అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

5/2/13

కాపురాలు

1983

పద్మ  , వెంకటేశ్వర్లు    కొత్తగా  పెళ్ళయిన జంట. చూడ ముచ్చటైన జంట అని అందరూ అనుకునేలా ఉండేవారు . పెళ్ళయిన కొన్నాళ్ళు సంసారం సజావుగానే సాగినా పాతబడే కొద్ది సహజంగానే చిన్ని చిన్ని అలకలు  లుకలుకలు మొదలయ్యాయి. ఒకరోజు  పద్మ వండిన  బంగాళదుంప కూర వారి మద్య గొడవకి కారణం అయింది వెంకటేశ్వర్లు తల్లి  వరలక్ష్మమ్మ రూపంలో. 

" అసలే నాకు  కీళ్ళు నెప్పులైతే తెలిసీ కూడా నీ  పెళ్ళాం అదే కూర  వండింది రా  వెంకటేసూ " అని రాగాలు మొదలెట్టింది వరలక్ష్మమ్మ. "తెలీక వండిందిలేమ్మా " అని  సర్ది చెప్పేలోపే వంట గదిలో ప్లేటు ఎత్తి పడేసిన సౌండ్.   ఏమైందా అని చూస్తే వరలక్ష్మమ్మ మాటలు విన్న పద్మ ప్లేట్ విసిరేసి వీసా విసా  తన రూమ్ లోకి వెళ్ళిపోయింది.  సహజం గానే  వెంకటేశ్వర్లు లో ఉండే పురుష  అహం  ( male ego) దెబ్బ తిని   అ వెనుకే  లోపలి వెళ్లి "  ఎంటే ఆ పొగరు ఆడదానికి ఇంత అహంకారం పనికి రాదు"  అని అరిచాడు.  పుట్టింట్లో అల్లారు ముద్దుగా  పెరిగి వచ్చిన పద్మకి వెంటనే ఎక్కడ లేని ఏడుపు ఎక్కిళ్లతో కలిసి వచ్చేసింది. ఆ  ఏడుపు చూసి ఇంకాస్త మండింది  వెంకటేశ్వర్లు కి "ఇప్పుడెం అయిందని  ఇలా కుళ్ళి కుళ్ళి  ఏడుస్తున్నావ్"  అని అడిగాడు  కోపంగా .  "ఇప్పుడే కాదు మొన్న  టీ  తేవడం లేట్ అయిందని  కోపంగా  చూసారు , పది రోజుల కింద కూడా  ఇంతే  కారణం లేకుండా నన్ను కళ్ళు కనిపించడం లేదా  అని తిట్టారు    " అని గతం తవ్వసాగింది  పద్మ. 

 తిక్క రేగింది  వెంకటేశ్వర్లు కి  ఎంటే  టీ  తేలేదని కోపంగా  చూసానా  , పది రోజుల కింద  తిట్టానా ? అసలా  రోజు  ఏమైందో కూడా గుర్తు లేదు కదే నాకు ....అంటే ఇవన్ని మనసులో పెట్టుకుని  సాధించాలని  టైం కోసం ఎదురు చూస్తున్నావన్నమాట  ఛీ ఛీ ఇంత బతుకు బతికి నీలాంటి వ్యక్తిత్వం లేని దాన్ని చేసుకుంటానని కలలో కూడా అనుకోలేదే  అంటూ ఎక్కడ  లేని  అసహ్యాన్ని ప్రదర్శిస్తూ కుర్చీని  కాల్తో  ఒక తన్ను  తన్ని బయటికి వెళ్ళిపోయాడు వెంకటేశ్వర్లు.

