అట్లాంటి ఇట్లాంటి హీరోని కాను నేను

4/29/13

ఎటు వైపు మన పయనం

కట్ట  బియ్యం  675 రూపాయలు పెట్టి కొని ఆరు నెలలు అవలేదు అప్పుడే 1100 కి చేరుకుంది . ఒక నెలకి ఇంటిల్లిపాది కొనుక్కు తాగే  నీళ్ళ ఖర్చు దాదాపు 800 . ఈ ధరలు కేవలం  సామాన్యుడి నడ్డి మాత్రమె విరుస్తున్నాయి అనుకుంటే పొరబాటు . భవతీ బిక్షాందేహీ  అన్న  అరుపు  సిటీలలో  వినిపించడం లేదేమో గానీ చిన్న చిన్న  పట్టణాలలో  పల్లెల్లో ఇంకా  వినిపిస్తూనే ఉంది . ఆ  అరుపు  వినగానే ఇంట్లో నుండి  ఒక చిన్న గ్లాసులో బియ్యం తెచ్చి వేసే  ఇల్లాళ్ళు కనుమరుగయ్యారిప్పుడు .. అందరి చేతులు ఖాళీ లేవిప్పుడు.  దారిన పోయే  బాటసారికి గుక్కెడు  నీళ్ళు ఇచ్చే  పరిస్థితులు  లేకుండా  పోతున్నాయి. పొరబాటున చుట్టాలొస్తే   వీళ్ళు ఎన్నాళ్ళు ఉంటారో   ఆ ప్రభావం నెల బడ్జెట్ మీద ఏ రకమైన  ప్రభావం చూపిస్తుందో  అన్న టెన్షన్  మద్య తరగతి  జీవికి నిద్రపట్టనీయదు. ఇదే  కొనసాగితే ? 

ఒకప్పుడు  అత్యంత గౌరవంగా  బతికిన  చిన్న చిన్న రైతులు ఇప్పుడు  మా  ఊర్లో గుడి  కడుతున్నాము చందాలు  ఇవ్వండి  అని  దేవుడి పేరు చెప్పుకుని  పరాయి  జిల్లాలలో అడుక్కు తినాల్సిన  పరిస్థితి . అమ్మాయిని గవర్నమెంటు స్కూలుకి పంపి  అబ్బాయిని మాత్రం    మంచి కాన్వెంట్ లో  చదివించుకునే  అభిప్రాయానికి చాలా  మంది మళ్ళీ వచ్చేసారు .

 కేవలం  నిత్యవసరాలకోసం మధ్యతరగతి పోరాటం చేయాల్సిన రోజులు  కళ్ళ ముందే  కనిపిస్తున్నాయి. సినిమాల్లాంటి చిన్న చిన్న ఆనందాలు కూడా కొన్ని కుటుంబాలు దూరం చేస్కోవాల్సిన  పరిస్థితులు  ఇప్పటికే వచ్చేసాయి. బతకడం కోసం కొన్ని వందల మంది సకుటుంబ సపరివార  సమేతంగా దాడులకి తెగబడే రోజులు   ముందు ముందు  చూస్తామేమో  అనిపిస్తుంది. దీనికి పరిష్కారం ఉందా?  ధరలు తగ్గించాలా లేక  జనాల్లో కొనుగోలు శక్తి పెంచాలా ?  దళారీ  వ్యవస్థ  నాశనం చేయాలా  లేక ప్రజా  స్వామ్యం  స్థానే మరో కొత్త  వ్యవస్థ సృష్టించాలా????