చూస్తావ్ తప్ప టీం కి ఏమి కావాలో నువ్వు తెలుస్కోవు.


నీ బౌలింగ్ లో ఫుల్ గా రన్స్ ఇచ్చి ఆ తర్వాత చేజ్ చేయమంటావ్ .. మేమేదో కొట్టాలని వెళ్తాం .. కానీ అప్పటికే నువ్వు బాల్స్ అన్నీ తినేసి ఉంటావ్. మా బ్యాటింగ్ కూడా నువ్వే ఆడేస్తే ఇంక మేమెందుకురా ఆడటం .................నవ్వుతున్నారు రా అక్కడ మమ్మల్ని చూసి.



ఇప్పటి దాకా నువ్వు సచిన్ తో ఆరెంజ్ క్యాప్ రేస్ లో గెలిచా అనుకుంటున్నావ్ కదూ ....కానీ నిన్ను గెలిపించడానికి మేము ఆరు మ్యాచ్ లుగా ఓడిపోతూనే ఉన్నాము రా ...... ఇలానే ఓడిపోతుంటే ఏదో ఒకరోజు ........ఏంట్రా మనం ఆడింది అని వెనక్కి తిరిగి చూస్తే టోర్నమెంట్ అంతా నువ్వే ఉంటావ్ అందులో మేము ఉండం.


ఇప్పటిదాకా మేము నీతో హ్యాపీ గా లేమురా ఉన్నట్టు నటించాం .. ఇక ముందు కూడా నటిస్తాం కానీ ఒక రిక్వెస్ట్ ........ మేము కొట్టలేని రన్స్ ఇచ్చి .. మళ్లా మాకు మిగలకుండా బాల్స్ అన్నీ తినేసి . మేము చేజ్ చేయాలని మాత్రం కోరుకోకు ప్లీజ్ .

5/12/10

సమానత్వం సాధించారు

సరిగ్గా ఒకటిన్నర సంవత్సరం క్రితం మేము బ్లాగుల్లోకి వచ్చినప్పుడు బ్లాగుల్లో అసమానతలు వివరీతగా ఉండేవి. " ఎ " గ్రూపు ఆధిపత్య ధోరణి కనిపించేది. జూనియర్ల ర్యాగింగ్ జరిగేది. కొత్తగా బ్లాగులు తెరిచిన వారి మీద ఒక ఈగిల్ ఐ పని చేస్తూ ఉండేది. వాడి మానాన వాడు రాసుకున్నాడా సరే సరి చూసే చూడనట్టు వదిలేసేవారు ఆలా కాకుండా " ఎ " గ్రూపు కి నచ్చని వారి బ్లాగులు ( తెలీక) చదివి కామెంట్ పెట్టాడా ఇంకా వాడు చచ్చాడే. వేరే బ్లాగుల్లో కామెంట్లు మానుకునే వరకు వాడి అంతు చూసే వారు కొందరు అజ్ఞాతలు. ఇంకా ఆహా ఓహో లు తప్ప .. వారి మీద చిన్నపాటి వ్యంగ్యాస్త్రాలు వ్రాసినా కూడా వారి వందిమాగాదులు బెదిరించేసేవారు. మరీ ఒక బ్లాగర్ ని అయితే తను మామూలుగా వ్రాసిన ఒక విమర్శకు తట్టుకోలేక ..... మేము సమాజం లో ఉన్నత స్థానం లో ఉన్న వాళ్ళం నీ ఐపి పట్టుకుని నీ అంతు చూస్తాం అని బెదిరించారు. ( మేము ఇలాంటి ప్రయోగాలు చిన్నప్పుడే మా రాజేష్ గాడి మీద ప్రయోగించాం)

ఇంకా కొన్ని ఇరిటేషన్ కలిగించే అంశాలు ..... " ఎ " గ్రూపు వారి వ్యంగ్యమైన కామెంట్స్ ... ఎవరైనా వారి గ్రూపులో చేరకపోయినా ...... వారికి తమ మెయిల్ ఐడి ఇవ్వకపోయినా వారు వ్రాసిన టపాని వెక్కిరిస్తూ కామెంట్ పెట్టేవారు. వీరితో ఎందుకు వచ్చిన గొడవలే అని వారి దారిలోకి వస్తారని వారి భావన ఏమో. చిర్రెత్తుకొచ్చేది అవి చూస్తే .... బాగా వ్రాసే యువ బ్లాగర్లని అజ్ఞాతంగా నో లేక అనామక ఐడి క్రియేట్ చేసుకుని ...... వాడిని అల్లాడిచ్చి ఆకులు మేపేవారు. ఇలాంటి అనుభవం నాకూ ఒకసారి అయింది. అప్పుడు నేను జూనియర్ కదా అందువల్ల .. ఇష్టానుసారం అజ్ఞాతల రూపం లో దాడులు .. వల్గర్ కామెంట్స్... బాబోయి తట్టుకోలేము ఆ నీచాన్ని .