పద్మ అహం బాగా  దెబ్బతింది .... ఇంత జరిగాక ఇక  ఈ  ఇంట్లో  ఒక్క క్షణం ఉండను   పుట్టింటికి పోతాను అనుకుంటూ బ్యాగు లాగి బట్టలు సర్దడం మొదలెట్టింది . పుట్టింటికి  వెళ్ళాకా ఏమేం చాడీలు చెప్పాలో  ఆలోచించుకుంటూ ఉండగా భర్త ని వదిలేసి వచ్చి  పుట్టింట్లో  వదినల  చేత అడ్డమైన మాటలు పడుతూ  బతుకుతున్న  సత్యవతి  కళ్ళ ముందు  మెదిలింది . తన  అన్న  భార్య ఒకసారిగా గుర్తుకురావడం తో చేస్తున్న పని ఆపి మంచం మీద  కూలబడింది . కాసేపు  మూడ్ డైవర్ట్ చేసుకోవడానికి  రేడియో పెట్టింది  వివిధ భారతి లో పాటలు వస్తున్నాయి .తర్వాత   కీళ్ళ  నెప్పులు అధికంగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన   జాగ్రత్తలు గురించి డాక్టరు గారి కార్యక్రమం వస్తుంది. అందులో     నెప్పులు  అధికంగా  ఉన్నప్పుడు దుంప కూరలు  తినడం తగ్గించాలి  అన్న డాక్టరు గారి  సలహా  వినగానే తన  తప్పేమిటో తనకి  తెలిసి వచ్చింది . వెంటనే లేచి అత్తగారి  దగ్గరకి వెళ్లి " క్షమించండి అత్తయ్య నిజంగా అ నాకు  ఈ విషయాలు తెలీవు ఇక నుండి  మీరు  చెప్తే  నీర్చుకుంటాను"   అని  అడిగింది . వెంటనే వరలక్ష్మమ్మ " సర్లేవే  పిచ్చిదానా ఇంక అ  ఏడుపు  మొహం కాస్త  కడిగి వాడు ఇంటికి వచ్చేసరికి ఎలా  చల్లబరచాలో ఆలోచించు .... భర్తకి  అలా  ఎదురు తిరిగి మాట్లాడకూడదు" అని  హితవు పలికింది .

సాయంత్రం భర్త  ఇంటికి వచ్చేసమయానికి స్నానం చేసి తలనిండా పూలు పెట్టుకుని ఆయనికి ఇష్టమైన పకోడీలు వేసి ఎదురు చూడసాగింది పద్మ . బయటికి వెళ్ళిన వెంకటేశ్వర్లు ఆలోచన మరో రకంగా ఉంది  .. అనవసరంగా   కుర్చీని  తన్ని పద్మ ని  కాస్త  ఎక్కువ  భయపెట్టానేమో నేను అంత ఆవేశపడి ఉండకూడదు అనుకున్నాడు.  ఇంటికి వెళ్ళే దారిలో స్వీట్స్ , పూలు తీసుకుని వస్తుండగా  నవలలు అద్దెకు ఇచ్చే షాపుని చూడగానే తన భార్య కి ఇష్టమైన యద్దనపూడి సులోచనా  రాణి నవలలు రెండు తీసుకుని ఇంటికి చేరాడు . భర్తని చూడగానే ఎదురెళ్ళి చేతిలోవి తీసుకుని...... లోనికి రాగానే  మంచి నీళ్ళిచ్చి పక్కన కూర్చుంది.  భర్త  తెచ్చినవి  చూసి  మురిసిపోతూ ఆనందంగా భర్త  భుజం మీద  తల వాల్చి ఇంకెప్పుడు  తొందరపడకూడదు  అని  నిర్ణయించుకుంది , వెంకటేశ్వర్లు కూడా భార్యని  దగ్గరకి తీసుకుని ముందు ముందు  సంయమనం పాటించాలని  నిర్ణయించుకున్నాడు . 