సరిగ్గా అప్పుడే పుట్టింది కెబ్లాస ముల్లుని ముల్లుతోనే తీయాలి ... వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి అన్నట్టు వారి దారిలోనే ఎదురు దాడి మొదలెట్టింది కెబ్లాస . కెబ్లాస దెబ్బకి " ఎ " గ్రూపు త్వరగానే తోక ముడిచింది. ఈ మద్య కొత్తగా బ్లాగుల్లోకి వచ్చినవారు వారికి ఇష్టం వచ్చినట్టు హాయిగా బ్లాగుతున్నారంటే ఆ పుణ్యం కెబ్లాసదే . కొందరు యువ ఔత్సాహిక బ్లాగర్లు వారం లో 50 టపాలు వేయగాలిగారంటే కారణం కేవలం కెబ్లాస. అంతకు ముందు ఒక బ్లాగర్ తనకి ఇష్టం వచ్చినట్టు బ్లాగడం మొదలెట్టగానే .... ఆలా రాయకూడదు ఇలా రాయాలి అని క్లాసులు .. వ్యంగ్యాస్త్రాలు ... పైగా " ఎ " గ్రూపు బ్లాగుల్లో కొత్త బ్లాగర్లని కామెడీ పాత్రలు చేసి ఆడుకోవడం. నిజంగా సీనియర్లు .....గత మూడేళ్లుగా బ్లాగుల్లో ఉన్న వాళ్ళు చెప్పండి ..... బ్లాగ్లోకం లో ఇప్పుడు ఉన్న సహ్రుద్బావ వాతావరణం, సమానత్వం ఏడాది కింద ఉందా??

అసలు భయంకరమైన కామెడీ ఏంటో తెల్సా .... " ఎ " గ్రూపు వారి రాజకీయాలకు భయపడి ఎవరైనా అమాయకులు బ్లాగులు మూసేస్తే ఆ నేరాన్ని తెలివిగా " ఎ " గ్రూపు ని బలంగా వ్యతిరేకించే వారి మీదకి నేట్టేయడం. వీరి వల్లనే వారి బ్లాగు మూతపడింది అని ప్రచారం చేయడం . వీరు బ్లాగు లోకాన్ని గబ్బు చేశారు ... ఆధిపత్యం ప్రదర్శించాలనుకున్నారు .... కానీ కెబ్లాస ఆవిర్భావంతో సమానత్వపు పరిమళాలు బ్లాగ్లోకంలో వ్యాపించాయి . కెబ్లాస సభ్యులు సమానత్వం సాధించారు.

కొత్త బ్లాగరులారా ..... స్వేచ్చగా బ్లాగండి ... మీ భావాలు .. మీ ఆలోచనలను నియంత్రించకుండా ప్రపంచానికి తెలియచెప్పేందుకు మాలిక ఉంది. బ్లాగులు మూసిన బ్లాగర్లారా మళ్లీ బ్లాగులు తెరవండి .... ఒక్కసారి గట్టిగా కేక పెట్టి చూడండి. బ్లాగు లోకం ఎవరి సొత్తూ కాదు .

5/11/10

ఆన్ లైన్ బెదిరింపులు

ఏమిటో ఆ మద్య ఆర్కుట్ లో కొందరు బెదిరించేవారు ప్రొఫైల్ డిలీట్ చేస్తున్నా అని తమ ప్రొఫైల్ స్టేటస్ పెట్టేవారు ... అందరూ వచ్చి బ్రతిమాలినా వినకుండా డిలీట్ చేసే వారు ..........మళ్లీ ఐదు రోజుల్లో కొత్త ప్రొఫైల్ తో సిద్ధం అయ్యేవారు . హిహీ నను యాడ్ చేస్కో అని మెసేజ్ పెట్టే వారు. ఆ మాత్రానికి వారం ముందు బెదిరించడం దేనికో అర్ధం అయ్యేది కాదు. మళ్లీ ఆర్కుట్ ని వదిలి ఉండలేక ఒక కన్ను వెసి ఉంటారు ....... తర్వాత అందరూ తమని మర్చిపోవడం ఓర్చుకోలేక కొత్త ప్రొఫైల్ తో వచ్చేస్తారు. నిజంగా డిలీట్ చేసేసే వారు పబ్లిసిటీ లేకుండా దిలేట్ చేయొచ్చు కదా అని స్క్రాప్ పెడితే చూడనట్టే నటించేవారు. వీళ్ళు ఒక రకం జీవులు .. అందరి అటెన్షన్ తమ మీదనే ఉండాలని కోరుకునే వారు.