2013

నిహారిక ,  వివేక్  పెళ్ళయి మూడు నెలలు  కావొస్తుంది. నీహారిక బాగా చదువుకుంది కానీ  తన కూతురు బయటికి వెళ్లి ఉద్యోగం చేసే అవసరం రాకూడదని నీడ పట్టున ఉండి ఇంటి పన్లు మాత్రం చూసుకుంటూ సుఖంగా ఉండాలని  వెతికి వెతికి  వివేక్ కి ఇచ్చి పెళ్లి చేసారు నీహారిక తల్లిదండ్రులు . ఒకరోజు  వివేక్ ని పిలిచింది  అతని తల్లి   రమాదేవి . " వివేక్   నాకసలే  బిపి   ఎక్కువగా  ఉంది నీ  భార్య ఎంట్రా  అంటే  అన్నిటిలో ఉప్పు దంచి పారేస్తుంది కాస్త  తగ్గించి వాడమని చెప్పు "  అంది . " అదేదో నువ్వే చెప్పొచ్చు కాదమ్మా "  విసుగ్గా  అన్నాడు వివేక్.  " ఈ కాలం పిల్లలు  అన్నిటికీ ఊరికే  అపార్ధం చేసుకుంటార్రా   అందుకే  నిన్ను  నెమ్మదిగా  చెప్పమంటున్నాను " అందావిడ. సర్లేమ్మా   అంటూ  తన రూమ్ లోకి వెళ్ళాడు  వివేక్. నీహారిక  ఫోన్ లో తన ఫ్రెండ్  కి మెసేజ్ చేస్తూ  ఉంది.  " హారీకా అమ్మకి బిపి ఎక్కువగా  ఉంది వంట లో ఉప్పు  తగ్గించి వాడు" అన్నాడు.  చివుక్కున  తలెత్తి "  ఆ  మాట  ఆవిడే  చెప్పొచ్చుగా  నీతో  చాడీలు  చెప్పడం  దేనికి "  అంటూ కటువుగా  అంది  నీహారిక .  "చాడీలు  చెప్పాల్సిన  అవసరం  అమ్మ కి లేదు   చెప్పింది  చెయ్యి అనవసరంగా  పెద్దది  చేయకు " అన్నాడు  వివేక్

ఆహా నేను  పెద్దది చేస్తున్నానా  లేక  ఉప్పు  వంక  పెట్టుకుని నన్ను ఎదో  ఒకటి అనాలని  మీరు  ప్లాన్ చేస్తున్నారా ??

నిన్నేదో  అనాలని  ఉప్పు  వంక  పెట్టుకోవాల్సిన  అవసరం  మాకు లేదు 

అంతే లెండి మీకు  వంకలెందుకు  ఏదైనా  ఎవర్నైనా అనగల  వంశం మీది మరి

ఏమిటే అనవసరమైన విషయాలన్నీ లాగుతావ్ 

ఆహా ......ఏమిటే  అనే దాకా వచ్చావా ... నేనేం నీ  పనిమనిషిని కాదు  నీ  లిమిట్స్ లో ఉండు .... 

ఛి ఛి  నువ్విలాంటి దానివని తెలీక  చేస్కున్నాను అంటూ  టీపాయి  ని  ఒక తన్ను తన్ని బయటికి వెళ్లిపోయాడు వివేక్.

నాకు మాత్రం  దరిద్రం పట్టి  నిన్ను చేస్కున్నాను   ఉండు  నిన్నేం చేస్తానో  అంటూ  సెల్ తీసి  తన  అన్న కి ఫోన్ చేసింది  నీహారిక .  అన్న ఫోన్ లిఫ్ట్ చేయగానే   పెద్దగా ఏడుస్తూ   " అన్నయ్యా .... నేనిక్కడ  ఉండలేను  అన్నయ్యా ... అయన,  మా అత్తగారు నన్ను  వేపుకు తింటున్నారు  వచ్చి  నన్ను  నీతో  తీస్కెళ్ళు అన్నయ్య " అని  అరిచినంత   పని చేసింది .    చెల్లెలి  గొంతు లో ఏడుపు  రేంజ్  విన్న   ఆమె  అన్న విశ్వనాద్  అక్కడ  ఎం జరిగి ఉంటుందో  అన్న విషయం  ఊహించేసాడు.    వెంటనే  తండ్రికి,   తన  మేన మామలకి ఫ్రెండ్స్  కి ఫోన్ చేసి  తన  చెల్లిని  అత్తవారింట్లో   పెడుతున్న  చిత్ర హింసల  గురించి  చెప్పి   రెండు  స్కార్పియో ల  నిండా  జనాలతో   చెల్లెలి  అత్తగారి  ఊరు   బయల్దేరాడు. 

ఒక  గంట  గడిచింది నీహారిక  కాస్త  తేరుకుంది ...  అయినా   అత్తగారు కూరల్లో  ఉప్పు తగ్గించమని  అంటే వివేక్ వచ్చి  అడిగాడు  దానికి నేను  సీరియస్  అవకుండా  ఉండాల్సింది చీ   అనవసరంగా మూడ్  పాడు చేసాను  అనుకుంటూ  టీవీ ఆన్ చేసింది  ఈ  టీవీ లో సుఖీభవ కార్యక్రమం లో  అదే  సమయంలో ఉప్పు  తెచ్చే ముప్పు  అనే  కార్యక్రమం చూసాక నిజంగా  బిపి పేషెంట్స్ కి  ఉప్పు  వాళ్ళ  వచ్చే  బాధలు తెలిసాక తానెంత తప్పు చేసిందో  తెల్సి వచ్చింది   నీహారిక కి .  ముందు  అత్తయ్యకి   సారీ చెప్పాలి  అని  రూమ్ లో నుండి బయటికి  వస్తుండగా    బయట  గేటు ని  ఎవరో  బలంగా నెట్టినట్టు  సౌండ్  వచ్చింది ఆ వెంటనే  ఇంట్లోకి  అన్న ,  నాన్న ,  అమ్మ ,  మామయ్యలు,   అత్తయ్యలు , అన్నయ్య   ఫ్రెండ్స్   అందరూ వచ్చేసారు . అవాక్కై    చూస్తుండగానే లోపలి నుండి  వచ్చిన రమాదేవి  గారిని చుట్టూ ముట్టేసారు   ఆడగుంపు " ఏవమ్మా నువ్వసలు  ఆడదానివేనా మా అమ్మాయిని  అష్టకష్టాలు పెడుతున్నవంట ... ఏమనుకున్నావ్  మా  గురించి  మీ  అంతు తేల్చేస్తాం  అని ఆమెని  కొట్టినంత  పని చేసారు . అంతలో  బయటి నుండి వచ్చిన  వివేక్ ఈ సీన్ చూసి  నిర్ఘాంత  పోయాడు . వివేక్ ని చూసి  కోపం  కట్టలు తెంచుకున్న విశ్వనాద్ అతని ఫ్రెండ్స్  వివేక్ మీదకి  ఉరికి తలోదెబ్బ వేసారు .  తేరుకున్న   నీహారిక  వారించేలోపే  ఇక   ఒక్క క్షణం ఈ  ఇంట్లో ఉండద్దు అని  నీహారిక  చెయ్యి పట్టుకుని  తీస్కెళ్ళి పోయారు .  తీరా  జరిగిన విషయం నీహారిక నుండి  తెల్సుకుని అల్లుడికి క్షమాపణ చెబుదామని బయల్దేరే  లోగానే ... మీ  అల్లుడు  మీ మీద కేసు పెట్టాడు అంటూ  పోలీసులు ఆ  వెనుకే విడాకుల  నోటీసు వచ్చేసాయి. 


పై  రెండు కధల్లో తేడా  ఒక  సెల్ ఫోన్  మాత్రమే కాదు మనుషుల్లో  చచ్చిన సహనం కూడా ఒక కారణం.  దీనికి పరిష్కారం అంటూ  చూపలేమా  అంటే ... కోట్లాది మందిలో  ఎంతమందికని పరిష్కారం  చూపుతాం. ఎవరి  జీవితాలు  వాళ్ళవి  ఎవరి  ఇగో లు  వాళ్ళవి .