బ్లాగుల్లో కూడా ఇలాంటివి గతం లో జరిగినట్టు గుర్తు. గొడవలకి భయపడి గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయే వారు కొందరైతే .... బెదిరింపు టపాలు పెట్టడం అందరూ కామెంట్స్ లో బ్రతిమాలాక తమ నిర్ణయం మార్చుకునే వారు కొందరు. కొందరైతే ఇవాల్టి నుండి నా కామెంట్ బాక్స్ కి తాళం వేస్తున్నా అని చెప్తారు . కొన్నాల్లకే తాళం బద్దలు కొట్టేస్తారు . ఆ మాత్రం దానికి బెదిరించడం దేనికి . ఈ మద్య ఇంక సెలవు అని టపా వ్రాసి బ్లాగు మూసేయడం లేదా ఆపేయడం ఆనవాయితీ అయినట్టు ఉంది . కొందరు ....... సెలవు ఇదే ఆఖరు టపా .. అని ఎవరికో చివరి అప్పగింతలు చెబుతున్నట్టు టపా పెట్టి అందరినీ టెన్షన్ పెట్టి మళ్లీ కామెంట్లు ఏమైనా వచ్చాయా అని అక్కడక్కడే తిరుగుతుంటారు. రెండు రోజులకు మళ్లీ ఎందుకీ బెదిరింపులు .... ఆవేశం వచ్చినప్పుడు అంకెలు లెక్కపెట్టుకోండి అంతే గాని బ్లాగు ఉసురు తీయకండి. నువ్వెవరయ్యా మాకు చెప్పడానికి అంటారా .... మరి ఆకేదో పువ్వేదో తెలీనోల్లు బ్లాగెలా రాయాలో బ్లాగార్లెలా ఉండాలో లెక్చర్ ఇవ్వగా లేనిది నేనివ్వకూడదా.

మనలో మాట కాగడా తన చివరి పోస్ట్ మార్చ్ 30 న వ్రాసి వదిలేశాడు అప్పటి దాకా రోజుకొక టపా వ్రాసే వారు కొందరు అదే మార్చ్ 30 న టపా వ్రాసి మళ్లీ నెల దాకా వ్రాయలేదు . వారు మొత్తం నలుగురు వారిలో ఒకరు కాగడా అయి ఉండవచ్చు అని నేను అనుకునే లోపే వారిలో ఇద్దరు వ్రాయడం మొదలెట్టారు .... మిగతా ఇద్దరు వ్రాయడం లేదు .... మరి కాగడా బిజీ అవడం వల్ల మూతపడిన ఆ బ్లాగులు ఎవరివి.

5/10/10

జయసూర్యా..... నువ్ ఎంచుకున్న రాగమేంటి తెంచుకున్న తాళం ఏంటి

శీర్షిక చూడగానే మీకు కింగ్ సినిమా గుర్తు వచ్చి ఉండాలి . కింగ్ సినిమాలో శ్రీను వైట్ల అడ్డదిడ్డంగా ఎకిపారేసినా మనోడికి బుద్ధి రాలేదు కావాలంటే మీరే చూడండి.




ఇప్పుడు ఇది చూడండి .... గోలీమార్ లో తను స్వరపరచిన పాట .




ఇంతకీ ఆ అన్నాయి ఎవరో కనుక్కున్నారా?

భారతీయ సమాజం - నాకు తెల్సిన విషయం

స్త్రీ పురుషుల మద్య స్నేహాన్నిసరిగా అర్ధం చేసుకోలేని పరిస్థితి గురించి చర్చ జరిగినప్పుడు కొన్ని విషయాలు గురించి తీవ్రంగా ఆలోచించడం జరిగింది. స్త్రీకి ఆర్ధిక స్వాతంత్రం లభిస్తున్న నేటి రోజుల్లో ఎవరేమి అనుకుంటే నాకేమి నా మనసు నాకు తెల్సు అని ధైర్యంగా ముందుకు పోగలిగిన పరిస్థితులు నేడు ఉత్పన్నం అయ్యాయి . దీనికి ఆర్ధిక స్వాతంత్రం ఒక కారణం అయితే అర్ధం చేస్కునే కుటుంబసభ్యులు మరొక కారణం గా మనం చెప్పుకోవచ్చు. కానీ ఆనాటి కాలం లో స్త్రీకి ఎ ఆర్ధిక ఆసరా గానీ , కుటుంబం నుండి అండదండలు గానీ అంతగా లభించనప్పుడు ఆమె పరిస్థితి ఏమిటి ??? అప్పట్లో మన వాళ్లకి కుటుంబ నియంత్రణ లేక పోవడం గంపలు గంపలు గా పిల్లలని కని పడేయడం వారిని పెంచలేక సతమతమవడం మొదలైన కారణాలు పీడిస్తున్నప్పుడే ... కొందరు ధనవంతులైన వృద్ధులు కన్నె పిల్లలను పెళ్లి చేసుకోవడం మొదలెట్టారు . అలాగే యుక్తవయస్సులో ఉన్న వారు కూడా వివాహం తగిన ఈడు జోడు ఉన్న వారు కూడా పెళ్లి చేసుకునే వారు . మొదటి కేసు లో వృద్ధుడైన భర్త మరణించినా అమ్మాయి చిన్న వయస్సులో విధవరాలయ్యేది. లేదా రెండవ కేసు విషయానికి వచ్చేసరికి ఆనాడు తగిన వైద్య సౌకర్యాలు లేక విషజ్వరాలు వంటివి సోకి మరణించడం వంటివి సంభవించేవి. ఔనన్నా కాదన్నా మనది అనాదిగా పితృస్వామ్య వ్యవస్థ . అమ్మాయి మరణిస్తే అబ్బాయి మరొక వివాహం చేసుకునే వాడు కానీ అబ్బాయి మరణిస్తే ఆమెను మరొకరు వివాహం ఆడేవారు కాదు . ఇక ఆమెకి అన్నీ కష్టాలే .

సరిగ్గా అటువంటి పరిస్థితే వచ్చినప్పుడు జరిగిన సంఘటన ఇపుడు మనం చదువుదాం . దత్తాత్రేయుడు అనే యువకునికి , సావిత్రి అని యువతికి ఘనం గా వివాహం జరిపించారు వారి తల్లి దండ్రులు. చాలా చక్కని సంసారం వారిది . అయితే కొన్నాళ్ళకి అ యువకునికి జబ్బు చేసి ఎన్ని మందులు వాడినా తగ్గగా పోగా నానాటికీ క్షీణించసాగాడు. చివరి ప్రయత్నగా గంధర్వపురం లో ఉండే శ్రీ నరసింహ సరస్వతీ వద్దకు తీసుకొస్తుండగా మార్గ మద్యలో ఆ యువకుడు మరణిస్తాడు. ఊరు కాని ఊరు లో భర్త శవం పై పడి ఆమె ఎడుస్తుండగా ఒక ముని వచ్చి ఆమెకు కొన్ని మంచి మాటలు చెప్పి స్వాంతన చేకూరుస్తాడు. అప్పుడు ఆమె తనకు మార్గం సూచించమని అడుగగా ఆమెకు బృహస్పతి వుపదేశించిన స్త్రీ ధర్మాలు చెబుతాడు. భర్త చనిపోయిన యావజ్జీవమూ విధవా ధర్మం పాటించడం ఉత్తమం (అప్పట్లో రెండో వివాహం ప్రసక్తి లేదు) ఇవన్నీ భర్త లేక తను బ్రతుకలేను అనుకునే వారికే . ఆ విధవా ధర్మాలు చాలా ఉత్తమం అయినవి. ఆమె తప్పని సరిగా జుట్టు తీయించుకోవాలి . లేదంటే జుట్టు అనే త్రాడుతో భర్త ను కట్టివేసినదోషం వస్తుంది . అమెతోబాటు మరణించిన ఆమె భర్త సైతం ఆ పాపాన్ని మోయవలసి వస్తుంది. నిత్యం తలస్నానం చేసి ఒంటి పూట భోజనం చేస్తూ ఉండాలి. వయసు మేడ పడిన వారు రెండవ పూట పాలు, ఫలములు భుజించవచ్చును. నేల మీదనే పడుకోవాలి. తెల్ల చీరలు ధరించాలి .. సుఘంధములు ,పూలు ధరించరాదు. వేసవికాలంలో నీరు దొరకని ప్రాంతాల్లో చలివేంద్రం పెట్టించాలి. వైశాఖమాసం లో జల దానం , కార్తీక మాసం లో దీప దానం , మాఘం లో నెయ్యి నువ్వులు దానం చేయడం శ్రేష్టం .. ఇలాంటి ధర్మాలు ఆచరిస్తే ఆమె స్వర్గానికి పోవడమే కాక మరణించిన ఆమె భర్త ఆత్మ సైతం శాంతిస్తుంది. ఇలా చేయలేని పక్షం లో పతివ్రతయైన స్త్రీ , తన భర్తను విడిచి బ్రతుకలేను అని భావించే స్త్రీ స్వర్గమునకు పోవలేనంటే సతీసహగమనం చేయడం ఉత్తమం అని చెబుతాడు. ఆమె గర్భవతి అయినా , లేక పసి బిడ్డలు ఉన్నా లేదా ఆమె దూర ప్రాంతమున ఉన్నా ఇటు వంటివి చేయకూడదు అని చెబుతాడు. దానికి సిద్ధపడి సహగమనం చేయదలచిన సావిత్రి భక్తికి మెచ్చి ఆమెని వారించి ఆమె భర్తను బ్రతికించాడు అన్నది కధ.

పై వాఖ్యాల సారాంశం........ భర్త లేని స్త్రీ ని ప్రస్తుత సమాజం ఎంత ఇబ్బంది పెడుతుందో మనకి తెల్సు . ఆ రోజుల్లో యవ్వనవతి , సౌందర్యవతి అయిన స్త్రీ కి వైధవ్యం కత్తి మీద సాము వంటిది . ఆమెకి లోకం లో తిప్పలు , నిందలు తప్పవు సూటి పోటి మాటలు , అవమానాలు భరించలేక ఆ ఉమ్మడి కుటుంబాలలో ఒకరి సంపాదన మీద పడి బ్రతికెందుకు ఆత్మాభిమానం అడ్డు వస్తూ , పరాయి మగవానిని కన్నెత్తి చూసినా రంకు అంటగట్టే ఆ సమాజం లో ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకునే బదులు భార్తతోనే సహగమనం చేయడం ఉత్తమం. అలా కాకుండా కాస్త పెద్ద వారైన కుమారుల అండ ఉంటే వారి సంరక్షణలో వైధవ్యం స్వీకరించి విధవా ధర్మాలు పాటించడం మరొక మార్గం.

ఇక్కడ పసిబిడ్డలు ఉన్నవారికి , గర్భవతులకు , దూరదేశాన ఉన్నవారికి సహగమనం నిషిద్దం అనేది తెలుస్తుంది . పైపెచ్చు ఆనాడు స్వర్గం నరకం రెండూ ఉన్నాయి అని బలంగా నమ్మే మన సమాజం లో స్వర్గానికి పొదలచిన మంచి నడవడిక కలిగిన స్త్రీలకే ఇవన్నీ వర్తిస్తాయి. అలా కాకుండా ఇష్టారాజ్యం వ్యవహరిస్తూ థూ నా బొడ్డు బాయి అనుకుని తెగించిన వారికి చెప్పడానికి ఏమీలేదు. వారిని ఎవరూ ఏమి చేసేవారు కూడా కాదు. ఆకాలం లో పునర్వివాహాలు లేకపోయినప్పటికీ .. ఒంటరి స్త్రీలు కొందరు జారిణులై మద్యమాంసానికి బానిసలై పతనమైన ఘటనలు ఉన్నాయని చెప్పవచ్చు.

సరే విషయం లోకి వద్దాం ...పరిస్థితులను బట్టి తన స్వరూపాన్ని మార్చుకున్నా భారతీయ సమాజం చాలా గొప్పది. కాకపొతే ప్రతి యుగం లోనూ పర్వర్ట్ లు ఉంటారు. అది భారత దేశం కావచ్చు , పాశ్చాత్య దేశం కావచ్చు ఎదుటి వాడిని బలహీనపరచాలంటే వాడి కుటుంబం లోగానీ వంశం లోగానీ ఆడవారి ద్వారానే పగ తీర్చుకునే అవకాశాలు వీజీగా దొరుకుతుంది అనేది చరిత్ర చెప్పిన సత్యం. ఇంత చదువుకుని ఇంత పరిపక్వత సాధించాం అని చెప్పుకునే ఈ రోజుల్లోనే ఎవడినైనా తిట్టాలంటే నీ అమ్మ , నీ అక్క , నీ ఆలి ఇవి స్టార్టింగ్ పదాలు. ఆ కారణం చేతనే అవతలి వారి కుటుంబాల గురించి మొత్తం తెల్సుకునే ప్రయత్నంలో కొందరు తప్పటడుగులు వేస్తారు . వాటిని హైలైట్ చేయడం కూడా మనలో ఉన్న పర్వర్షన్ బయటపెట్టుకోవడమే . మన సమాజం చందమామ లాంటిది అయితే అందులో చిన్న మచ్చ లాంటి కొందరు చేసే పనులని మొత్తం సమాజానికి ఆపాదించి .... జాతినే ప్రశ్నించే మిడి మిడి జ్ఞానశిఖరాలు ఎక్కువై అసలే దిగజారిన భారతీయ గౌరవాన్ని మరింత దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారు. శ్రీరామ చంద్రమూర్తి సీతమ్మని అనుమానించి అగ్నిప్రవేశం చేయించిన ఉదంతానికి సరైన కారణాలు వెదికి , ఆయన లోకకల్యాణం కోసమే చేశాడనిచెప్పిన నోటితోనే మనకి తెల్సిన వారబ్బాయి పెళ్ళికి ముందే అమ్మాయికి సంబంధించి కొన్ని రుజువులు అడిగాడు కాబట్టి వాడు ....ఎదవ .. అలాంటి ఎదవలు ఉన్న భారత దేశం విలువలు లేనిది అని తీర్మానించేస్తాం. రెండు కోట్లకి పైగా యువకులు ఉన్న ఆంధ్ర దేశంలో ఎవడో కౌన్ కిస్కా గొట్టం ఒకడు ( వాడికి తెలిసీ తెలీని వయసులో జరిగిన ఎ సంఘటన వాడి మీద ఎ ప్రభావం చూపిందో) ఏదో తన భార్య శీలవతి అని రుజువు చేసుకోవాలనుకున్నాడు. వాడిని చదువుకుని ఉద్యోగాలు చేసే ఈ తరం అబ్బాయిలకి ప్రతినిధిని చేసేస్తారు కొందరు.
వాడికి కావాల్సింది పెళ్ళాం కాదు మెంటల్ కౌన్సిలింగ్ . వాడి మనసు కి పురుగు పట్టింది. తనలో ఉన్న చెడు కనిపించకుండా వాడు వేసుకున్న ముసుగే సాంప్రదాయం.... బ్లా బ్లా బ్లా .

ఎవడో పర్వర్ట్ ... వాడు కూడ మనిషి కాదు ఒక కధలో పాత్ర ఇండియన్ వాల్యూస్ అంటే అమ్మాయి పెళ్ళికి ముందు శీలవతిగా ఉండడం అన్నాడట. దాన్ని పట్టుకుని కొందరు భారతీయ విలువలని ప్రశ్నిస్తున్నారట.

భారతీయ విలువల గురించి ఒక్క మాట లో చెప్పాలంటే ఒక చిన్న సంఘటన కి సంబంధింఛి చెప్పుకోవచ్చు .

ఒక అబ్బాయి బండి మీద వేగంగా వంకర టింకరగా వెళుతూ ఒక సెంటర్ లో పడ్డాడు అనుకోండి ... మెజారిటీ ప్రజల స్పందన .

ఇండియా లో : చినగా వెళ్ళొచ్చు కదయ్య లేదా అంత తొందరేంటి బాబు లేదా ఏరా సామీ ఇంట్లో చెప్పి వచ్చావా

అమెరికాలో : Asshole or Mother **** er

పాకిస్తాన్ : क्यारे देखके नहीं चलते माके लाव्दे

ఈ తేడా చాలు మన సమాజం విలువ చెప్పడానికి.

చివరిగా ఒక స్కూల్ లో పది మంది చదువుకున్నారు . అందులో ఐదుగురు మంచి స్థాయి వచ్చి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్కుంటూ తమ ఉన్నతికి కారణం ఆ స్కూల్ అని చెప్పుకున్నారు . మరో ఐదుగురు పతనమై పోయి తమ పతనానికి కారణం అదే స్కూల్ అని చెప్పారు యేది నిజం.

తేడా స్కూల్ లో లేదు మనలో ఉంది. అలాగే భారతీయ సమాజం మంచిదే కానీ చూసే దృష్టిని బట్టి అది కనిపిస్తుంది.

( నాదీ మిడి మిడి జ్ఞానమే - తప్పులుంటే సరిచేయగలరు)

5/6/10

సిగ్గు సిగ్గు - నరరూప రాక్షసులు తప్పించుకునే అవకాశం


గత జనవరి 30 న చిన్నారి నాగ వైష్ణవిని విజయవాడలో కిడ్నాప్ చేసి అత్యంత కిరాతకంగా హత్య చేసిన మోర్ల శ్రీనివాస రావు , జగదీశ్, పంది వెంకట్రావ్ గౌడ్ లకు శిక్ష నుండి తప్పించుకునే అవకాశాలు వరుసగా వస్తున్నాయి. నిందితులను సరిగ్గా ఇంటరాగేట్ చేయకుండా పోలీసులు వారికి సహకరిస్తున్నారు అనే ఆరోపణలు వస్తున్న నేపధ్యం లో ఈ రోజు ఫోరెన్సిక్ ల్యాబ్ వైష్ణవి కి సంబందించిన బూడిద నుండి డియెన్ఏ సేకరించడం కష్టం అని తేల్చి చెప్పడంతో వైష్ణవి హత్యని నిరూపించే అవకాశం లేకుండా పోయింది. సంఘటనా స్థలం లో బూడిద కుప్పలా దొరికిన వైష్ణవి కి చెందిన ఎముకలను క్షుణ్ణంగా పరిశీలించిన ఫోరెన్సిక్ ల్యాబ్ కి అందులో ఏ ఆధారాలు దొరకలేదట. డి యెన్ ఏ సేకరించలేకపోయాం అంటూ చేతులు ఎత్తేసింది. ఒక పక్క నిందితులు కోర్టులో ఒప్పుకునే పరిస్థితి లేదు. మరో పక్క నిన్ననే నిందితులకు నార్కో అనాలసిస్ పరీక్షలు చేయవద్దని సుప్రీం ఆదేశించడం ఈ కేసుకి అడ్డంకి గా మారింది. వైష్ణవి తండ్రి మరణించాడు .. హంతకులను చూసిన డ్రైవర్ మరణించాడు, నిందితులు నిజం ఒపుకోవడం లేదు, నార్కో టెస్ట్ చేయకూడదు , చివరిగా మిగిలిన ఆధారం వైష్ణవి కి చెందిన అవశేషాలు ..... వాటి నుండి కూడా ఆధారాలు దొరకడం లేదు .. ఇక నిందితులు బయటికి రావడానికి మార్గం సుగమనం అయింది.


మనం ఏమీ చేయలేం -కనీసం కాసేపు సిగ్గు పడదాం................ చిన్నారి వైషు కి సారీ చెబుదాం. సారీ వైష్ణవి .. నీకే న్యాయం చేయలేక పోయాం కనీసం నీ ఆత్మకి శాంతి కలిగించలేకపోయాం.

5/5/10

ఆ పాట భయంకరం

ప్రపంచం లోనే అతి భయంకర డాన్స్





మరో సూపర్ స్టార్





అది చూసి మతి చెడిన స్టార్





కొసమెరుపు

5/4/10

ఒక సారి "కేక " పెట్టి చూడండి

సాధారణంగా మనకి తెల్సిన( నచ్చిన) ఒక విషయాన్ని నలుగురితో పంచుకోవాలి అనిపిస్తుంది. అందుకే ఈమెయిలు ఫార్వర్డ్ చేయడం ద్వారా మన మిత్రులకు చెబుతూ ఉంటాం . ఆ విషయం చెప్పింది మనమే అని అందరికీ తెలియాలంటే అందుకు అనువైన వేదిక బ్లాగు. మనకి బ్లాగు రాయడం అలవాటు అయిన తర్వాత మనకి తెల్సిన ప్రతి విషయాన్ని బ్లాగులో రాయాలి నలుగురితో పంచుకోవాలి అనిపిస్తుంది . ఇది సహజం నేను అయితే నాకొచ్చిన కల కూడా వ్రాసాను. అయితే ప్రతి చిన్న విషయాన్ని మనం బ్లాగులో రాయలేం . ఈ క్షణం ఏం చేస్తున్నాం అనేది సరదాగా వ్రాయాలంటే దానికి బ్లాగు కన్నా సరైన వేదిక మైక్రో బ్లాగింగ్. ట్విట్టర్ వాడే వారికి చెప్పనవసరం లేదు కానీ చిన్న చిన్న లైన్లు ఒకటి రెండు పదాలు బ్లాగడానికి అనువైన వేదిక మైక్రో బ్లాగింగ్ కాన్సెప్ట్. ఇప్పటికిప్పుడు మీరేం చేస్తున్నారు అనే విషయాలతో బాటు మీ మిత్రులతో సరదాగా చర్చించడానికి కూడా ఇందులో అవకాశం ఉంటుంది . వీటి కోసమే ఏర్పాటు చేయబడింది కేక .

సోషల్ నెట్వర్కింగ్ సైట్స్ అయిన ఆర్కుట్ , ఫేస్ బుక్ లకంటే భిన్నమైనది కేక . కేకలో అంతా బహిరంగమే . కేక లో మీరు మీ అప్ డేట్స్ పోస్ట్ చేయవచ్చు , వేరొకరి అప్ డేట్స్ చదవచ్చు. కేక అలవాటైనాక చాలా చక్కగా మీరు ఎంజాయ్ చేస్తారు . బ్లాగింగ్ కి సరి కొత్త రూపమైన కేక లో ఒకకేక పెట్టి చూడండి .... ఇంక కేక లు పెడుతూనే ఉంటారు.

5/2/10

ఏమిటీ వివక్ష

ఒక సారి ఈ కింది వీడియో చూడండి



ఇప్పుడు ఇది చూడండి


ఇంగ్లీషు వాడు చస్తే నోరు తెరుచుకుని చూసేవాళ్ళు బాలయ్య చేస్తే ఎక్కిరిస్తారెందుకు . తెలుగు హీరోలకి సూపర్ నాచురల్ పవర్స్ ఉండకూడదా .

5/1/10

అసలు రావాల్సిన మార్పేంటి- కొందరు కోరుతున్నదేంటి

ఈ టపా ఎవరినో దెప్పి పొడవడానికి కాదు . నిత్యం మన చుట్టూ జరిగే విషయాల్లో మన సంకుచిత్వాన్ని ప్రశ్నించుకునే ప్రయత్నం. చదువుకున్న పరిస్థితుల వల్ల అయితే నేమి , స్నేహాల వల్ల అయితేనేమి మనలో చాలా మంది వ్యవస్థలో బలమైన మార్పులు కోరుతున్నాం. కాని మూలాల్లో నుండి మన మనస్తత్వాల లో మార్పు తెచ్చుకుంటే తప్ప అంత తేలిగ్గా పెద్ద పెద్ద విషయాల్లో లో మార్పులు కష్టం అనేది నా భావన.

ఉదాహరణకి ఒక రిక్షా కార్మికుడు సెల్ లో మాట్లాడుతుంటే " చూడు సెల్ ఫోన్లు ఎంత చీప్ అయిపోయాయో , ఆఖరికి రిక్షా వాడు కూడా సెల్ లో మాట్లాడుతున్నాడు అని సెటైర్లు చాలా మంది వేసే ఉంటారు లేక పోతే మన పక్కన వాళ్ళు వేయగా వినే ఉంటారు .. ఏం రిక్షా వాడు సెల్ లో మాట్లడకూడదా................ అతనికి చుట్టాలు ఉండరా లేక అతనికి సెల్ ఫోన్ లాంటి ఉపకరణాలు నిషిద్ధమా ?? ఆర్ధిక పరమైన అంశాల మూలంగా మనుషులను అంచనా వేసే దౌర్భాగ్య మనస్తత్వాల్లో మార్పు రావాలి .

ఇక ఇప్పుడు రాయబోయే పాయింట్ మన మార్తాండ కి బాగా పరిచయం ఉండవచ్చు . ఇంటర్నెట్ కేఫ్ కి వెళ్లి పెన్ డ్రైవ్ నుండి ఒక రెండు ప్రింట్ ఔట్స్ తీసుకుంటుంటే ఆ కేఫ్ ఓనరు రెండు రూపాయలు అడిగి తీసుకుంటాడు ... మరీ రెండు రూపాయలకి ఇతనికి ఎం వస్తుంది అనుకునే లోపే మరొకతను వచ్చి మరో ప్రింట్ ఔట్ తీసుకున్నాడు . ఓనర్ ఒక రూపాయి అనగానే మొహం చిట్లించి ఎందుకు అర్ధ రూపాయి ఏ కదా అన్నాడు అదోలా ........ ఆ వ్యక్తి వంక తేరిపార చూశా చాలా ఖరీదైన బట్టలే వేసుకున్నాడు మరెందుకు ఇంత కక్కుర్తి ???? " ఇలాంటి వాళ్ళు రోజుకి పది మంది వస్తారు సార్ " అన్నాడతను ? అర్ధ రూపాయి కోసం ఇంత కక్కుర్తా?

చాలా కష్టపడి పైకొచ్చిన ఇంకొక ఫ్రెండ్ చెబుతూ ఉండేవాడు అతను బాగా స్ట్రగుల్ అవుతున్న రోజుల్లో ఫ్రెండ్స్ దగ్గరకెళ్ళి భోజనం పెట్టించమని అడిగితే గేలి చేసేవారట...... రెండు మూడు గంటల పాటు వెయిట్ చేయించిన తర్వాత ఇక్కడే కూర్చో ఇప్పుడే వస్తాం అని వెళ్ళిపోయి ఇంక కనిపించే వారు కాదట ... అదే సిగిరెట్ అడిగినా మందు పార్టీ ఇవ్వమన్నా వెంటనే బయలుదేరేవారట .... ఆ రోజుల్లో 15 పెట్టి భోజనం పెట్టలేదు గానీ ... వంద రూపాయలు పెట్టి మందు మాత్రం పోయిస్తారు ఎం మనస్తత్వాలో ఏంటో అంటూ ఉంటాడు.

కస్టపడి బట్టలు చించుకుని బాలయ్య సినిమా టిక్కట్ 200 పెట్టి కొంటాం గానీ అక్కడే రోడ్డు పక్కన చెట్టుకింద కాలు చాపుకున్న ముసలవ్వ కి ఒక్క రూపాయి కూడా ధర్మం చేయాలనే ఆలోచన రాని మెంటాలిటీ ప్రతి జనరేషన్ కి పెరుగుతుంది. ఉచితార్ధంగా ఆధిపత్యం కోసం పోరాటం. ఏదైనా ఈవెంట్ కోసం కష్టపడేప్పుడు ఒక్కడు రాడు. అదే దానికి పేరు వస్తే ఆ సక్సెస్ తన ఖాతాలో వేసుకోవడానికి ..... ఎక్కడ లేని ప్రయత్నాలు చేయడం. చదవకుండా పాసైపోదామనుకునే పిల్లల లో వచ్చిన మార్పు మొగ్గ దశలోనే మాడిపోవాలి.

ఇలా కాదు మార్పు రావాలి ......... వృత్తుల మీద గౌరవం పెరగాలి , సినిమా రిలీజ్ రోజు ఎండకి ఎండి వానకి తడిసి హీరోకి కటౌట్ పెట్టే కురాళ్ళు కనిపించకూడదు. అసలు సినిమా టిక్కట్లు బ్లాక్ లో కొనే దౌర్భాగ్యం ఉండకూడదు. బస్సుల్లో స్త్రీల సీట్లలో కూర్చోవడం మానాలి ఇంకా ఎన్నో ఉన్నాయి . నేను చెప్పింది కొన్ని ఉదాహరణలే
ఇవన్నీ సిల్లీగా అనిపిస్తాయి గానీ ముందు ఇలాంటి బుద్ధులు మారితే కదా తర్వాత మనం అనుకునే పెద్ద పెద్ద విషయాలలో మార్పు కోరుకునేంత విశాల పరిపక్వత చెందిన ఆలోచనలు వచ్చేది . రూట్ లెవల్లోనే మనం చాలా వెనక బడి ఉన్నాం ఇంకా ఇది దాటి ... సహజీవనాలు , పెళ్ళికి ముందే కిల్లీలు , కొన్ని విషయాలకి చట్టబద్ధతలు అంగీకరించే కనీసం ఆలోచించేదశకు సమాజం చేరుకోవాలంటే చాలా కష్టం . ఏమంటారు ????

ఇవన్నీ వదిలేసి పనికి మాలిన విషయాల్లో మార్పు కోరుకుంటుంటే సమాజం సంకనాకి పోద్ది